This Short Story Of A Student Explains The Real Struggle To Choose Between Responsibilities & Love

Updated on
This Short Story Of A Student Explains The Real Struggle To Choose Between Responsibilities & Love

Contributed by P Muni Hemanth.

కిర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్!!!! "అబ్బా, అలారమ్ అప్పుడే మొగుతుందే! ఇప్పుడే కదా పడుకుంది! అయినా ఈ అలారమ్ కనిపెట్టినోడికి నిద్ర పట్టేదికాదేమో! ఎవరికీ నిద్రలేకుండా చేస్తున్నాడు" అనుకుంటూ లేచి బ్యాగ్ దగ్గరకి వెళ్లి, బ్యాగ్లో నుండి పేస్ట్, బ్రష్ తీస్తూ "ఈ పేస్ట్ చూసినప్పుడల్లా మా నాన్న మాటలు గుర్తుకొస్తాయి!" "రేయ్, ఈ పేస్ట్ యాబై రూపాయిలు, దీన్ని నీకు నేను కొనిచ్చా, నువ్వు దీన్ని నీ కొడుక్కి కొనీయాలంటే బాగా చదువుకోవాలి, సరేనా" అని ఇంట్లో ప్రతి రోజు పేస్ట్ పట్టుకోగానే చెప్పేవాడు,"హాస్టల్ లో చేరిన రోజు నుండి పేస్ట్ గుర్తుచేసే విషయం ఇదేగా, నేను ఏమైనా మారానా" సరేలే ఇప్పుడు ఇది కాదు కానీ రెడీ అవ్వాలి టైం అవుతుంది కాలేజ్ కి……….

ఫ్రెండ్స్ అందరం టిఫిన్ చేసి కాలేజీకి నడక అందుకున్నాం, దారిలో ఒక తల్లి తన పిల్లాడిని భుజాన వేసుకొని పరిగెడుతోంది, చేతిలో వాడి స్కూల్ బ్యాగ్ ఉంది, స్కూల్కి టైం అయిపోతున్నట్లుంది, "అవును, ఆమె ఇప్పుడు వాడికోసం పరిగెడుతోంది, కానీ వీడు రేపు ఆమె కోసం పరిగెడుతాడా?, వాడిదాక ఎందుకు నేను మా అమ్మ కోసం పరిగెడుతానా??" ఇలా అనుకుంటూ నడిచేలోపు కాలేజ్ మెయిన్ గేట్ వచ్చింది, ఇంకేముంది అబ్బాయిల కళ్ళకి ఫుల్ మీల్స్ దొరికినట్టే, ఎందుకంటే కళ్ళ చుట్టూ అమ్మాయిలు, అయినా ఒక అందమైన అమ్మాయిని చూస్తే ప్రతి అబ్బాయి కవితాపితామహుడు అవుతాడు, వ్యాకరణం, అలంకారాలు, ఛందస్సు ఏమీ తెలియక పోయినా మాటలు, కవితలు తో గిన్నిస్ బుక్ ఎక్కేస్తారు. ఇలా అనుకుంటుండగా ఎదురుగా ఒక అమ్మాయి, పగటి పూట మెరుపులా, కోకిలమ్మ అరుపులా, చంద్రుడి చుట్టూ ఇంద్రధనస్సు ఉంటే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా నడుచుకుంటూ వెళ్తోంది. ఈమెని చూసి పూలు కూడా "నువ్వు ఒక పువ్వులా పుట్టివుంటే మా ఖ్యాతి ఇంకా పెరిగేది" అనుకుంటాయి, ఒంపుసొంపులతో పారే నదులు కూడా "నీలో ఉన్న ఒంపులు మాలో లేవు" అని సిగ్గుపడ్డాయి. ఇలా అనుకుంటూ చూస్తుండగా ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్లిపోయింది, మా క్లాసురూమ్ వచ్చింది. క్లాసులోకి వెళ్లినా నాకు ఇంకా కవితాప్రవాహం ఆగలేదు. అయినా క్షణకాలంలో ఒక అమ్మాయి అందం ఇంతగా ప్రభావితం చేస్తుందా? నాకే ఆశ్చర్యం వేసింది. "అవునులే, అమావాస్య రోజు ఇంటికి దీపమే అందం, ఈ వయస్సులో అబ్బాయిలకి అమ్మాయిల అందమే ఆనందం".

