You Must Checkout This Inspiring Story Of A Guy Who Is Striving To Develop His Village Into A Better Place To Live!

Updated on
You Must Checkout This Inspiring Story Of A Guy Who Is Striving To Develop His Village Into A Better Place To Live!

"మా దోమకొండలో ఒక్క కుటుంబమైనా బాగుపడుతుందనంటే నేను వందమంది కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధం -బాల ప్రసాద్ గారు". దోమకొండ జనాబా సుమారు 10,000కు పైగానే.. ఇందులో ఏ ఒక్కరూ తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగినా బాల ప్రసాద్ గారు వారి కన్నా ఎక్కువ సంతోషపడతారు. ఆపద ఎదురైతే వారి కన్నా ఎక్కువ ఆందోళన పడతారు, సహాయం అవసరమైతే వారి కన్నా ఎక్కువమందిని అభ్యర్ధిస్తారు. రక్తం పంచుకున్న సోదరులు, బందువులే పట్టించుకోలేని ఈ ప్రస్తుత సమాజంలో ఆ ఊరికి అన్నీ తానై సొంత సుఖాలను త్యాగం చేసి తన ఊరిని తన కుటుంబంలా ప్రగతి పధం వైపు నడిపిస్తున్న దోమకొండ పుత్రుడి కథ ఈరోజు.

తనలోని తపనను ఎలా ఉపయోగించుకుని ఆ ఊరిని అన్ని రకాలుగా ఎలా బాగుచేశారన్నది మరింత క్షుణ్ణంగా తెలుసుకుందాం.

కూలి పని చేయాల్సిందే: దోమకొండ ఊరు కామారెడ్డి నుండి 16కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊరిలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బాల ప్రసాద్ గారు పేదరికంలో ఉండే బాధలు, సమస్యలు అనుభవిస్తునే ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలలో చదువుకుంటూ తన జీవితాన్ని మార్చుకున్నారు. ఖచ్చితంగా ఏదైనా కూలి పనిచేస్తే తప్ప రోజు గడవని పరిస్థితి వారిది. నా జీవితంలో ఉద్యోగం వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలను రూపుమాపాలి , అమ్మనాన్నలను బాగా చూసుకోవాలి అని మాత్రమే కాదు నా ఊరిని నా లాంటి పరిస్థితిని ఎదుర్కుంటున్న పిల్లలకు అండగా నిలవాలని కలలు కనేవారు. తన సంకల్పంలో నిజాయితి ఉండడం వల్ల అనుకున్నట్టు గానే 2001లో మొదటి జీతం అందుకున్న రోజు నుండే సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. అలా దోమకొండ అని మాత్రమే కాకుండా దాదాపు 50 ఎన్.జి.ఓలతో కలిసి పనిచేస్తు ఎన్నో వేలమందికి సహాయం చేశారు.

మహిళల ఉన్నతి కోసం: దోమకొండలో ఉన్న 10,000 జనాబాలో దాదాపు 98% శాతం మంది ప్రజలు బీడిలను తయారు చేస్తూ బ్రతకుబండిని నడుపుతుంటారు. ఒక్కరోజు 1,500 బీడిలను తయారు చేయడానికి వీరు దాదాపు 12గంటల వరకు కష్టపడాల్సి ఉంటుంది దీనికై వీరు సంపాదిస్తున్న వేతనం కేవలం రూ.100 నుండి రూ.200 మాత్రమే. ఇంత కష్టపడితే వారు ఏదైనా ఆస్థులు కూడ బెట్టుకున్నారా.? ఏదైనా వేనకేసుకున్నారా అంటే అది లేదు కేవలం వారు బ్రతకడానికే సరిపోయే వేతనం మాత్రమే అందుకునే వారు. అంతే కాదు దాదాపు 12గంటల పాటు దగ్గరుండి పొగాకు వాసన పీల్చడంతో వీరిలో చాలామందికి కాన్సర్, మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాణంతకరమైన వ్యాధులు వచ్చేవి. బాల ప్రసాద్ గారి తల్లి దండ్రులు కూడా ఈ బీడిలు తయారుచేసేవారు కాబట్టి ఇందులోని కష్టాలపై పరిపూర్ణ అవగాహన ఉండేది. చదువు, జ్ఞానం మాత్రమే వీరు జీవితాన్ని మార్చగలదు అని చెప్పి బాల ప్రసాద్ గారు జి.ఎమ్.ఆర్ మరియు ఉపాసన గారి సహాయంతో వృత్తి విద్య కోర్సుల మీద శిక్షణ ఇప్పించి, అపోలో హాస్పిటల్స్ లో స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. బీడిలు చూడితే నెలకు 3 వేలు సంపాదిస్తుంటే అపోలో హాస్పిటిల్స్ లో ఉద్యోగం చేస్తు 12,000 వేలకుపైగా జీతం ప్రస్తుతం అందుకుంటున్నారు.

"దోమకొండలో ఒక సామాన్యుడు నాకన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంతకన్నా నాకు గొప్ప ఆనందం లేదు. -బాల ప్రసాద్ గారు".

