తోడు నీడ - This Short Story Of An Elderly Couple Will Remind Us The Need Of Gratitude In Life

The story of abandoned Old couple who knew the real meaning of life
Updated on
తోడు నీడ - This Short Story Of An Elderly Couple Will Remind Us The Need Of Gratitude In Life

మేనేజర్ తిడతాడనో , పని ఎక్కువ ఉందనో తొందరగా వెళ్దాం అని స్పీడ్ పెంచి 70 ఎక్కించాను , హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా , పరుగులు పెట్టె నగరం , పొరుగువాడి గురించి ఆలోచిస్తోందా? అంటే నేనేం పెద్ద పతీతి కాదు , నేను అదే బాపతి, కాకపోతే ఆ రోజు అదృష్టం అవతల వాడి బండికి ఉందేమో మరి , ఓవర్ టేక్ చేసే హడావిడి లో వాడి బండి హ్యాండిల్ నా బండికి తగిలింది , దెబ్బకి నా బండి వెళ్లి డివైడర్ కి గుద్దుకుంది.

నలుగురొచ్చారు, చూసి నీళ్లు ఇచ్చి , పెద్ద దెబ్బలు ఎం తగలకపోడం తో ఒక చోట కూర్చోపెట్టి ఎవరి పని వాళ్ళు చూస్కున్నారు.దూరంగా డివైడర్ మీద కూర్చున్న ముసలోడు నా వైపే చూస్తూ తెగ నవ్వుతున్నాడు.

డివైడర్ మీద GHMC వాళ్ళు వేసిన చెట్టు నీడలో కూర్చున్నారు , ముసలోడు వాడి పెళ్ళాం. అసలే కాలు బెణికి నేను ఏడుస్తుంటే ఆ వెక్కిలి నవ్వుకి నాకు కాలిపోయింది . అలా కుంటుతున్న కాళ్లతోనే రోడ్ దాటి వాళ్ళ దగ్గరికి వెళ్లి గట్టిగా...

వివేక్ : ఏయ్ ! ముసలోడా , పనిపాటా లేదా? ఒకడు దెబ్బ తగిలి ఏడుస్తుంటే , నవ్వు ఎలా వస్తుంది నీకు ?

తాత : నిన్ను చూసి నవ్వలేదయ్యా నేను , నా ఆడది పని కాడ జరిగిన ముచ్చటొకటి చెప్తే నవ్వు ఒచ్చినాది. ఒసేయ్ సుశి చెప్పవే ...

అవ్వ : ఎవరు సారూ మీరు ? మిమ్మల్ని చూసి మేమెందుకు నవ్వుతాము ?

వివేక్ : తమషాలాడకు , నేను చూసా నవ్వడం. మీ సంగతి ఇలా కాదు , ఫోటో తీసి మున్సిపాలిటీ కి పంపిస్తే , క్లీన్ చేసి పడేస్తారు. అయినా అడుక్కుతినే వాళ్ళని పంపించేశారు అన్నారు , మళ్ళీ తగలడ్డారు ఏంటో..

అవ్వ : ఏయ్ ! ఎవడ్రా అడుక్కుతినే వాళ్ళు , నువ్వు ఇచ్చావా ? నేను తీస్కున్నానా ? నువ్విచ్చినా నేను తీసుకోను .

ఆకలి తో అయినా ఉంటా కానీ ఆత్మాభిమానానన్ని చంపుకోను . మాటలు తిన్నగా రాని....

ఒక్కసారి చెంప మీద చెప్పుతో కొట్టినట్టు అయింది. కొట్టినా అంత బాధ ఉండేది కాదేమో. అలా అవ్వ అన్నాక , నేను అన్న మాట వాళ్ళు మర్చిపోయిన , నేను మర్చిపోనేమో .క్షమించమని అడిగాను. వెంటనే క్షమించడం తో బాధ రెట్టింపు అయింది.

చిన్న సంచి , సంచిలో రెండు జతల బట్టలు. సిమెంట్ తో నిండిన ఆమె చెప్పులు , నీరసం తో నిండిన తాత శరీరం. ఒక బ్రెడ్ ప్యాకెట్ , సగం నీళ్లతో నిండిన బాటిల్. ఆసక్తి అడిగిన మొదటి ప్రశ్న

వివేక్ : ఎం చేస్తుంటారు తాత మీరు?

తాత : నేనేం చెయ్యను బాబు. నా ఆడదే పనికి పోయి నాలుగు పైసలు తీసుకొస్తది . నా 27 వ ఏట నుండి అదే నన్ను పోషిస్తుంది.

వివేక్ : అదేంటి తాత ? కొడుకులు కానీ కూతుర్లు కానీ లేరా?

తాత : ఒకడు పరువు పోతుందని వద్దనుకున్నాడు, ఇంకొకడు భారమనిపించి వదిలేసాడు.

కొడుకుంటే ఆనంద పడ్డారప్పుడు , కూతురు లేదని బాధ పడాల్సి వస్తుంది ఇప్పుడు.

ఆ క్షణం ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఒక పూట తింటు ఆ వయసులో పని చేస్తూ , అంత బాధ మోస్తూ ..వినే నాకే కన్నీళ్లు తిరిగాయి , అసలు ఎలా ? ఒక్కసారిగా లోకం చాలా బరువుగా అనిపించింది. నచ్చలేదు అస్సలు నచ్చలేదు.

సడన్ గా అసలు అక్కడికి నేను రావడానికి కారణం ఆ తాత నవ్వు. ఇంత బాధ లో ఎలా నవ్వగలుగుతున్నాడు?

