గెలుపంటే ఏంటి?; విద్యార్ధి కి కలిగిన ఈ ప్రశ్నకి, గురువు ఇచ్చిన జవాబు, ఈ కథ..

Updated on
గెలుపంటే ఏంటి?; విద్యార్ధి కి కలిగిన ఈ ప్రశ్నకి, గురువు ఇచ్చిన జవాబు, ఈ కథ..

Contributed by Masthan Vali సిద్ధార్థ స్కూల్, ఏడవ తరగతి తెలుగు క్లాసు ముగించుకుని వెళుతున్న మాష్టారు కి రెండో బెంచిలో ఎప్పుడు సరదాగా ఉండే రిషి, ఏదో సుదీర్ఘంగా ఆలోచిసున్నట్టు కనిపించాడు. " రిషి, ఇలా రా " అని పిలిచాడు. చక చకా మాష్టారును చేరాడు రిషి, వినమ్రంగా చేతులు కట్టుకు నిల్చున్నాడు. " ఏంటేదో ఆలోచిస్తున్నట్టున్నావ్...? "

" మాష్టారు, నాకో చిన్న డౌట్. గెలుపు అంటే గమ్యం కాదు, అదొక నిరంతర ప్రయాణం అంటారు... మరి ఆ ప్రయాణం ఎక్కడికి.? గమ్యం తెలియని ప్రయాణాన్ని ఏమనాలి. గమ్యం చేరకపోతే మనం చేసే ప్రయాణానికి అర్థం ఏముంటుంది.? అలా అనుకొని గమ్యాన్ని నిర్దేశించుకున్నాక, తీరా ఆ గమ్యం చేరాక... అది గెలుపు కాదు, ఇంకా ముందుకెళ్లాలి అనుకుంటూ పొతే మనిషి సంతృప్తి చెందగలడా…? "

రిషి చురుకైన విద్యార్థి అని తెలుసు కానీ, చిన్న వయసులో ఇంత లోతుగా ఆలోచించే పరిణితి ఉందని ఎప్పుడు గ్రహించలేదు మాష్టారు.

ఆశ్చర్యం నుండి కాస్త తేరుకుని, " చాలా ప్రశ్నలే అడిగావు, మంచి ప్రశ్నలు కూడా.! అవునూ, ఈ వయసులో నీకెందుకు ఇన్ని ఆలోచనలు.? హాయిగా చదువుకుని ఆడుకుంటూ ఉండక...!? " రిషి ఏం చెప్తాడో చూద్దామని అడిగారు మాష్టారు.

" మొన్న ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు నేను బాధపడుతుంటే, నాన్న చెప్పారు గెలుపు గురించి... ' గెలుపు అంటే గమ్యం కాదు, అదొక నిరంతర ప్రయాణం ' అని, నాకు అప్పటికి బాగానే అనిపించింది కానీ, కాసేపాగి ఆలోచించాక అర్థం కానట్టు అనిపించింది… అందుకే మిమ్మల్ని అడుగుతున్నా..." నిదానంగా బదులిచ్చాడు రిషి.

మాష్టారు కి మా గొప్ప ఆనందం కలిగింది. చెప్పింది చెప్పినట్టు వేదం అనుకోకుండా, దాని లో ఉన్న నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలన్న రిషి ఉత్సాహం ఆయనకి నచ్చింది. అతనడిగిన ప్రశ్నకు అతని నుండే సమాధానం రాబట్టదలచి,

" సరే, మీ నాన్న చెప్పింది కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇంకెవరో చెప్పిందీ కూడా వద్దు. నీ వరకు నీకు ‘గెలుపు’ అంటే ఏంటి చెప్పు? " మాష్టారు రిషి ని అడిగారు. రిషి కి ఎం చెప్పాలో తెలియయట్లేదు. కానీ ఎదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. కాసేపాగి… " ’సంతోషం’, నాకు గెలుపు అంటే సంతోషం మాష్టారు..." అన్నాడు. " అంటే…? నీకు సంతోషాన్నిచ్చేది ఏదైనా అది గెలుపే అంటావా...? " " అవును. నిన్న రాకేష్ వాళ్ళ టీం పై 15 రన్స్ తో గెలిచాం. మా టీం లో అందరం సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్నాం. సో, అందుకే నాకు గెలుపంటే సంతోషం అనిపించింది. " " ఇంకేం, ను గెలిచేసావ్ గా. ఇక ఎప్పుడు క్రికెట్ ఆడకు మరి...? " రిషి ని చూసి నవ్వుతూ అన్నారు మాష్టారు. " అదేంటి మాష్టారు...? " " అవును, నువ్వే అన్నావ్ గా మీ టీం గెలిచింది అని... మరి మళ్ళీ మళ్ళీ ఆడటం ఎందుకు.? " " . . . . . . . . . . . . "

