ఆంధ్రబోజుడు, విజయనగర సామ్రాజ్య నిర్మాణ సారథి, దక్షిణ భారతదేశ అతిగొప్ప చక్రవర్తి అయిన మన శ్రీకృష్ణదేవరాయల వారికి తెలుగు బాష అన్నా, సాహిత్యమన్నా ఎంతో ఇష్టము ,ప్రీతి. అందుకే ఎంతో ప్రతిభ గల ఎనిమిది మంది కవులను ఒక చోట చేర్చి, తన సభలో వారికి చోటు కల్పించారు రాయలవారు.
ఆ ఎనిమిది మంది అష్టదిగ్గజ(అష్ట+దిక్+గజ)కవులుగా (Eight elephants that hold the eight directions of the Earth according to Vaishnava philosophy) చరిత్రలో ప్రసిద్ధికెక్కారు. ఈ సభ భువనవిజయం(Conquest of the world) గా ప్రసిద్ది చెందింది. ఈ అష్టదిగ్గజాలందరు ప్రభంధకర్తలే.మరి ఇంతటి మహా కవి సమ్మేళనం అయిన భువన విజయం లోని ఎనిమిది కవులెవరో చూడండి.
1. అల్లసాని పెద్దన(Allasani Peddana): ఈ అష్టదిగ్గజ కవులలో మొదటివాడు,'ఆంధ్రకవితాపితామహుడు', రాయలవారికి అత్యంత ప్రీతిపాత్రుడు, రాయలువారి ఏనుగులు అధిరోహించేందుకు సమ్మతి గల ఏకైక కవి గా,రాయలువారు పెద్దన కి స్వయంగా తులాభారం చేసినట్టుగా, సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండాలి అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు.పెద్దన కవి స్వారోచిష మనుసంభవం, హరికథాసారము లాంటి గొప్ప రచనలు, ప్రబంధాలు రచించారు.ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చేవాడు. అందుకే ఇతనిని 'పెద్దనామాత్యుడు' అని కూడా అంటారు
ఈయన రచనా శైలిని 'అల్లసాని వాని అల్లిక జిగి బిగి' గా వర్ణిస్తారు.
2. నంది తిమ్మన(Nandi Timmana): "నానాసూనవితాన వాసనల నానందించు సారంగ మే లా న న్నొల్లదటంచు, గంధఫలి బల్కాకం తపంబంది యో షానాసాకృతి బూని సర్వసుమనస్సౌరభ్యసంవాస మై పూనెం బ్రేక్షణమాలికామధుకరీ పుంజంబునిర్వంకలన్" అని ఆడవారి ముక్కు మీద రాసిన ఒక అందమైన పద్యం కారణంగా 'ముక్కు తిమ్మన' గా ప్రసిద్దికెక్కారు. క్రిష్ణదేవరాయలవారి వివాహం తిరుమలదేవితో అయ్యేందుకు తిమ్మన కవి దోహద పడ్డారని చరిత్ర చెబుతోంది.
గొప్ప పండితులకే కాకుండా, సాధారణ జనాలకు అర్థమయ్యేలా రాయడం తిమ్మన కవి గొప్పతనం. అందుకే 'ముక్కు తిమ్మన ముద్దు పలుకు' అని ఈయన కవితాశైలిని వర్ణిస్తారు.సాహిత్యంలో ఎన్నో కొత్త కొత్త విన్యాసాలు చేస్తూ, చిత్రకవిత,గర్భకవిత వంటి కొత్త పద్ధతులలో రచనలు చేసేవారు. తిమ్మన కవి రచించిన పారిజాతాపహరణం ఒక evergreen romantic classic అని చెప్పుకోవచ్చు.
3. మాదయ్య గారి మల్లన(Madayyagari Mallana): మాదయ్య గారి మల్లన రాయలువారితో పాటు యుద్ధ సన్నాహాల్లో పాల్గొనేవారని చరిత్ర చెబుతోంది. మల్లన కవి రాసిన 'రాజశేఖర చరిత్రము' యుద్ధ నేపథ్యముతో కూడిన ఒక ప్రేమకావ్యంగా ప్రసిద్ది చెందింది. కాని ఈయన సమకాలీకులతో పోల్చి చూస్తే మల్లన కవి ప్రేమ,శృంగారం వంటి వాటి ప్రస్తావన వారి కావ్యాల్లో తక్కువగా చేసేవారు.
