This Story About The Pain A Woman Goes Through Will Increase Your Respect Towards Motherhood!

Updated on
This Story About The Pain A Woman Goes Through Will Increase Your Respect Towards Motherhood!

Contributed By Sai Gokul

అమ్మ

ప్రపంచం అంతటికి జన్మనిచ్చిన దేవత. మన‌‌ గతానికి,భవిష్యత్తుకి,ప్రస్తుతానికి చివరకు నువ్వు అన్న నీ వాస్తవానికి కారణం తనే. ఆకాశం అంత ప్రేమను ఓ వీడని మేఘంలా ప్రాణం పోయే వరకు మనపై కురిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కథతో నేను అమ్మ‌ ప్రేమను వర్ణిస్తానని కాదు,ఒకవేల అలా వర్ణిస్తే ఈ భూమిపై ధీనిని మించిన వర్ణన ఉండదు కాని నాకు తెలిసినంతలో మా అమ్మ ప్రేమ గురించి నాకు తెలియకుండా నాకు జరిగిన నా కథను మీకు చెప్పాలనుకుంటున్నా.

1994 June 30, ఓ శుభమూహుర్తాన పంచభూతాల సాక్షిగా,పెద్దల ఆశీస్సులతో,నా పంచ ప్రాణాలు నువ్వేనంటు నాన్న అమ్మ‌ మెడలో మంగళసూత్రం కట్టాడు.

1994 December, అమ్మ గర్భవతి అయ్యింది.నాల్గవ నెల అని డాక్టర్ ధృవీకరించాడు.

1995 January, ఐదవ నెల. ఎంతో ఆశగా హాస్పిటల్ కు వెళ్ళిన అమ్మా నాన్నలకు ఓ నిరాశ ఎదురైంది అదే 'Vascular mole' . వాస్కులర్ మోల్ అంటే గర్భం లాంటిదే కానీ గర్భం కాదు రక్తం గడ్డ లాగా ఏర్పడి గర్భంలాగా కనిపిస్తుంది. అది వెంటనే తీసేయాలి లేకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ ద్వారా తెలుసుకున్న అమ్మా నాన్న దాన్ని తీయించారు.

డాక్టర్: ఇంకా ప్రాబ్లెమ్ ఏమి లేదు కానీ ఇంకో సంవత్సరం వరకు గర్భం రాకూడదు ఒకవేళ వస్తే పుట్టబోయే బిడ్డకి అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంది . సరే డాక్టర్ అని ఇంటికి తిరిగొచ్చేశారు అమ్మ నాన్న.

1995 ఆగస్ట్ అమ్మ మళ్ళీ గర్భం దాల్చింది మూడవ నెల భయం భయంగా డాక్టర్ దగ్గరికి వెళ్లారు అమ్మ నాన్న . డాక్టర్: బాగా ఆలోచించుకోండి పుట్టబోయే బిడ్డకి అంగవైకల్యం వచ్చే అవకాశం చాలా ఉంది పుట్టాక మళ్ళీ బాధ పడి లాభం లేదు. ఆలోచించుకుని ఒక వారం తర్వాత రండి. నా సలహా ఐతే తీసేయడమే మంచిది . డాక్టర్ మాటలు విన్న అమ్మ నాన్న బాగా ఆలోచించుకున్నారు బంధువులంతా తీసేసేయ్ అన్నారు మా నాన్నతో సహా కానీ మా అమ్మ మాత్రం అందరితో గొడవ పడి ఆ మూడు నెలల పసి ప్రాణాన్ని కాపాడుకుంది. బిడ్డ బాగా పుట్టాలని రోజు సాయిబాబా గుడికెళ్లి మొక్కుకుంటు,ప్రదక్షిణలు చేస్తూ వచ్చింది . అమ్మ సంకల్పం ముందు ఎవరి సలాహాలు నిలవలేక పోయాయి. అప్పటినుంచి ప్రతి నెల వెళ్లి బిడ్డ ఎలా ఉన్నాడో అని చెకప్ చేయించుకుంటూ ధైర్యంగా ముందడుగు వేసింది.

