A Heart Wrenching Short Story of A Wannabe Actress!

Updated on
A Heart Wrenching Short Story of A Wannabe Actress!
(Written by Naga Sai) ఇంక బ్రతకదలుచుకోలేదు నేను.. భూమికి నన్ను మోసే అవసరం,నన్ను నేను భరించే భారం రెండూ తీరిపోయాయి.. చాలు.. పడ్డ బాధలు, కోల్పోయిన జీవితం అన్ని చాలు.. అమ్మ, నాన్న చనిపోయాక కూడా ఇలా లేను నేను. తమ్ముడు ఉన్నాడు అనే ఆలోచన నేను అనాధ కాదు అనే ఫీలింగ్ ని దూరం చేసింది, నా బాధ్యతని గుర్తుచేసింది... అలాంటిది ఇప్పుడు మహా అయితే ఇంకో 5 నిమిషాలు బతుకుతాను.. ఆ విషం బాగా పనిచేస్తే ఇంకా ముందే పోతానేమో... కారణం సినిమా... ఇది ప్రతి మనిషిని ఆకర్షించే ఒక లోకం.. ఆలోచనలు చంపే ఒక మైకం.. ఆ మైకంలో నేను కూడా మునిగిపోయాను.. ఒకడు నటుడు అవుదాం అని వస్తాడు.. ఒకడు రాయాలి అని వస్తాడు.. అందరు ఎదో చెయ్యాలని వస్తారు.. ఇలా ఈ మత్తు అనే మంటల్లో పడి కొందరు తమని తాము కాల్చుకుంటే ఇంకొందరు ఆ కాలుతున్న మంటల వెలుగులో ముందుకెళ్లే దారులు వెతుక్కుంటుంటారు.. ఇక్కడ అందరి కలా ఒక్కటే ఈ రంగుల ప్రపంచంలో వాళ్ళకంటూ ఒక అధ్యాయం రాసుకోవాలని.. ఏదో మాయ ఉంది ఈ గాలిలో.. అనుక్షణం కెమెరా కాంతులలో కళ్ళు ఆర్పాలని తపించే వాళ్ళలో నేనూ ఒకదాన్ని.. ఒక అమ్మాయిగా పుట్టి బాగా చదువుకొవాలనుకోవడమే ఒక సాహసం అలాంటిది నేను ఓ నటిని అవ్వాలనుకున్నాను, తారని అవ్వాలనుకున్నాను.. ఇది నేను కన్న కల కాని ఆ కల నన్ను కనలేదు.. నేను కోరుకున్న సింహాసనం నన్ను నిరాకరించింది.. తమ్ముడి కోసం ఏదొక ఉద్యోగం చేసుకుందాం అనుకున్నాను ఆ కుక్క నా జీవితంలోకి వచ్చే దాకా.. నన్ను నటిని చేస్తా అన్నాడు.. నా ఆశని, అందాన్ని ఆసరాగ తీసుకోని అవకాశం అనే పదాన్ని వాడుకుని కోరిక తీర్చుకున్నాడు.. ప్రొడ్యూసర్ ముసుగులో, తన క్రూరత్వాన్ని నా అవసరంతో చెల్లు చేసుకున్నాడు చివరికి వాంఛ తీర్చుకొని బుద్ది చూపించాడు, చాల చిన్న పాత్ర ఇచ్చి వంద రూపాయలు నా మొహాన కొట్టాడు.. ఇన్నాళ్లు జాగ్రత్తగా భద్రపరుచుకున్న నా కన్యత్వం విలువ వంద రూపాయలా? అప్పుడే అర్ధం అయ్యింది నాకు ఇక్కడ నిలదొక్కుకోవలంటే చాల పోగొట్టుకోవలని.. నా ప్రాణంతో సమానమైన నా లక్ష్యమా? లేక ప్రాణం కంటే విలువైన శీలమా? ఒకసారి పోయిన శీలం వైపు కన్నా ఎప్పటినుండో నన్ను పిలుస్తున్న స్థానం వైపే అడుగులేసాను.. విలువలు, కట్టుబాట్లు, నేను పెరిగిన వాతావరణం, సంఘం ఏవీ నన్ను ఆ దారిన నడవకుండా