4. ధూర్జటి (Dhoorjati) : గొప్ప శివభాక్తుడిగా దూర్జతికవిని చరిత్ర వర్ణిస్తోంది. ఈయన కుటుంబంలో అదే పేరుతో ఇంకొక నలుగురు ఉండటం వలన ఈయనకు 'పెద్ద ధూర్జటి గా పేరుగాంచారు. ధూర్జటి కవి రచించిన కావ్యాలు ఎక్కువగా పురాణాల నుండి తీసుకుని వర్ణింపబడినవి, శివుడిని కీర్తిస్తూ రచించినవి. ఈయన రచించిన శ్రీ కాళ హస్తీశ్వర శతకం( 100) లోక ప్రసిద్దిగాంచింది. "స్తుతిమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేలగల్గెనో ఎటులిట మధురి మహిమ"(How is Dhurjati's poetry so immeasurably beautiful?) అని రాయలవారు ధూర్జటి కవిని కీర్తించారు అని చరిత్ర పలుకుతోంది.ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు(extempore poems) ప్రచారములో ఉన్నాయి.
5. అయ్యలరాజు రామభద్రుడు(Ayyalaraju Ramabhadrudu): రామభ్యుధయం,రాయలువారు రాసిన గ్రంధాన్ని తెనిగీకరించిన(translated into Telugu) 'సకలకథాసారానుగ్రహము' అనే కావ్యము రామభద్ర కవి ప్రసిద్ధ రచనలు. రామభ్యుధయం,రాయలువారు రాసిన గ్రంధాన్ని తెనిగీకరించిన('సకలకథాసారానుగ్రహము' అనే కావ్యము రామభద్ర కవి ప్రసిద్ధ రచనలు, అంతిమ దశలో రామభద్రకవి పేదరికంతో అలమటించారని, ఎక్కువ సంతానము వల్ల ' పిల్లల రామభద్రుడు' అనే పేరు గాంచారని చరిత్ర చెబుతోంది. రామాభ్యుదయము ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధము. ఇందులో కొన్ని చమత్కారాలు ఉన్నాయి. దశరథుని పుత్రకామేష్ఠి సందర్భంలోని వ్యాకరణ ప్రస్తావన, శూర్ఫణక ముక్కు, చెవులు కోసింది లక్ష్మణుడు కాదని చెప్పడం ఇందులోని ప్రత్యేకతలు. ఈ కావ్యం వ్యాకరణ, అలంకార శాస్త్రానికి, చక్కని ఉదాహరణ. రామకథను ప్రబంధ కావ్యంగా వ్రాయటమనేది గొప్ప ప్రయోగం. దాన్ని విజయవంతంగా పూర్తి చేయటం రామభద్రుడికే చెల్లింది.
6. పింగళి సూరనామాత్యుడు(Pingali Sooranaamaathyudu): సూరన్న కవి తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు. గిరిజా కళ్యాణం,రాఘవపాండవీయం,కళాపూర్ణోదయం,ప్రభావతీప్రద్యుమ్నం,రాఘవపాండవీయం ఈయన రాసిన ప్రసిద్ధ రచనలు కళాపూర్ణోదయాన్ని దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు.ఇది ఒక అద్భుతమైన ప్రేమ కావ్యము.ఈ poetical నవలలో కవి 'flashbacks,' 'character transformation' లాంటి కొత్త techniques ని అవలంభించారు.