అలా అందమైన ప్రవాహం నుండి మా ఫ్యాకల్టీ క్లాస్ బయటకి తీసుకొచ్చింది. దీర్ఘంగా క్లాస్ వింటుంటే మా ఫ్రెండ్ పక్కన గోనుక్కుంటూ బాధపడుతున్నాడు. సరే ఆగలేక అడిగా "ఏరా ఏమైంది?" వాడు నిన్న ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోయింది అని బాధపడుతున్నాడు. పోనీలే దేశానికి ఒక వీరాభిమాని దొరికాడు అనుకున్నా, కానీ వాడి బాధ ఇండియా ఒడిపోయినందుకు కాదట, వాడు క్రికెట్ బెట్టింగ్ ఓడిపోయాడు అంట, అది వాడి బాధ! వాడు అంటున్నాడు "నేనంటే దేవుడికి ఇష్టం లేదురా అందుకే నేను బెట్ వేసిన ప్రతిసారీ ఒడిపోతున్నా", నాకు నవ్వొచ్చింది, మా అమ్మ మాటలు గుర్తొచ్చాయి, "రేయ్ నాన్న, మనం దేవుడికి ఎప్పుడు రెండే చెప్పాలి, ఒకటి సారి, రెండు థాంక్స్, తప్పు చేసినప్పుడు సారి చెప్పాలి, మంచి చేసే అవకాశం ఇచ్చినప్పుడు థాంక్స్ చెప్పాలి". నేను వాడితో అన్నాను "రేయ్ మనం అంటే ఇష్టం లేకపోతే ఏ కుక్కగానో, పందిగానో పుట్టించే వాడు కదా, మనం అంటే ఇష్టం కాబట్టే మనుషులుగా పుట్టించాడు రా దేవుడు". వాడు విని "ఆకాలేసి అన్నం దొరక మోచేయి నాకుతుంటే అరికాలు నాకరా ఇంకా బాగుంటుంది అన్నాడట నీలాంటోడు, డబ్బులు పోయి నేను ఏడుస్తుంటే సూక్తులు చెప్తావేంటిరా" అన్నాడు. మేము ఇద్దరం మాట్లాడుకోవడం చూసిన ఫ్యాకల్టీ "క్లాస్ వింటే మంచి ఇంజినీర్లు అవుతారు లేదంటే నాలా ఫ్యాకల్టీ అవుతారు" అని శపిస్తుంది. మేము అదురుకున్నాం, ఆమె నన్ను లేపి "ఎం మాట్లాడుతున్నారు రా, చెప్పండి?" అంది. నేను "స్టూడెంట్స్కి ఏది ముఖ్యమో మాట్లాడుకుంటున్నాం మేడమ్" అన్నాను. ఆమె "అబ్బా! నిజమా! సరే స్టూడెంట్స్ కాదు గానీ ఇంజనీర్స్ కి ఏది ముఖ్యమో చెప్పు?" అన్నారు. నేను "మేకప్ మేడమ్, అది లేకపోతే కష్టం మేడమ్" అన్నాను. "మేకప్ ఆ", ఆశ్చర్యంగా అడిగింది మేడమ్. అప్పుడు నేను "ఈ అమ్మాయిలు అందంగా ఉన్నా దాన్ని ఇంకా పెంచడానికి మేకప్ వేస్తారు, అలానే ఇంజినీర్ల కూడా దేనినైనా ఇంకా అందంగా, అద్భుతంగా, బలంగా చేయాలంటే సబ్జెక్ట్ తో మేకప్ వేయాలి మేడమ్" అన్నాను. క్లాసులో అబ్బాయిలు అంతా ఒక్కసారిగా కేకలు పెట్టారు, అమ్మాయిల అంతా బుంగమూతి పెట్టారు. ఇలా జరుగుతుండగా లంచ్ బ్రేక్ ఇచ్చారు, కాలేజీ కూడా అయిపోయింది. అందరివీ ఆకలి కడుపులే, ఆత్రరంగా పరుగులు మొదలెట్టారు. జేబులో గాంధీ గారి ఫొటోలో ఉన్న వాళ్ళు క్యాoటీన్కి, లేని వాళ్ళు నాలా హాస్టల్ కి ప్రయాణం అయ్యారు.

