The Story Of A Man Who Found The True Meaning Of Life On His Journey To Kasi

Updated on
The Story Of A Man Who Found The True Meaning Of Life On His Journey To Kasi

Contributed By GireeshRaman

రెండు ఊర్లు దాటి పొతే, ఆడున్న కోనలో శివయ్య జాతర. ఊరంతా అటే పోయారు. వీడు ఒంటరిగా ఊరిలో వున్నాడు. ఒంటరితనం వాడికో ఊరట.

ఇంటి దూలానికి కుల్లిపోయి వేలాడుతున్న గుమ్మడి కాయని తీస్తుండగా, కట్టెకి పట్టుకొని వాడి మెడలోని దండ తెగింది. ఓ రుద్రాక్ష దొర్లుతూ దొర్లుతూ, మెట్లని దుమికి నడి వీధిలో, ఒక ముసలి దాని ముందు వొచ్చి ఆగింది.

ఎరుక చెప్పేది, కురవంజి. సోదమ్మ సోది అంటూ, తంబురా వాయిస్తూ, వీది వీది తిరిగేది, ఆ పొద్దు సప్పుడు చెయ్యకుండా పోతుంది.

ఆమె నుదుట, భూగోళం అంత బొట్టు వుంది. సింధూరంతో దిద్దింది, కానీ సూరీడిలా ఎర్రగా రగులుతుంది. చీర ఆడాడ చినిగుంది, కాలికి నెత్తురుంది . తంబురా విరిగిపోయింది .

వీడు ఆ అవ్వని ఇంట్లోకి పిలిచాడు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు, ఇంట్లో పాత గుడ్డ ఉంటే దానితో నెత్తురు తుడిచాడు, దెబ్బలకి పసుపు ఇచ్చాడు. వీడేమి అడుగలేదు, ఆమె చెప్పింది "కుక్కలు వెంట పడ్డాయి", అని. ఆమె ఏమి అడుగలేదు, వీడే ఆమెకి భోజనం పెట్టాడు.

ఆమెని సాగనంపే అప్పుడు, ఇంటికి దిష్టి తియ్యడానికి తెచ్చిన, రెండు గుమ్మడి కాయల్లో, ఒకటి ఆమెకి ఇచ్చాడు. తంబూరాకి వాడుకోమన్నాడు.

ఆమె గుమ్మడి కాయని బుట్టలో పెట్టి, ఆ బుట్టను నెత్తిన పెట్టుకొని, విరిగిన తంబూరని చంకనెట్టుకొని, కుడి చేతిలో గవ్వలాడిస్తూ, ఎడమ కాళి గజ్జలు ఆడిస్తూ, వీడి వంక నవ్వుతూ ఓ సూపు చూసి, "నువ్వు వెతుకుతున్నది "అని ఓ మాట జారీ, ఇట్టా పాట పాడింది .. .. .

"కాశీ పురానా గంగా తీరానా కురిసేటి వెన్నలలోనా కానోచేతి వన్నెలోన కాగడా వెలుగుల్లోనా నీలో ప్రవహించేనే ఓ ఆలోచనల సంద్రం . హ !

కాశీ పురానా గంగా తీరానా కాలేటి శవముల మధ్యనా పైకి తీలేటి పొగలు నీ సుట్టు కమ్మగా, కమ్మగా పిండములని తింటున్న కాకుల దోవలోనా ధూళిగా లేచే బూడిద లోనా నీకు కానోస్తాది, ఆ ఉదయం - నీటి లోంచి పైకి లేచే మిల మిల మండే సూర్యుడు."

వాడు మరునాడు కాశీ పోయాడు. పున్నమి నాడు. ఆ రేతిరి గంగ మీద కురుస్తున్న వెన్నలను, అక్కడి అరుగు మీద కూర్చొని చూసాడు. చూస్తూ చూస్తూనే కట్లపాముల ముడుచుకొని ఆడే నిద్రపోయాడు. మోగిన శంఖం సప్పుడ్లకి , గంటల మోతకు వాడికి మెలుకువ వొచ్చింది .

తెల్లవారగానే ఇంకొన్ని శవలొచ్చాయి . వాటిని మోసుకుంటూ బంధు మిత్రులొచ్చారు . ఏడుస్తున్నారు, కొంత మంది గట్టిగా, కొంత మంది మౌనంగా . ఆడ కట్టెలు అమ్మేవాడికి ఆనందం , కొత్త బేరం వొచ్చింది అని. కాటి కాపరికి ఆనందం , పని దొరికింది అని. అయ్యగారికి ఆనందం , ఆయన సంచిలో కొంచం బియ్యం పడుతాయి అని .

ఈ భావోద్వేగాల మధ్య నుండి , కాలుతున్న శవములు మధ్య నుంచి , బుడిద ను తొక్కుకుంటూ, విభూదులు రాసుకుంటున్న ఆగోరాల మధ్య నుండి, సన్యాసుల మధ్యనుండి , సన్నాసుల మధ్యనుండి , ఒక్కో మెట్టు దిగుతూ వాడు నది ఒడ్డుకు వచ్చాడు

గంగలో.. తేలుతున్న తెప్పలని , విస్తరాకులలో వొదులుతున్న పిండాలని , కుండ లోంచి పారపోస్తున్న ఆస్తికలని చూస్తూ.. ఆ గంగమ్మ తల్లిని చూసాడు , పైనున్న ఆకాశం కిందకి పడ్డాది , నీలం ఆకాశం నీటిలో కనిపిస్తుంది.

మొదటి సారి .. తలెత్తి కాకుండా తలాడించి , ఏంతో గొప్పదైనా ,విశాలమైనా ఆకాశాన్ని చూసాడు. అదే చోట ఆ నీటిలోని వీడి ప్రతిబింబాన్ని చూసాడు !