కూటి కోసం కోటి విద్యలు అని అన్నారు, ఆ విద్యాలనే నలుగురికి పంచి వారి జీవితాలలో ఆనందం నింపాలి అనే ఆలోచనతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు వారిద్దరూ. గౌరీ, ఉదితా 2013 లో టీచ్ ఫర్ ఇండియా ఫెలోషిప్ లో కలిశారు. పాఠశాల కెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పి పనైపోయింది అనుకుంటారు చాల మంది. కానీ వారు చెప్పే దగ్గర పిల్లలు రోజు కూలి కోసం వెళ్లి పాఠశాల వైపే రావట్లేదు. రెక్క ఆడనిదే వారి డొక్కా నిండదు. వీళ్ళ కోసం ఎదో ఒకటి చెయ్యాలి అని ఆరోజే అనుకున్నారు.
అనుకుందే తడవుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్లారు. అక్కడ వాళ్ళకి ఒక సరికొత్త సమస్య ఎదురైంది. అభివృద్ధి, అభివృద్ధి అని పరిగెడుతుంది అనుకున్న ప్రపంచం వారి దగ్గర మాత్రం అలా ఆగిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలకి చైర్మన్లు అవుతున్న ఆడవారు, అక్కడ మాత్రం ఇంటి గడప దాటాలంటే భయపడుతున్నారు. స్వతంత్రం దేశానికీ వచ్చింది కానీ, వాళ్ళను మాత్రం మన సమాజం మూఢనమ్మకాలతో, సంస్కృతి సంప్రదాయం అనే నెపం తో కట్టిపడేసింది. మారాలి, మార్చాలి అని వాళ్లిదరు అనుకున్నారు.
అప్పుడు మొదలైన ఆ ఆలోచన, మార్చితే మారుతుంది అనుకున్న వారి నమ్మకం, అయిదేళ్ల కష్టం "ఉమీద్". 2014 లో మొదలైన ఈ సంస్థ ఇప్పుడు ఎందరో ఆడవాళ్ళకి ఒక సరికొత్త బాట చూపిస్తుంది.
ఎన్నో కథలు
'ఉమీద్' అంటే నమ్మకం. గౌరీ, ఉదితా వారి ఆలోచన పై పెట్టుకున్న నమ్మకం, గడప దాటటానికి ఎంతో ఆలోచించే ఎందరో ఆడవాళ్ళు ఆ ఆలోచన తమ జీవితానికి కొత్త వెలుగు చూపిస్తుంది అని పెట్టుకున్న నమ్మకం. నాలుగేళ్ళ ఈ ప్రయాణంలో ఎన్నో కథలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కష్టాలు, ఆ కష్టాలను అధికమించి ప్రపంచాన్ని కదిలించిన వారి జీవితాలు.
సబీనా,(name changed) కొన్నేళ్ల క్రితం ఆడ కూతురికి జన్మనిచ్చింది అని తన భర్త తనను వదిలేసాడు. పైసా చేతిలో లేక, ఏమి చేయాలో తెలియక ఉన్న స్థితి లో తను ఉమీద్ లో చేరింది. చేరిన మొదటి రోజు నుండి తన పిల్లల కోసం శ్రమించింది. "ఎప్పటి నుండో ఏదో ఒకటి చేసి ప్రపంచానికి చూపించాలి అని ఉండేది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నేను ఏంటో చూపించటమే మిగిలుంది." రాత్రి పగలు తేడాలేకుండా కష్టపడి ఒక మాములు ఉద్యోగి స్థాయి నుండి ఇప్పుడు కొత్తవారిని ట్రైనింగ్ చేసే స్థాయి ఎదిగింది.
" ఒంటరిగా ఎదగాలి అంటే ఒంటరిగానే మిగిలిపోతాం. ఎదుగుదల అంటే మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లు ఎదగటం అని మాకు మా "ఉమీద్" నేర్పింది"
ప్రస్తుతం సబీనా తన నాలుగు కూతుర్లతో వారి బంధుల దగ్గర ఉంటూ, ఇంకా తన భర్త నుండి విడాకుల కోసం పోరాటం చేస్తూనే ఉంది. కష్టాలేమి తనకి కొత్త కాదు, పోరాటం అంటే తనకి ఇప్పుడు భయమే లేదు. తానేంటో ప్రపంచానికి చూపించాలి అని కసి, ఆడవారు అంటే పంజరం లో పక్షులు కాదు, గట్టిగ అనుకుంటే ఆకాశాన్ని అందుకునే శక్తులు అని చూపించాలి అనే నమ్మకం తనలో నింపింది 'ఉమీద్'.
సబీనా లాంటి కథలెన్నో. ఆ బాధలన్నిటిని ధాటి వీరు ఇక్కడ ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు. తమ దాగున్న కళలను బయటకు తీశారు. పేపర్ లాంప్స్, డోర్ మాట్స్, కర్టైన్స్ ఇలా ఒకటేంటి చాలానే చేస్తున్నారు ఇక్కడ. కేవలం స్కిల్ డెవలప్ మెంట్ మాత్రమే కాదు, leadership స్కిల్స్ కూడా వారిలో పెంచడమే ఉమీద్ లక్ష్యం. 9 నెలలు మన భారాన్ని మోసిన వారే మనకి భారం అని అనుకోవటం మనకి సిగ్గు చేటు.'ఆడవాళ్ళూ' అని భారంగా, హీనంగా చూసే ఈ సమాజానికి, మేము భారం కాదు గర్వం అని, హీనం కాదు దైర్యం అని చూపిస్తున్నారు. 'ఉమీద్' ద్వారా వారు ఒక సరికొత్త జీవినోపాది పొందుతున్నారు. అప్పటిదాకా ఇంట్లో ఒక్క మాట మాట్లాడాలంటే ఆలోచించే వీరు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలలో ప్రెసెంటేషన్ లు ఇస్తున్నారు. ఉమీద్ చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా నో ప్లాస్టిక్ మరియు eco friendly . ఇలా ప్రకృతి పరివేక్షణ లో కూడా తమ వంతు అడుగులు వేస్తున్నారు. ఇలా వాళ్ళు వేస్తున్న ఆ ప్రగతి అడుగులు మరెందరో మహిళలకు నూతన బాట కావాలి అని ఆశిస్తూ "సర్వేజనా సుఖినోభవంతు".