శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ప్రతి ఒక్క అవతారానికి ఒక నిర్ధిష్టమైన కారణముంది కొన్ని అవతారాలకు ఒక తల్లి గర్భాన జన్మించి తన జన్మ కర్తవ్యాన్ని నిర్వర్తించారు కొన్ని అవతారాలకై కాలయాపన చేయకుండా సత్వరమే అవతరించి తమని నమ్ముకున్న వారిని ఆదుకున్నాడు. భగవంతుని అవతారాలలోనే అత్యంత శక్తివంతమైన అవతారం నరసింహావతారం. పరిస్థితులను బట్టి, మనకు ఎదురయ్యే వ్యక్తులను బట్టి మనల్ని మనం సంస్కరించుకోవాలని ఈ అవతారాలు సూచిస్తాయి. నరసింహునికి ఈ భూమి మీద ఉన్న అతి ఉన్నతమైన దేవాలయాలలో ఈ శోభనాచల నరసింహా స్వామి వారి దేవాలయం కూడా ఒకటి. ఈ గుడి విజయవాడ నుండి 57కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆగిరిపల్లి అనే గ్రామంలో ఉన్నది.
ఆగిరిపల్లి గ్రామాన్ని ఏ విధంగానైనా చేరుకోవచ్చు కాని కొండ మీద ఉన్న ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రాతి మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. "నన్ను(భగవంతుడు) చేరుకోవాలంటే నువ్వు నా అంత ఎత్తుకు ఎదగాల్సి ఉంటుంది" అనే గొప్ప సందేశం ఇందులో దాగి ఉంటుంది. ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఓ పురాతన కథ దాగి ఉంది. ఆ రోజుల్లో శుభవ్రతుడు అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పాలించేవారు, ఆ మహారాజు గొప్ప విష్ణు భక్తుడు. శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకోవడాని ఒకప్పుడు ఇదే దట్టమైన అడవిలో ఘోర తపస్సు చేశారట. భగవంతుడు ప్రసన్నుడై శుభవ్రతుడికి దర్శనమిచ్చారట.
"మీ అవతారాలన్నీటిలో నరసింహావతారం నాకు అత్యంత ప్రీతికరం" అని చెప్పగానే శ్రీహరి నరసింహుని రూపంలో దర్శనమిచ్చారట. అలాగే ఇక్కడే ఉండి తన రాజ్యంలోని ప్రజలందరిని ఆదుకోవాలని వేడుకున్నారు. భక్తుని కోరిక మేరకు విష్ణువు ఇక్కడే స్వయం భూ గా వేలిశారని చెబుతుంటారు.పరమేశ్వరుడు, శ్రీహరి ఇద్దరూ కలిసి విహారయాత్రకు వెళుతున్నప్పుడు ఇక్కడి ప్రకృతి నచ్చి ఇక్కడే ఉందామాని చెప్పి భావించారట అలా శివుడు కొండ మల్లేశ్వర స్వామిగా, శ్రీహరి నరసింహా స్వామి వారిగా వెలిశారని ఆలయ పూజారులు వర్ణిస్తారు.
ఈ గుడి ఎంతటి మహిమాన్వితమైనదో ఇక్కడి పరిసరాలు కూడా అంతే అందంగా ఉండటంతో భక్తులు దర్శనానికై మాత్రమే కాకుండా ఇక్కడి ప్రకృతి ఒడిలో సేదతీరడానికి కూడా వస్తుంటారు. దసర నవరాత్రుల సమయంలో భక్తులు ఈ కోవెలను అధిక సంఖ్యలో దర్శించుకుంటారు.