మెరుగైన జీవితం కోసం: మహిళలు మానసికంగా ధృడంగా ఉంటే పురుషులు శారీరకంగా ధృడంగా ఉంటారు. ఒక ఊరు అభివృద్ధికి నోచుకోవడం లేదంటే అందుకు మధ్యపానం, సోమరితనం ప్రధాన కారణంగా ఉంటుంది. దోమకొండలో కూడా కొంతమంది పురుషులు రోజుకు సంపాదించిన డబ్బులో సగానికి పైగా ఎక్కువ డబ్బు మధ్యం కోసం ఉపయోగించేవారు, ఒక్కోసారి పూర్తిగా కూడా ఉపయోగించేవారు. ఇలాకాదు అని చెప్పి ఆ కుటుంబానికి ఆత్మీయ బంధువుగా అవతరించి నిర్మాణ్ ఫౌండేషన్ సహాయంతో కొన్ని స్వయం వృత్తి విద్యల మీద ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఫినాయిల్, హాండ్ బ్యాగ్స్ లాంటి వాటి మీద శిక్షణ ఇప్పించారు. ఇప్పుడు ఆ కుటుంబాలు ఆనందంగా గడుపుతున్నారంటే దానికి బాల ప్రసాద్ గారి కృషి ఎంతో ఉంది.

"రైతు దేవుడే కావచ్చు, కాని రైతు ఆనందంగా బ్రతకాలంటే మార్కెటింగ్ విలువలు నేర్చుకుని మంచి బిజినెస్ స్ట్రాటజీతో వ్యవసాయం చేయాలి -బాల ప్రసాద్ గారు".

సాంప్రదాయ వ్యవసాయం: పక్క పొలంలోని రైతు వరి పండిస్తే మనోడు కూడా వరి పండిద్దామనుకుంటాడు. పక్క రైతు పొలంలో రెండు బస్తాల యూరియా వేస్తే మనోడు నాలుగు బస్తాల యూరియా వేస్తాడు. పవర్ ఫుల్ పురుగుల మందులు చల్లితే మనోడు కూడా అంతే స్థాయి పురుగుల మందులు చల్లుతాడు. కాకపోతే పక్క రైతు 10,000 సంపాధిస్తే మనోడికి 5,000కూడా లాభం రాదు. వ్యవసాయంలో పోటి పెరగడం సరైన అవగాహన లేకపోవడంతో దోమకొండ రైతు ఎన్నో నష్టాలు చవిచూసేవారు. బాల ప్రసాద్ గారు వ్యవసాయం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయించడం మొదలు పెట్టారు. పెస్టిసైడ్స్ వల్ల చీడ పురుగులు మాత్రమే కాదు పంటకు ఉపయోగపడే వానపాములు, ఇతర క్రిమి కీటకాలు చనిపోతున్నాయి మరో పది సంవత్సరాల పాటు ఇలాగే జరిగితే అణుబాంబు పడ్డ భూమిలా ఎడారిలా మారే ప్రమాదముంది.. బాలప్రసాద్ గారు మరియు కొంతమంది మిత్రుల సహాయంతో దోమకొండలో కొంతమంది రైతులకు ప్రతి రైతుకు రెండు గోవులను దానంగా ఇచ్చి వాటి నుండి వచ్చే ఎరువుతో వ్యవసాయం ఎలా చేయవచ్చో వివరించారు ఇంతకు ముందు క్వింటాళ్ళకు 1500 సంపాదిస్తున్న రైతు నేడు 6,000కు పైగా ఎక్కువగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ తో సంపాదిస్తున్నారు.

విద్యార్ధుల కోసం: దోమకొండలో ఓ విచిత్రమైన పరిస్థితి ఉండేది. ఓ పేద విద్యార్ధికి 90%కి పైగా మార్కులు వస్తే 5,000రూపాయల చిన్నపాటి ఉద్యోగానికి, 60% మార్కులు వచ్చిన ఓ ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్ధి సివిల్స్ రాయడానకి ప్రయత్నించేవారు. పేద విద్యార్ధులలో చదువు ఉన్నా కాని భయం వల్ల చిన్నపాటి ఉద్యోగమే మేలు అని సంతృప్తి చెంది ఇలా ఆగిపోవడం అది దేశానికై నష్టం అని చెప్పి విద్యార్ధలకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తూ సాంఘికంగా, ఆర్ధికంగా, కెరీర్ పరంగా అండగా నిలబడుతూ వారి జీవితానికి ఓ అర్ధం ఉండేలా మారుస్తున్నారు..

బాల ప్రసాద్ గారి వయసు చాలా చిన్నది కాని ఆయన సాగించిమ సేవా ప్రయాణం మాత్రం చాలా సుధీర్ఘమైనది. పిల్లలను దత్తత తీసుకోవడం దగ్గిరి నుండి ఇలా ఊరిని ఇన్ని రకాలుగా ఊరిని బాగుచేయడం వరకు ఆయన ఎన్నో చేశారు, చేస్తున్నారు. ఇప్పటికి తన సంపాదనలో ఖర్చులు తగ్గించుకుని 60%కు పైగా దోమకొండ ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు. ఇంకా ఆయన చేయాల్సినవి పనులు, చేరుకోవాల్సిన శిఖరాలు ఎన్నో ఉన్నాయి వాటినే లక్ష్యంగా ఎంచుకుని ముందుకు సాగిపోతున్నారు. ఊరికి ఒక్కడు బాల ప్రసాద్ లాంటి వ్యక్తి ఉన్నా మన భారతదేశం కొన్ని సంవత్సరాలలోనే మన ఊహకు అందనంత మారిపోతుంది.