ఆపలేకపోయాయి కాని, ఈ పశువులకి ఎంత కోరిక తీర్చినా మళ్ళి మళ్ళీ వాడుకోవలనే ఆకలి తప్ప వాడుకున్నందుకు కనీసం అవకాశం ఇద్దాం అనే ఆలోచన లేదు అని చిన్నగా అర్ధం అయ్యింది.. కాని తమ్ముడ్ని పోషించడానికి నా చేతిలో వేరే దారి లేదు.. గట్టిగా ఆలోచిస్తే ఏదొ ఒక దోవ ఉండేదేమో కాని చచ్చిన మనిషిని ఎన్ని సార్లు గాయపరిస్తే ఎం ఉంది? అని ఇష్టం లేకపోయినా కళ్ళు మూసుకొని ప్రతి రాత్రి నా జీవితం నుండి ఒక గంట కాలాన్ని సమయంలా కాకుండా నొప్పిలా భావిస్తాను.. నా కోరిక తీర్చుకుందాం అని వచ్చిన నేను చాల మంది కోరికలకు బలయిపోయాను.. ఎంతో మంది పైశాచికత్వానికి పాచికలనయిపోయాను.. నా చీకటి బతుకులో ఉన్న ఒకే ఒక వెలుతురు నా తమ్ముడు.. కనీసం వాడిని అయినా నాలా కాకుండా నలుగురికి చెప్పుకునే పని చేసేలాగ పెంచాలి అనుకున్నాను.. మొత్తం అన్ని కోల్పోయి మామూలు వయసులో ఉన్న ఆడపిల్లలలా కాకుండా వ్యాపారవేత్తనయిపోయాను నా శరిరాన్ని పెట్టుబడి పెట్టుకొని.. తమ్ముడికి మాత్రం నైట్ డ్యూటీ అని చెప్పి కెమెరా ముందు వేసుకోవాల్సిన మేకప్ అద్దం ముందు వేసుకొని ఎవడి కోసమో నన్ను నేను సిద్ధం చేసుకొని బతుకుని భారంగా లాగుతున్నాను.. అప్పుడు తెలిసింది వాడికి నేను దాచిన నిజం.. ప్రతి రాత్రి నేను బయటకు వెళ్తుంది నైట్ డ్యూటీకి కాదు అని వాడికి తెలిసిపోయింది.. వాడ్ని ఎలా ఎదురుకోవాలో కూడా నాకు తెలీదు.. కోప్పడతాడనుకున్నాను, భాదపడతాడనుకున్నాను, అరుస్తాడనుకున్నాను కాని నా నీచ స్థితిని చూసి 17 ఏళ్ళ వాడు అడిగిన మాట నా ప్రాణం తీసేసింది.. అక్కని అని కూడా చూడకుండా "నా కోరిక కూడా తీర్చు అక్క, నేను దాచుకున్న డబ్బులన్ని ఇస్తాను" ఇవే వాడి నోట్లో నుండి వచ్చిన మాటలు .. సున్నితంగా సుఖపెట్టమన్నాడు, పరోక్షంగా ప్రాణం తిసేసాడు.. కోపం వచ్చింది వాడు అన్న మాట మీద కంటే ఆ మాట అనడానికి కారణమైన నా పరిస్థితి మీద.. ఏడుపు వచ్చింది, బాధల్లో అందరికి వచ్చేదే కాని మొదటి సారి కన్నీళ్ళు రాకుండా, కళ్ళు ఎర్రగా కాకుండా, ఎక్కిళ్ళు లేకుండా గుండె పగిలేలా ఏడ్చాను.. చాలు అనిపించింది అట్టర్ ప్లాప్ అయిన నా జీవితం అనే సినిమాలో అన్ని కోల్పోయిన ఆడదాని పాత్రకి స్వస్తి చెప్పేద్దాం అనిపించింది.. భూమ్మీద బతకడానికి వేసుకున్న ఈ ప్రాణం అనే మేకప్ ని తీసేద్దాం అనిపించింది.. సెలవు.. అవసరాలకి, పరిస్థితులకి, అర్ధం లేని ఆశలకి లొంగి చివరికి తనని తానే కోల్పోయి అవ్వకుండానే మిగిలిపోయిన ఒక నాయకి.