10 Stellar Quotes By Late Atal Bihari Vajpayee That Prove He Was A Great Writer Too

Updated on
10 Stellar Quotes By Late Atal Bihari Vajpayee That Prove He Was A Great Writer Too

మన చేతలు, మాటలు ఒకే విధంగా ఉండడమే నిజాయితీ. వాజ్ పేయి గారు చేసి చెప్పినా, చెప్పిన తర్వాత చేసినా ఒకేవిధంగా ఉండేది. ఆ వ్యక్తిత్వం ద్వారానే ఆయన ప్రతిపక్ష పార్టీలోనూ ఆదర్శ నాయకుడిగా కీర్తింపబడ్డారు. వాజ్ పేయి గారి నాన్న పండిట్ కృష్ణబిహారి వాజ్ పేయి గారు గ్వాలియర్ రియాసిత్ లో కవిగా ప్రజలందరి మదిలోకి వెళ్లారు. నాన్న రాతలను చదువుతూ ఎదిగిన వాజ్ పేయి గారికి కూడా ఆ లక్షణాలు అలవడ్డాయి. మహోన్నత నాయకుడిగా ఎదగక మునుపు "రాష్ట్రధర్మ" అనే మాసపత్రికలో, ఆ తర్వాతి కాలంలో దిన వార పత్రికలోనూ పనిచేశారు. ఒక్కసారి చరిత్రను పట్టుకుంటే నిజం తెలుస్తుంది గొప్ప నాయకులందరిలోను ఓ కవి ఉన్నాడని. మహాత్మ గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, చేగువేరా, నెల్సన్ మండేలా, భగత్ సింగ్ ఇంకా చెప్పుకుంటూ పొతే ఎందరో.. సున్నిత మనస్కుడే నాయకుడు అవ్వగలడు, కవి అవ్వగలడు.. ఆయన 18 సంవత్సరాలకే స్వతంత్ర పోరాటంలో జైలుకు వెళ్లారు, ఆ తర్వాతి కాలంలో ఎమర్జన్సీ సమయంలో కాని, ప్రధానిగా కొనసాగుతున్న సమయంలో కాని అక్షరాలను మరవలేదు. అలా సుదీర్ఘ కాలంలో పలు సంధర్భాలలో మనసులో నుండి ఉబికివచ్చిన కవితలు కొన్ని..

1. ఎత్తైన పర్వతాలపై చెట్లు ఎదగవు మొక్కలు మొలకెత్తవు. గడ్డి గరక కూడా పరుచుకోదు, మంచు పొరలు మాత్రమే పరుచుకుంటాయి శవం మీది తెల్లటి వస్త్రంలా మృత్యువులా చల్లబడుతుంది. అక్కడ పక్షులు గుళ్ళు కట్టుకోలేవు, అక్కడ అలసిపోయిన యాత్రికులెవ్వరూ దాని నీడలో కునుకు కూడా తీయలేరు. వాస్తవమేమిటంటే కేవలం ఎత్తుగా ఎదగడం మాత్రమే సరిపోదు అందరితో కలవకపోవడం గాలిగోపురంలా ఒంటరిగా తనవాళ్ళకు దూరంగా శూన్యంలో ఏకాకిగా మిగిలిపోవడం పర్వతాల గొప్పతనం కానేకాదు. అది కేవలం నిస్సహాయత. కావాల్సిందేమిటంటే ఎత్తుతో పాటు విశాలంగా విస్తరించాలి.

2. రక్తం ఎందుకు తెల్లబడింది అభేదంలో భేదం కలిసిపోయింది. అమరులు వెళ్ళిపోయారు గీతాలు తెగిపోయాయి. గుండె గాయమై పోయింది. పాలు ఎందుకో విరిగిపోయినవి. ఎవరి నీడ వారికే శత్రువు, ఇతరుల కౌగిలింతలెందుకు? మాతృభూమి కోసం ఆత్మహత్యల బాట మాట్లాడిన మాటలు నీటి మీది రాతలైనవి.. పాలు విరిగిపోయినవి.

