This Tale Of The Fearless Kanneganti Hanumanthu Is The One For Our History Books!

Updated on
This Tale Of The Fearless Kanneganti Hanumanthu Is The One For Our History Books!

"కన్నెగంటి హనుమంతు గారి మీద రకరకాలుగా కథలు ప్రచారంలో ఉన్నాయి.. కాని Koumudi Magazine వారు విశేషంగా రీసెర్చ్ చేశారని భావించి వారు వివరించిన కథ నుండి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది".

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ మన ఉన్నతికి, బ్రతుకుకు కారణం అయ్యేవారిని ఎలా స్మరించుకుంటామో మనం ఈనాడు అనుభవిస్తున్న ఈ స్వేచ్చకు కారణం అయిన సమరయోధులను కూడా స్మరించుకోవడం మన విధేయత.. నేను, నా కుటుంబం లాంటి స్వార్ధ పంజరం నుండి బయటకు వచ్చి నా దేశం, నా మనుషులు అంటు నినదించి ఎందరో భరతమాత ముద్దు బిడ్డలు తమ ప్రాణం కన్నా ఎక్కువ విలువైనవే మనకోసం త్యాగం చేసి చీకట్లలో కలిసిపోయి మనకు వెలుగు చూపించారు. మనందరికి మన్యం వీరులు అల్లూరి సీతారామ రాజు గారి గురించి బాగా తెలుసు, సీతారామరాజు గారు ఉద్యమ ప్రయాణం కోనసాగించే 6నెలల ముందే కన్నెగంటి హనుమంతు గారు దేశం కోసం బ్రిటీష్ తూటాలకు నేలకు ఒరిగారు. ఒకటి కాదు రెండు కాదు 26 బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయినా గాని పోతున్న ప్రాణాన్ని తన సంకల్ప బలంతో ఒడిసి పట్టి కొన్ని గంటల పాటు బ్రిటీష్ వారిని వీరోచితంగా నిలదీసిన వీరుడు కన్నెగంటి హనుమంతు గారు.

12043211_703427359794267_9173814813107167683_n

కుటుంబ నేపద్యం, శాంతియుత ఉద్యమం: 26 బుల్లెట్లు దిగినా పోరాడారు అంటే హనుమంతు గారు అల్లూరి సీతారామరాజు గారిలా హింసాయుత ఉద్యమాన్ని నడిపించారు అని అనుకోవచ్చు కాని ఆయన మహాత్మ గాంధీ గారు నడిచిన అహింసాయుత మార్గంలోనే ఉద్యమాన్ని నడిపించారు. అల్లూరి గారు తుపాకితో వణికిస్తే హనుమంతు గారు శాంతియుత పోరాటంతో బ్రిటీష్ వారిని వణికించారు. హనుమంతు గారు జన్మించింది గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి మండలంలోని మించాలపాడు అనే ఒక చిన్న గ్రామంలో. సాధారణంగా పేదవారే ఎక్కువ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారనే ఒక భావన ఉంది కాని హనుమంతు గారు అత్యంత ధనికులు ఆరోజుల్లో. హనుమంతు గారు అసలేం చదువుకోలేదు. బహుశా తన జీవిత లక్ష్యం స్వతంత్ర పోరాటమనే కాబోలు "కాలం, పరిస్థితులు తనని చిన్నతనం నుండే తోటి మిత్రుల సహాయంతో బాణాలు, వడిసెలు సంధించడం నేర్పించాయి". ఒక వయసు రాగనే తన చేతిలోకి ఒక తుపాకి వచ్చేసరికి ఇది తనకు వచ్చిన డిగ్రీగా అనుకున్నారు ఆయన. తన దగ్గరి డబ్బును కేవలం తన కోసమే ఉపయోగించుకోలేదు.. చుట్టు ప్రక్కల ఉన్న చాలా గ్రామాలలోని ప్రజలందరికి అన్ని రకాలుగా సహాయం చేస్తు వారికి ఒక ధైర్యంగా ఉండేవారు.

12115844_703427349794268_971155505146657760_n

భారతదేశం యావత్తూ ఏదో మార్గాన్ని అనుసరించి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్న రోజులవి.. అప్పటివరకు హింసాయుత మార్గాన్ని నమ్మినా కాని గాంధీ గారి మాటలకు తన దారిని మార్చుకున్నారు. హనుమంతు గారు మహాత్మ గాంధీ గారి సహాయ నిరాకారణ ఉద్యమంలో తనతో ఉన్న గ్రామ ప్రజలను ఐక్యంగా తన ప్రసంగాలతో ఏకం చేసి ఉద్యమాన్ని సాగించారు. 1882లో బ్రిటీష్ ప్రభుత్వం మద్రాస్ ఫారెస్ట్ చట్టం అని ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. దాని ప్రకారం ఏ ఒక్కరు కూడా అడవులలోని చెట్లను గాని, అడవుల ద్వారా లభించే ఏ రకమైన వాటిని కూడా తీసుకోకూడదు అని ఒక చట్టం తీసుకువచ్చింది. కొన్ని ప్రత్యేకమైన అటవీ ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలని, అలాగే అలా ఉపయోగించుకున్నందుకు పన్ను కూడా కట్టాలని ఒక దిక్కుమాలిన చట్టం తీసుకువచ్చింది. స్వతహాగ వర్షాలు తక్కువగా ఉండడం, ఇంకా అక్కడి ప్రజలు అడవిని ఆధారం చేసుకుని బ్రతికే దీన జనులకు ఆ చట్టం పెద్ద గుదిబండగా మారింది. విపత్కర కరువు పరిస్థితులు.. తామే రెండురోజులకొకసారి భోజనం చేసే సమయంలో వీరికి పన్ను ఎక్కడి నుండి కట్టాలిరా భగవంతుడా అని విలవిలలాడుతున్నా కూడా బ్రటీష్ వారు మరింత కర్కషంగా మారి వారిని మరింత చిత్ర హింసలకు గురిచేసేవారు.. బ్రిటీష్ తుపాకి తూటకు వారి గుండెను చూపించే ధైర్యం లేక నాటి గ్రామ ప్రజలు అమాయకంగా బ్రతికే దౌర్భగ్య రోజులవి.

