This Story On How A Short Train Journey Changed A Guy’s Whole Perspective Of Life Will Move You!

Updated on
This Story On How A Short Train Journey Changed A Guy’s Whole Perspective Of Life Will Move You!

ఒక గంటన్నర ప్రయాణం నా జీవితాన్ని మార్చేస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు …… ఒక మాములు మనిషి నన్ను ప్రభావితం చేస్తాడని అసలు అనుకోలేదు ……. ఒక చిన్న సంభాషణ మనసుని కదిలించి ,మనిషిని బ్రతికిస్తుందని నాకప్పటివరకు తెలీదు…………

అది ఏప్రిల్ పది . నా పుట్టిన రోజు . నా జీవితం లో అతి ముఖ్యమైన రోజు . ఆరు నెలల క్రితం నాకు నేను పెట్టుకున్న గడువు ఈరోజుతో ముగిసింది . ఈరోజు నేను ఆత్మహత్య చేసుకోబోయే రోజు . ఇంకో మూడు గంటల్లో నేనీ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను . ఊరికి దూరంగా ఉన్న రైల్వే ట్రాక్ నా చివరి గమ్యం .

మలక్ పేట్ రైల్వే స్టేషన్ లో లింగంపల్లి వెళ్లే లోకల్ ట్రైన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను . పదింటికి రావాల్సిన ఎంఎంటిఎస్ రైలు పావుగంట ఆలస్యంగా నడుస్తుంది . నా జీవితం లో అన్నీ ఇంతే, నా వరకు వొచ్చేసరికి అన్నీ తారుమారవుతాయి . నేను బ్రతికుండడం వల్ల ఎవరికీ ఏ ప్రయోజనం లేదు . భూమికి భారం . తల్లిదండ్రులకి బరువు . నన్ను చూస్తే నాకే జాలేస్తుంది . నా బతుకుని తలచుకుంటే నాకే అసహ్యమేస్తుంది . నలుగురిలా హాయిగా ఉండలేను. నలుగురిలో దర్జాగా తిరగలేను. నాకేదీ చేతకాదని సమాజం నిర్ధారణ చేసింది . నేనెందుకూ పనికిరానని నాకే అర్ధం అయ్యింది . జీవితం ప్రశ్నలా మారినపుడు చావే సమాధానం లా కనిపిస్తుంది . జీవితాన్ని మార్చే క్షణమ్ కోసం ఎంతగానో ఎదురుచూసా , ఇక నాకు మిగిలింది చావే . ఇది ఆవేశం లో తీసుకున్న నిర్ణయం కాదు . వివరాలన్నీ లెటర్ లో రాసి ఉంచా. నేనిప్పుడు పోతే ఎదో రెండురోజులు ఏడ్చేసి మర్చిపోతారు ,అదే బతికుంటే నన్ను , నా దరిద్రాన్ని చూస్తూ రోజూ ఏడుస్తూనే ఉండాలి.

రైలు వచ్చేసింది . బోగీలో చివరి సీట్ లో కిటికీ పక్కన కూర్చున్నాను. రద్దీ పెద్దగా లేదు . చివరిసారిగా ఈ ప్రపంచాన్ని కిటికీ లోనుంచి చూస్తున్నాను. ఎలాంటి ఎమోషన్స్ కి లోనుకాకూడదని ఏ ఆలోచనని నా దగ్గరికి రానివ్వట్లేదు . నాకెదురుగా కాస్త దూరం లో ఓ చంటి పిల్లాడిని ఎత్తుకొని ముద్దుచేస్తున్న తల్లిదండ్రులు కనిపించారు . లోలోపలే నా తల్లిదండ్రులకి క్షమాపణలు చెప్పుకున్నాను . ఎంత వద్దనుకున్నా వాళ్ళని వదిలేసి వెళుతున్నానని భాద కన్నీరులా బయటకి వచ్చేస్తుంది . కానీ నా నిర్ణయాన్ని మాత్రం మార్చుకోను.

నన్ను దూరం నుంచి ఎవరో గమనిస్తున్నట్టు అనిపించింది . నేను కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తూ ఉన్నాను. ఎవరో నన్ను తట్టినట్టు అనిపించి కళ్ళు తెరచి చూసాను . “ఈ సీట్ ఖాళీయేనా . కూర్చోవొచ్చా ?” అని అడిగాడు . “హా. ఎవరు లేరు,” అని చెప్పాను . ఆ మనిషి ఏదోలా ఉన్నాడు . కాళ్ళకి స్లిప్పర్లు , వీపు దగ్గర చిరిగిపోయిన చొక్కా , చేతిలో రెండు సంచులు ,మెడకి ఎదో స్కూల్ ఐడి కార్డు కి మొబైల్ ని తగిలించుకొని ఉన్నాడు . నాకెందుకో కంపరంగా అనిపించి తల తిప్పి బయటకి చూస్తూ ఉన్నాను .

