Contributed By Sreeja
ఎన్నడో మొదలైన నా పయనం.. నా కాంచిపురం యాత్ర. ఎప్పటికి చేరుకుంటానో తెలియదు. కానీ ఇన్నాళ్లకు కాంచిపురం పొలిమేరకు చేరుకున్నాను. కంచికి చేరుకోవాలి అనేది నా చిరకాల కోరిక. ఏ నాటికి తీరుతుందో అది. మనుషులంతా కాశీకి, కంచికి ముక్తి కోసం వెళ్తారు. వాళ్లకు ముక్తి అంటే మళ్లీ జననం ఉండకపోవడం. కానీ మాకు ముక్తి అంటే వేరే. కథలం కదా..!
మాకు ముక్తి అంటే, ఓ కథగా కంచికి చేరి, మళ్లీ మరొక కొత్త కథగా ప్రయాణించడం. కథ కంచికి చేరుకుంటేనే పదాలకు మోక్షం. లేదంటే పదాలు మాయమై కథ చచ్చిపోతుంది. కథలకు ముక్తి అంటే మరణం కాదు.. మరొక జననం. గత కొన్నాళ్లుగా కంచికి చేరే కథలు కనుమరుగవుతున్నాయి. చేరినవి మళ్లీ తిరిగి వెనక్కి రావడంలేదు. అసలు మా ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా??
వెన్నెల కురిసే రాత్రి, మిద్దె మీద పరుపులు పరచి, బామ్మ తన మనవడికి జోకొడుతూ చెప్పే, "అనగనగా.." నుంచి మొదలై చివరకు కథ కంచికి చేరే వరకు సాగుతుంది. ఒకప్పుడు చకచకా కదిలిన మేము ఇప్పుడు ఇలా పాట్లు పడుతున్నాము.
మేము ఇద్దరం స్నేహితులం. ఒకప్పుడు ఒక్క రోజులొనే కంచికి చేరడంతో ప్రతి రోజు కలుసుకునే వాళ్లం. ఇప్పుడు అది మెల్లగా వారానికి ఒకసారి, లేదా నెలకొక సారిగా మారుతూ.. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి కూడా కలవడం కష్టం అయిపోయింది. అసలు కలుస్తామో లేదో కూడా తెలియడం లేదు.
ఈ సారి నా పయనం ఇలా మొదలైంది. ఒక మహా నగరం అది. సూర్యోదయం, అస్తమయం కూడా సరిగా కనపడనివ్వని ఎత్తైన భవనాలతో నిండిన మహానగరం. నాకు చందమామ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తను వచ్చాకే కదా మా పయనం మొదలయ్యేది. అందుకేనేమో మమ్మల్ని చందమామ కథలు అని కూడా అంటారు.
ఆ రాత్రి మబ్బులను పక్కకి జరుపుకుని చందమామ రానే వచ్చాడు. నా ప్రయాణం మొదలు పెట్టడానికి తగిన ఇంటిని వెతుక్కుంటూ వెళ్తూ, ఒక ఇల్లు చేరాను. లోపలికి వెళ్లి చుస్తే ఒక నల్లటి డబ్బా ఉంది. ఏవేవో రంగులు అందులో కదులుతూ విచిత్రంగా ఉంది. చిన్న చిన్న మనుషుల బొమ్మలు కూడా అందులో కదులుతున్నాయి.అదేంటో కానీ, ఆడ మగ, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దాన్నే కళ్లప్పగించి మరీ చూస్తున్నారు. ఇక ఈ ఇంటిలో నాకు ఎటువంటి పని లేదు అని అర్థం అయింది. సరే అని పక్కనే ఉన్న మరో ఇంటికి వెళ్తే, అక్కడా అదే తంతు. ఊరంతా తిరుగుతూ ఒక పెద్ద భవనంలోకి వెళ్లాను.ఆ భవనంలో చాలా ఇళ్లు ఉన్నాయి. ఏ గడప ఎవరిదో తెలియక తికమకగా ఉంది. అక్కడ ఇంకా అద్వానం. ప్రతి ఒక్కరూ చేతిలో ఒక చిన్న డబ్బా పట్టుకుని చూపు తిప్పడం లేదు. ఒక మహాతల్లి అందులో చూస్తూనే తన బిడ్డకి అన్నం తినిపిస్తుంది. అన్నం ఎవరికి పెడుతుందో, ఎక్కడ పెడుతుందో తనకే తెలియడం లేదు.ఇక చేసేది ఏమీ లేక చీకటిలో చందమామను చుస్తూ గడిపాను. ఆ తర్వాత రాత్రులు ఇదే తీరు. పౌర్ణమి నాడు నిండు చంద్రుడు అమావాస్యకు చిక్కిపోయాడు. కానీ నా పరిస్థితి మారలేదు. నా యాత్ర మొదలు పెట్టాలి అనే ఆశ నీరుకారిపోతుందేమో అని భయం వేసింది.
