Contributed By Avinash Vemula వాడి కళ్ళేమో ఎరుపు.. జుట్టేమో తెలుపు .. శరీరమేమో తేలిక .. మనసేమో బరువు.. బయటేమో సూర్యుడి సెగ.. దానికితోడు లోపలేమో గుండెల్లో సెగ.. వాడి ఛాతీలోనేమో ఓ బండరాయి.. వాడు కూర్చుందేమో ఇంకో బండరాయి మీద.. మండుటెండలో మండుతున్న ఆలోచనలతో..
వీడినేమో చచ్చేదాకా బాదారు.. ఎందుకంటే పిచ్చోడు అన్నారు.. తమ పనికి అడ్డు వస్తున్నాడన్నారు.. తీసుకువచ్చి అడవిలో పడేసారు.. చావుబ్రతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు.. వాడు నిజంగానే పిచ్చోడు.. కాకపోతే దేశమంటే పిచ్చి.. కొట్టిందేమో తీవ్రవాదులు..
వాడికేమో అవినీతి పడదు.. అందుకేనేమో ఆ ఉద్యోగం వాడికి పట్టలేదు.. రాజీనామా చేసాడు.. వాడి ఉద్యోగానికే కాదు .. వాడి బాధ్యతకి కూడా.. రోడ్డు మీద కుర్చుండిపోయాడు.. కుటుంబాన్ని రోడ్డు మీదకి తెస్తానేమోని కుమిలిపోతున్నాడు..
వీడు పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయింది.. వీడి తండ్రేమో జవాను.. ఇంకొద్దిరోజులకే ఆయన వీరస్వర్గం పొందాడు.. చనిపోయేటప్పుడు కొడుకుకి ఏమి ఇవ్వలేదని బాధపడ్డాడు.. కానీ తెలుసుకొలేకపోయాడు చచ్చేంత దేశభక్తిని ఇచ్చాడని.. గాలికి పెరిగాడు, ఒంటరిగా పెరిగాడు.. కానీ బ్రతికాడు, సొంతంగా పైకివచ్చాడు.. దేశం కోసం ప్రాణం విడుస్తున్నాడని గర్వం ఒక వైవు.. ఎవరికీ తెలియకుండానే చస్తానేమోని వెలితి ఇంకోవైపు..
వాళ్ళ కుటుంబానికి వాడే దిక్కు.. వీడు పోయిన అడిగే దిక్కు లేదు.. వాడిదేమో జీతం సమస్య.. వీడిదేమో జీవిత సమస్య..
వాడికేమో బాధ.. వాడివల్ల తన కుటుంబం కన్నీరుపెడతుందని.. వీడికేమో బాధ.. వీడు పోతే కన్నీరు పెట్టేవారు ఒక్కరూ లేరని.. తన బాధకి ఎవరైనా చలిస్తారేమో అని వాడు.. తన బాధకి ఎవరైనా కరుణిస్తారేమో అని వీడు..
ఎట్టకేలకు.. ఆకాశం చలించింది.. మబ్బులు కరుణించాయి.. నీలపు నింగిని నల్లపు మబ్బులు కమ్మాయ్యి.. మబ్బులు చల్లబడ్డాయి.. ఆకాశం కన్నీరు కార్చింది..
వర్షం కురుస్తూనే ఉంది.. వాడి గుండెలోని మంట చల్లారేదాకా.. వీడి గుండెలోని బాధ పోయేదాకా..
వర్షంలో తెలియదనుకున్నాడేమో మరి.. వాడు ఏడ్చాడు, తనివితీరా ఏడ్చాడు.. గుండెల్లో బరువు కిందకి జారేవరకు.. మళ్ళీ మనస్సు తేలికగా అనిపించేతవరకు.. మామూలుగా అయ్యేవరకు.. మనిషిగా అయ్యేవరకు... తిరిగి ప్రయత్నించలాని ధైర్యం వచ్చేవరకు.. అలా ప్రకృతి వాడిని సేద తీర్చింది..
వీడికేమో వర్షం కన్నీరు అయింది.. భూమి పాడె అయ్యింది.. చెట్టు యొక్క ఆకులు పూలులా మీద పడ్డాయి.. గాలికి పడ్డ చెట్లు కట్టెలు అయ్యాయి.. పిడుగులేమో ప్రార్థనలు అయ్యాయి.. మెరుపులేమో ఘనంగా సాగనంపాయి.. ఇలా ప్రకృతి వీడికి వీడ్కోలు పలికింది..
చివరికి వాడు నవ్వాడు.. వీడు నవ్వాడు.. కాకపొతే వాడి కధ మళ్ళీ మొదలయింది.. వీడి కధ ముగిసింది...