స్నేహితులంతా కలిసి భోజనం చేస్తూ క్లాస్ లో ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నాం. ఇంతలో హాస్టల్ ఓనర్ వచ్చారు. మాతో కూర్చొని మాటలు కలిపారు. మాటల మధ్యలో "నిన్న ఒక ఆక్సిడెంట్ చూసా బాబు, ఆ అబ్బాయికి పదహారేళ్ల వయస్సు ఉంటుందేమో, వాడి తమ్ముడిని బండి వెనకాల ఎక్కించుకుని 100-120 స్పీడ్ తో వెళ్లి రోడ్డుమీద సమోసాలు అమ్ముకునే ముసలమ్మను గుద్దేశారు. ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు, పిల్లాడికి ఇంటర్ లో మంచి మార్కులు వచ్చాయని అయిదు లక్షలు పెట్టి ఆ బండి కొనిచ్చాడు అంట వాళ్ల నాన్న, ఈ రోజు తన ఇద్దరు బిడ్డల్ని బలి తీసుకుంది ఆ బండి. పాపం ఆ ముసలమ్మ! ఏం పాపం చేసింది? ఆ తల్లీ కోసం ఇంటి దగ్గర ఏ కూతురు ఎదురుచూస్తుందో, ఒక క్షణంలో ఇంతమంది జీవితాలు తారుమారు అయిపోయాయి. అయినా నాకు అర్థం కాదు, వేగం మనిషిని పైకి తీసుకురావాలి కానీ, పైకి తీసుకుపోకూడదు కదా బాబు, ఈ చదువులు సంస్కారం కోసమో, సంపాదన కోసమో, చావు కోసమో, ఆలోచించే తీరిక మీకు ఉండదులే బాబు!!!!" బరువైన గుండెతో మాట్లాడాడు. సరే తినేసి ఇదే ఆలోచనతో రూమ్లకి వెళ్ళాం. కుర్రాళ్ళంగా రూంలోకి రాగానే మళ్ళీ అమ్మాయిలు, క్రికెట్, ఫ్యాకల్టీ గురుంచి చర్చ, అసలు ఆక్సిడెంట్ గురించే మర్చిపోయాం, అలా మాట్లాడుకుంటూ నిద్రపోయాం.

