Contributed by Krishna Prasad
తోలు బొమ్మలాట - మనలోని చాలా మందికి ఈ పేరు సుపరిచితమే.అలాగే చాలా సినిమాలలో మనం వీటిని చూశాం , కొంత మందికి ఐతే ఈ పేరు తెలియకపోవచ్చు కూడా. ఇప్పుడయితే మనకి సినిమా , టెలివిజన్ ఇలా వినోదం పంచే సాధనాలు చాలా ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అంటే హరికథలు ,బుర్రకథలు వంటివి ఉనికిలో కూడా లేనప్పుడు ఆనాటి ప్రజలకి తోలుబొమ్మలాట ప్రధాన వినోద ,విజ్ఞాన సాధనం.
మన ప్రాచీన కళ తోలుబొమ్మలాట. చర్మంతో చేసిన బొమ్మల చేతులకి, కాళ్ళకి ,తలకు దారాలు కట్టి మధ్యలో ఒక దబ్బని కట్టి ,అవసరమైన దారాలు పైకి కిందకీ కదుపుతూ బొమ్మలని ఆడించేవరు. పురాణ కథలని ,వివిధ గాధలని ఎంతో అర్థవంతంగా చెప్పేవారు. ఒక సన్నటి వస్త్రాన్ని తెరగా కట్టి ,రెండు వైపులా పెద్ద దీపాలని పెట్టీ ,బొమ్మలను ఆడిస్తూ సన్నివేశానికి అనుగుణంగా పాట పాడుతూ , తాళం వాయించేవారు. సూత్రం తో వీటిని ఆడించే వ్యక్తిని సూత్రధారి అంటారు ఈయన సన్నివేశానికి తగ్గట్టు పా డుతు ,సంభాషిస్తూ బొమ్మల్ని ఆడించేవాడు. ఈయన వెనుక వంత పడేవారు వుండే వారు వీరు సన్నివేశానికి తగ్గ హంగామా అల్లరి చేసేవారు. అలాగే యుద్ధ ఘట్టలప్పుడు వల్ల కాళ్ళ కింద ఉండే బల్లచెక్కలను తొక్కుతూ శబ్ధం చేస్తూ, నగారా ,ఉరుములు, మెరుపుల శబ్ధం కోసం కాలి డబ్బాలను ఉపయోగిస్తూ సన్నివేశాన్ని రక్తికట్టించేవారు. జుట్టుపోలిగాడు, బంగరక్క ,కేతిగాడు ,అల్లాటప్పా గాడు వంటి పాత్రలు కథనం , కథనంకి మధ్యలో వచ్చి కడుపుబ్బ నవ్వించేవి.
వీటిని ప్రదర్శిస్తున్నారని తెలిస్తే చాలు పక్క ఊరి నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చే వారు.చిన్న పిల్లలు ,పెద్ద వారు,ముసలి ముతకా వంటి తారతమ్యం లేకుండా రెప్పవాల్చకుండా చూసే వారు .చదువుకున్న వారి నుంచి చదువు రాని వారి వరకు అభాల గోపాలన్ని అలరించేది ఈ జానపద కళ. మన తెలుగువారి జానపద కళా రూపమైన తోలు బొమ్మలాట క్రీ .శ.1700 కాలంలో ఎక్కువగా ప్రదర్శితబడుతూ ఉండేది.ఇది ఆంధ్రప్రదేశ్ కి చెందినప్పటికీ ,కర్ణాటక రాష్ట్రం లో కూడా ప్రాచుర్యం పొందింది. తూర్పుగోదావరి , పశ్చిమ గోదావరి జిల్లాలలో ఎక్కువగా ప్రదర్శించబడిన తోలుబొమ్మలాట, ఆనాటి ప్రజల వివాహ మరియు వివిధ వేడుకులలో ,అలాగే గ్రామాల్లో ముఖ్యంగా వ్యవసాయ తరుణం అయిపోయాక ఎక్కువగా ప్రదర్శితమవుతూ ఉండేది.
రాను రాను వీధి నాటకాలు , డ్రామాలు ఇతరత్రా వినోద సాధనాలు రావటం వలన , ప్రజలు వాటివైపు మొగ్గుచూపటంతో తోలు బొమ్మలాట మరుగున పడిపోయింది. అలా అవసనదశకు చేరుకున్న తోలు బొమ్మలాట ,ఇప్పుడు చాలా అరుదుగా కొన్ని కొన్ని గ్రామాల్లో మాత్రమే కనిపిస్తున్నది.