3. నిన్న.. నిన్న.. అని అనుకొంటూ ఉండగానే నేడు చేతి నుంచి జారిపోయింది. భూత భవిషత్తు ఆలోచనల మధ్య వర్తమానంలో పందెం ఓడిపోయాం! లాభనష్టాల ఒడిదుడుకులలో జీవన సరళి వ్యాపారమైంది. అమ్ముడు పోయేవాని ధర నిర్ణితమైంది అమ్ముడు పోనివాడు పనికిరాని వాడయ్యాడు. నన్ను సంతలో ఒంటరిగా నిలబెట్టి మిత్రులు ఒక్కోక్కరే చేజారిపోయారు. జీవితం గడిచిపోయింది.

4. భూమ్మీద మనిషి ఒక విచిత్ర జీవి.. గుంపులో ఉన్నప్పుడు ఏకాకిగా, ఒంటరిగా ఉన్నప్పుడు గుంపులో నుండి ఏకాకి అయినట్టు అనుభవిస్తాడు. సభ్యత అనే ఒక నిష్ఠురమయిన పరుగులో సంస్కృతి వెనక్కి నెట్టేస్తూ ప్రకృతి మీద విజయం సాధించి మృత్యువును పిడికిట్లో బిగించాలనుకుంటాడు. అతని రక్షణ కోసం నాశనమయిన వ్యక్తుల సంపదను దోచుకుంటాడు. ఆకాశాన్ని శపిస్తాడు, ధరిత్రిని వివస్త్రను చేస్తాడు, గాలిని నీటిని కలుషితం చెయ్యడానికి సంకోచించడు. ఇదంతా చేసిన తర్వాత అప్పుడు ఏకాంతంలో ఆలోచిస్తాడు. మళ్ళి ఏకాంతం మళ్ళీ ఇంట్లో మారుమూల గది లేదా కోలాహలంగా ఉండే బజారులో, లేదా శాస్త్రవేత్త ప్రయోగశాలలో లేదా గుడిలో కాదంటే స్మశానంలో ఆలోచిస్తాడు, విచారిస్తాడు.

5. ప్రతి ఇరవై ఐదు డిసెంబర్ నాడు జీవించే ఒక మెట్టు ఎక్కుతాను. ఒక కొత్త మలుపులో ఇతరుల కంటే ఎక్కువగా పోరాడతాను. నేను పెద్ద పెద్ద సమూహాలను నిశ్శబ్ధం చేయగలను కానీ నన్ను నేను సమర్ధించుకోలేకపోతున్నాను. నా మనసు నన్ను న్యాయస్థానంలోనే నిలబెడుతుంది. నాకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేస్తుంది. నన్ను ప్రశ్నిస్తుంది. నా కేసు నాకు వ్యతిరేకంగా నమోదవుతుంది నన్నే దోషిగా నిలబెడుతుంది. అప్పుడు నేను ఏమీ చూడలేకపోతాను. దూరంగా ఉన్నది దగ్గరిగా ఉన్నది దేన్ని చూడలేను. అకస్మాత్తుగా నా వయస్సు దశాబ్ధం పాటు పెరుగుతుంది. నేను నిజంగా వృద్ధుణ్ణి అయిపోయానా?

6. సూర్యుడు ఒక అనంత సత్యం దాన్ని అబద్దమని ఎవ్వరూ అనలేరు. హిమబిందువులు కూడా సత్యమే కదా! కాని హిమ కణికలు క్షణికమైనవి నేనెందుకు క్షణ క్షణం జీవించాలి కణకణంలో విరజిమ్మే సౌందర్యాన్ని ఆస్వాదించాలా.? సూర్యుడు మళ్ళీ మళ్ళీ ఉదయిస్తాడు తాపం మళ్ళీ మళ్ళీ ఏర్పడుతుంది కానీ తోటలోని పచ్చ పచ్చని దర్భాలపై ప్రతి ఋతువులో మంచు ముత్యాలు దొరకవు.

