30 Powerful Quotes About Women By Yaddanapudi Sulochana Rani Garu

Updated on
30 Powerful Quotes About Women By Yaddanapudi Sulochana Rani Garu

యద్దనపూడి సులోచన రాణి గారు తెలుగు ప్రజలను ఎంతగా ప్రభావితం చేశారంటే తను రాసిన నవలల్లోని పాత్రల పేర్లు తల్లిదండ్రులు వారి పిల్లలకు పెట్టేంతలా.. యండమూరి వీరేంద్రనాథ్ గారి నుండి మొదలుకొని ఎందరో గొప్ప రచయితలు యద్దనపూడి గారి పుస్తకాలు చదివే ఎంతో నేర్చుకున్నామని చెబుతుంటారు.. యద్దనపూడి గారు తను రాసే ప్రతి నవలలోనూ మహిళల జీవితాలు, మహిళలలోని అవధులులేని శక్తిని వివరిస్తూనే, వారు ఎలా పరివర్తనం చెందాల్సి ఉంటుందని విప్లవాత్మకంగా వివరించారు.. అలా యద్దనపూడి గారు మహిళా లోకానికి ప్రేమతో జన్మనిచ్చిన కొన్ని జీవనసత్యాలు..

1. ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాల్సిన పాఠం "ఈ ప్రపంచంలో నన్ను తప్ప ఇంకెవ్వరినీ నమ్మను".

2. ఆడపిల్ల ఎప్పుడూ తనలో తిరుగుబాటుని నివురుకప్పిన నిప్పులా దాచుకోవాలి.

3. ఇష్టంలేని వారి నుండి పాదరసంలా దొరకకుండా తప్పించుకు తిరిగే జానాతనం ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలి. లేకపోతే ప్రపంచం నిండా ఆమె పాలిట "ఇష్టం" ప్రదర్శించే కత్తుల్లాంటి మగవారు చాలామంది ఉన్నారు.

4. మగవాడితో అనుబంధమే జీవిత సర్వస్వం అనుకునే స్త్రీ పరమ మూర్ఖురాలు.

5. స్త్రీ తన జీవితాన్ని ఇల్లు - భర్త - పిల్లలు అనే ప్రపంచానికే పరిమితం చేసుకుంటే ఆమె పయనం ఎప్పుడో ఒకసారి ఎండమావులు అని తెలుసుకుంటుంది.

6. పిల్లలు అంటే కట్టుకున్న భార్యకే గాని వుంచుకున్న స్త్రీ కి కాదని అనుకుంటాడు మగాడు. ఆ నమ్మకానికి ప్రతిరూపాలే ఇన్ని అక్రమ సంతానాలు.

7. పరీక్ష తప్పితే అవమానం. పెళ్లికాకపోతే అవమానం, ఉద్యోగం లేకపోతే అవమానం, తల్లిదండ్రులు తిడితే అవమానం, భర్త చూడకపోతే అవమానం. అసలు ఇప్పటి తరం ఆలోచనల్లోనే వక్రమార్గం ఉంది.

8. మా అమ్మమ్మ తరం భర్త అంటే మగమహారాజు అనుకునేవారు. మా అమ్మతరం మనకి అన్నంపెట్టే ధర్మాత్ముడు అనుకునేది. నా తరం "మొగుడంటే మొగుడే" అనుకునేది. ఇప్పటితరం "మొగుడంటే దిగివచ్చిన దేవుడేం కాదు. నేను ఎంతో తానూ అంతే అంటుంది".

9. నిన్నటి తరం స్త్రీ డబ్బు సంపాయించే మగాడిని చేసుకోవడం కోసం ఆరాటపడేది. అది తారుమారు అయింది. ఇప్పటి యువకుడు అదే దోవకు వచ్చాడు.

10. ఏ స్త్రీ కి అయినా భర్త వ్యక్తిత్వంతో కూడిన సమర్ధుడు అయితే అష్టైశ్వర్యాలు ఆమె మనోమందిరం ముంగిట ఉన్నట్లే.

11. "నేను నీ అర్ధాంగిని. అర్ధాంగి అంటే శరీరంలో అర్ధభాగం కదా! కానీ నీ మనసులో సగభాగమైనా నాకు అర్ధం కావడం లేదేమరి.

12. చాలామంది ఆడవాళ్ళు ఇల్లు, పిల్లల కోసం పెళ్లి చేసుకుంటారు. ఆడదానికి ఇవే ఎక్కువ సుస్థిరత అని నమ్ముతారు.

13. స్త్రీ ప్రప్రథమంగా మాతృమూర్తి, అందుకే స్త్రీలో అంత ప్రేమ అంత సహనం.