నిద్రలేచే సరికి సాయంత్రం 6 అయింది. నా కళ్ళు ఆశగా నా ఫోన్ వైపు చూస్తున్నాయి. నాకు 6 గంటలికి రావాల్సిన మెసేజ్ ఇంకా రాలేదు. నా కళ్లలో ఇంత ఆశ నేను ఎప్పుడు చూడలేదు, ఒక మెసేజ్ కోసం ఒక మనస్సు ఇంతగా వేచి చేస్తుండడం ఉంటుందా? మళ్ళీ వచ్చే మెసేజ్ లో ఏదో ఉంటుంది అనుకుంటే పొరపాటే, కేవలం "హాయ్" అని మాత్రమే ఉంటుంది, అయినా ఎందుకింత ఆకాంక్ష అంటే ఆ మెసేజ్ పెట్టబోయేది ఒక అమ్మాయి కాబట్టి, ఇది ప్రేమో, వ్యామోహమో నాకు తెలీదు కానీ తనతో చాట్ చేస్తుంటే హాయ్ గా ఉంటుంది. అయినా ప్రేమ గురించి మాట్లాడేంత అనుభువం, వయస్సు నాకు ఉన్నాయి అని నేను అనుకోను, ఎందుకంటే నాకు ఇంకా 20 సంవత్సరాలే, నేను ఇంకా చదువుకుంటున్నా, ఇది నా పని కాదు, కానీ "నేనూ మనిషినే కదా!! ఋషిని కాదు గా!!" అనే సిద్ధాంతాన్ని నమ్మి ఈ ప్రత్యేకమైన ఆనందం కోసం వెంపర్లాడుతున్నా. 6:30 అయింది ఇంకా మెసేజ్ రాలేదు, ఏదో తెలియని లోటు, రూమ్ లో ఎవరితో మాట్లాడం లేదు నేను, నిన్నటి చాట్ హిస్టరీ చూస్తూ ఆ మెసేజ్ కోసం ఎదురుచూస్తున్నా. అయినా హాయ్ అనే చిన్న మెసేజ్ కోసం ఆశపడ్డం, బాధపడ్డం, ఎదురుచూడ్డం ఈ వయస్సులోనే జరుగుతుందేమో!! నిన్నటి చాట్ హిస్టరీ చూస్తూ నవ్వుకుంటున్నా. అసలు ఒక అబ్బాయితో మాట్లాడితే కలగని పరవశం ఒక అమ్మాయితో మాట్లాడితే కలిగేలా ఈ సృష్టిని తయారు చేసిన భగవంతుడికి ఒక సలాం! ఆ అమ్మాయి మన మాటలకి నవ్వినా, నువ్వు భలే మాట్లాడతావ్ అని అన్నా అసలు భూమి మీద కాళ్లు నిలబడవు. చంద్రుడిని అరచేతిలో పట్టుకొని తిప్పినంత గర్వంగా ఉంటుంది, సూర్యుడి పక్కన నిలబడి సెల్ఫీ దిగినంత సరదాగా ఉంటుంది. ఇన్ని ఆలోచిస్తున్నా ఎక్కడో చిన్న బాధ, 7:30 అయింది, అయిన ఇంకా మెసేజ్ రాలేదు. ఇంతలో మా క్లాస్మేట్స్ గ్రూప్ చాట్ ఉంటే ఓపెన్ చేసాను, అందులో అంతా అబ్దుల్ కలాం గారి గురించి పోస్ట్లు, ఫోటోలు. ఎంటా అని చూస్తే ఈ రోజు ఆ మహానుభావుడి పుట్టినరోజు అంట. సరే నేను కూడా పోస్ట్ చేశా "ఓ మేధావీ!! నీ కళ్ళతో మేము చూస్తాం, నీ బాటలో మేము నడుస్తాం, నీ ఆలోచనలు బ్రతికిస్తాం, హ్యాపీ బర్త్డే". ఇలా పోస్ట్లు అన్ని చూస్తుంటే నాకు నా చిన్నప్పటి మాట గుర్తొచ్చింది, ఆ మాటతో అమ్మని ఎప్పుడు ఎడిపించేవాడిని, ఆటపట్టించేవాడిని "అమ్మ! నువ్వు అబ్దుల్ కలాం ఒకేరోజు పుట్టారు! ఆయన రాష్ట్రపతి అయ్యారు, నువ్వేమయ్యావ్??". హటాత్తుగా