(article contributed by Veera Reddy Kesari)
కాకినాడ సుబ్బయ్య హోటల్... జగత్ ప్రసిద్ధి. ఆత్మీయంగా వండి, ఆప్యాయంగా వడ్డించే ఆధునిక పూటకూళ్లమ్మ ఇల్లు.. సుబ్బయ్య హోటల్. అక్కడ భోజనం చేయడానికి చాలా ధైర్యం వుండాల. ఎందుకంటే... వరసబెట్టి వస్తూనే వుంటాయి... కాస్త దీనిని కూడా టేస్ట్ చేయండి అంటూ.
అబ్బే... పూర్వం సుబ్బయ్య హోటల్ ఎలా వుండేది? ఇప్పుడు తగ్గిపోయింది... అనే పాతకాపులు కూడా... సుబ్బయ్య హోటల్ కంటే ఆత్మీయంగా వడ్డించే హోటల్ ఏముంటుంది? అని త్రేన్చుకుంటూ వెళ్లిపోతారు.
కొసరి కొసరి వడ్డింపులు, ఆత్మీయ పలకరింపులు, నోరూరించే వంటకాలతో కడుపారా భోజనం పెట్టే సుబ్బయ్య హోటల్ చరిత్ర ఇవాల్టిది కాదు. ఇండియా ఇండిపెండెన్స్ కి వున్నంత చరిత్ర. ఇంతకీ ఈ సుబ్బయ్య ఎవరు? కాకినాడవాడా? తూర్పుగోదావరి వాడా? అంటే... కాదు... ఎక్కడో నెల్లూరు నుంచి పొట్టచేతబట్టుకొని కాకినాడ వచ్చి... అద్దె ఇంట్లో పదిమందికి సరిపోయే మెస్ ప్రారంభించాడు. అతని పేరు గునుపూడి సుబ్బారావు. అప్పట్లో... అప్పటి అలవాట్లకు తగ్గట్టే.. పీటలమీద కూర్చోబెట్టేవారు. ఇప్పుడు టేబుళ్లు, ఫ్యాన్లు, ఏసీలూ వున్నాయనుకోండి. అప్పటికీ ఇప్పటికీ రుచుల్లో తేడా వచ్చినా... వండే విషయంలో ఆత్మీయత, వడ్డించే విషయంలో ఆప్యాయత... సుబ్బయ్య హోటల్ సొంతం.
నాలుగైదు రకాల కూరలు, పప్పు, సాంబారు, రెండు రకాల స్వీట్లు, మజ్జిగ పులుసు, పలావ్, పులిహోర, బూరె.. వీటితోపాటు రకరకాల పచ్చళ్లు, పొడులు.... ఓ పాతిక రకాలు వుంటాయి.
హమ్మయ్య... మొత్తానికి మంచి భోజనం లాగిచ్చేశాం.. అని ఆపసోపాలు పడుతూ అడుగు బయటకు పెట్టేటప్పుడు కూడా... ఇది కూడా రుచిచూసి వెళ్లండి అంటూ... ఇంకొకటేదో మనను ఆత్మీయంగా పలకరిస్తుంది.
వంట, వడ్డనలోనే కాదు.. తినడంలో కూడా ఆత్మీయత, ఆప్యాయత చూపించే భోజన ప్రియులకు... ఇది స్వర్గంకన్నా ఎక్కువే ..!!