1996 జనవరి 23 గర్భంతో చివరిరోజు తెల్లవారుజామున 2-3 మధ్యలో నొప్పులు రావడంతో ఎలాంటి బిడ్డ పుడతాడో అని భయంతో నాన్న .ఎలా పుట్టినా నా బిడ్డనే అని ప్రేమతో అమ్మ హాస్పిటల్ కి బయలుదేరారు. అమ్మ దేవుడిని వేడుకుంటుంది ఏ తప్పు జరగకూడదని బిడ్డ పుడితే నీ పేరు పెట్టుకుంటా అని సాయిబాబాను ప్రార్తించింది . చివరకి అమ్మ ప్రేమను నాన్న భయం గెలవలేక పోయింది. నేను పుట్టాను అమ్మ నాకు జన్మనిచ్చింది . వణుకుతున్న నాన్న చేతులు ఆనందంతో ఆకాశాన్ని తాకాయి, సంద్రాన్ని మోస్తున్న అమ్మ కళ్లు లోకాన్ని జయించాయి . నేను బాగా పుట్టాను . ఐ లవ్ యు అమ్మ ఏ తల్లిదండ్రులైనా వాళ్లకు పుట్టే బిడ్డలు వాళ్ళని బాగా చూసుకోవాలి లేదా వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటారు. పని వారిలా కాదు సొంతవారిలా . కానీ ఇక్కడ అమ్మ పరిస్థితి అది కాదు సరిగా పుడితే జీవితాంతం సేవలందుకుంటుంది లేదా జీవితమంతా సేవలందిస్తుంది. నీ ప్రేమకు, ధైర్యానికి జోహార్లు .ఇప్పడు నేను బ్రతుకుతున్న బ్రతుక్కి అసలు నేను బ్రతకడానికే కారణం నువ్వు ఇలా నువ్విచిన జన్మలో నేను ఆనందాన్ని చూసాను, బాధని చూసాను ,పగని చూసాను, ప్రతీకారాన్ని చూసాను, స్నేహాన్ని చూసాను చివరకి ప్రేమను కూడా చూసాను. జన్మ జన్మలకు నీకు రుణపడి ఉన్నా. వచ్చే జన్మలోకూడా అవసరమైతే ఆ దేవుళ్ళతో యుద్ధం చేసైనా మళ్ళీ నీకే పుడత . నమ్మకం లేని నా రేపటికి నీ నిన్నటి ప్రేమను పునాదిగా వేశావు. నా రేపు ఎలా ఉన్నా దాని అంతిమ లక్ష్యం నీ సుఖమే నువ్వు నా కలలో కదిలే , మదిలో మెదిలే ఆలోచనవి కావు నువ్వే నా ప్రాణం నువ్వే సర్వస్వం అన్ని నువ్వే ,నాన్న కూడా .(ఇంకా నా జీవితంలో చేరబోయేవాళ్ళు కూడా) తల్లిని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ కథ అంకితం . ఎలా పుడతానో తెలియని నా కోసం నా తల్లి పరితపిస్తూ నొప్పులు భరిస్తూ, ఏడుస్తూ, ప్రేమతో నాకు జన్మనిచ్చింది అలాంటిది అన్నీ బాగున్నాయని తెలిసి కేవలం ఆడపిల్ల అన్న ఒకే ఒక్క కారణంతో నూరేళ్ళు బ్రతకాల్సిన శిశువుని భూమిపై అడుగు పెట్టకుండానే చంపేస్తున్నారు . నా తల్లి కథ ఆడ శిశువు వద్దు అనుకున్న ఏ తల్లిదండ్రులను కదిలించినా చాలు అమ్మ ఇచ్చిన ఈ జన్మకు అక్కడ జరిగే ప్రతి శిశువు జననం సమాధానమే . చివరగా ఒక మాట తల్లిని ప్రేమించే ప్రతీ ఒక్కడికి ఈ కథ అంకితం అని నేను అన్న మాటకు మీకు అనుమానం రావచ్చు తల్లిని ప్రేమించని వాడంటూ ఈ భూమ్మీద ఉంటాడా అని? ఒక వేళ తల్లిని ప్రేమించని వాడంటూ ఉంటే ఆడవారిపై ఈ రేపులు,ఆసిడ్ దాడులు,అఘాయిత్యాలు ఎందుకు జరుగుతాయి.. ప్రతి ఒక్క స్ర్రీలో ఒక తల్లిని చూడండి అన్నీ అవే కుదురుకుంటాయి.. మా అమ్మ పేరు కవిత నా పేరు సాయి గోకుల్ ఇది నా కథ.

ఇలా‌‌ ప్రతీ తల్లి ప్రసవ వేదన ఓ కథే. ఒక్క సారి అమ్మ దెగ్గరికి వెళ్ళండి. వడిలో తల వాల్చండి. నేను ఎలా‌‌ పుట్టాను,ఎంత కష్టపెట్టి పుట్టాను అని‌ అడగండి అప్పుడు... మీ తల‌నిమురుతూ మీ అమ్మ చెప్పేది వినండి. అమ్మ అంటే ఏంటో అర్థమవుతుంది...