ఆ మాట నా గుండెలో బండరాయి పడేసింది, "ఈ రోజు అమ్మ పుట్టిన రోజు! ఛా! మర్చిపోయా! ఏవో చెత్తంతా గుర్తుపెట్టుకున్నా, ఇది మర్చిపోయా". వెంటనే అమ్మకి ఫోన్ చేశా "అమ్మ! హ్యాపీ బర్త్డే మా" అని చెప్పా, అమ్మ "థాంక్స్ రా" అనింది. ఆ మాటలో ఆరాధన, ప్రేమ, మాధుర్యం నా కళ్ళలో నీళ్లు తెప్పించాయి. అమ్మ "కాలేజ్ పిల్లడివి కదా చదువులో పడి మర్చిపోయుంటావ్ అనుకున్నాను, గుర్తుందే మా బాబు కి" అంది. పాపం పిచ్చి తల్లి, చదువులో పడి మర్చిపోయా అనుకుంటోంది, కానీ లేని పోని ఆలోచనలతో మర్చిపోయా అని నాకు తెలుసు. అమ్మ మాట వినగానే నా మీద నాకే సిగ్గేసింది. అప్పుడు అనిపించింది "ప్రేమైనా, నమ్మకమైన, భరోసా అయినా తలితండ్రులు చూపినంతగా ఈ ప్రపంచంలో ఇంకెవరూ చూపించలేరు". సరే అమ్మతో కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసా, కానీ నా కళ్ళలో నీళ్లు మాత్రం ఆగలేదు. అమ్మ గొంతులో ప్రేమ వల్లో, నేను అమ్మ పుట్టినరోజు మర్చిపోవడం వల్లో తెలీదుకాని కన్నీళ్లు ఆగడం లేదు, "కన్నీళ్లు ఆనందానికీ వస్తాయి, బాధకీ వస్తాయి! ఆనందం వల్ల వచ్చిన కన్నీళ్లు జ్ఞాపకాలను గుర్తుచేస్తే, బాధ వల్ల వచ్చిన కన్నీళ్లు మన పొరపాట్లును గుర్తుచేస్తాయ్" ఇలా ఆలోచిస్తుండగా సడన్ గా ఫోన్ మోగింది, నా ఫోన్ కి మెసేజ్ వచ్చింది, అదే ఇందాకటి దాకా ఎదురుచూస్తున్నా కదా ఆ అమ్మాయి దగ్గర నుండి "సారీ! నెట్ బ్యాలన్స్ లేదు, ఇప్పుడే బ్యాలన్స్ వేయించుకుని నీకు మెసేజ్ చేస్తున్నా" అనింది. కన్నీళ్ళతో ఉన్న కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి, నేను పైకి చూసాను "దేవుడికి తెలుసు, ఏది ముందు, ఏది తరువాత అని, అందుకే అమ్మని గుర్తుచేశాడు, బాధ్యత నెరవేర్చాక అమ్మాయిని గుర్తుచేశాడు"...ఇంకా ఫోన్లో చాటింగ్ స్టార్ట్ చేశా, చాట్ చేస్తున్నా ఏదో అసంతృప్తి...అమ్మ పుట్టినరోజు మర్చిపోయినట్టు జీవితంలో ఇంకా ఏం మర్చిపోయానో ఆలోచిస్తున్నా...ఫ్రెండ్స్ అందరూ భోజనానికి వెళ్లారు.. నేను మాత్రం పరధ్యానంలో ఉండిపోయాను.. నన్ను ఒక్క ప్రశ్న తొలిచేస్తోంది, "దేని కోసం ఏది కోల్పోతున్నాను?? బాధలు ఎదురవుతాయి అని బాధ్యతలు కోల్పోతున్నాను, కష్టపడలేక కర్తవ్యాన్ని కోల్పోతున్నాను, రుచులు కోసం వెతికి ఆకలిని కోల్పోతున్నాను, ఏదో ప్రేమ ఆశించి ఇంకేదో ప్రేమ కోల్పోతున్నాను"."