" చెప్పు రిషి... మళ్ళీ ఆడి ఒక వేల మీ టీం ఓడిపోతే…? " " . . . . . . . . . . . . . . " " అందుకే, ఇంక క్రికెట్ ఆడకు... మొన్న గెలిచిన మ్యాచ్ నే ఎప్పటికి గుర్తుంచుకో, సరేనా..." రిషి చేత ఏదైనా మాట్లాడించాలని ప్రయత్నిస్తున్నారు మాష్టారు. " లేదు. మేము మళ్ళీ ఆడినా గెలుస్తాము, ఓడిపోము... " చిన్నగా బదులిచ్చాడు. " ఒక వేళ ఓడిపోతే...? " " మళ్ళీ ఆడుతాం..." " మళ్ళీ ఓడిపోతే...?" " గెలిచే వరకు ఆడుతాం " " సరే. అలానే గెలిచారు. గెలిచాక ఆగిపోతారా...? ఇంకో మ్యాచ్ ఆడరా మరి? " " ఆడుతాం " " అది ఓడిపోతే...? " " అది ఓడిపోయినా, గెలిచినా క్రికెట్ మాత్రం ఆడుతూనే ఉంటాం...? " " ఎందుకు రిషి? గెలిచాక మళ్ళీ ఆడాల్సిన అవసరం ఏముంది... ఓడిపోయాక మళ్ళీ ఆడటం లో అర్థం ఏముంది రిషి...?" " అర్థం ఉంది మాష్టారు. మేము క్రికెట్ ఆడేది ఆట మీద ఇష్టం తో, ఆడుతున్నప్పుడు దొరికే ఆనందం కోసం... " " హ్మ్... ఇప్పడు దారిలోకొచ్చావ్. ఏది, మీ నాన్న చెప్ప్పిన మాట ఒక సారి చెప్పు " అని అడిగాడు. " గెలుపు అంటే గమ్యం కాదు, అదొక నిరంతర ప్ర…యా…ణం " రిషి వేగంగా మొదలు పెట్టి నెమ్మదిగా ముగించాడా వాక్యాన్ని. రిషి కి అందులో దాగున్న విషయం అర్థమైందని అతని పెదవులపై కనిపించిన సన్నని నవ్వు తెలియజేస్తోంది మాష్టారు కి.

" ఇప్పుడర్థం అయ్యియిందా మీ నాన్న ఏం చెప్పాలనుకున్నారో? ఈ క్రికెట్ నీ జీవితం అనుకో. ఒక మ్యాచ్ గెలిచావని ఇక ఆడటం మానెయ్యవు గా... అలానే జీవితం లో ఎన్ని సార్లు గెలిచినా ఆ గెలుపును చూస్తూ అక్కడే ఆగిపోకూడదు అని ఆ మాట వెనుకున్న ఉద్దేశం. ఇక గమ్యం అంటావా... నిజమే, నీ గెలుపే నీ గమ్యం కావాలి. నువ్వే అన్నావు గా క్రికెట్ అంటే ఇష్టం అందుకే ఆడుతాం అని. మరి ఆటకు ఆటకు మధ్య నువ్వేం కొత్తగా నేర్చుకున్నావు అన్న ప్రశ్న కు సమాధానం నువ్వు అడిగిన గమ్యం. ఎప్పటికప్పుడు కొత్త గమ్యాల్ని ఏర్పరుచుకుంటూ గెలుపోటములకు అతీతంగా నిలబడి ఆడాల్సిన ఆట జీవితం.... అలా ఆడుతూ ఉండటమే గెలుపు… "

అతనికి అర్థమయ్యేలా వివరించానని అనుకుంటూ, " మరి నేను వెళ్ళనా ఇక... " అని రిషి కేసి చూసారు. ఓ సత్యం గ్రహించిన ఆనందంలో నుంచి తేరుకుని బయటపడ్డాడు మాష్టారు చెప్పిన మాటలు విన్న రిషి. " Thank You మాష్టారు " అని క్లాసు నుండి గ్రౌండ్ వైపు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళుతున్నాడు.

ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన అనుభవజ్ఞులని చెప్పుకునే మహానుభావులు అర్థం చేసుకోలేని గెలుపు ను రిషి అందుకోవాలని కోరుకుంటూ మాష్టారు కూడా కదిలారు…