“ఏంటి బాబూ ఆలా ఉన్నావ్ ఏదైనా సమస్యా?” అని అడిగాడతను. “నీకెందుకు ... నీ పనేదో నువ్ చూస్కో,” అని కోపంగా చెప్పి, తల తిప్పేసుకున్నా . ఈలోగా ఎదో స్టేషన్ వచ్చింది . ఏ స్టేషనో చూద్దామని తల తిప్పాను .

విద్యానగర్ రైల్వేస్టేషన్ అది . “ఏ స్టేషన్ బాబు ఇది?” అన్నాడు . చిరాగ్గా తన వంక చూసినపుడు తనకి ఒక చేయి లేదని నాకర్థం అయింది . “విద్యానగర్,” అని చెప్పాను

ఓసారి తనని తేరిపారా చూసాను . అతనికి ఒక కాలు కూడా లోపం ఉంది . నేను తనని ఆలా చూడడం గమనించిన అతను , “అది చిన్నప్పుడే పోలియో తో ఆలా అయ్యింది బాబు,” అని చెప్పాడు . “మరి ఈ చెయ్యి ??” అని అడిగాన్నేను . “ఇదా.. ఓసారి రోడ్డు దాటేప్పుడు లారీ గుద్దేసింది ఆ ప్రమాదం లో ఈ చేయి కూడా పోయింది.”

కాస్త సానుభూతి కలిగింది నాకు . “ఏంచేస్తుంటావ్ నువ్వు ? కష్టంగా లేదా ?” అని అడిగా .... దానికతను ఒక చిన్న నవ్వు నవ్వి, “ఉదయాన్నే న్యూస్పేపర్ ఏజెన్సీ దగ్గర పేపర్లు తీస్కొని చౌరస్తాలో పేపర్ అమ్ముతుంటా . తొమ్మిదింటి నుండి సాయంత్రం వరకు స్కూల్ లో అటెండరుగా చేస్తా,” అని చెప్పాడు .

నాకతని మీద గౌరవం కలిగింది . ఒక కాలు ఒక చేయి లేకపోయినా తన బ్రతుకు తాను బ్రతుకున్నందుకు .

“మరి మీకు ఇబ్బందిగా లేదా ఇలా కాలు చేయి లేదు . మీకంటూ ఎవరైనా ఉన్నారా ?? ఇలా రోజూ కష్టపడడం అది కూడా మీరు ఇలా….” అని.

నేను అడగడం పూర్తి చేసేలోపే, “హహహ్హా ...నాకర్థం అయ్యింది బాబూ నువ్వేం అడగలనుకుంటున్నావో . నాకు పెళ్లి అయింది నాకో కూతురు కూడా ఉంది . తనకి నేనంటే పంచ ప్రాణాలు . ఇక ఇబ్బందులు కష్టాలంటావా ,అవి అందరికి ఉండేవే కదా.” అన్నీ ఉన్ననాకే బతకడానికి దిక్కు తేలీక చావుని వెతుకుతూ వెళుతుంటే ఇతనేంటి ఇంత సింపుల్ గా నవ్వేసి ఈజీ గా చెప్పేస్తున్నాడు అని ఆశ్చర్యపోయి , అర్ధం అవ్వనట్టు తనని చూసా.

