IIT విద్యార్ధికి 2లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి.. సి.ఏ చదువుతున్న విద్యార్ధికి 50,000 ఆర్ధిక సహాయాన్ని అందించిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి.. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు 3,00,000 ఆర్ధిక సహాయం అందించిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి.. పరీక్షలలో మంచి మార్కులు వచ్చినందుకు విద్యార్ధినికి 30,000 ఆర్ధిక బహుమతి అందించిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి.. పేద విద్యార్ధికి 25,000 ఆర్ధిక సహాయం చేసిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. హా.. ఇపాటికే మీకు విషయం అర్ధం అయ్యిందనుకుంటా. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అందించిన సహాయాలలో ఇవి కేవలం కొన్ని మాత్రమే.. గత 15 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవలు, సహాయాలు, అంతకు మించి యువతలో ఆయన రగిలిస్తున్న స్పూర్తి అనిర్వచనీయం.
పేదలకు ఆయన కనిపించే దేవుడు: చాలామంది అంటుంటారు నేను డాక్టర్ అయ్యాక పేదలకు ఉచితంగా వైద్యం చేస్తాను, నాకు వచ్చే జీతంలో కొంత ఛారిటీకి ఇస్తాను అని.. తీరా డాక్టర్ గా బాధ్యతలు తీసుకున్నాక రకరకాల కారణాలు అందరికి చెప్పి, తమని తాము సర్దిపుచ్చుకుని వదిలేస్తారు. కాని జగిత్యాలకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాత్రం ముందు నుండి తాను ఏదైతే చెయ్యాలని తపించారో వాటిని నిర్విఘ్నంగా పూర్తిచేస్తున్నారు.. తాను స్థాపించిన అరుణ హాస్పిటల్ లో వైద్యం అందిస్తూ సాటి డాక్టర్ ఊహించలేని గొప్ప సేవలు చేస్తూ అసలైన వైద్యుడు అని నిరూపించుకుంటున్నారు.
జగిత్యాల గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.. జబ్బులు వచ్చినా కాని ట్రీట్మెంట్ కి డబ్బులేక అదే జబ్బులతో అవస్థలు పడుతుంటారు. శ్రీనివాస్ రెడ్డి గారు వీరి బాధలను చూసి చలించిపోయి గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య క్యాంపులు నిర్వహిస్తుండడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు దాదాపు100కు పైగా గ్రామాలలో ఉచిత క్యాంపులు నిర్వహించి అవసరమైన మందులను కూడా అందిస్తున్నారు. కేవలం నిర్వహించడం వరకు మాత్రమే కాదు గ్రామాలలో అంటు వ్యాధులపై అవగాహన కల్పిస్తూ, గ్రామాలలో పరిశుభ్రత గురించి వివరిస్తుంటారు.
ఆర్ధిక సహాయాలు: ఎవరైనా తెలియని వారికి సహాయం చెయ్యడమంటే మహా ఐతే 500, 5,000 లేదంటే 10,000 అంతే.. శ్రీనివాస్ రెడ్డి గారు సమస్యను చూసి, నిశితంగా పరిశీలించి అది పరిష్కారం కావాలంటే ఎంత ఖర్చవుతుందో అని లెక్కవేసి అందుకు తగిన ఆర్ధిక సహాయం అందిస్తారు, ఇప్పటి వరకు అలా దాదాపు 2కోట్ల వరకు వివిధ సంధర్భాలలో అందించారు. చదువుకునే విద్యార్ధులకు, గొంతులేని మూగ ప్రభుత్వ పాఠశాలలకు, గ్రామాల అభివృద్ధి కొరకు ఇలా రకరకాలుగా ఎంతోమందికి సహాయం చేసి వారి గుండెల్లో నేనున్నాను అనే దైర్యపు దీపాన్ని వెలిగిస్తున్నారు.