ప్రకృతి ఏ ప్రాణిని మోసం చేయదు అందరికి సమానంగా తన ప్రేమను అందిస్తుంది.. సరిగ్గా చూసి అవగాహన చేసుకున్న వారే దానిని పొందుతున్నారు. మరి చూడలేని, అవగాహన లేని వారి పరిస్థితి ఏంటి? మా బతుకింతే అని ఏడుస్తూ బతకటమేనా వారి జీవితం? ఈ భూమి మీద "అసాధ్యం" అనే పదాన్ని చెరిపివేయడానికి ఓ మనిషి తనవంతు కర్తవ్యాన్ని అందించాడు.. రాజస్థాన్ 40% ఏడారితో నిండిన ప్రాంతం. వ్యవసాయానికి కాదు కదా తాగడానికి సైతం నీళ్ళు లేని ఎడారికి మారుపేరైన రాజస్థాన్ కోసం మన తెలంగాణ ఇంజినీర్ వెదిరె శ్రీరామ్ గారు అపర భగీరధ అవతారమెత్తారు.
భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రం రాజస్థాన్, అతి తక్కువ వర్షం నమోదయ్యే రాష్ట్రం కూడా రాజస్థాన్ యే. గుక్కెడు మంచి నీళ్ళ కోసం రాజస్థాన్ వాసులు తల మీద మూడు, నాలుగు కుండలు ఎత్తుకుని నడిచేవారు. ఇలాంటి కథలు చిన్నతనంలో మనం మాత్రమే కాదు వెదిరె శ్రీరామ్ గారు కూడా చదువుకున్నారు. కాని అంతటితోనే తన పరిశోధన ఆగిపోలేదు. అసలు నీటి సమస్యలు ఎందుకు ఏర్పడతాయి.? ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే వాటిపై ఎంతగానో ఆలోచించేవారు. ఐతే మొదట పూర్తిగా దీని కోసమే పూర్తిగా పనిచేయలేదు. ఇంజినీరింగ్ పూర్తి చేశాక అమెరికాలో 15 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశారు. ఉద్యోగమైతే చేస్తున్నారు. మంచి జీతం వస్తుంది కాని అతని మనసంతా ఇండియా మీదనే ఉండేది. దేశం అభివృద్ది చెందాలంటే అధికారమే ముఖ్యం అని మొదట రాజకీయాలలో చేరి నల్గొండ పార్లమెంట్ నియోజికవర్గం నుండి పోటిచేసి ఓడిపోయారు. ఆ తర్వాత అదే పార్టీ వెదిరె శ్రీరామ్ గారిని రాజస్థాన్ నదీ జలాల అథారిటీ చైర్మన్ గా నియమించింది. ఇక అప్పటి నుండే కథంతా మారిపోయింది.
తెలుగు ఇంజినీర్ టి. హనుమంత రావు గారు రూపొందించిన "చతుర్విద జల ప్రక్రియ" ఇంకా శ్రీరామ్ గారి ప్రణాళికలతో అసాధ్యం సాధ్యం అయ్యింది. రాజస్థాన్ రాష్ట్రంలో పూర్తిగా ఎన్ని చెరువులు ఉన్నాయో తెలుసా 2,000 మాత్రమే. స్టోరేజి సిస్టమ్ కూడా ఏ మాత్రం కనిపించదు. అసలే తక్కువ వర్షం పడుతుందనంటే ఆ పడ్డ వర్షం కూడా అక్కడి వేడికి ఇంకిపోయేది. మేఘం అందిస్తున్న నీటిని ప్రాణులకు అందజేయాలంటే వర్షం నీటిని నిల్వ ఉంచేందుకు జల స్వావలంభన అభియాన్ పధకం కింద 2014లో వేల సంఖ్యలో చెరువులను తవ్వించారు. ఆ నీటిని భూగర్భంలోకి పంపారు అలా భూగర్భంలో నీటి నిల్వలను పెంచారు. అలా రాష్ట్రంలోని సగానికి పైగా గ్రామాలలో అమలుచేశారు.. కట్ చేస్తే రాజస్థాన్ వాసులు కలలో చూడని జలసిరులు వారి ముంగిట వెల్లి విరుస్తున్నాయి.
ఇంతకు ముందు వందల మీటర్లలో తవ్వినా నీరు రాకపోయేది ఇప్పుడు పది అడుగులు తవ్వినా నీరు వచ్చేసింది. గుక్కెడు మంచి నీళ్ళ కోసం కూడా అవస్థలుపడే ప్రజలు ఇప్పుడు సంవత్సరానికి మూడు పంటలు పండిస్తున్నారు. ఎండ వేడితో పాదాలను కాల్చే అప్పటి మట్టే పచ్చని గడ్డితో రాజస్థాన్ వాసులకు రాచమార్గం వేశారు. ఇందు కోసం వేల కోట్లు ఖర్చు కాలేదు బడ్జెట్ లో 1,300 కోట్లు మాత్రమే కేటాయించారు దానితోనే ఇలా అద్భుతాలు సృష్టించగలిగారు.