This Story Of A Young Girl Whose Father Is A Naxal Will Move You Deeply!

Updated on
This Story Of A Young Girl Whose Father Is A Naxal Will Move You Deeply!

నా పేరు అరుణ,మా నాన్నకి ఇష్టమైన రంగు ఎరుపురంగు,అందుకే నాకు ఆ పేరు పెట్టారు,అబ్బాయి పుడితే అరుణ్ అని,అమ్మాయి అయితే అరుణ అని ఎప్పుడో నిర్ణయించున్నారు.మేం ఉండేది విశాఖపట్నం జిల్లా లో పాడేరు మారుమూల గ్రామం,మా ప్రాంతాన్ని ఏజెన్సీ అని కూడా అంటుంటారు.

అది 1999 సంవత్సరం ,వేసవి సెలవులు,మా స్నేహితులు అందరు చుట్టాల ఇళ్ళకి వెళ్లారు,నేను మా అమ్మ కూడా బయలుదేరాం,వేరే ఊరికో,చుట్టాల దగ్గరికో కాదు. అడవిలోకి,మా నాన్న ని చూడడానికి,నేను పుట్టిన తరువాత మొదటి సారిగా మా నాన్న ని కలవబోతున్న, నేను 7వ నెల పసికందు గ ఉన్నప్పుడు మా నాన్న పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అప్పటినుండి నన్ను చూడలేదు,మా అమ్మ మాత్రం మధ్యలో రెండు మూడు సార్లు అడవికి వెళ్లి నాన్నని కలిసి వచ్చేది,నేనొస్తానంటే రానిచ్చేది కాదు,నాన్నని కలుస్తానంటే నువ్వింకా చిన్న పిల్లవి అని నన్ను తెలిసిన వాళ్ళ ఇంట్లో వొదిలి వెళ్ళేది,ఈసారి మా నాన్నే నన్ను రమ్మన్నారు అని చెప్పింది.

నా వరకు నాన్న ప్రేమ అంటే ఏంటో తెలీదు,మా క్లాస్మేట్స్ అందరిని వాళ్ళ నాన్నలే స్కూల్ లో దింపేవారు,నెలకోసారి బడికొచ్చి బాగోగులు అడిగితెలుసుకునేవాళ్ళు. నన్ను ఆలా చూసుకోడానికి నాన్న ఎందుకు రారు అని నేను అమ్మ ని అడిగితే నాన్న అంతకన్నా పెద్ద పనిలో ఉన్నారు అని చెప్పేది, ఎదో, అభ్యుదయం, విప్లవం, తిరుబాటు, అంటూ ఏదేదో చెప్పేది, నాకది అర్ధం కాలేదు, అర్ధం చేస్కోవాలని లేదు. కాస్త ఎదిగాక మా నాన్న ఒక నక్సలైట్ అని నాకు అర్ధం అయ్యింది పోలీసుల లిస్టులో మొదటి పేరు మా నాన్నదే అని,నక్సల్ టీం లో మా నాన్న ప్రధాన సూత్రధారి అని మెల్లిగా తెలిసింది,ఏ నిమిషం లో ఏ వార్త వస్తుందో అని బిక్కు బిక్కుమంటూ కాలం గడిపేవాళ్ళం. ఆలా మేము అడవిలో నాన్నని కలవడానికి వెళ్తుంటే ఎవరో ఒకతను వోచి,ఇప్పుడు కలవడం కుదరదు,కూంబింగ్ ఎక్కువగా ఉంది మళ్ళీ ఎప్పుడో చెప్తాం అని అమ్మకి చెప్పి వెళ్ళిపోయాడు. నాన్నని చూడబోతున్నాను అన్న ఆనందం ఒక్కసారిగా నీటిబుడగ లాగ పేలిపోయింది. .అమ్మతో పెద్ద గొడవే పెట్టాను,నేను నాన్నని చూడాలని ,ఏడ్చాని,బతిలాడాను,ముందు బుజ్జగించింది,ఎదో చెప్పిచూసింది,ఇంకా విసుగొచ్చి రెండు దెబ్బలు వేసింది,ఇంటికితీసుకెళ్లి నిదురపుచ్చింది. మళ్ళీ నాన్న నుండి ఎప్పుడు పిలువొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్న నేను,పిలుపు రాలేదు,రోజులు కష్టంగా గడుస్తున్నాయి కానీ ఏళ్ళు మాత్రం పరిగెడుతూనే ఉన్నాయి,చక్రాలు కట్టినట్టు. అప్పుడో ఇప్పుడో పేపర్లో “తప్పించుకున్న అగ్రనేత” అంటావు ఒక ఫోటో వొచ్చేది ,అది నాన్న ఫోటో అని అమ్మ చెప్పేది,ఆ ఫోటోలని భద్రం గా దాచుకునేదాన్ని.నాన్న కి సంబంధించి నాకున్నా గుర్తులు,అవే.

