This Story About How Buddha Transformed A Villainous 'Angulimaal' With Love Will Bring Tears To Your Eyes!

Updated on
This Story About How Buddha Transformed A Villainous 'Angulimaal' With Love Will Bring Tears To Your Eyes!

బుద్ధుని కాలంలో అంగుళిమాలుడు అనే విద్యార్ధి ఉండేవాడు. పెద్దలంటే అమిత గౌరవం, గురువు అంటే భక్తి ఉండేవతనిలో.. ఓ గురువు దగ్గర అతను మంచి ఆసక్తితో విద్యబుద్దులు నేర్చుకుంటున్నాడు. మిగిలిన విద్యార్ధుల కన్నా అతనే ఎక్కువగా గురువు గారి ప్రశంసలు అందుకోవడాన్ని చూసిన సహవిద్యార్ధులు అంగుళిమాలుడిని సర్వనాశనం చేయాలని కుట్రపన్నారు. ఆ కుట్రలో భాగంగా గురువుగారి భార్యతో అంగుళిమాలుడికి అక్రమసంబంధం ఉందని ప్రచారం చేసి ఈ విషయాన్ని గురువుగారికి చెప్పారు. సంయవనం పాటించి ఓపికతో నిజనిజాలను తెలుసుకోవాల్సిన గురువు కోపంతో, ద్వేషంతో ఏ పాపం ఎరుగని అంగుళిమాలుడిని సర్వనాశనం చేసి భూమి మీదనే కాదు ఆకరికి నరకంలో కూడా చిత్రహింసలకు గురిచేయాలని ఓ పధకం రచించాడు. ఒకరోజు అంగుళిమాలుడిపై ఎక్కడలేని ప్రేమను తెచ్చుకుని "నా దగ్గర అద్భుతమైన తారక విద్య ఉంది, ఈ విద్యను నువ్వు నేర్చుకోవాలి.. అదే నువ్వు నాకిచ్చే అతిపెద్ద గురుదక్షిణ. ఐతే దీనికి ఒక షరతు ఉంది. ఈ విద్యను నేర్చుకోవాలంటే వెయ్యిమందిని చంపాలి. దీనిని నువ్వు అమలు జరుపకుంటే నువ్వు గురుద్రోహివి అవుతావు అని హెచ్చరించాడు". గురువునే దైవంగా భావించే అంగుళిమాలుడు "మీరు నిర్దేశించిన కర్తవ్యాన్ని తప్పక నెరవేరుస్తాను గురువర్య.. వెయ్యిమంది ప్రాణాలు తీసి అందుకు సాక్ష్యంగా వారి బొటనవేళ్ళను మీకు చూపిస్తానని మీకు గురుదక్షిణ తప్పక చెల్లించుకుంటానని వాగ్ధానం చేసి కత్తిపట్టుకుని ఊరులోకి పయనమయ్యాడు..

ఒక నిజమైన విద్యార్ధికి ఏకాగ్రత అంతా అతని లక్ష్యం మీదనే ఉంటుంది. వెయ్యిమందిని చంపాలి.. గురువుగారి గురుదక్షిణ చెల్లించాలి అంటూ నిత్యం ఆలోచించేవాడు. సౌమ్యుడైన ఆ విద్యార్ధి ఎదుటివారిని చంపాలంటే మొదట విపరీతంగా భయపడేవాడు, నేను తప్పు చేస్తున్నానా అని మధనపడేవాడు కాని గురుద్రోహం మహాపాపం అని విచక్షణ మరిచి చంపడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కరిని చంపుతూ వారి బొటనవేలును దారంతో మెడలో దండగా చేసుకున్నాడు. నిత్యం మనుషులు ప్రయానించే కొన్ని ప్రదేశాలలో ఉంటూ ఈ ఉదంతానికి పాల్పడుతున్నాడు. ఒకరోజు ఏ వ్యక్తిని చంపడం కుదరకపోతే తన పరీక్షలో ఉత్తీర్ణుడిని కాలేనేమోనని తీవ్రంగా విచారించేవాడు. అంగుళిమాలుడు ఎక్కడ వచ్చి చంపుతాడోనని ప్రజలందరిలో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి.. ఈ విషయం ప్రసేనజిత్తు మహారాజుకి చేరింది. అతన్ని పట్టుకోవడానికి చర్యలు తీసుకున్నా గాని ఏ పురోగతి లేదు. ఎవ్వరూ ఏమి చేయలేని పరిస్థితికి వచ్చేశారు.. ఈ విపత్కర పరిస్థితి గౌతమ బుద్ధునికి తెలిసింది.