unsung-heroes-8

ఉద్యమ ప్రస్థానం: కాని ఎప్పుడు చీకటిదే విజయం కాదు.. మబ్బులు ఎంతసేపని కోట్ల కిరణాలతో దారి చూపిస్తున్న సూర్యుడిని అడ్డుకుంటాయి. ఆ విపత్కర పరిస్థితిలో, ఆ చీకటీలో కన్నెగంటి హనుమంతు గారు మరింత ఉవ్వెత్తున ఉదయించారు. 6.2 అడుగుల ఎత్తు, బలిష్టమైన దృడ దేహంతో ఉన్న హనుమంతు గారు గుర్రం మీద ఆ గ్రామాలలో స్వారి చేస్తూ "ఎవ్వరు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.. ఇది మనదేశం, మన అడవి. ఎవడో బయటి వాడు మన ఇంటికి వచ్చి మనం తింటున్న తిండికి డబ్బు కట్టండి అనడానికి వాడికి ఎన్ని గుండెలు" అని సహాయ నిరాకరణ ఉద్యమంలో విసృతంగా పాల్గొన్నారు.. ఎంతోమంది ప్రజలను చైతన్యం చేశారు.. హనుమంతు గారు ఇచ్చిన దైర్యంతోనే నాటి ప్రజలు అడవిని ఏ పన్ను చెల్లించకుండా స్వేచ్చగా ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత పన్ను కట్టనందుకు పశువులను బ్రిటీష్ వారు బంధిస్తే మహిళలు సైతం 300 మందిగా, సమూహ శక్తిగా పోలీస్ స్టేషన్లను దాటి, పశువులను బంధించిన పాకలోకి వెళ్ళి ధైర్యంగా విడిపించుకుని వచ్చేవారు. అది మాత్రమే కాదు బ్రిటీష్ అధికారంలో పనిచేసే ఏ ఒక్కరికి కూడా సహాయం చేయకుండా వారి శక్తిని నిర్వీర్యం చేసేవారు. హనుమంతుని ఎదురించి మనం చేసేదేమి ఉండదని ముందు అతనిని లొంగదీసుకోవాలని హనుమంతు గారికి కొన్ని ఆశలు చూపించారు. "నిన్ను ఈ ప్రాంతానికి అధికారిగా నియమిస్తాము, నువ్వే పన్నులు వసూలుచేసుకుని కొంత తీసుకుని మాకు మిగిలినది చెల్లించవచ్చని ఆశలు చూపించారు" ఈ స్వార్ధ కుట్రలకు తన వ్యక్తిత్వాన్ని, ఉద్యమాన్ని అణిచి వేయకూడదని దేనికి ఆ వీరుడు లొంగలేదు.

10525820_676304245779554_6870818340229739868_n

ప్రాణ త్యాగం.. హృదయవిదారకం: ఆరోజు రానే వచ్చింది.. పన్ను కట్టలేదని పశువులను బంధిస్తే ఆ పశువులను తోలుకెళ్ళినందుకు బ్రిటీష్ వారు మరల ఆ గ్రామాలపై విరుచుకుపడి పశువులను తిరిగి బంధించేస్తున్నారు. ప్రజలు వారిపై పోరాటం చేస్తున్నారు. స్వతహాగ గాంధేయవాది ఐన హనుమంతు గారు ఆ పోరాటాన్ని శాంతింపజేయడానికి అక్కడికి వెళ్ళారు.. దూరంగా హనుమంతు గారి రాకను చూసిన బ్రిటీష్ సైన్యం ఫైర్ అంటూ ఒకేసారి బుల్లెట్ల వర్షం అతని శరీరం మీద కురిపించారు. పోయే ప్రాణాన్ని ఆపి, నశించిపోతున్న శక్తిని కూడదీసుకుని సుమారు 5గంటల పాటు వారితో మాట్లాడారట, అప్పటికి అహింసా విధానాన్నే వారి అనుచరులకు బోధించారట. ఆ సమయంలో తనకి దాహం వేస్తుందని మంచినీళ్ళు అందించండి అని అడిగినా కాని బ్రిటీష్ వారు కర్కషంగా మంచినీళ్ళు తెచ్చేవారిని హింసించారట. ఐనప్పటికి బ్రిటీష్ వారి విధానాలపై బలంగా వాధిస్తూనే, అనుచరులకు సరైన దిశా నిర్ధేశం చేస్తూ నెత్తురు మడుగులో ప్రాణం వదిలారు.

నేడు మనం బ్రతుకుతున్న స్వేచ్చాయుత భవనంలో హనుమంతు గారిలాంటి వీరులెందరో ప్రతి ఇటుకగా మనల్ని మోస్తున్నారు.. ఆ త్యాగ శూరులు ప్రతి ప్రాంతంలోను వారి కుటుంబాన్ని అమ్మ, నాన్నలను ఆశలను ఒదిలేసి మనకోసం ప్రాణ త్యాగం చేశారు.. వారు కోరుకున్న పరిస్థితులు దేశంలో నెలకునేలా చేయడమే వారికి మనం అందించే నిజమైన ఘన నివాలి.