Here's All You Need To Know About Shreshta - The Lyricist Who Wrote Soulful Song 'Gundelona' For Arjun Reddy!

Updated on
Here's All You Need To Know About Shreshta - The Lyricist Who Wrote Soulful Song 'Gundelona' For Arjun Reddy!

అర్జున్ రెడ్డి క్లైమాక్స్ లో ఓ పాట వస్తుంది.. "గుండెలోన నిండుకున్నా నీ గురుతులేగ ఊపిరయ్యే ఇన్నాళ్లూ" నిజంగా ఎంత గొప్ప పాటండి అది.. ఒక మహిళ మనస్తత్వం ఎలా ఉంటుంది, తను ఓ వ్యక్తిని ప్రేమిస్తే ఎంత ఉన్నతంగా, గాఢంగా ప్రేమిస్తుంది అనే ఆలోచనలకు ప్రతిరూపం ఆ పాట. లిరిక్స్ రాయడం మాత్రమే కాదు దానికి ట్యూన్ రెడీ చేసి బ్యాక్ గ్రౌండ్ లో ఏ instrument వాడకుండా అలానే కంపోజ్ చేశారు. ఆ పాట అనే కాదండి శ్రేష్ఠ గారు రాసిన ప్రతి పాట ఓ అణిముత్యమే.. ఓ అద్భుతమే.. అక్షర రూపం దాల్చిన ఆ భావం మన మనసుకు తాకి సేదతీరిస్తుంది. ప్రేమ, బాధ ఏ భావమైన గాని తన కలం నుండి మధురంగా జాలువారుతాయి. మన తెలుగు మహిళా గీత రచయిత్రి శ్రేష్ఠ గారి గురించి తన సినీ ప్రయాణం గురించి ఇంకాస్త ఎక్కువగా తెలుసుకుందాం..

శ్రీ శ్రీ గారి స్పూర్తి: శ్రేష్ఠ గారిది మంచిర్యాల. నాన్న బిజినెస్, అమ్మ ఉద్యోగం చేస్తుండేవారు. అమ్మ నాన్నల కన్నా తాతయ్య వెంకటకిషన్ గారి ద్వారానే పుస్తకాలపై, సాహిత్యంపై ఇష్టం మొదలయ్యింది. "ఏ విషయంలోనైనా చిన్నతనంలో ఇష్టం కలిగితే అది పెరిగి పెద్దయ్యేసరికి టాలెంట్ గా మారిపోతుంది" తాతయ్య ప్రభావంతో శ్రేష్ఠ గారికి పాటలు పాడడం, రాయడం మీద మంచి అభిరుచి పెరిగింది. అలాగే శ్రీ శ్రీ గారి రచనలు కూడా తనని అత్యంత ప్రభావితం చేశాయి. ఇంకేముంది సమాజంలో చైతన్యం నింపేలా చిన్నతనం నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. ఒకపక్క కవిత్వాలు రాస్తునే మరో పక్క ఎల్.ఎల్.బి పూర్తి చేశారు.

మొదటి పుస్తకం: నీ...మదిలో మలినాల ఊటలు కనులలో కల్మషపు తూటాలూ.. కొంగు చాటున దాగున్న పొంగుల రుచి చూడ మంటూ తొందరిడితే... పసికందుగా నువ్వున్న వేళన పాలు పంచిన నిన్ను పెంచిన తల్లి కూడా... ఓ ఆడదేనని మరువకోయీ ! గుప్త స్థానాలన్నీ సృష్టి మూలాలవ్వీ! వక్ర దృష్టితో చూడకోయీ నీ జన్మస్థలినే మరువకోయీ...!

ఇలాంటి ఎన్నో సమ్మోహనమైన లైన్లతో ఉస్మానియా యూనివర్సటీలో చదువుకుంటున్న రోజుల్లోనే "భావన" అనే పుస్తకం రాసి ఎంతోమంది ఆత్మీయుల అభిమానాన్ని పొందారు.

ఇండస్ట్రీలో ఎలా ఉండేదంటే: అవకాశం కావాలంటే అబ్బాయి ఐతే డబ్బు ఇవ్వాలి అమ్మాయి ఐతే కమిటిమెంట్ ఇవ్వాలి అనే దిక్కుమాలిన సాంప్రదాయం కొంతవరకు మన ఇండస్ట్రీలో ఉంది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రేష్ఠ గారు ఒక మహిళగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు. స్వతహాగా ధృడమైన మహిళ కాబట్టి శ్రేష్ఠ గారికి ఇవన్నీ చాలా కోపం తెప్పించేవి, కొన్నిసార్లు తాను రాసిన పాటలను కావాలనే వేరొకరి పేరు వేసి కక్ష తీర్చుకునేవారట. దాదాపు మూడు సంవత్సరాల పాటు రకరకాల ఇబ్బందులు ఎదుర్కుని ఇక నా వల్ల కాదు నాకు ఏ సినిమా వద్దు అని చెప్పేసి ఒకానొక సందర్భంలో తన ఊరు వెళ్ళిపోయారు.

మొదటి పాట: ఆ తర్వాత కొంతకాలానికి హైదరాబాద్ మధురానగర్ లో నివాసముంటున్న సమయంలో "ఒక రొమాంటిక్ క్రైమ్ కథ" సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న ప్రవీణ్ యిమ్మడి గారితో పరిచయం ఏర్పడింది. తన ఇష్టాన్ని గమనించి ప్రవీణ్ గారు మొదట రెండు ట్యూన్ లు ఇచ్చి దీనికి లిరిక్స్ రాయమని చెప్పారట. అవకాశాల కోసం వెతకడం మాత్రమే కాదు అది అందుకున్నాక సరిగ్గా ఉపయోగించుకోవాలని తెలిసిన శ్రేష్ఠ గారు కేవలం ఒక్కరోజులోనే ఆ ట్యూన్ లకు అద్భుతమైన లిరిక్స్ రాసి ఇచ్చేశారు, కట్ చేసే మొదటి సినిమాకే సినిమాలోని అన్ని పాటలు రాసే గొప్ప అవకాశం వచ్చేసింది. ఆ తర్వాత "కో అంటే కోటి(బంగారు కొండ, ఓ మధురిమవే), జబర్ దస్త్(అరెరే అరెరే), కొరియర్ బాయ్ కళ్యాణ్(మాయ ఓ మాయ), పెళ్ళి చూపులు(చినుకు తాకే, మెరిసే), అర్జున్ రెడ్డి(గుండెలోన, మధురం) యుద్ధం శరణం(నీ వలనే, ఎన్నో భావాలు) లాంటి సినిమాలకు మంచి సాహిత్యమున్న పాటలు అందించారు.

నిజానికి మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ ఇంకా అందులో మహిళా గీత రచయితలు అంటే ఇంకా తక్కువ. ఎల్.ఎల్.బి చదివి వృత్తి పరమైన జీవితానికే పరిమితం అవ్వకుండా ఇలా మనసుకు హత్తుకునే పాటలతో శ్రేష్ఠ గారు మనందరి మనసులకు దగ్గరయ్యారు.