This NGO Is Providing Orphan Kids A New Life Through Adoption

Updated on
This NGO Is Providing Orphan Kids A New Life Through Adoption

మన తెలుగులో ఒక సామెత ఉంటుంది "మొక్కై వంగనది మానై వంగునా" అని.. చెట్టుకు వేఱు ఎంత అవసరమో మనిషికి బాల్యం అంత అవసరం. సరైన పునాది సరైన బాల్యం వంటిది. తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు ప్రేమ, కెరీర్ గైడెన్స్, బంగారు భవిషత్తుకు అవసరమయ్యే సౌకర్యాలు అందుతున్నాయి.. మరి తల్లిదండ్రులు లేని పిల్లల మాటేమిటి.? పేరెంట్స్ ఉన్నా ఆర్ధిక, సామాజిక కారణాల వల్ల వెనుకబడుతున్న పిల్లల నిర్మాణ సంగతేంటి.? ఇదిగో ఈ ఆలోచన నుండే పది సంవత్సరాల క్రితం పిల్లల జీవితాలలో "వి కేర్ ఫౌండేషన్" ఉదయించింది. వ్యక్తిగతంగా, మరియు మిత్రులు శ్రేయోభిలాషుల నుండే కాకుండా నృత్యకారిణి శోభన, సింగర్ చిత్ర, శ్రీకృష్ణ మొదలైనవారితో ఈవెంట్స్ చేస్తూ అందులో నుండి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా పూర్తిగా పిల్లల కోసం ఖర్చు చేయ్యడమే వి కేర్ యొక్క మరో గొప్పతనం.

పిల్లలందరూ ప్రవేట్ స్కూల్ , కాలేజీలోనే: 2009లో NGO ను ప్రారంభించడానికి ముందు సందీప్ గారు దాదాపు 80 అనాథాశ్రమాలు, వృద్దాశ్రమాలు తిరిగి ఎలాంటి సంస్థ స్థాపిస్తే బాగుంటుందనే దాని కోసం విపరీతమైన రీసెర్చ్ చేశారు. కొన్ని NGOలలో లోపాలు, మరి కొన్నిట్లో గొప్ప లక్షణాలు, మరెన్నో ఆలోచనలతో రూపుదిద్దుకున్నదే వి కేర్. పిల్లల్లో శారీరక శక్తి తక్కువ, మానసికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. ఇలాంటి స్థితిలో మనం సహాయపడాలి.. ఏదో దానం చేస్తున్నట్టుగా కాదు మంచి కాలేజ్, మంచి వసతులు మొదలైనవన్ని వారి ఎదుగుదలకు కారణమవ్వాలనే సందీప్(అన్నయ్య), సింధు(సోదరి)తపన. వి కేర్ లో ప్రస్తుతం దాదాపు 260 మంది పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలందరూ ఎక్కువశాతం ప్రయివేట్ స్కూల్ లోనే చదువుకున్నారు. ఒక్కో ఇంటర్మీడియట్ స్టూడెంట్ కు కాలేజీ ఫీజు రూ.20,000 హాస్టల్ ఫీజు రూ.24,000 వెరసి రూ.44,000. ఒక్కో డిగ్రీ స్టూడెంట్ కోసం కాలేజి ఫీజు రూ.33,000 హాస్టల్ ఫీజు రూ.24000 మొత్తంగా రూ.58,000 ఇలా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకు ఫీజులు కడుతున్నారు. ఇలా మొత్తంగా ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న పిల్లలు ఇక్కడ 55మంది వరకు ఉన్నారు.

మీకు నచ్చిన కోర్సు మీరు చెయ్యండి డబ్బుల గురుంచి మిగిలినవాటి గురుంచి మేము చూసుకుంటాము అనే మొదటి నుండి సందీప్ సింధు చెబుతుంటారు. చిన్నతనం నుండి వి కేర్ లోనే ఉంటూ చదువుకుంటున్న సునీత అనే అమ్మాయికి ఇంటర్మీడియట్ లో 96.03% శాతం మార్కులు వచ్చాయి. ఇంజినీరింగ్ చెయ్యాలని తనకు ఇష్టం. ప్రస్తుతం గోకరాజు గంగరాజు ఇనిస్టిట్యూట్ లో చదువుతుంది, తనకు సంవత్సరానికి అవసరమయ్యే కాలేజ్ ఫీజు(రూ.58,000), హాస్టల్ ఫీజు(నెలకు రూ.4,500) పూర్తిగా వికేర్ యే చెల్లిస్తుంది. ఇలా 13 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం ఆవేరేజ్ గా ఒక్కో విద్యార్థి మీద వెచ్చించే మొత్తం రూ. 65,000.

