అప్పటి వరకు మిగితా సినిమాలలో ఒకరకంగా కనిపించిన హీరో కాస్త కృష్ణవంశీ సినిమాలో మరోరకంగా కనిపిస్తాడు.. ఒక ఆర్టిస్టు బెండు తీసి ఇదిరా నీకు అవసరంలేని నీ కొవ్వు అని చూపిస్తు ఎంత కావాలో అంతే నటనను రాబట్టగల సమర్ధుడు కృష్ణవంశీ. క్రియేటివిటి అంటే లేని దానిని సృష్టించడం.. ఆ క్రియేటివిటిని తన ఇంటి పేరుగా పిలిపించుకునేంతటి స్థాయికి ఎదిగిన పసుపులేటి కృష్ణవంశీ పుట్టింది ఇదేరోజు.
కృష్ణవంశీ చిన్నతనం నుండే ఒక రకమైన Inferiority Complexలో ఉండేవాడు..ఎవ్వరితో అంత త్వరగా కలిసిపోయేవాడు కాదు.. అలా ఒంటరితనం అలవాటయ్యింది. ఆ ఒంటరితనంలో సినిమా ఒక అందమైన ఊహా ప్రపంచంలా కనిపించింది. హీరోయిజం, డాన్సులు, పాటలు అందమైన సెట్టింగులు ఇవన్నీ అతనికి ఒక కొత్త ప్రపంచంలా అనిపించేది.. ఆ ఇష్టంతో చిన్నప్పుడు థియేటర్ లోపలికి వెళ్ళి సినిమా ఎలా ప్రదర్శిస్తారు అని ఒక ఆటలా శ్రద్దగా గమనించేవాడు. అప్పటినుండే సినిమాకు ఆయనకు ఒక ఆత్మబంధం ఏర్పడింది. అది కృష్ణవంశీలా పెరిగి సినిమా తీయాలి అని ఒక బలమైన లక్ష్యంగా మారింది. ఆ లక్ష్యం గురుంచి ఇంటర్మీడియట్ చదువుతుండగానే తండ్రికి చెప్పాడు కాని తండ్రి Post Graduate పూర్తిచేయమని షరతు పెట్టాడు. లక్ష్యం అంటే అంతిమ లక్యం కాదు, ఆ లక్ష్యానికి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడమే నిజమైన లక్ష్యం అంటు Post Graduate పూర్తి చేసి సినిమా ప్రపంచంలోకి ప్రవేశించాడు.. చిన్న చిన్న దర్శకుల దగ్గర పనిచేసినా రాని మార్పు ఒక్క రాం గోపాల్ వర్మ శిశ్యరికంలో ఆయన జీవితం, ఆలోచనలు మొత్తం మారిపోయాయి.
శ్రీకాంత్ కు ఖడ్గం, మహాత్మ, నితిన్ కు శ్రీ అంజనేయం, ప్రభాస్ కు చక్రం, జూనియర్ ఎన్.టి.ఆర్ కు రాఖీ, సౌందర్య కు అంతఃపురం, కాజల్ కు చందమామ, రామ్ చరణ్ కు గోవిందుడు అందరివాడేలే, రవితేజ కు సింధూరం, మహేష్ బాబు కు మురారి, నాగార్జున కు నిన్నే పెళ్లాడుతా.. ఇలా మనం ఏ హీరోను చూసుకున్నా ఆ హీరో కెరీర్లోబెస్ట్ Performance సినిమాగా కృష్ణవంశీ తీసిన సినిమా ఉంటుంది.. కృష్ణవంశీ లాంటి సినిమాలు ఆయన ద్వారానే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొదటగా కొత్తరకంగా కనిపించాయి. సాధారణంగా చాలా మంది డైరెక్టర్లందరు వారి సినిమా జీవితమంతా ఒకే రకమైన కథతో, కాన్సెప్ట్ తో అటు తిప్పి ఇటు తిప్పి అదే సినిమా తీస్తుంటారు.. కాని కృష్ణవంశీ మాత్రం ఒక కుటుంబ కథ చిత్రం(మురారి, నిన్నేపెళ్లాడుతా), ప్రేమకథ చిత్రం (చందమామ), ఒక సోషల్ ఇష్యూ(గులాబి), ఫాక్షన్ హత్యల మీద(అంతఃపురం), ఒక దేశ సమైఖ్యతా చిత్రం(ఖడ్గం), ఒక నక్సల్స్ సమస్య (సింధూరం), ఒక నిజమైన భక్తి (శ్రీ అంజనేయం), ఒక నిజమైన చావుకు అర్ధం(చక్రం), ఆడపిల్లల సమస్య(రాఖీ), ఒక గాంధీయిజం(మహాత్మ) ఇలాంటి భిన్నమైన జోనర్లలో తనదైన ముద్రవేశారు. ఇవన్నీ సంఘాన్ని సమాజాన్ని నిద్రలేపేవే కాని ఇందులో Entertainment మిళితం చేస్తూ ఆయన సాగించిన ప్రస్థ నం ఖచ్చితంగా ఇంకొకరి తరం కాదు..! ఆయన రెండు సినిమాలకు Best films(నిన్నేపెళ్లాడుతా,సింధూరం) గా National Awards వచ్చాయి, మూడు సినిమాలకు(ఖడ్గం,చక్రం,చందమామ) ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డ్స్ తెచ్చిపెట్టాయి.
కృష్ణవంశీ సినిమాలలో మాటలు,కథ మాత్రమే కాదు పాటలు కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయి. మనమెంతో ఆనందంతో గర్వపడే సిరివెన్నెల సీతారామ శాస్త్రికి కృష్ణవంశీ అంటే ఎంత ఇష్టమంటే ఏకంగా తన కొడుకుగా దత్తత తీసుకొని తన ప్రేమను తెలిపారు.. ఒక సినిమా వల్ల జీవితాలు ఆర్ధికంగా మారుతాయి.. కాని ఒక సినిమా వల్ల జనాలు మంచి మనుషులుగా మారుతారు అని బలంగా నమ్మి, డబ్బులు వచ్చినా రాకపోయినా అవసరం లేదు అని నమ్మే సినీ సైనికుడు ఆయన. కృష్ణవంశీ దృష్టిలో సినిమా అంటే వ్యాపారం కాదు! సమాజాన్ని మార్చడానికి ఉన్న అద్భుతమైన ఆయుధం 'సినిమా'..
"నేను(కృష్ణవంశీ) ఒక మంచి మనిషిగా చచ్చిపోవాలి అదే నా జీవిత లక్ష్యం, నేను చనిపోయే ఒక 20నిమిషాల ముందు నేను బతికిన బ్రతుకంతా నాకు కనిపిస్తుంది.. ఆ 20నిమిషాలలో కనీసం 18 నిమిషాలు ఐనా నేను మంచి వాడిని అని నాకు నమ్మకం కావాలి అ ఆనందంలో సంతోషంగా చచ్చిపోవాలి ఇదే నా జీవిత లక్ష్యం -కృష్ణవంశీ..." మీరు అనుకున్నది జరగాలని కాని అది ఎంత లేట్ ఐతే అంత లేట్ గా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం మీ ఖ్యాతి ఉంటుంది.