సాటి మనుషులకు సేవ చేయాలనే కాంక్ష ఉండాలే కాని డబ్బు, సమయం, శ్రమ లాంటి వంకలేమి చెప్పనవసరం లేదని చెప్పడానికి ఓ పరిపూర్ణ ఉదాహరణ శ్రీదేవి గారి జీవన శైలి. శ్రీదేవి గారు పెద్దగా చదువు కోలేదు, ఆర్ధికంగా కూడా అతి సామాన్యమైన కుటుంబం వారిది. భర్త ఒక తాపి మేస్త్రీ, తను ఇంట్లో ఉంటూ టైలరింగ్ చేస్తుంటారు. నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారు కూడా ఇతరులకు సహాయం చేసేంతటి స్థోమత మాకు లేదని చెప్పుకునే ఈ దౌర్భాగ్యపు రోజులలో ఈ దిగువ మధ్యతరగతి కుటుంబం ఎంతోమందికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు..
బెల్లంపల్లి లోని తాండూరు ఐబి లో నివాసం ఉంటున్న వీరు ముందు తమ చుట్టూ ఉన్న వారి జీవితాలలో వెలుగులు నింపారు. సేవా జ్యోతి, గ్రామ జ్యోతి లాంటి మహిళా సంఘాలను ఏర్పాటు చేసి అక్కడి మహిళలలను గ్రామస్తులకు సరైన దిశ నిర్ధేశం చేస్తూ వారిని ఆర్ధికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నారు. తోటి గ్రామస్తులనే కాక తల్లిదండ్రులు లేని ఇంకా మతి స్థిమితం లేని పిల్లలను తన ఇంట్లోనే ఉంచి సేవా భారతి అనే పేరుతో అనాథ శరణాలయం ఏర్పాటు చేసి వారికి భగవంతుడు ఇచ్చిన కన్నతల్లి ఐయ్యారు.
శ్రీదేవి గారు కేవలం తన చుట్టు పక్కల వారిని మాత్రమే కాదు పక్క ఊళ్ళైన బెల్లంపల్లి, నిర్మల్, మంచిర్యాల లాంటి ప్రాంతాలకు వెళ్ళి దాదాపు ఏడు సంవత్సరాల పాటు అక్కడి వారిని తన శక్తికి మించి ఆదుకున్నారు కూడా. అనాధ శరణాలయంలో ఉండే పిల్లల పనులు మహిళా సంఘాల వ్యవహారాలు, ఇంకా అన్ని రకాల పనులు కూడా తనే చూసుకుంటూ ఇలా తోటి వారిని తమ శక్తికి మించి ఆదుకోవడమనేది చాలా తక్కువ మందిలో కనిపించే గొప్ప లక్షణం.