సెలెబ్రెటీల సహాయం మరువలేనిది: వి కేర్ నిజాయితీని ప్రత్యక్షంగా చూసిన యాంకర్ అనసూయ గారు ఇక్కడే ఉండి చదువుకుంటున్న నందిని, జనని, హర్షిణి అనే ముగ్గురు పిల్లలను అడాప్ట్ చేసుకున్నారు. వీరి చదువుకు, అవసరాలకు అవసరమయ్యే బాధ్యతలను తనే చూసుకుంటున్నారు. వెన్నెల అనే అమ్మాయికి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కలలు కనేది. ప్రతిష్టాత్మకమైన NIFTలోనూ సీటు వచ్చింది. కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు కలుపుకుంటే ఖర్చు ఎంతో ఎక్కువ.. ఐతే వెన్నెల కలను వాస్తవం చెయ్యడానికి శశి వంగపల్లి గారు (కాస్ట్యూమ్ డిజైనర్) ముందుకు వచ్చారు. నాలుగున్నర సంవత్సరాల కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు బాధ్యతలను తనే తీసుకున్నారు.

"కావాలనే ప్రచారం చేసుకుంటున్నారు" అనే అపవాదు రాకూడదనే తాము చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు మనం చూస్తున్న చాలామంది. నవదీప్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వి కేర్ కోసం ఆయన ఎంతో విలువైన సమయాన్ని కేటాయించారు. ఒకానొక సంవత్సరం పూర్తిగా తను, తన ఫ్రెండ్స్, రిలేటివ్స్ మాత్రమే పూర్తిగా సహాయమందించారు. ప్రభాకర్, తెలంగాణ శకుంతల, నీరజ కోన, ప్రదీప్ మాచిరాజు మొదలైనవారి సపోర్ట్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడింది.

సక్సెస్ స్టోరీస్: ఏ ఒక్క విద్యార్థి మీద ఏ ఒత్తిడి ఉండదు, పిల్లలకు నచ్చిన రంగాన్ని భవిషత్తుగా నిర్ణయించుకోవచ్చు. ఇక్కడే చదువుకున్న రాజేష్ టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుండి డాన్స్ అంటే ఇష్టం ఉండడం వల్ల దానినే కంటిన్యూ చేశాడు, కొరియోగ్రాఫర్ గా (రంగస్థలం అనే టీవీ షో లో) అలాగే, ప్రస్తుతం హైదరాబాద్ లో మూడు డాన్స్ ఇనిస్టిట్యూట్ లలో 150 మంది తన దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు. డిగ్రీ పూర్తిచేసిన అర్జున్ కు TCSలో, వైష్ణవికి విప్రో లో జాబ్ వచ్చింది. అలాగే రత్న, కవిత, చైతన్యలకు కూడా replete health it services private limited లో మంచి జాబ్ సాధించుకున్నారు. చదువుల్లోనూ అంతే! ఇక్కడే చదువుకున్న శిరీషకు టెన్త్ లో 9.3GPA, నానికి 9.5GPAతో జిల్లా ఫస్ట్ సాధించాడు.

వి కేర్ లో చదువుకుంటున్న ప్రతి బిడ్డకు ఒక కథ ఉంటుంది, బాల్యంలోనే మొక్కకు మల్లె గొడ్డలి దెబ్బ తిన్న ఒక గాయం, గతం ఉంటుంది. వి కేర్ లో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అప్పటినుండి ఇవ్వేమి మళ్ళీ అడ్డు రావు, ఏ అడ్డు వచ్చినా వారి మార్గం సుగమం చెయ్యడానికి సందీప్, సింధులుంటారు. ఒక తల్లిగా, తండ్రిగా, గురువుగా, మిత్రునిగా, కెరీర్ గైడ్ గా సందీప్, సింధు పిల్లల జీవితాలను వారు ఊహించని విధంగా మార్చివేస్తున్నారు. ఈ విజయంలో మరెందరినో భాగం చేస్తున్నారు.

You can contact them: Phone: 99668 84400 Facebook CLICK HERE