15 సంవత్సరాలు గడిచిపోయాయి,అమ్మ ఆరోగ్యం అసలు బాలేదు,బీదరికం లో ఉన్న మాకు కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేదు,మాది సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధం ఉన్న కుటుంబం అని. నాకు Doctor అవ్వాలని ఎంతో బలమైన కోరిక ఉండేది,ఇంటర్ లో కూడా మంచి Percentage వొచ్చింది కానీ డబ్బులులేక పోవడం తో సీటు రాలేదు,డబ్బులు లేక మంచి ట్రీట్మెంట్ ఇప్పించలేక అమ్మ ప్రాణాలు కూడా కాపాలేకపోయా. అప్పుడు కూడా నాన్న రాలేదు. ఇంకా వొస్తారన్న ఆశ కూడా నాకు లేదు కానీ ఒక్కసారైనా నాన్నని కలిసి మాట్లాడాలని ఉండేది, నా భాదలు చెప్పుకోవాలని,ఇలా మా నాన్న మమ్మల్ని ఒదిలి అడవిలో ఉండడం వల్ల నేనెంత వేదన కి గురయ్యానో చెప్పాలని ఉండేది,ఎందుకు ఇలా చేసాడని తిట్టాలని ఉండేది,కానీ కుదరదు నాలో నేను కొన్ని వేల సార్లు ఇవే ప్రశ్నలు వేసుకొని సమాధానాలు దొరక్క అమ్మ సమాధి దగ్గర బిగ్గరగా ఏడ్చే దాన్ని. నా వేదన అరణ్య రోదన ఎవ్వరికి వినపడదు.