ఈ రోజు నాకు ఎదురైన ఈ సందర్భంలో నేను ఏదోకటి నేర్చుకోవాలి, కనీసం ఇప్పుడైనా మారాలి, ఏది నాకు ముఖ్యం అనే ప్రశ్నకు సమాధానం సాధించాలి, కంటి కోసం మనస్సును పాడుచేయడం మనేయాలి". "ఏ పని చేసిన నా దారిని నేను వదలకూడదు, నా కర్తవ్యాన్ని నేను మరువకూడదు".ఒక్కసారి ఆలోచిస్తే అమ్మ పుట్టినరోజు విషయంలోనే కాదు, నేను నేర్చుకోవలసిన, గుర్తుచేసుకోవాల్సిన విషయాలు ఈ నా రోజులో నాకు చాలానే ఉన్నాయి. ఉదయన్నే పేస్ట్ గుర్తుచేసిన మాట, రోడ్డు మీద చూసిన ఒక తల్లి గుర్తుచేసిన మాట, మా హాస్టల్ ఓనర్ చెప్పిన మాట, అన్నిటిని గుర్తుపెట్టుకోవాలి, ఇకనైనా మేలుకోవాలి. ఇన్ని అనుకోని నిగ్రహించుకోవడం ఇదే మొదటిసారేం కాదు, దాదాపు ప్రతీ రోజు చేసే పనే. కాని ఏం చేద్దాం "నేను మనిషినే కదా ఋషిని కాదుగా!!!". మనస్సులో ఇన్ని ఆలోచనలు నలుగుతున్నా నా చూపు ఫోన్లోని మెసేజ్ వైపు వెళ్తుందంటేనే చాలదు, నా మార్పు ఎంతవరకు జరుగుతుందో చెప్పడానికి!!!! ప్రతిరోజు మారాలి అనుకోవడం, మళ్ళీ మామూలుగానే ఉండడం.. ఇది ఎవరి తప్పు, నా తప్పా? నా వయస్సు తప్పా? లేక నా చుట్టూ ఉన్న పరిస్థితుల తప్పా?? ఈ వయస్సుకే నాకు ఇన్ని అర్థమయిపోతే నిజంగానే నేను మారేవాడినేమో!! మారడం అంటే నేనేదో జులాయిని, పోరంబోకుని కాదు. జీవితంలో బలమైన అసంతృప్తి ఉన్నవాడ్ని. ఇంకా ఏదో సాధించాలి అనుకునే వాడిని. కాబట్టే మార్పును ప్రేమిస్తున్నా, కానీ ఆ మార్పే నన్ను ప్రేమించడం లేదు. కానీ ఒకటి మటుకు ఈరోజు తీర్మానించుకుంటున్నాను, "ఈ రోజు నాకు ఇది మంచి ఇది చెడు అని చెప్పకపోయినా, ఏది చేసినా బాధ్యతని విస్మరించవద్దని చెబుతోంది". కాబట్టి భాధ్యతను ఈరోజు అందుకోకపోయినా కనీసం గుర్తుపెట్టుకొని నెమ్మదిగా అందుకోవాలి. అయినా నా పిచ్చిగాని నేను అందరిలాంటి మనిషినేగా ఋషిని కాదుగా అనుకుంటూ ఫోన్లో అమ్మాయికి "గుడ్ నైట్!!! రేపు మాట్లాడుకుందాం" అని మెసేజ్ పెట్టి పడుకున్నాను. పడుకున్నా మనస్సులో ఇవే వినిపిస్తున్నాయి. ఇక నా మనస్సుకి నేనే సర్దిచెప్పుకోవాలి. "రేయ్!! నువ్వూ అందరిలాంటి మనిషివే ఋషివి కాదు!! కానీ అందరికీ నీకు వ్యత్యాసం ఏంటి అంటే, ఋషిలా బ్రతకాలి అనుకుంటున్న మనిషివి, ఇక పడుకో" అంటూ నిద్రలోకి జారుకున్నాను………….