తిరుమల అంటేనే పరమ పవిత్ర స్థలం.. ఈ ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శిస్తున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంతో పాటు ఇదే ప్రాంతంలో మరెన్నో దేవాలయాలు ఉన్నాయి..హిందూ పురాణగాధల ప్రకారం ఈ సప్తగిరులలో దాదాపు 70 తీర్ధరాజాలున్నాయి. ఒక్కో తీర్ధానికి ఒక ప్రత్యేక ఉనికి ఉంది. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన భక్తులు ఈ కపిల తీర్ధాన్ని కూడా తప్పక దర్శిస్తారు. తిరుపతి రైల్వేస్టేషన్ నుండి సుమారు 6కిలోమీటర్ల దూరంలో ఈ కపిల తీర్ధం కొలువై ఉన్నది.
ఈ కపిల తీర్ధంతో పాటు తిరుమలలో తప్పక దర్శించవలసిన తీర్ధాలలో చక్ర తీర్ధం, అగ్ని తీర్ధం, విశ్వక్ సేన తీర్ధం, సప్తర్షి తీర్ధం, పంచాయుధ తీర్ధం మొదలయినవి ముఖ్యమైనవి. ఏడుగురు బ్రహ్మ మానస పుత్రులలో కపిల మహర్షి కూడా ఒకరు అని మహాభారతంలో పేర్కొన్నారు. హిందూ పురణాలలో కపిల మహర్షి ఒక గొప్ప మునిగా కీర్తింపబడ్డారు. పూర్వం కపిల మహర్షి పాతాళలోకంలో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజించేవారు. ఇదే శివలింగాన్ని అగస్త్య మహర్షితో పాటు మహాఋషులు, దేవతలు కూడా పుజించేవారట. శ్రీ వేంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి వివాహం తరువాత కపిల మహర్షి అభ్యర్ధన మేరకు పరమేశ్వరుడు కపిలమహర్షి శివుడిని పూజించిన క్షేత్రానికి విచ్చేశారట.
ఈ కపిల శివలింగాన్నే ఆగ్నేయ శివలింగం, శేషాచల శివలింగం అని వివిధ పేర్లతో పిలుచుకుంటారు. ఇక్కడి జలధార నింగి నుండి నేలను చేరుకుంటున్న గంగలా ఎప్పటికి ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపుతిప్పనివ్వవు.. ఇక్కడి ప్రశాంత వాతావరణం.. అడుగుతీసి అడుగు వేయనివ్వదు. తిరుమల అంటే మనకు శ్రీనివాసుడే గుర్తుకు వస్తారు కాని ఈ కపిల శివలింగం తిరుమల దేవాలయం కన్నా పూర్వం నుండే పుజలందుకుంటున్నదని చరిత్ర.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.