వీటి పని అయిపోయింది, ఇక పనికిరావని ముద్రపడిన వస్తువులను ఏర్చి కూర్చి వాటన్నిటికి అందంగా ప్రాణప్రతిష్ఠ చేస్తారు రవి. ఇప్పుడు మీరు చూసే శిల్పాలన్నీ పాడైపోయిన కారు, బైక్ ఇతర ఐరన్ వస్తువుల ద్వారా రూపొందించినవే. గుంటూరు మాయాబజార్ పాడైపోయిన బైక్, కార్ లు అమ్ముతూ ఉంటారు. లోకల్ షాప్ వాళ్ళు వాటిని కొనుగోలు చేసి బాగున్న విడిభాగాలను వీళ్ళు అమ్ముతూ ఉంటారు. రవి గారు తెనాలి నుండి 30 కిలోమీటర్లు ప్రయాణ చేసి ఆ పాడై పోయిన వస్తువులను ఏరి(వాటిని చూడగానే తెలిసిపోతుంది ఏ శరీరానికి దీన్ని ఉపయోగించవచ్చని) నెలల తరబడి శ్రమించి ఇదిగో మనం చూస్తున్న ప్రాణులుగా ఒక్కో వస్తువుతో తీర్చిదిద్దుతారు.
రవి నాన్న, తాత, ముత్తాతలు కూడా కళాకారులే. తాత గారు దేవాలయాలు కట్టేవారు, నాన్న విగ్రహాలు, శిల్పాలు చెక్కేవారు. ఇంతటి గొప్ప వారసత్వం రవి గారిలో ప్రవహిస్తుంది కనుక ఏ కెరీర్ ఎంచుకోవాలని ఆయన ఎక్కువ ఆలోచించలేదు. రవి గారు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే హైదరాబాద్ జే.ఎన్.టి.యు లో BFA, అలాగే కలకత్తాలో MFA పూర్తిచేశారు. BFA లో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, MFA లోను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ తను. ఎక్కడ చదువుకున్నా కానీ ఇంటి వారసత్వంగా వచ్చిన పనిని నేర్చుకుని, సొంతూరు తెనాలిలోనే జీవిస్తున్నారు.
ఇప్పటికి హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబాయ్ లాంటి మహా నగరాలలో రవి గారు ప్రదర్శనలిచ్చారు.