ఒక రాత్రి ఒక పిల్లవాడి ఏడుపు విని మళ్లీ నా ఆశ చిగురించింది. వాడు వాళ్ల అమ్మను కథ చెప్పమని మారాం చేస్తున్నాడు. ఎంతో ఆతృతతో గదిలోకి వెళ్లి చుస్తే, వాడి అమ్మ పనిలో పడి వాడి గోలను పట్టించుకోవడం లేదు. కానీ వాడు పట్టిన పట్టు వదలకుండా కథ కథ అని మారాం చేస్తున్నాడు. చేసేది ఏమి లేక వాళ్ల అమ్మ కథ చెప్తా అని మంచం మీదకి తీసుకుని వెళ్లింది. కానీ ఏ కథ చెప్పాలో తెలియలేదు. బాగా ఆలోచించింది.ఆమెకు అప్పుడు గుర్తుకువచ్చా నేను వాళ్ళ అమ్మమ్మ చెప్పిన కథలా.
అనగనగా.. అని చక్కగా మొదలు పెట్టి కథ చెప్పసాగింది. సగం దూరం వెళ్లానో లేదో.. అక్కడే ఆగిపోయా. కథ చెప్పడం ఆపేసి ఎవరో పిలిచినట్టు మధ్యలో వదిలేసి వెళ్లిపోయింది ఆమె. నేను ఆగిపోయాను ఆ సగం దూరంలో. నా లోని పదాలు కూడా సగం చచ్చిపోయాయి.
నా సంగతి ఇలా ఉంటే, నా మిత్రుడు ఎలా ఉన్నాడో అని తలచుకోని రోజు లేదు. వాడు నా లాగా మహా నగరంలో లేడు. ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాడు. కాబట్టి వాడైనా బ్రతికి బట్ట కడతాడు అని చిన్న ఆశ. కానీ వాడి పరిస్థితి కూడా నా లాగే అయ్యింది అని నడి రాత్రిలో నాలా సగం చచ్చి పడి ఉన్న వాడిని చూసి అర్థం అయింది.
వాడు వెళ్లింది ఒక చక్కని అందమైన పల్లెటూరు. పెద్ద పెద్ద భవంతులు కాదు. చిన్న చిన్న అందమైన పొదరిళ్లు ఉన్నాయి అక్కడ. ఎంతో అందమైన ఊరు. నేను చూసిన ఆ నల్లటి డబ్బాలు ఇక్కడ లేవు. ఉన్నా కాని దాన్ని చుస్తూ ఇల్లు, ఒళ్లు మరచిపోయే మనుషులు లేరు ఇక్కడ. అంతా బానే ఉంది కానీ, అక్కడ అనగనగా.. అని మొదలు పెట్టే బామ్మలు ఉన్నారు కానీ, ఊకొడుతూ తర్వాత ఏంటి అని అడిగే మనవళ్లు లేరు. ప్రతి గడపది అదే పరిస్థితి.
రాక రాక ఒక పెద్దావిడ ఇంటికి ఆమె కొడుకు నగరం నుండి వచ్చాడు. ఆమె పగలంతా మనవడితో గడిపి రాత్రి వాడిని ఆరుబయట పక్కన పెట్టుకుని కథ చెప్పడం మొదలు పెట్టింది. కథ సగం అయ్యే సరికి వాడి తండ్రి వచ్చి, పిల్లవాడికి చలి పడదు అని చెప్పి, లోపలికి తీసుకుని పోయాడు. అందుకే నా మిత్రుడు సగం ప్రాణంతో దారి మధ్యలో ఉండిపోయాడు. మా మజిలీ ఎప్పుడు చేరుకుంటామో అని ఆలోచిస్తూ కూర్చున్నాం ఇద్దరం. ఇంతలో నేను కదలడం మొదలు పెట్టాను. పిల్లవాడి అమ్మ కథ మొదలు పెట్టిందేమో. నేను వెళ్తూ ఉన్నా అనే ఆనందం కంటే కదలలేని నా మిత్రుని గురించి బాధే ఎక్కువ అయ్యింది. నా కన్నీరు ఆగలేదు.
అలా కొంత దూరం వెళ్లాక వాడు కూడా మెల్లగా కదలడం చూశాను. అది చూసి సంబరపడిపోయాను. కానీ చాలా నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడు. బామ్మ దగ్గరికి మనవడు వచ్చాడేమో. పాపం బామ్మ ముసలిది కదా. పైగా ఇంట్లో ఎవ్వరూ వినకూడదు అని బాగా మెల్లగా చెప్తుంది కథ. ఏదైతేనేం, వాడు కూడా మెల్లగా కంచికి చేరుకుంటాడు అని మెల్లగా ఊపిరి పీల్చుకున్నాను. అలా మెల్లగా కాంచీపురం పొలిమేర చేరుకున్నా నేను.
కానీ నా స్నేహితుడు మాత్రం పొలిమేరకు ఆమడ దూరంలో ఆగిపోయాడు. వెలిసి పోతూ ఉన్నాడు. వాడి లోని అక్షరాలు ఒక్కొక్కటిగా గాలిలో కలిసిపోతున్నాయి. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పుడు అర్థం అయ్యింది నాకు. బామ్మ గొంతు శాశ్వితంగ మునిగిపోయిందని!!