This Short Story Of A Old Man Explains How Beautiful Humanity Is

Updated on
This Short Story Of A Old Man Explains How Beautiful Humanity Is

Contributed By ManikantaReddy Gopu

కృష్ణయ్య సన్నగా కనిపిస్తాడు, కానీ బలవంతుడు.ఊరి చివరున్న వేర్ హౌస్ లో పని చేస్తాడు. బియ్యం బస్తాలు లారీలకి లోడ్ చేయడం, అన్ లోడ్ చేయడం పని. రోజుకి మూడొందల నుండి నాలుగొందలు వస్తాయి. ఉదయం ఏడు గంటలకు ఫస్ట్ లోడు వస్తుంది, ఆ టైముకల్లా వేర్ హౌస్ లో ఉండాలి. టౌనులో కొత్త పేట పక్కనున్న బస్తీలో ఒక పాత రెండు గదుల ఇంట్లో ఉంటాడు. కృష్ణయ్యకి ఎవరూ లేరు, ఒక్కడే ఉంటాడు.ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు,పోయినేడాది తన ఇరవయేళ్ళ కూతురు చనిపోయాక ఆ మాట్లాడడం ఇంకా తగ్గిపోయింది. నెలలో అయిదారు రోజులు పని ఉండేది కాదు, అప్పుడు రేల్వే స్టేషన్ దగ్గర తన స్నేహితుడి అరటిపళ్ళ బండి దగ్గరకెళ్ళి కూర్చునేవాడు, కానీ తనతో కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు.

ఇంటి నుండి వేర్ హౌస్ కి రెండు మైళ్ళ దూరం. తన కూడా పని చేసే వాళ్ళు వేర్ హౌస్ కి ఆటోలో వచ్చేవారు. కానీ కృష్ణయ్య మాత్రం తన సైకిల్ మీద వచ్చేవాడు. తనకు ఆటోలు, ట్యాక్సీలు నచ్చేవి కావు. టౌన్ లో ఎక్కడికెళ్ళాల్సి వచ్చినా, తన సైకిల్ మీదే వెళ్ళేవాడు. వేర్ హౌస్ లో ఒక్కోసారి మధ్యాహ్నం పూట ఒక గంట ఖాళీ దొరికిది, అప్పుడు కొంత మంది నిద్ర పోయేవారు, ఇంకొంత మంది పక్కనున్న టీ కొట్టు దగ్గర కాలక్షేపం చేసేవారు. కానీ కృష్ణయ్య మాత్రం ఒక్కడే కూర్చుని బీడీలు కాల్చుకునేవాడు. వేర్ హౌస్ లో పని చేసేవాళ్ళలో వయసులో ఉన్న వాళ్ళే ఎక్కువ. కృష్ణయ్య బలవంతుడే అయినా, వయసు మీద పడడంతో మిగతా వాళ్ళతో సమానంగా పని చేయలేకపోయేవాడు, లేదంటే తనకూ రోజుకి అయిదారొందలు ముట్టేవి. తన వయస్సు వాళ్ళందరూ వేర్ హౌస్ లో పని చేయడం మానేసి మూడేళ్ళవుతోంది. కొంతమంది టౌన్ లో వాచ్ మెన్ గా చేస్తున్నారు. కొంతమంది పని మానేసి వాళ్ళ పిల్లలతో ఉంటున్నారు.

సాయంత్రం పని అయిపోయాక, ఇంటికెళ్ళే దారిలో వైన్ షాపు దగ్గర ఆపి మందు తీసుకెళ్ళేవాడు. తను రోజూ తాగడు.వారంలో రెండు మూడు రోజులు, శరీరం బాలేనప్పుడు. కృష్ణయ్యకి ఆటోలు నడిపేవాళ్ళన్నా,ట్యాక్సీలు నడిపేవాళ్ళన్నా కోపం. రోడ్డు మీద సైకిల్ లో వెళ్ళేటప్పుడు, వాళ్ళ రాష్ డ్రైవింగ్ తో తనని ఇబ్బంది పెట్టేవాళ్ళు. వాళ్ళ డ్రైవింగ్ లో అతి వేగం, నిర్లక్ష్యమే కనిపించేదవి తనకి.తమని నమ్మి బండి ఎక్కిన ప్యాసింజర్లని జాగ్రత్తగా తీసుకెళ్ళాలన్న బాధ్యత కూడా ఉండేది కాదు. ఈ కాలంలో బండి ఎక్కిన ప్యాసింజర్లతో నాలుగు మాటలు మాట్లాడెదెవరు. చెవులు హోరెత్తేలా,గుండెలదిరేలా సౌండ్ బాక్సుల్లో పాటల హోరు. అయినా వాళ్ళని మాత్రమే అని ఏం లాభం, ఇప్పుడు ప్యాసింజర్లు కూడా అలానే ఉన్నారు. ఎప్పుడూ చూసినా పాటలు వచ్చే వైర్లు పెట్టుకునే వాళ్ళు కొంతమంది, ఫోను చూస్కుంటూ నవ్వుకునే వాళ్ళు కొంతమంది.