14. స్త్రీ తన జీవితం స్వయం శక్తితో, తెలివితేటలతో, వ్యక్తిత్వం వివేకంతో ఎప్పుడైతే నిర్మించగలుగుతుందో, అదే నిజమైన స్వతంత్రం.

15. స్త్రీ తన జీవితానికి మూలాధారం పురుషుడే అని భావించినన్ని రోజులూ ఆమె జీవితం నౌకరీ గిరియే.

16. ఈ ప్రపంచంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు. వారంటే గౌరవాభిమానాలు ఏర్పడతాయి. కారణం వారి రూపాలు, కట్టుబాట్లు ఎలా ఉన్నా, వారి కళ్ళలో మాతృత్వమునకు కారణం తొణికిసలాడుతూ ఉంటుంది. వారిని చూస్తే మనిషికి సర్వస్వం ఇస్తున్న ఈ సృష్టే నాకు గుర్తుకువస్తుంది.

17. పెళ్ళికి ముందు భర్తని ప్రేమించడం ఎలాగా అని ఆరాటపడిన నేను మధ్యవయసు వచ్చే సరికి ఎవరినీ ప్రేమించకుండా బ్రతకటం ఎలాగో నేర్చుకున్నాను.

18. వెలుగుని వెంటాడే నీడలా, ఆడపిల్ల వ్యక్తిత్వానికి సవాళ్లు ఉంటాయి.

19. నిన్నటి తరానికి సీతలు - సావిత్రులు - రుక్మిణులు ఆదర్శం. ఈనాటి తరానికి దుర్గులు - కాళికలు ఆదర్శం.

20. "నీ ప్రేమతో నన్ను బంధించేశావు" అంది ఆమె పరవశంగా. వారం తర్వాత అతను ఆమెని ఉరితీసి చంపాడు.

21. ఆడపిల్లలో ప్రేమకి ఆశపడే మనసే ఆమెకి ఒక పెద్ద ప్రమాదం.

22. ఈ ప్రపంచంలో ఆడపిల్లలు వేల, లక్షలమంది కాందిశీకుల్లా మూగగా ఈ జీవితపు ఎడారిలో నడకని సాగిస్తున్నారు. వారి నిట్టూర్పుల సెగలకు ఈ భూమి వేడెక్కిపోతుంది.

23. మన సంఘంలో మహిళ జీవితం తన స్వంతం కాదు. దాని మీద కుటుంబం అధికారం ఉంటుంది.

24. ఉద్యోగాలు చేసే చాలామంది మహిళలు తమకి బయటప్రపంచంలో ఎదురయ్యే చేదు అనుభవాలను ఇంట్లో వారికి చెప్పరు.

25. సగటు ఆడపిల్ల హీరో భర్తగా రావాలని కోరుకోదు, వచ్చిన భర్తనే హీరోగా చూసుకుంటుంది.

26. నూటికి 99మంది పురుషులకి స్త్రీ శరీరమే తప్ప మనసు అవసరం లేదు.

27. దాంపత్యంలో భర్త అధికుడు - భార్య అల్పురాలు అయితే అది యజమాని - సేవకుల సంబంధం అవుతుంది. ఇద్దరూ సమాన ఉజ్జీలు అయితే, రణరంగంలో ప్రత్యర్థుల్లా అవుతారు. ఇద్దరిలో తెలివి, సమర్ధత, మంచితనం - మమత ఉన్న జోడి ఆదర్శ దంపతులు అవుతారు.

28. ఆమె భర్త కనుసన్నల్లో బ్రతికే ఉత్తమ ఇల్లాలని అనుకుంటుంది. అతను ఆమెను తన పెంపుడు కుక్కకీ తేడాలేదని విసుక్కుంటూ ఉంటాడు.

29. ఈ ప్రపంచంలో స్త్రీ ప్రేమ పురుషుని పట్ల ఏకోన్ముఖం కాకూడదు. ఆమె ప్రేమించడానికి, ఆమె ఆదరించడానికి, చదువు, ఉద్యోగం, సంఘసేవ, దేశసేవ ఇంకెన్నో ఎదురుచూస్తున్నాయి.

30. స్త్రీ కళ్ళవెంట కన్నీటి కాల్వల కంటే ఆనందభాష్పాలు ఎక్కువగా వచ్చే స్వర్ణయుగాన్ని స్త్రీలు తమకి తామే తెచ్చుకోవాలి. పురుషుడు తెస్తాడనే భ్రమతో ఉంటే జీవితాలే అయిపోతాయి.

31. వందకాకుల మధ్య ఒక్క కోకిలలా, లక్షమంది దుర్మార్గపు మగవాళ్ళ మధ్య ఒక్క మంచి వ్యక్తి ఉంటాడు.