” మనిషిగా పుట్టడమే గొప్ప వరం , ఎంత అదృష్టం ఉంటె ఈ జన్మ దొరుకుతుంది . ఆలా అడగకముందే వచ్చిన వరాన్ని ఉన్నంత కాలం అనుభవించాలే కానీ అది నాకు అందలేదు,నాకు ఇది దక్కలేదు అంటూ భాద పడడం దేనికి ? బతకడం కష్టమేమో కానీ జీవితం చాల అందం అయిన్ది . ఆ అందాన్ని ఇంకా పెంచడానికే ఏవో ఇలా నాకున్న చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి . జీవితాన్ని ఆనందంగా మార్చడానికే ఏవో భాదలు,కష్టాలు వస్తుంటాయి అంతే . అందరూ అటుంటారు జీవితం లో గెలిచాం, జీవితం లో ఓడిపోయాం. .ఇదేమైనా పోటీ నా గెలిచేదానికి ఓడిపోడానికి . ఏనుగు కి కుందేలు కి పోటీ ఎట్లా కుదురుతుంది , ఏనుగు బలం ఏనుగుదే ,కుందేలు వేగం కుందేలుదే .ఇది ఎవరికి వాళ్ళు చేయాల్సిన ప్రయాణం . ఒకరికి పూలబాట ఉండొచ్చు ఒకరికి ముళ్ళ బాట ఉండొచ్చు . ఎవరి దారి వాళ్లదే ఎవరి ప్రయాణం వాళ్లదే. ఈ ప్రయాణం లో చేరాల్సిన చోటు అని ఒకటుంటుంది అని అనుకోని ఎదో పరుగులు తీస్తుంటారు . ప్రయాస పడుతుంటారు. ఆస్వాదించాల్సింది ఈ ప్రయాణాన్ని , ఈ దారిలోనే మన అనే వాళ్ళు మనకి కలుస్తుంటారు, మనతో నడుస్తుంటారు . కష్టాలు, భాదలు, ఎదురుదెబ్బలు, ఇవి లేకపోతే మజా ఏముంటుంది బాబు . అవన్నీ ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి అంతే. అవి వచ్చేది కూడా మనకి ఒక మంచి అనుభవాన్ని అనుభూతిని ఇవ్వడానికే .

అందమైన హరివిల్లుని చూడాలంటే ముందు కారుమబ్బుల్ని చూడాలి, గాలిదుమారం కి నిలబడాలి , మెరుపులు రావాలి,ఉరుముల శబ్దం వినాలి,ఒక్కోసారి పిడుగులు కూడా తట్టుకోవాలి, ఇవన్నీ దాటుకుని తట్టుకున్నాక అందమైన హరివిల్లు ని చూస్తే ఆ అనుభూతి ఎంత బాగుంటుంది .

పరమాన్నం రుచి తెలియాలంటే కడుపులో పేగులకి ఆకలి మంట ఏంటో ముందు తెలియాలి అప్పుడేగా పరమాన్నం ఎంత రుచిగా ఉంటుందో తెలిసేది . ఏవో చికాకులు కష్టాలు నష్టాలు భాదలు ,ఇవన్నీ కాసేపు ఇలా ఉండి ఆలా పోయేవి , ఇవి వచ్చినపుడే మన బలం ఏంటో తెలుస్తుంది వీటిని దాటిముందుకెళ్లినకే మన బతుకేంటో తెలుస్తుంది. అది తెలిసిన నాడు జీవితంలో ప్రతీ నిమిషం వేడుకే . చదువుకున్నోడివి నీకివన్నీ తెలియనివా . నువ్వేదో అడిగితే నేనేదేదో చెప్పినట్టున్నా .”

“లేదు లేదు సరిగ్గానే చెప్పారు .”

“మీరేం చదువుకున్నారు ? మీ పే...... రు……?”

“నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది,వెళ్తా బాబూ.”

“హ… సరే …”

దిగేసి వెళ్ళిపోయాడు . ఆ జనం లో మాయం అయిపోయాడు . తనని వెతుకుతూ నేనూ దిగాను,కానీ అతను కనపడలేదు.

ఈలోగా నా రైలు బయలుదేరింది . కానీ నేను ముందుకు కదలలేదు. అతను చెప్పిన ప్రతీ మాట నా మనసుని తాకింది. నా మెదడుని ఆలోచించేలా చేసింది . అంగవైకల్యం ఉన్నాకూడా ఏమాత్రం లెక్కచేయకుండా ధైర్యంగా ముందుకెళుతూ జీవితం లో ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ ,నవ్వుతూ బ్రతుకుతున్న తనని చూసి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని నాకర్థం అయ్యింది . మనోవైకల్యం ని మించిన శత్రువు మరోటి లేదని తెలియజేసాడు అతను .

చావుని వెతుకుతూ వెళుతున్న నాకు జీవితాన్ని పరిచయం చేసాడు . ఇన్నేళ్ళలో నేనెప్పుడూ నేర్చుకోలేకపోయిన పాఠాన్ని ఈరోజు అతను నాకు నేర్పాడు .

అతని పేరు కూడా నాకు తెలీదు కానీ నాకతను ఓ గురువు , స్ఫూర్తి నింపిన మార్గదర్శి.

చనిపోవాలి అని బయలుదేరిన నా ప్రయాణం ఆ ఆలోచనని చంపేసి ఏదిఏమైనా బ్రతకాలి బ్రతకడంలో ఆనందాన్ని చూడాలి అనే కొత్త గమ్యం దిశగా మొదలయిన్ది నా పయనం …