మిగితావారికి కత్తులు, వివిధ మారణాయుధాలు ఆయుధాలైతే బుద్ధునికి మాత్రం ప్రేమ, కరుణనే ఆయుధాలు.. వాటితోనే ఏంతోమంది రాక్షసమనుషులను ఓడించి, మార్చి వారికి సరైన దారిని అందించాడు. అంగుళిమాలుడిని కూడా ఇదే పద్దతితో మార్చాలనుకున్నాడు.. ఒకరోజు అంగుళిమాలుడు ఉండే ప్రదేశాన్ని గుర్తించి ఒంటరిగా అక్కడికి ఆ మార్గం గుండా ప్రయాణం చేసే బాటసారిగా వెళ్ళాడు.. అదే సమయంలో కొడుకు ఎంతటి ఘోర తప్పులు చేస్తున్నాడోనని వివరించి తనదారికి తెచ్చుకుందామని అంగుళిమాలుడి తల్లి అక్కడికి వెళ్ళింది. దూరంగా ఎవరో వస్తున్నారని గుర్తించిన అంగుళిమాలుడు వెనకనుండి వచ్చి కత్తితో ఆమెను చంపబోయాడు.. ఆమె వెనక్కి తిరిగిచూసేసరికి 'కన్నతల్లి'. ఆకరికి కన్నతల్లినే చంపే దుస్థితి వచ్చిందని మొదటిసారి అతనికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. ఐనా కూడా గురుదక్షిణ నెరవేర్చాలి అని సతమతమవుతున్న సమయంలో అదే మార్గంలో వస్తున్న గౌతమ బుద్ధుని దర్శనం కలిగింది. గట్టిగా అరుస్తూ బుద్ధున్ని ఆగూ.. అని గద్ధరించాడు. బుద్ధుడు ఆగి ప్రశాంతంగా చిరుమందహాసంతో అంగుళిమాలుడుని చూస్తున్నాడు. తనంటే ఎక్కడో ఉన్న రాజులే భయపడుతున్నారు.. వీడేంటి నా ప్రదేశంలోకి వచ్చి కత్తి చేతిలో ఉన్న నన్ను చూసి భయపడకుండా ప్రేమగా, కరుణతో నన్ను చుస్తున్నాడేంటని అంగుళిమాలుడికి ఆశ్ఛర్యమేసింది. అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు.. "నా మార్గంలో నేను వెళ్తుంటే ఆగు అన్నావు, నేను ఆగిపోయాను.. ఇప్పుడు చెడు దారిలో ఉన్న నిన్ను ఆగు అంటున్న నువ్వు కూడా ఆగిపో.." అంగుళిమాలుడు.. "ఇది నా కర్తవ్యం నేను ఆగను. నేను నా లక్ష్యాన్ని ఛేదించి నా గురువుకి గురుదక్షిణ సమర్పించాలి. అంటూ వాదించడం మొదలుపెట్టాడు"

