This Short Story About The Transformation Of A Guy Who Hates His Mother Will Make You Emotional!

Updated on
This Short Story About The Transformation Of A Guy Who Hates His Mother Will Make You Emotional!

ఛీ జీవితం. అసలు నేను ఈ ఇంట్లో పుట్టి ఉండకూడదు. నేను కోరుకున్నదేదీ నాకు దక్కదు,ఎందుకురా దేవుడా నన్ను ఈ ఇంట్లో పుట్టించావ్???ఊహ తెలీక ముందే నాన్న పోయారు. ఒక మంచి చదువు చెప్పించలేదు,ఫారిన్ వెళ్దాం అనుకున్నా, అదీ కుదరలేదు,ఒకమంచి software జాబ్ చేయాలనుకున్నా అది రాలేదు, అన్నిట్లోనూ సర్దుకుపోవడమే. అసలే పిచ్చ టెన్షన్స్...ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది. పోయిన మనిషి పోతూ నాకు ఈ అప్పులు తగిలించి వెళ్ళింది,అసలిన్ని అప్పులు ఎందుకు చేసిందో మహాతల్లి. ఇప్పటికైనా నా దారి నేను చూసుకోవాలి,లేకుంటే ఇప్పుడు నేను తిట్టుకుంటున్నట్టే రేపు నాకు పుట్టే పిల్లలు నన్ను తిట్టుకుంటారు, ఈ ఇల్లు అమ్మేసి ఆ అప్పు తీర్చాలి, మిగిలినదాంతో business మొదలెట్టాలి,నాన్న కష్టపడి కట్టిన ఇల్లు, అమ్మా నాన్న కలిసి ఉన్న ఇల్లు అంటూ సెంటిమెంట్స్ కి పోకుండా అమ్మేయాలి,ఈ బ్రోకర్ పార్టీని తీసుకొస్తా అని చెప్పి ఇంకా రాలేదు,నాకే దొరుకుతార్రా బాబు ఇలాంటోళ్ళు... ఈలోపు అమ్మ అల్మారా సర్దుదాం ఎదో LIC కడుతున్నాను అంది ఓసారి,ఆ పేపర్స్ ఏమైనా దొరుకుతాయేమో వెతుకుదాంఈలోపు... ఇదేంటిది ఎదో డైరీ లా ఉంది,అమ్మకి డైరీ రాసే అలవాటుందా ??నేనెప్పుడూ చూడలేదే, అయినా ఈ డైరీ ఎవడికి కావాలి ఆ పేపర్స్ ఎక్కడా?????? ఎహె,…. ఎక్కడా లేవే ,డైరీ లో ఏమైనా ఉన్నాయా, ఓసారి చూద్దాం ఇదేంటిది,రెగ్యులర్ గా లేవు డేట్స్, ఎప్పుడో ఓసారి రాసినట్టుంది. అసలేముంది ఈ డైరీ లో, ఎం రాసుకుంది???

24 April 1992 - ఆక్సిడెంట్ లో రవి చనిపోయి ఇవాళ్టి కి సంవత్సరం,జీవితం తలకిందులయ్యి నేటితో ఏడాది,ఇవాళ ఆబ్దికం జరుగుతుంటే,రోహిత్ ,నాన్న ఫోటోకి అన్నం ఎందుకు పెడుతున్నాం అంటూ అడుగుతున్నాడు,మూడేళ్ళ పిల్లాడు ,వాడికేం చెప్పాలి??వాడిని సముదాయించాలా?నన్ను నేను ఓదార్చుకోవాలా??దేవుడా దేనికయ్యా ఈ శిక్షా ??

