A Nostalgic Account Of How We Used To Enjoy Summer Days As Kids!

Updated on
A Nostalgic Account Of How We Used To Enjoy Summer Days As Kids!


(article Contributed by Ravi Teja)

అసలు ఈ ప్రపంచం భవిష్యతు ఏమవ్వబోతుంది? ప్రకృతి ప్రతాపం, పైసల పరేషాన్, ఉద్యోగ ఉద్వేగాలు, వేషధారణతో చిల్లర వేషాలు, బంధాలు వదిలేసి Technology కి బంధీలుగా మారి.

ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే పాలు తాగే పసి పిల్లల నుండి కాలేజీ వెళ్ళే కన్నెపిల్లల వరకు ఎప్పుడు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలా ఎప్పుడు సంత లో సందడి చేయాలా అని ఆరాటపడేవాళ్ళు. అదే ఇప్పుడు, పిల్లలకి అమ్మమ్మ చేతి ఆవకాయ రుచి తెలియదు, మధ్యాహ్నం పూట మామిడి తోట లో రాలే మామిడి పండు కమ్మదనం ఎరుగరు. అప్పుడు మే నెలలో కూడా ఆరు బయట తిరిగేంత వేసవి ఉండేది, అదే ఇప్పుడు ఏప్రిల్ లోనే చెమటలతో ఏడిపించే ఎండలు. జనాలు ప్రపంచ ఆధునీకత పేరుతో ప్రకృతి కి చేసే ద్రోహంకి ఇది ప్రకృతి తీర్చుకునే ప్రతీకారం అని అనుకోవాలా?

నేను లాగులు తొడిగే వయస్సులో ఎవరైనా నాకు ఒక్క రూపాయి ఇస్తే వేయి కోట్ల లాటరి తగిలిన ఆనందం, ప్రపంచానే కోనేయొచ్చన్న ధీమా, అలాంటిది ఇప్పుడు అదే రూపాయి ఇప్పటి పిల్లలకి ఇస్తే ఆ రూపాయికి విలువ ఇవ్వడం పక్కకి ఉంచితే మనకి విలువ పోకుండా ఉంటే అదే సంతోషం అని అనుకునే పరిస్థితి. 10 సంవత్సరాల క్రితం పదోవ తరగతి చదవడానికి 6000 కట్టడానికే కిందా మీదా అయ్యేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు లాగు తడుపుకునే వయస్సు వాడికి లక్షలు కడుతున్నారు. ఎన్ని లక్షలు కట్టిన పిల్లలకి లక్ష్యం అనేది నేర్పనంత వరకు వాళ్ళు బాగుపడరనేది వాస్తవం.

ఒకప్పుడు ఆడవాళ్ళ అమ్మతనం వాళ్ళ వేషధారణ లోనే కనిపించేది. సినిమాలల్లో ఆడవాళ్ళు నాట్యం చేసినా నటించిన ఏది చేసిన నిండుగా ఉండేవాళ్లు. మాములు ఆడపిల్లలు ఒంటి మీద చున్ని లేనిదే ఇంటి బయటికి అడుగు పెట్టేవాళ్ళు కాదు. అదే ఇప్పుడు హీరోయిన్ పాటలో డాన్సు చేస్తే నర్సరీ పిల్లల బట్టలు తొడగాల్సిందే. సరే అదే వాళ్ళ వ్యాపకం, జీవనం, వృత్తి, అలా చేయందే వాళ్ళ జీవితం గడవదు అనుకుంటే పొరపాటే, ఆడియో ఫంక్షన్ లు ఐనా, సినిమాలు రిలీజ్ ఫంక్షన్ ఐనా కూడా అప్పుడు వాళ్ళ వేషాలు మాటల్లో చెప్పలేకుండా ఉంటాయి. దోమల మెష్ లు, చేపల వలలు ఒంటికి చుట్టుకున్నటు ఉండే బట్టలు, అది చూసి మామూలు అమ్మాయిలు కూడా అలా ఉండాలనుకోవడం. అప్పటికి ఇప్పటికి జరిగిన మార్పు ఏంటి అసలు? ఇదే ప్రశ్న అడిగితే “TREND, FASHION, STYLE" అని మాట్లాడుతారు. విదేశీయులు భారతీయ సాంప్రదాయాలు నచ్చి వాళ్ళు మనలా ఉండాలని చూస్తుంటే భారతీయులు పడమటి బాట పడుతున్నారు.అందచందాలు ఆరబోస్తేనే అమ్మాయి అందంగా కనిపిస్తది అనే బ్రమ లో ఆడ పిల్లలు బ్రతికేస్తునారు. అందమనేది ఆరబోత లో ఉండదు, ఆడవాళ్ళు చూపించే కట్టుబాటు లో ఉంటది. ఇది పిల్లలకి అర్ధం కాకపోయినా తమ పిల్లలు అందంగా ఉండాలనుకునే తల్లితండ్రులు అందరు అర్ధం చేసుకుంటే అప్పుడు దేశమే మారుతది. కేవలం అమ్మాయిలనే మాత్రమే తప్పు పడుతున్నా అని అనుకోకండి. అబ్బాయిల్లో మద్యపాన వ్యసనం ఒక్కటి అరికడితే అన్ని సర్దుకుంటాయి.

ఒకప్పుడు అమ్మాయితో మాట్లాడాలంటేనే కష్టం, ఇక అమ్మాయికి సంబంధించిన ఫోటోలు అంటే ఇక మామూలు విషయం కాదు. అదే ఇప్పుడు Facebook, whats app లో DP అనే పేరుతో రోజుకొక ఫోటో పెట్టడం, చివరికి తనని ఫాలో అయ్యే వాళ్ళందరి దగ్గర అమ్మాయి ఫోటో ఆల్బo పోగు అవ్వడం. రోజుకొక ఫోటో పెట్టేంత అవసరం ఏముoటదో ఎవ్వరికి అర్ధం కాదు.

2000 కి ముందు పుట్టిన వాళ్లకి తెలుసు సెలవుల్లో ఉండే సరదా, సందడి ఏంటో, వేసవి సాయంత్రం అందరు కలిసి ఆడుకోవడం, రాత్రి పిల్లలంత తాత దగ్గర చేరి కథలు చెప్పించుకోవడం. కాని ఇప్పటి పరిస్తితి అది కాదు, పిల్లలకి సెలవులు వస్తే ఐపాడ్ లు, స్మార్ట్ ఫోన్ లు, ప్రతి క్షణం రంగుల తెర ముందే జీవితం, అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోదామంటే ఛీ అంటారు, కారణం అక్కడ అంతర్జాలం అనే మాయాజాలపు వసతులు లేకపోవడం.

ఇవన్ని నా మనస్సులో ప్రతి క్షణం కలవర పరిచే అంశాలు, వీటిలో ఏ ఒక్కటి మారినా దేశం లో మార్పు అనేది కచ్చితంగా కనిపిస్తుంది. కొంతలో కొంత ఐనా మారుతుంది అని ఆశిస్తూ