చిన్న పిల్లలు ఏది చేసినా ముద్దు ముద్దుగా ఉంటుంది.. వారు ఎదిగే క్రమంలో నేర్చుకునే ప్రతి పని తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ముద్దులొలికే పాప పేరు శివాని 2012లో జన్మించింది తను. కేవలం 5 సంవత్సరాల వయసున్న పాప ఏం చేస్తుందండి.? మామూలుగా ఐతే అప్పుడే ఊహ తెలిసి సవాలక్ష ప్రశ్నలు అడుగుతుందేమో, లేదంటే పద్యాలు, పాటలు పాడుతుందేమో, లేదంటే చాలామంది అల్లరి పిల్లలలా స్కూల్ కి వెళ్ళనని మారం చేస్తుంటుందేమో.. కాని శివాని ఆ వయసులోనే ఆర్చరీ క్రీడలో దేశ వ్యాప్తంగా ఎన్నో మెడల్స్ సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ లో (16 సంవత్సరాలు నిండిన వారికే గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేస్తారు, లేదంటే అందులో కూడా శివాని పేరు ఉండేది) స్థానం సంపాదించి రేపటి భారత క్రీడా రంగానికి ఆర్చరీ రంగంలో పతకాలకు ఏ ఢోకా లేదని నమ్మకం కలిగిస్తుంది ఈ 1st క్లాస్ చదువుతున్న పాప.
కుటుంబ నేపధ్యం: శివాని నాన్న గారిది విజయవాడ. విజయవాడలో వీరు Cherukuri Volga Archery Academy ద్వారా దాదాపు 100 మందికి పైగా శిక్షణ ఇస్తున్నారు. ఫుట్ బాల్ ప్లేయర్ ఐన సత్యనారాయణ గారికి ముగ్గురు పిల్లలు. లెనిన్, ఓల్గా, శివాని. లెనిన్, ఓల్గా చిన్నతనం నుండే ఆర్చరీ క్రీడలో నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్ లో చాలా మెడల్స్ సాధించారు. ఒక పక్క మెడల్స్ సాధిస్తూనే మరోపక్క తమ టాలెంట్ ను కోచ్ గా మరెందరికో అందించి వాళ్ళను కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకువచ్చారు. ఒకానొక సందర్భంలో వరుసగా చాలా సంవత్సరాల పాటు ఆర్చరీలో ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలిపారు. దురదృష్టవశాత్తూ లెనిన్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు, ఒకానొక సందర్భంలో కూతురు ఓల్గా గ్రౌండ్ కూడా గ్రౌండ్ లోనే చనిపోయింది. తన ఇద్దరి పిల్లలను మాత్రమే కాదు యాక్సిడెంట్ లో శివాని నాన్న గారు తన రెండు కళ్ళు కూడా పోగొట్టుకున్నారు.
శివానీకి శిక్షణ: ఇద్దరు పిల్లలు చనిపోయారు.. చూపు కోల్పోయీరు.. అంతే కోల్పోయారు, కాని వారిలోని శక్తి, ధైర్యం కాదు. సరోగసి ద్వారా పుట్టబోయే బాబు/పాప ఆర్చరీ క్రీడలో ఉన్నతురాలిగా తీర్చిదిద్దాలని వారు బలంగా అనుకున్నారు. అనుకున్నట్టుగానే పుట్టిన రెండో నెల నుండే శివానీకి చిన్నపాటి విల్లు ద్వారా శిక్షణ ఇచ్చేవారు. 3 నెలల వయసు వచ్చాక అకాడెమి లో ఆర్చరీ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో పాపను తిప్పుతూ మిగిలిన వారు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో పాపకు చూపించేవారు. 10వ నెలలోనే నడక మొదలుపెట్టడం వల్ల అప్పుడే తనకు అసలైన శిక్షణ ప్రారంభమయ్యింది. ఇక శివానికి 18 నెలలు నిండగానే కోచ్ చంద్రశేఖర్ గారి శిక్షణలో గురి చూసి లక్ష్యాన్ని చేదించే బాణాలు వేసేంతటి స్థాయికి ఎదిగింది.
అందుకున్న అవార్డులు: పెద్ద పిల్లలు వింటారు, అర్ధం చేసుకుంటారు. మిగిలిన వారి కన్నా చిన్న పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం అత్యంత కష్టతరం. శివాని మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కున్నా కాని మిగిలిన పెద్దవారు ఆశ్చర్యానికి లోనయ్యేలా బాణాలు సంధించింది. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ తన ప్రతిభ ప్రదర్శించింది. 2015లో జరిగిన అండర్-5 ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో శివాని మొదటిస్థానంలో నిలిచింది (అప్పుడు తన వయసు 3 సంవత్సరాలు), 2016 అండర్-9 ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారతదేశంలోనే 3 వ స్థానం అందుకున్నది. జాతీయ స్థాయిలో 5 మెడల్స్, రాష్ట్రస్థాయిలో 10 పతకాలు గెలిచి ఇంత చిన్న వయసులో ప్రపంచంలోనే ఎవ్వరు సాధించలేని, అందుకోలేని ఘనతను అందుకున్నది. ఇప్పుడు శివాని ప్రస్తుత లక్ష్యం 2024 ఒలంపిక్స్. ఆ ఒలంపిక్స్ నుండే తన అసలైన పతకాల వేట కొనసాగబోతుంది.. ఖచ్చితంగా ఒక తెలుగు మహిళగా, భారతదేశ మహిళగా తన బంగారు చేతులతో విజయాలు అందుకోబోతున్నది.
Image Courtesy: Sivani Facebook