11 June 1993 -ఈరోజు రోహిత్ కి స్కూల్లో మొదటిరోజు,మొదట మారాం చేసి ఏడ్చాడు నేను వెళ్ళను అని,అక్కడ పిల్లందరిని చూసి ఏడుపు ఆపేసాడు,వాడ్ని వదిలేసి 6 గంటలు ఉండడం ఇదే మొదటి సారి,అసలు ఆఫీసులో పనిమీద మనసే పెట్టలేదు,సాయంత్రం స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తే,హుషారుగా,ఆడుకుంటూ,నవ్వుతూ ఉన్నాడు,చిన్ని కన్న…. అప్పుడే ఎదుగుతున్నాడు

23 August 1997 -రేపు స్కూల్లో పేరెంట్స్ మీట్ అంట,నాన్న ఎక్కడ అంటూ చాలాసేపు అడిగాడు,నాన్న అంటే దేవుడికి ఇష్టం అందుకే దేవుడు నాన్నని తీసుకెళ్లిపోయారు అని చెప్పా,మరి నీకు నాన్న అంటే ఇష్టం లేదా నువ్ ఎందుకు వెళ్ళలేదు అంటూ అమాయకంగా అడిగాడు,పిచ్చివాడు,వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమ అంతా వీడి మీదే కదా నేను చూపించేది. నువ్వు పెద్దపేద్దగా అయ్యాక నేను కూడా నాన్న దగ్గరికి వెళ్తా అని చెప్తే,..హు..,సరే అంటూ తలవూపాడు,ఎం అర్ధం అయ్యిందో చిట్టికన్నయ్యకి

23 March 2003 -ఈరోజుతో స్కూల్ చదువు అయిపోయింది,అప్పుడే పెద్దోడైపోయాడు ఇంకో ఐదారేళ్లలో చదువు పూర్తవుతుంది,ఎంత తొందరగా గడిచింది కాలం,అసలు రోహిత్ లేకపోతే వాడి అల్లరి లేకపోతే నేను ఏమైపోయేదాన్నో

2 August 2005 -Engineering చేస్తా అంటున్నాడు,ఖర్చు ఎక్కువేమో అని భయంగా ఉంది. ఎం పర్లేదు,వాడు ఇష్టపడి చేస్తా అన్నది చేయించాలి,వాడేకదా నా సర్వస్వమ్,వాడి కోసం కాకపోతే ఇంకెవరికోసం చేయాలి,లోన్ తీసుకుంటా,సరిపోకపోతే అప్పు చేస్తే పోయే,మెల్లిగా తీర్చేయొచ్చు,వాడు చక్కగా చదుకుంటే అదే చాలు

19 February 2008 -ఎదో సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడంట చిరాగ్గా ఉన్నాడు,కోపం లో ఎదో అరిచేసాడు,ఎంత కష్టపడి చదివాడో పాపం,అయినా ఆ పేపర్ దిద్దేవాళ్లే సరిగ్గా దిద్దరంట మా supervisior కూడా చెప్పాడు, పోనిలే,మళ్ళా రాసి పాసైపోతాడు,మార్కులేమైనా కొలబద్దా ఏంటి తెలివికి

7 May 2009 -foreign లో పైచదువులు చదుతా అంటున్నాడు,నాకేమో,వాడిని వదిలి దూరం గా ఉండడం నా వల్ల కాదు,ఎదో సర్ది చెప్పాను కానీ,కోపంగా ఉన్నాడు,ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ,,పోనీ,పంపిద్దాం అంటే, చాలా ఖర్చు,…డబ్బు సమస్య కాకపోయినా,వాడిని చూడకుండా నేను ఉండలేను,మెల్లిగా అర్ధం చేసుకుంటాడు

27 November 2010 -ఉద్యోగం కోసం చాలా కష్టపడుతున్నాడు,ఏవేవో కోర్సులంటూ నేర్చుకుంటున్నాడు,ఇప్పటికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు,ఎవరు ఏ విషయం చెప్పలేదు,బయటికి చెప్పట్లేదు కానీ వాడు చాలా భాద పడుతున్నాడు,

November 28 2010 -ఈరోజు మా MD ని కలిసి అడిగాను రోహిత్ కి ఉద్యోగం కోసం అని,అడగగానే ఒప్పుకున్నారు,నేను 24ఏళ్లగా పనిచేస్తున్న ఆఫీసులో మేనేజర్ ఉద్యోగం,ఎంత గర్వం గా ఉందొనాకు,జీతం కూడా ముఫైవేలు. వాడికి చెప్తే ముందు ఒప్పుకోలేదు ఆత్మాభిమానం ఎక్కువ వాడికి,చివరికి ఒప్పించా