7. రామరాజభూషణుడు (Ramaraajabhushanudu): రామరాజభూషణుడు కవి మరియు సంగీత విద్వాంసుడు. ఈయన అసలు పేరు భట్టుమూర్తి. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానమునకు ఆభరణము లాగ ఉండటము వల్ల ఈయనకు 'రామరాజభూషణుడు' అని పేరు వచ్చింది వసుచరిత్రము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, కావ్యాలంకారసంగ్రహము(నరసభూపాలీయము), ఈయన రాసిన గొప్ప గ్రంథాలు. నానాశాస్త్ర నిష్ణాతుడైన బుద్ధిశాలి. పద్య రామణీయకత, ప్రౌఢ సాహిత్యము, విజ్ఞాన పటిమ ఇతని రచనలలో కనబడతాయి. సంగీతమునకు, కవిత్వమునకు గల పొత్తును ఇతనివలె మరి యే కవి కూడా గ్రహించలేదు. ఇతని పద్యములన్నిటిలోను 'లయ' 'గమకములు' ఉంటాయి. కీర్తనల లాగా పాడదగినవి.
8. తెనాలి రామకృష్ణుడు (Tenali Ramakrishnudu): అష్టదిగ్గజ కవులలో నేటి తరానికి కూడా గుర్తున్న ప్రసిద్ధ కవి తెనాలి రామకృష్ణకవి.ఎన్నో గొప్ప కావ్యాలు రచించినా తెలుగువారికి ఈయన హాస్యకవిగానే పరిచయమున్నారు.వికటకవి అన్నది ఈయనకున్న బిరుదు.ఎన్నో కథలు ఈయన పేరు మీద ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉద్భటారాధ్య చరిత్ర,ఘటికాచల మహాత్మ్యము,పాండురంగ మహాత్మ్యము,కందర్పకేతు విలాసము,హరిలీలా విలాసము ఈయన రాసిన ప్రసిద్ధ గ్రంథాలు.తప్పులు ఎత్తిచూపటంలో, ఒప్పును మేచ్చుకోవడంలో రామకృష్ణకవి ముందు ఉంటారని కథలలో ప్రస్తావిస్తారు.కాళీ మాత అనుగ్రహానికి నోచుకున్న రామకృష్ణ కవి అష్టదిగ్గజ కవులలో ఒక మణి గా వేలుగొందాడనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
రామకృష్ణ కవి చాటువులు చెప్పడంలో గొప్ప నేర్పరి.రాయల సోదరులైన తిరుమలరాయలు తనపై కవిత చెప్పుమని అష్టదిగ్గజములని అర్ధింపగా, అందవిహీనుడు, ఒంటి కన్ను వాడైన తిరుమలరాయల గూర్చి యేమి కవిత్వం చెప్పాలి అని సంశయంలో ఉండగా, రామకృష్ణ కవి ఇలా స్తుతించాడు.
అన్నాతి గూడ హరుడవె
అన్నాతిని గూడనప్పుడసురగురుడవే!
అన్నా తిరుమలరాయా
కన్నొక్కటి కలదు కాని కౌరవపతివే!||
(భార్యతో ఉన్నపుడు నీవు హరుడవు, భార్య ప్రక్కన లేనపుడు రాక్షసగురువైన శుక్రాచార్యుడవు, అన్నా తిరుమలరాయా, నీకు ఒక కన్ను ఉంది కానీ అది లేకపోయి ఉంటే కురుపతి దృతరాష్టుడివి)
ఇంతటి మహానీయులతో నిండిన భువనవిజయ సభ ప్రతి తెలుగు వాడు గర్వపడవలసిన ఒక గొప్ప చారిత్రిక సంపద. పైన చేయబడ్డ గ్రంథాలలో చాలా వరకు మరుగున పడుతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ సాహిత్యాన్ని కాపాడుకొని, చదివి, ముందు తరాలవారికి అందించే ప్రయత్నం ప్రతి తెలుగు వాడు చేయాలని ఆశిస్తున్నాను.
ఎవడు కాదన్నా,
తెలుఁగ దేల యెన్న దేశంబు దెలుఁగేను
తెలుఁగు వల్లభుండఁ తెలుఁగొకండ
యెల్ల నృపులు గొలువ నెరుఁగవే బాసాడి
దేశభాషలందుఁ తెలుఁగు లెస్స (From Amuktamalyada, Sri Krishnadevaraya's literary work)