7. చెట్టు మీద ఎక్కిన మనిషి ఎంతో ఎత్తుగా కనిపిస్తాడు చెట్టు కింద ఉన్న మనిషి పొట్టిగా కనిపిస్తాడు. మనిషి గొప్పవాడు కాదు నీచుడూ కాదు పెద్ద వాడు కాదు చిన్నవాడూ కాదు. మనిషి కేవలం మనిషి అవుతాడు. ఇంతటి సమతలమయిన సత్యాన్ని సమాజమెందుకు తెలుసుకోదు? ఒకవేళ తెలిసి ఉంటే దాన్ని చిత్తశుద్ధితో ఎందుకు అంగీకరించదు.?

8. ఎక్కడ ఉండే మనిషి అక్కడే నిలబడాలా? ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలా? జడత్వం జీవన మెట్లా అవుతుంది. పలాయనం పురోగమన మవుతుందా.? మనిషి సంఘర్షించాలి, పరిస్థితులను అధిగమించాలి, ఒక స్వప్నం చెదిరిపోతే మరో స్వప్నం కనాలి! ఎంత పైకి ఎదిగినా మానవత్వం నుంచి వైదొలగరాదు. ఒక పాదాన్ని భూమిపై పెట్టి భగవాన్ వామనుడు ఆకాశాన్ని, పాతాళాన్ని జయించాడు.

9. పదిహేను ఆగస్టు అంటుంది. స్వాతంత్ర్యం అసంపూర్ణంగా ఉందని స్వప్నాలు ఇంకా నిజం కావాల్సి ఉంది అధినాయకుని వాగ్దానాలు ఇంకా పూర్తి కాలేదు. ఏ శవాలపై నడుస్తూ స్వాతంత్ర్యం భారత్ కు వచ్చిందో ఇంకా దేశ దిమ్మరుల దుఃఖం కారు మేఘాల్లా కప్పుకునే ఉంది. కలకత్తా ఫుట్ పాత్ లపై ఎందరో గాలి వానలో తడుస్తున్నారు వాళ్ళని అడగండి పదిహేను ఆగస్టు గురించి ఏమంటారో.. మానవుడు ఎక్కడైతే అమ్మబడతాడో అక్కడే నిజాయితీ కొనబడుతుంది. ఎట్లా నేను ఈ వేడుకలను జరుపుకోను? ఇంకా కొన్ని దినాల నిస్సహాయత ఉంది. ఇంకా ఎన్నో రోజుల దూరం లేదు. ఖండిత భారతాన్ని మళ్ళి అఖండితం చేస్తాం. గిల్ గిత్ నుంచి గారో పర్వత శ్రేణుల వరకు స్వాతంత్ర్య వేడుకల్ని జరుపుకుందాం ఆ స్వర్ణ దినం కోసం ఇవ్వాళ్టి నుంచి నడుం వంచి బలిదానాలు చెయ్యాలా? ఎవరైతే సంపాదించుకున్నారో వాళ్లలో కలితో పోరాడు. ఎవరైతే ఏది పొందలేదో వాళ్ళ గురుంచి ఆలోచించాలి.

10. జన్మదినాన్ని మనం పండుగగా జరుపుకుంటాం, మరణాన్ని పండుగగా ఎందుకు జరుపుకొం? అంతిమ యాత్రా సమయంలో అశ్రువులు అపశకునం కానే కావు. లోలోపల దుఃఖించు కన్నులు ఏడ్వరాదు కలల్ని కడిగేసుకోరాదు మోసపురితమైన విశ్వంలో కేవలం కలలే నిజమవుతాయి. నేను ఆనందంగా జీవించాను నవ్వుతూ చనిపోతాను, మళ్ళి తిరిగి వస్తాను, ఎవరితో నాకెందుకు భయం. ఈ జీవనం కంటే మృత్యువే మేలైనది ఉగ్రవాదులు వీధి వీధిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను కూడా ఏడుస్తాను..