16 July 2014 -ఏంటో ఈ నీరసం ఎక్కువ ఉంటుంది ఒంట్లో,డాక్టర్, హాస్పిటల్ అంటూ తిరిగితే డబ్బులన్నీ స్వాహా చేస్తారు ఆ జబ్బు ఈ జబ్బు అంటూ,మొన్న సుజాత ఎదో పాలసీ అని చెప్పింది,దాంట్లో డబ్బులు వేస్తే వాడికి ఒక బండి కొనడానికి పనికొస్తాయి

22 March 2015 -పాపం,చాల కష్టపడుతున్నాడు ఉద్యోగం లో,ఉదయం వెళ్లి రాత్రి వొస్తున్నాడు,వాడికి కడుపారా వండి పెడదాం అంటే,స్థిమితం గా 10 నిమిషాలు నిలబడలేకున్నా,రోజంతా ఈ మంచానికే పరిమితం అవుతున్నా ఎదో చేయగలిగినంత చేస్తున్నా,వాడు కూడా ఒక్క మాట అనడంలేదు,పెద్దోడైపోయాడు,అన్నిటికి సర్దుకుపోతున్నాడు

15 January 2016 -దేవుడా,ఇలా పూర్తిగా నేను మంచంకి పరిమితం అయ్యేలోపే నన్ను తీసుకెళ్ళిపో తండ్రి,వాడికి బయట లక్ష సమస్యలు,వంద వ్యాపకాలు,ఇంట్లో మనశాంతి లేకుండా,ఇలా బెడ్ పేషెంట్గా నన్ను చూస్తూ వాడు తట్టుకోలేడు,ఇప్పుడు వాడు అన్నే చేసుకోగలడు ఇంకా నాకు ఏ దిగులు లేదు,త్వరగా నన్ను తీసుకుపో స్వామి…….

నాకే తెలీకుండా కన్నీళ్లొస్తున్నాయ్ ఏంటి …….నాకోసం జీవితం అంతా కష్టపడి,నేనే జీవితం అని బతికిన అమ్మనా నేను తిట్టుకుంది ….నా లాంటి వాడికోసమా అమ్మా ఇన్ని త్యాగాలు చేసావ్... అసలు నేనేదో కోల్పోయాను అని అనుకున్నా నాకు అన్నీ సమకూర్చుతూ నిన్నే నువ్వు పట్టించుకోలేదు.

నన్ను ఒక అంతఃపురం లో రాజు లా ఉంచి,ఏ కష్టం రాకుండా,ఒక్కదానివే సైన్యం లా పోరాడవు,నన్ను గెలిపించావు ..నన్ను చూస్తూ నీ బాధలన్నీ మర్చిపోయావు నేనేమో నిన్నే భాదపెట్టను నువ్వో బరువు అనుకున్నాను …మాతా,పితా గురు దైవం అంటారు,నాకు అన్నీ నువ్వే అయ్యావు..నన్ను క్షమించమ్మా,నువ్వు వెళ్ళిపోయాక గాని నాకు నీ విలువ తెలీలేదే.

ఎంత కష్టపెట్టానమ్మా నిన్ను,మూర్ఖుడిని,మనిషినే కాను ఛా……..అమ్మా……. అమ్మా ……………ఒద్దు,ఈ ఇల్లు అమ్మను,ఇది ఇల్లు కాదు,నీ కోవెల,ఇది అమ్మను ….ఇదే ఉద్యోగంలోనే ఉంటా నాకేది వొద్దు, అమ్మా నీ జ్ఞాపకాలు చాలు ఆ అప్పులు నేనే తీరుస్తా…. లేదు,…నేనెక్కడికి వెళ్ళను.

అమ్మా, నీ ఋణం నేను తీర్చుకోలేను, నా కూతురిగా పుట్టమ్మా నా తప్పులు దిద్దుకుంటా… క్షమించమ్మా