Contributed by Lokesh Sanam
మే 2019, మండుటెండలతో మగ్గిపోతున్న ఒక మంగళవారం మధ్యాహ్నం అది,40 కి మీ వేగం తో గ్లామర్ బండి మీద అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న నాకు కారుతున్న చెమటలు ఆ సెగకి ఆవిరి అయిపోతుంటే, ఒక అగ్ని పర్వతం బద్దలై నాకు అభిషేకం చేస్తున్నట్టు అనిపించింది. అయినా ఆగని పయనం గమ్యం కోసం పరిగెడుతూ గమనం సాగించింది,అదే వేగం లో ముందుకు వెళ్తూ ఉన్నా.... ఒళ్లంతా చెమటలు దారంతా గతుకులు సాగిపోతుతున్నానే తప్ప ఆగిపోవట్లేదు
ఎందుకంటే, నాకు ఆగాలని లేదు, అలసటా లేదు. ఇంకో 4 మైళ్ళ దూరం నా గమ్యం అని గ్రహించి వేగం పెంచిన నాకు కనుచూపు మేరలో ఒక ముసలవ్వ కనిపించింది....
నీరసంగా కళ్ళు,నిస్సహాయంగా ఒళ్ళు చిరిగిన బట్ట,చేతిలో బుట్టా మొహమంతా ముడతలు,మెడంతా చిడతలు మెరిసిపోయిన వెంట్రుకలు,ఒరిసిపోయిన కాళ్ళు ఆమె వేచి చూస్తుంది సహకారం కోసం,ఊరి వరకు నడవలేక సహకరించే సాటి మనిషి కోసం నిరీక్షిస్తుంది. తెలియకుండానే వేగం తగ్గిపోయింది, ముందుకు సాగుతూనే ఉన్నా... దూరం చేరువయ్యింది,బ్రేక్ పడింది, బండి ఆగింది.
అవ్వ: బాబూ,ఎండకి నడలేకపోతున్నా,కాళ్ళకి చెప్పులు లేక కట్టమైపోతుంది,ఏమనుకొకపోతే అట్టా నువ్వు పోయె దారిలో దించయ్యా....?? నేను:అయ్యో దానిదేముంది అండి, రండమ్మా అన్నాను. ఆవిడ ఎక్కగానే...బండి మళ్లీ గమ్యం వైపు పయనం మొదలు పెట్టింది,కొంచెం దూరం వెళ్ళాక
అవ్వ నీ పేరేంటి నాయన అని అడిగింది,పేరు చెప్పాక ,ఇటు ఏ ఊరు వెళ్తున్నావ్ నాన్న అని అడిగింది, ముక్కురాలపడు వెళ్తున్నా అమ్మా ,మా అమ్మమ్మ ఇంటికి అన్నాను,ఇంతలో అవ్వ అవునా బాబూ మాదీ అదే ఊరు అంటూ,ఎవరి తాలూకా అని అడిగింది,నేను మా మావయ్య పేరు చెప్తూ ఆయనకి మేనల్లుడిని అవుతా నండి అన్నా,ఇంతలో అవ్వ అలా ఐతే మీరు మాకు సుట్టాలు అవ్తారయ్యా అంది ఆనందంగా. నాకూ చాలా బాగా అనిపించింది, ఆ మాటల్లో స్వచ్ఛత,పిలుపులో ప్రేమ మనా అనే ఫీలింగ్ ఇచ్చింది ఆ పెద్దావిడ. ఆ ఫీలింగ్ తో మీ పేరు ఏంటి అండి అని అడిగా, ఆమె భయం భయంగా...మేము వేరే మతస్తులం బాబూ అన్నారు. నాకేం అర్థంకాలేదు ఒక్క క్షణం,ఇంతలో తేరుకొని అయ్యో....నేను మీ పేరు అడిగానమ్మా అన్నాను. ఆమె దీనమైన గొంతుతో,
మొన్న సంతకి ఎళ్లి ఇదే యాలకి తిరిగి వత్తుంటే,నీ వయసున్న ఓ బాబు బండి ఎక్కా అయ్యా,ఇట్టాగే మాట్లాడుకుంటూ పేరు చెప్పా,అంతే వెంటనే బండి ఆపేసి దిగిపోమన్నాడు,ఏమైంది బాబూ అన్నాను,మీ మతస్థులు నాకు నచ్చరు దిగిపో అని అరిచాడు,దిగిపోయానాయ్యా.....ఇంకెవరికి ఇట్టా ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నా,కానీ ఈ యాల ఎండ ఎక్కువ ఉండేసరికి,చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోయేసరికి నిన్ను అడగాల్సి వచ్చింది అయ్యా. అందుకే నువ్వు పేరు అడగ్గానే చెప్పాలంటే "నాకు భయమేసింది". కళ్ళు తడిసిపోయాయి,మాట మూగబోయింది...ఇంతలో ఊరు చివర వంతెన దగ్గరకి చేరుకున్నాం,అవ్వ ఆపెయ్ బాబూ మా ఇల్లు ఇక్కడే అంది,ఆపేసా ఆవిడ దిగిపోయారు. వెళ్ళిపోతూ... టయానికి వచ్చి సాయపడ్డావ్ అయ్యా, సళ్లగుండు అనేసి వెళ్లిపోయింది. ఇంటికెళ్ళాక ఈ విషయం అమ్మమ్మ తో పంచుకుంటే,నేనేదో అసాధ్యమైన పని చేసినట్టు వాళ్ళు ఆనందంతో గర్వపడ్డారు. నాకు బాధేసింది, ఏ పరిస్థితుల్లో ఉన్నాం మనం అనిపించింది. మనిషిగా సాటి మనిషికి సహకరించ గలగడం కూడా వింత అయిపోయింది,సహకారం కూడా సహాయం అంత గొప్ప అయిపోయింది. మనిషికి మనిషి నిలబడలేనంత దౌర్భాగ్యమైన రోజులు వచ్చేశాయి కదా....అందుకేనేమో ఈ దుస్థితి.
కాస్తో కూస్తో చదువుకున్న మనలాంటి వాళ్ళు వీలైనంత వరకూ ఇటువంటి పరిస్థిుతులు తగ్గేలా చూస్కోగలగడమే,అందరికీ గౌరవం ఇవ్వగలగడమే మన చదువుకి,సంస్కారానికి విలువ.