*** అదే తను బండి నడిపే రోజుల్లో ప్యాసింజర్లు ఎంత బాగా మాట్లాడేవారో. విద్యానగర్ లో ఉండే గంగరాజు గారు నెలకి ఒక్క సారైనా యాత్రలకి వెళ్ళొచ్చేవారు , ఆయన్ని ప్రతిసారీ స్టేషన్ నుండి ఇంటికి తన బండిలోనే తీసుకెళ్ళేవాడు కృష్ణయ్య. దారి పొడవునా ఆయన చూసిన విశేషాలు చెప్తుండేవారు. గంగరాజు గారే కాదు, విద్యానగర్ కి వెళ్ళడానికి వచ్చే వాళ్ళు ఒక రూపాయి తక్కువిస్తానని వచ్చినా బేరం ఒప్పుకునేవాడు. ఎందుకంటే విద్యానగర్ కి వెళ్ళాలంటే ఒక చిన్న బ్రిడ్జి దాటాలి. ఎంతో కష్టపడి బండిని ఆ బ్రిడ్జి ఎక్కించాక, ఆ తర్వాత బ్రిడ్జి దిగేటప్పుడు బండి చాలా సులభంగా వెళ్తుంటే హాయిగా అనిపించేది. తను ఏం చదువుకోలేదు కానీ, ఆ బ్రిడ్జి రూటు నేర్పిన పాఠమైతే ముందు కష్టపడితే తర్వాత దానికి ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుందని. అలా తక్కువకి తీసుకెళ్తాడని, విద్యానగర్ బేరాలన్నీ తనకే వచ్చేవి. అప్పట్లో కృష్ణయ్య మాటల ప్రవాహానికి అడ్డు ఉండేది కాదు. ఎవరైనా శ్రద్ధగా వినేవాళ్ళు దొరికితే, ఆ ఊరి రాజకీయాల నుండి చరిత్ర వరకు అన్నీ మాట్లాడుతుండేవాడు.కొత్తగా ఊరొచ్చిన వాళ్ళని వివరం అడిగి మరీ తీసుకెళ్లేవాడు, ఇంటికి చేరుకున్నాక లగేజిని ఇంటి లోపలిదాకా మోసుకెళ్ళేవాడు. ప్యాసింజర్లని ఎప్పుడూ ఒక మాట అనేవాడు కాదు. ఉదయాన్నే కొత్తపేట రెండో వీధి పిల్లలని కాన్వెంట్ స్కూల్ కి తీసుకెళ్ళేవాడు. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తీస్కొచ్చేవాడు. వెళ్ళే దారిలో పిల్లలు కృష్ణయ్యతో పాటలు పాడించేవారు. వాళ్ళ తల్లి దండ్రులకి కూడా కృష్ణయ్య మీద చాలా నమ్మకం, జాగ్రత్తగా తీసుకొస్తాడని. కృష్ణయ్య కి ఆ పిల్లలతో పాటు తన కూతురిని కూడా కాన్వెంట్ స్కూల్ కి తీస్కెళ్ళాలని ఉండేది, కానీ ఖర్చుకెనకాడి గవర్నమెంట్ స్కూలులో చేర్పించాడు. సాయంత్రం బండి తోలడం అయిపోయాక ఇంటికెళ్లి తాగేవాడు కానీ, తాగి ఎప్పుడూ బండి నడపలేదు.ఆ తర్వాత కొన్నేళ్లకి ఆటోలు,ట్యాక్సీలు పెరిగిపోవడంతో బేరాలు తగ్గిపోయి,బండి తోలే పని మానేయాల్సి వచ్చింది.

*** పన్నెండేళ్ళవుతుంది ఆ పని మాని, వేర్ హౌస్ లో చేరి. రోజూలాగే,పని అయిపోయాక వేర్ హౌస్ నుండి సైకిల్ మీద బయల్దేరాడు కృష్ణయ్య. కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు పక్కన ఒక ఆటో పడిపోయి ఉంది, ఆ డ్రైవర్ దెబ్బలతో మూలుగుతున్నాడు. దగ్గరకెళ్ళి చూస్తే, డ్రైవర్ దగ్గర మందు వాసనొస్తోంది. ఆ క్షణం లో తనకెంతో ఇష్టమైన రిక్షా బండి నడిపే వృత్తి మరుగున పడిపోవడానికి కారణమయ్యారని కానీ, ఏడాది క్రితం ఉద్యోగం కోసం పరీక్ష రాయడానికి హైదరాబాద్ వెళ్ళిన తన కూతురు ట్యాక్సీ డ్రైవర్ చేతిలో అత్యాచారానికి గురయి చనిపోవడానికి కారణమయ్యారని కానీ, రోజూ సైకిల్ తొక్కుతూ రిక్షా వృత్తిని దైవంలా భావించే తన కళ్ళ ముందు, తాగి ఆటో నడిపి వృత్తి ద్రోహం చేసాడని కానీ, తనకు ఆటో,ట్యాక్సీల మీదున్న కోపాన్ని ఏ మాత్రం చూపలేదు. ఆ ఆటో డ్రైవర్ ని తన సైకిల్ మీద వేస్కోని హాస్పిటల్ కి బయల్దేరాడు. పన్నెండేళ్ళ తర్వాత తను మళ్లీ సారథి అయి గమ్యానికి చేర్చాడు.