రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఉన్న బుక్స్, మోడల్ పేపర్స్ అన్ని ముందర వేసుకుని ప్రిపరేషన్ లో ఉంటాము, మనం చదివిన క్వశ్చన్ వస్తుందా, అనుకున్న మర్క్స్ వస్తాయా.? అన్న భయం కంగారులోనే ఉంటాము.. బ్లైండ్ స్టూడెంట్స్ మాత్రం ఎక్కువ శాతం ఇలా ఆలోచించరు, రేపటి తమ పరీక్షను రాయడానికి సహాయం చేసేవారు ఎవరైనా దొరుకుతారా.? లేదా రాస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి ఏదైనా కారణం చెప్పి రాకుండా పోతారా.? ఇవే ఆలోచనలు ఎక్కువ. మీకో విషయం తెలుసా మన భారత దేశంలో బ్లైండ్ స్టూడెంట్స్ 50% ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోవడానికి గల ప్రధాన కారణం వాలంటీర్లు అందుబాటులో లేకపోవడమే!!
ఒక యువకుడి ఆలోచన: శ్రీరామ్ గత నాలుగు సంవత్సరాలుగా బ్లైండ్ స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవారు. ఒకసారి 'ఒకేసారి ఒక్కరోజులో' ఇద్దరి వ్యక్తులకు పరీక్ష రాయాల్సి వచ్చింది, అతి కష్టం మీద ఇంకో స్నేహితుడి సహాయంతో ఎగ్జామ్ రాయించడం జరిగింది. అప్పుడే తనలో ప్రకంపనలు మొదలయ్యాయి, నాకు తెలిసిన వారికే ఇలాంటి ఆపద ఎదురయితే ఇంకా దేశంలో ఎంతమందికి వాలంటీర్లు దొరకక పరీక్షలు రాయలేకపోతున్నారనే స్పృహ కలిగింది. కొన్ని సంస్థలు ఉన్నాయి కానీ వారు ప్రతి ఒక్క పరీక్షకు రూ.1,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. కమర్షియల్ గా కాదు ఖచ్చితంగా మానవతా దృక్పథంతో ఉచితంగా పరీక్ష రాసేవారు ఎందరో ఉన్నారు వారిని ఒక వేదికపై తీసుకురావాలని శ్రీరామ్ అనుకున్నారు.
Scribe Finder App: ప్రపంచంలో ఉన్న 37 మిలియన్ల చూపులేనివారిలో దాదాపు 15మిలియన్ గ్రుడ్డివారు మన దేశంలోనే ఉన్నారు, ఐతే ఏంటి అంతకు చాలా రేట్లు చూడగలిగే వారు మన దేశంలోనూ ఉన్నారు కదా అంటూ తన ఆలోచనను చిన్ననాటి స్నేహితుడైన శ్రీకాంత్ కు చెప్పారు. ఇద్దరు కలిసి 2018 లో Scribe Finder App ను తయారు చేసి ప్లే స్టోర్ లో అప్ లోడ్ చేశారు. ఈ యాప్ లో బ్లైండ్ స్టూడెంట్స్ మరియు వాలంటీర్ లోకేషన్, ఏ పరీక్ష రాస్తున్నారు, ఎంత సమయం కావాలి మొదలైన వివరాలన్నింటిని పొందుపరచాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఇప్పటికి 2,000 మంది ఎగ్జామ్ రాసి ఉన్నారు.
ఉచితంగా.. శ్రీరామ్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉండగానే మిత్రుడు శ్రీకాంత్ తో కలిసి ఈ ప్రాజెక్టు రూపకల్పనలో భాగం అయ్యారు, ప్రస్తుతం అక్షయ్ అనే మరో వ్యక్తి కూడా దీనికి సహాయం అందిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో 5,000 మంది రిజిస్టర్ అవ్వగా అందులో 2,000 మంది బ్లైండ్, 3,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఈ సంఖ్య మరింత విస్తరిస్తే దేశంలో నలుమూలలా ఉన్న ఎందరో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. దీనికి అవసరమైన ఖర్చులు, ఇతర సాంకేతిక సహాయ బాధ్యతలు ముగ్గురు చూసుకుంటున్నారు.
App Link: https://play.google.com/store/apps/details?id=com.ourapps.scribefinder Youtube link: https://www.youtube.com/channel/UCvlixIa9H-TDNCb7g64atSQ PH: 74114 21737