తెలంగాణ ఇది ఒక వెనుక బడిన ప్రాంతం కాదు వెనక్కి నెట్టేయబడిన ప్రాంతం.. ఇది ఈ రాజకీయ కాలంలో జరిగిన అరాచకం కాదు పూర్వం నిజాం పరిపాలన రోజుల నుండి అణిచివేయబడిన ప్రాంతం. తప్పు జరుగుతున్నప్పుడు ధర్మం అధర్మం అయినప్పుడు ప్రజలు దానిపై తిరగబడుతూనే ఉంటారు అలా 1969 నుండి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున పురుడు పోసుకుంది. నిజానికి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా నిజాం రాజులు పరిపాలించారు, భారతదేశ స్వాతంత్ర్యం తరువాత 1948 లో భారతదేశంలో వీలినమైంది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహర దీక్ష ఫలితంగా మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.. ఇంకా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత మూలంగా 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రాలకు వెళ్ళిపోగా, తెలుగు మాట్లాడేవారికి ఒక ప్రాంతం ఉండాలని ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ ను నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
నిజాం రాజులు వ్యవహరించిన నియంతృత్వ పోకడల వల్ల స్వతహాగ అప్పటి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలతో పోల్చుకుంటే చదువులో, జ్ఞాణంలో కాస్త వెనుకబడే ఉన్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయ నాయకులు వారి ప్రాంతానికే అనుకూలంగా పధకాలు, నిధులు ఇతర ప్రయోజనాలు మళ్ళించారనే ఆరోపనల మూలంగా ఉద్యమం మొదలైంది.1969లో అది ఉదృతరూపం దాల్చింది కాని అప్పుడు పెద్దమనుషుల ఒప్పందం వల్ల ఉద్యమం సద్దుమనిగింది. ఆ తరువాత ఒప్పందంలోని అంశాలను నిఖ్ఖచ్చిగా అమలు పరుచకపోవడం ప్రజల కష్టాలు బాధలు అలాగే కొనసాగుతుండటంతో 2001 ఏప్రిల్ నెలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా కె. చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టిని స్థాపించారు.. ఇక అప్పటి నుండి ఉద్యమ గతినే మార్చివేశారు.. కేవలం ధర్నాలు, రాస్తారోకోలు చేయడం వల్ల ప్రయోజనాలు తక్కువని నమ్మి ఉద్యమకారులే ఎం.ఎల్.ఏ, ఎం.పి లుగా గెలిచి చట్ట సభలో ప్రజల తరుపున ఉద్యమం చేశారు. తరువాత ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హమీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టితో పొత్తుపెట్టుకుని అత్యధిక సంఖ్యలో స్థానాలు గెలుపొందారు కాని తరువాత కాంగ్రెస్ తన మాటను దాటవేసింది. 2009 లో మరోసారి ఉద్యమం యుద్ధ రీతిలో కొనసాగింది. కె.సి.ఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో విద్యార్ధులు, సాధారణ ప్రజలు ఉద్యమాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు. కుల సంఘాలు, మత సంఘాలు, ఉద్యోగులు, రైతులు మాత్రమే కాదు ఆకరికి బిచ్చగాళ్ళు కూడా JAC (Joint Action Committee) గా ఏర్పడి ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు నిరాహార దీక్షలు నిర్వహించి వారి అంతిమ ఆకాంక్షను తెలియజేశారు.
తెలంగాణ ఉద్యమంలో కొన్ని అతి ముఖ్య సంఘటనలు... 2009 – నవంబరు 29 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష మొదలైంది. 2009 – డిసెంబరు 9 న భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు. 2010 – మార్చి 10 న ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ ఉద్యమం నిర్వహించబడింది. 2013 – జూలై 30 న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది. 2013 – అక్టోబరు 3 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2013 – డిసెంబరు 5 న తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించింది. 2014 – జనవరి 7 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2014 – ఫిబ్రవరి 13 న తెలంగాణ ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ విభజన) బిల్లు లోకసభలో ప్రవేశపెట్టబడినది. 2014 – ఫిబ్రవరి 18 న లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది. 2014 – ఫిబ్రవరి 20 న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. 2014 – మార్చి 1 న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. 2014 – మార్చి 4 న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ జూన్ 2, 2014 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2014 – జూన్ 2 న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.
1969 నుండి 2014 వరకు ఎంతో మంది విద్యార్ధులు, యువకుల ప్రాణత్యాగ ఫలితమే ఈ స్వేచ్ఛా తెలంగాణ. ప్రతి తెలంగాణ పౌరుడి అభ్యున్నతే ముఖ్య లక్ష్యంగా, వారి సంకల్పాన్ని నేటి తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చాలి అప్పుడే తెలంగాణ ఉద్యమం, ప్రాణ త్యాగాలకు నిజమైన అర్ధం, నివాళి.
నిజమే మనలో కొంతమందికి తెలుగు వారు విడిపోవడం బాధగానే ఉంది కాని గుర్తుపెట్టుకోండి… “మనం కేవలం రాష్ట్రాలుగానే విడిపోయాం.. మనల్ని ఎవ్వరూ విడగొట్టలేరు..” అరుకు నుండి అమెరికా వరకు, వరంగల్ నుండి వాషింగ్ టన్ వరకు ఎక్కడున్న మన మనస్తత్వం ఒక్కటే...
ఒకసాటి తెలుగువాడు ఎక్కడ కలిసినా ఆత్మీయంగా చిరునవ్వుతో “బాగున్నారా” అనే పలుకరిస్తాం. దేశం మొత్తం మీద చదువులలో అత్యదిక ర్యాంకులు మనవే.. కూరలో కొంచెం మసాలా ఎక్కువ ఉండాలి అని కోరుకునేది మనమే.. సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ఉండాలి అని కోరుకునేది మనమే.. అభిమాన హీరోల కోసం కొట్టుకునేది మనమే.. హెల్మెట్ లేకుండా బండి నడిపేది మనమే.. ఆవకాయ బిర్యాని అంటే లొట్టలేసుకుంటు తినేది కూడా మనమే.. మనల్ని భౌతికంగా కలుపుతున్నది గోదావరి, విశాఖ, పద్మావతి, నారాయణాద్రి లాంటి ట్రైన్లు మాత్రమే కాదు మన మనసులు కూడా ఎప్పుడు కలుస్తూనే ఉంటాయి.. మనం ఎక్కడ, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉన్నా మనం తెలుగువారమే.. మనం ఎప్పటికి ఒక్కటే.