ఈనాడు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి మిగిలిన సంస్థలు ప్రతి సంవత్సరం నిర్వహించే ముగ్గుల పోటీలకు కుసుమ గారు పాల్గొనేవారు. పాల్గొన్న ప్రతిసారి వారికి మొదటి బహుమతో, లేదంటే చూపరుల ప్రపంచాన్ని కాసేపు ఆగిపోయేలా ముగ్గులు ఉండేవి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు, ఐతే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిరుపాన్ని ముగ్గులో చూపించడం మూలంగా కుసుమ గారి ప్రతిభ, గుర్తింపు రాష్ట్ర స్థాయికి విస్తరించింది. ఒక్కోసారి మనలోని ప్రత్యేకతను మనం గుర్తించడం వల్ల తెలుస్తుంది, లేదంటే జనం గుర్తించడం వల్ల తెలుస్తుంది. కుసుమ గారికి రెండో మార్గంలో ప్రతిభను తెలుసుకోగలిగారు.
కుసుమ గారు హన్మకొండలో పుట్టిపెరిగి ప్రస్తుతం జనగాంలో నివసిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడబోయే చిత్రాలన్నీ సుద్ద, సంక్రాంతి ముగ్గుల కోసం వాడే రంగులతోనే వేశారు. ఇదొక రకమైన ఆర్ట్ అని ఇందుకోసం జె.ఎన్.టి.యూనివర్సిటీలో ఒక కోర్స్ ఉంటుందని తనకు కూడా ఈ మధ్యనే తెలిసింది. కుసుమ గారి టాలెంట్ సహజమైనది, కేవలం చూస్తూ ఆలోచిస్తూ నేర్చుకున్నారు, ఇందుకు భర్త నాగరాజు గారి సహకారం కూడా తోడవడంతో సంవత్సరం తిరగకుండానే దాదాపు 200 చిత్రాల వరకు రూపొందించారు.
ముగ్గులు అనేవి హిందూ సంప్రదాయంలో ఒక భాగం. కానీ కళకు సరిహద్దులు ఉండవు కదా, కుసుమ గారు ఈ ముగ్గుల ద్వారా క్రిస్మస్ వేడుకలు జరుపుతారు, దిశ సంఘటనపై తన అభిప్రాయాన్ని తెలుపుతారు, పోలీసుల దినోత్సవాన్ని జరుపుతారు, నాయకుల పట్ల తన గౌరవాన్ని చాటుతారు, ఇంకెన్నో చేస్తుంటారు. తక్కువ కాలంలోనే తన అబ్బాయి స్నేహితుల దగ్గరి నుండి ఐఏఎస్, పోలీసు ఆఫీసర్ల వరకు అభిమానులను సంపాదించుకున్న వారి కళను చూద్దాం రండి..