వంటికి తగిలిన గాయం మర్చిపోయి చాలా సేపు అయింది.మొహమాటం తోనే అడగాలా వద్దా అనే సంకోచం తో ...

వివేక్ : తాత , ఎం అనుకోవద్దు. నా వాళ్ళ కావట్లేదు , అందుకే అడిగేస్తున్న . అన్ని బాధలున్న , ఎలా తాత నవ్వుతున్నావ్ నువ్వు ?

తాత : (నవ్వుతు) లేనిది ఏడిస్తే ఒస్తుందా? ఉన్నదీ నవ్వితే పోతుందా ?

మీలా గొప్ప చదువులు చదవక పోయిన , కొడుకులు వదిలేసిన , ఆస్తులు లేకపోయినా , ప్రాణం పోయిన నన్ను వదలని నా ఆడది ఉంది . ఈ క్షణం నేను చనిపోయిన సంతోషంగానే పోతాను.కొడుకులే వదిలేసారు , భారం అని తెలిసిన , నన్ను పోషించడానికి కూలి పనికి పోయిమరీ నా కడుపు నింపుతుంది.కనిపించక పోయిన దాని కష్టం నాకు తెలుసు.అలిసిపోయిన దానికి , అలసట తో నిండిన నాకు ఒకరికొకరే తోడు నీడ. అది చెప్పే ముచ్చట్లు , దాని స్వచ్ఛత , నా కొడుకులున్న ఇంత బా చూసుకునే వాళ్ళు కాదేమో బాబు.రాత్రికి కలిసి చేసే భోజనం , అది చెప్పే మాటలు చాలు ఈ జీవితానికి.

వివేక్ : (ఎం మాట్లాడాలో కూడా అర్ధం కానీ నవ్వుతో ) మీరమ్మ?

అవ్వ : నా పెనివిటే నా కొడుకు , కూతురు, సంతోషం. ఆయన ముఖాన నవ్వు ఉన్నంత కాలం , ఏ కష్టం అయినా సుఖమే , ఆ బాధైనా హాయే.

ఆక్సిడెంట్ అయితే ఇంత సంతోషం వస్తదని ఎపుడు అనుకోలేదు, బహుశా వీళ్ళని కలవడానికే ఇక్కడ ఆక్సిడెంట్ అయిందేమో.చెప్పలేను కానీ ఎన్నో ఆలోచనలు , ఇంకెన్నో భావాలు. వాళ్ళని మళ్ళీ కలుస్తానని తెలుసు , మళ్ళీ మళ్ళీ వాళ్ళతో కూర్చుంటానని తెలుసు.

వివేక్ : అవ్వ వెళ్ళొస్తా , ఈ 2000 తీస్కొని ఈరోజు మంచిగా తినండి

అవ్వ : నీకు చెప్పింది అర్ధం కాలేదనుకుంట బాబు , నీ మాట గెలవడానికి మమ్మల్ని బిచ్చగాళ్ళని చేయకు.

వివేక్ : అయ్యో క్షమించండి అవ్వ , నా ఉద్దెశం అది కాదు. సరే వెళ్ళొస్తా అవ్వ , ఈసారి కలిసి భోజనం చేద్దాం. మీ కథ నా కథ ని మార్చే అంత గొప్పది . కానీ వెళ్లే ముందు ఒకే ఒక్క ప్రశ్న. తాత అబద్ధం ఆడి ఉంటె ? నిజంగా నన్ను చూసి నవ్వాడంటే ఏమంటావ్?

అవ్వ : అందరి భార్యల లానే నా మొగుడు మంచోడని చెప్తా. కాకపోతే నీ విషయం లో ఆయన చూడలేదనదే నిజం, ఎందుకంటే ఆయనకీ కళ్ళు కనిపించవు కనక..

(Complete Silence )

అన్ని ఉన్న ఏదో లోటు అని బాధపడతారు కొందరు , ఎం లేకపోయినా హ్యాపీ గా బ్రతికేయగలరు ఇంకొందరు.

పరుగులు పెట్టె జీవితాలు , కానీ నిశ్చలంగా ఆగిపోయిన జీవనాలు.

ఆ తాత అవ్వలా కథ ఏదో నేర్పింది, ఇంకెన్నో ప్రశ్నలు అడిగేలా చేసింది.

సంతోషంగా బ్రతకాడానికే సంపాదిస్తున్నాము, కానీ ఎక్కువ సంపాదించాలన్న ఆరాటంలో బ్రతకడం మర్చిపోయామా ?

అన్ని ఉన్న సంతోషంగా ఎందుకు లేమని ?

పరుగులు పెడితేనే బ్రతకగలమా ? నిలబడి ఆ క్షణాన్ని ఆస్వాదించలేమా?

సొంత వాళ్ళ కన్నా ఆఫీస్ పని ఎందుకు ముఖ్యం అయిపోయింది?

బాధ వస్తే పంచుకోడానికి నా అనే వాళ్ళు ఉన్నారా?

లోకం లో చాలా మంది కన్నా మంచి స్థాయి లో ఉన్నావు , దానికి కృతజ్ఞత చూపిద్దాం. నా అనుకునే మనిషి , నాలుగు మెతుకులు , మనసారా నవ్వులు. దాన్ని మించిన జీవితం లేదు. ఆ తర్వాత అదే దారిలో రోజు వెళ్ళాను , రోజు కలిసాను , వాళ్ళకి మనవడిని అయ్యానో లేదా తెలీదు కానీ ఇంకో తోడు లా మాత్రం నిలిచాను.