ఇలా ఉండగా ఒక అర్ధ రాత్రి మా ఇంటి తలుపులని ఎవరో దబదబా అని కొడుతున్నారు,భయమేసింది, తలుపు తీసేలోపే బద్దలయ్యేలా తలుపుని తడుతున్నారు,తలుపు తీసాను,అరుణ అంటే నువ్వేనా అన్నారు,ఔను అన్నాన్నేను తమతో రమ్మన్నాను,ఒక జీపులో ఎక్కించుకొని తీసుకెళుతున్నారు,అడవి మార్గం ,చాల సేపు ప్రయాణం సాగింది ముగ్గురు మగవాళ్ళు, ఒక ఆడ వ్యక్తి ఉన్నారు, నాకు అర్ధం అవ్వలేదు, బహుశా నాన్న దగ్గరికి తీసుకెళుతున్నారేమో అని అనుకున్నాను. దాదాపు 6 గంటలు అడవి మార్గం లో ప్రయాణం తర్వాత,ఒక చిన్న పట్టణం లాంటి ఊరిలో బండి ఆగింది, దంతెవాడ ఊరుపేరు, ఒరిస్సాలో ఉన్న అని అర్ధం అయ్యింది,పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు అప్పుడు అర్ధం అయ్యింది నన్ను తీసుకొచ్చింది పోలీసులు అని, స్టేషన్ లోకి తీసుకెళ్లారు,మెల్లిగా వెనక వైపుకి తీసుకెళ్లారు, అక్కడ పొడవాటి పెట్టెలు ఉన్నాయి,చాల మంది గుమిగూడి ఉన్నారు,ఒక పెట్టె దగ్గరికి నన్ను తీసుకెళ్లి పెట్టె తెరిచారు,ఇది మీ నాన్న శవం, నిన్న రాత్రి ఎన్కౌంటర్ లో చనిపోయాడు, postmortem తరువాత శవాన్ని తీసుకెళ్ళు అని చెప్పారు, నాకర్థం కాలేదు, అసలు ఎం అన్నారో కూడా నాకు తెలీలేదు, నేను ఫోటో లో చూసిన నాన్న మొహానికి, ఇక్కడ పెట్టె లో ఉన్న మొహానికి పోలికే లేదు, అది మీ నాన్న శవమే అంటూ నాకు నిర్ధారణ చేసారు చాలా ఫోట్లు చూపించి, 24 సంవత్సరాలుగా నేను చూడాలనుకున్న నాన్నని ఇలా శవంగా చూస్తానని అనుకోలేదు, మా నాన్న శవాన్ని జీపులో పెట్టి కొన్ని డబ్బులు ఇచ్చి నన్ను పంపించారు అక్కడి పోలీసులు, దారిలో ఒస్తున్నంతసేపు నేనెప్పటినుండో మా నాన్నని అడగలనుకున్నవి అన్నీ అడుగుతూనే ఉన్నా, ఒక్క దానికి ఆయన సమాధానం చెప్పలేదు,చనిపోయాడు కదా... ఇంక చెప్పడు కూడా .... దహనం లాంటివి అన్ని అయిపోయాయి, ఇంటికొచ్చాక నాన్న ఫోటోని చూస్తూ మళ్ళి ఏడుస్తూనే ఉన్న, ఎందుకు నాన్న నన్ను ఒదిలి వెళ్లిపోయావ్, మళ్ళీ జన్మంటూ ఉంటె కూతురిని ప్రేమ గా చూసుకునే,తోడుగా ఉండే తండ్రిగా పుట్టు నాన్న, నేను నా కుటుంబం అంటూ స్వార్ధపరుడిలా బ్రతుకు నాన్న,ఏమిచ్చింది నీకీ విప్లవం, నాకు అమ్మని, నిన్ను దూరం చేసింది,కనీసం ఒక్క సారికూడా నిన్ను కనులార చూసుకునే అదృష్టం కూడా లేకుండా చేసింది,ఎందుకు నాన్న ఇలా చేసావ్ అంటూ బిగ్గరగ్గా ఏడుస్తూ ఉండిపోయాను.కొన్ని రోజుల తరువాత మళ్ళీ తలుపులు బాదుకుంటున్నాయి తెరిచి చూస్తే ఎవరు తెల్ల బట్టల్లో ఉన్న కొందరు ఒచ్చారు ,బయట ఒక అంబులెన్సు కూడా ఉంది,నేను భయపడుతూ వెనక్కి అడుగులు వేస్తూ ఉన్న,ఆ నలుగురు నా దగ్గరికి వొస్తూ నన్ను బలవంతంగా లాకెళుతున్నారు,అంబులెన్సు లోకి ఎక్కించారు,మా ఇంటి చుట్టూ పక్కన వాళ్ళు అంత చూస్తూ ఉన్నారు తప్ప ఒక్కరూ ఆపలేదు.నన్ను తీసుకెళ్లి ఒక చీకటి గదిలో చారు,నాకసలేమి అర్ధం కాలేదు. ఎవరో వచ్చి సూది మందు ఇచ్చారు,మత్తు గా నిద్రలోకి వెళ్ళిపోయా,చాలాసేపటి తరువాత మెలకువవచ్చింది ,చూసే సరికి నన్ను ఒక కుర్చీకి కట్టేసి ఏవేవో వైర్లు అమర్చారు,నాకు చాలా నొప్పిగా ఉంది ఎందుకో తెలీదు, నరాలు జువ్వుమని లాగుతున్నాయి,నా శరీరం నా స్వాధీనం లో లేదు,తల కూడా తిప్పలేకుండా ఉన్నాను. తరువాత నన్ను ఒక చక్రాల కుర్చీలో తీసుకెళ్లి ఒక మంచం పై పడుకోపెట్టారు,అక్కడ ఉన్న అందరు వింత మనుషుల్లా ఉన్నారు,అక్కడ నన్ను చాల రోజులు ఉంచారు నాకు తరవాత అర్ధం అయ్యింది,అది పిచ్చాసుపత్రి అని.అమ్మ తోడు లేక నాన్న ప్రేమ లేక,చిన్న వయసులోనే నా అనుకున్న వాళ్ళు ఎవరు లేక ఒంటరి ఏడుస్తూ,నా భాదనంత ఆకాశం లో ఉన్న అమ్మానాన్నకి వినపడేలా అరుస్తూ ఏడుస్తూ ఉన్న నన్ను అందరు నాకు పిచ్చి పట్టిందనుకొని ఇక్కడ చేర్పించారని అర్ధం అయింది.

అయినా, నా మాటలు అర్ధం అవ్వాలంటే భాషే కాదు భాధ అంటే ఏంటో కూడా తెలియాలి ఉదయాన్ని చూడకుండానే చీకటిలోకి వెళ్ళిపోయిన నాలాంటి అరుణలు ఇంకా చాలా మందే ఉన్నారు