బుద్ధుడు చిరునవ్వు నవ్వి "అంగుళిమాల.. నువ్వు ఎంచుకున్న మార్గం అత్యంత నీచమైనది. నీ మార్గం వల్ల ఏ ఒక్కరికి శాంతి ఉండదు, ఆకరికి నీకు కూడా..! నువ్వు మనుషుల్ని చంపడాన్ని ధైర్యంగా, కర్తవ్యంగా భావిస్తున్నావ్ కాని నిజానికి నువ్వు లోపల భయపడుతూ పాపభీతితో చచ్చిపోతున్నావ్.. నీకు స్వేచ్చ అంటూలేదు.. నీ గురువు, నీ సహవిద్యార్ధులు నిన్ను సర్వ నాశనం చేయడానికే ఈ లక్ష్యం నీకందించారు. నన్ను మనస్పూర్తిగా నమ్ము.. నేను చెప్పింది ఆచరించు.. మనుషులు నిన్ను ప్రేమించి, గౌరవించే బ్రతుకుని నీకు చూపిస్తాను". అని ప్రేమతో చెప్పడంతో ఆ పలుకులోని దివ్యత్వానికి అంగుళిమాలుడి మనసు కన్నీటితో తడిచిపోయింది.. తాను ఎంతటి పాపాన్ని చేశానో అని గుండెలుబాదుకుని ఆరోజు మనస్పూర్తిగా ఏడిచాడు. ఆ ఏడుపుని కన్నతల్లితో పాటు బుద్ధుడూ ఓదార్చాడు. అతని మెడలోని మాలను, చేతిలోని కత్తిని దూరంగా విసిరేసి తన ఆశ్రమానికి తీసుకెళ్ళి అంగుళిమాలుడిని సౌమ్యునిగా మార్చేశాడు. ఇతనేనా కిరాతకంగా మనుషులను చంపింది అని జనాలు ఆశ్ఛర్యపడేంతగా ఓ మూర్తిభవించిన సాధువుగా అతను మారిపోయాడు.

ఓ సాధారణ సాధువుగా మారి భిక్షాటనకై వెళితే అతని చేత చంపబడినవారి కొడుకులు, బంధువులు అంగుళిమాలుడిపై రాళ్ళతో దాడి చేసేవారు. అక్కడ ఆ బాధను దిగమింగి బుద్ధునితో జరుగుతున్న పరిణామాలను వివరించేవాడు.. దానికి బుద్ధుడు.. "నీలో వచ్చినట్టే వారిలో కూడా తప్పక మార్పు వస్తుంది ఓపికగా ఉండూ" అంటూ ఉపదేశించేవారు. కొంతకాలం తర్వాత బుద్ధుడు చెప్పినట్టే ప్రజలలో మార్పు వచ్చింది.. ఎంతకొట్టినా ప్రేమగా స్వీకరిస్తున్నాడే కాని తిరిగి తమపై ఏవిధమైన దాడి చేయడం లేదని, అతనిలో స్పష్టమైన మార్పు వచ్చిందని రాళ్ళతో కొట్టే ప్రజలే చచ్చిన పామును మరల ఎందుకు కొట్టడం అని అంగుళిమాలుడిని వదిలేశారు. కాని ఒకరోజు ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది.. అంగుళిమాలుడి చేతిలో ప్రాణంపోయిన ఓ వ్యక్తి కొడుకు వచ్చి ఓ పెద్ద బండరాయితో తలపై, శరీరంపై కొడుతున్నాడు. ఇదంతా ఆ గ్రామస్థుల సమక్షంలోనే జరుగుతుంది. చచ్చేంతవరకు ఆ పెద్ద బండరాయితో కొడుతున్నా అంగుళిమాలుడు ఏరకంగా ప్రతిఘటించలేదు.. కొద్దిసేపటికి అంగుళిమాలుడు చనిపోయాడు.

ఆనందంతో చనిపోయిన అంగుళిమాలుడిని చూసి అక్కడున్న వారికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. ఏడుపు ఆగలేదు. (మారినప్పుడు అంగుళిమాలుడు కూడా ఇలానే ఏడ్చాడు) బహుశా మనం మారేటప్పుడు కూడా మనకు ఇలాగే పశ్చాతాపంతో కన్నీళ్ళు వస్తాయనుకుంటా.. చంపినవాడు కూడా కాసేపటికి ఏదో తెలియని వేదనతో అంగుళిమాలుడిని చూస్తు కుమిలి కుమిలి ఏడవసాగాడు. అంగుళిమాలుడి దహనానికి వేలాదిమంది తరలివచ్చి కన్నీరు పెట్టుకున్నారు. సహవిద్యార్ధులు, గురువు పన్నిన కుట్ర, మారిన తరువాత అతనుపడ్డ కష్టాలను తెలుసుకుని రోదించారు. చావు తర్వాతైనా గాని బుద్ధుడు చెప్పినట్టే ప్రజలు అంగుళిమాలుడిని ప్రేమించసాగారు. తప్పులు అందరూ చేస్తారు కాని ఆ తప్పులను ఒకే జన్మలో సరిదిద్దుకునేవారు మాత్రం కొందరే ఉంటారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.