సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ఎన్నో రకాలుగా తమ ఫ్రెండ్స్ ను ట్యాగ్ చేసి ఛాలెంజ్ విసురుతున్నారు, ఇందులో చాలా వరకు ఏదో టైం పాస్ గా చేస్తున్నవే.. ఇలాంటి ఛాలెంజ్ విసిరి సమాజానికి ఉపయోగపడేలా ఒక ట్రెండ్ సృష్టిస్తే ఎంతో బాగుంటుందనే బలమైన ఆకాంక్షతో ఈ "స్కూల్ బకెట్ ఛాలెంజ్" స్టార్ట్ చేశారు మునిపల్లి ఫణిత గారు.
ఫణిత గారిది కరీంనగర్ జిల్లా. ఇక్కడ చదువుకున్న తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నతనం నుండే సొసైటీకి ఏదైనా మంచి చేయాలనే భావాలతో ఉన్న తను ఎన్నో సార్లు కరీంనగర్ కు వచ్చినప్పుడల్లా సహాయ కార్యక్రమాలు చేసేవారు. ఒకరోజు గవర్నమెంట్ స్కూల్ కు వెళ్ళినప్పుడు "మాకు కనీసం పుస్తకాలు, పెన్సిళ్ళు, పెన్నులు కొనుక్కోవడం కూడా కష్టంగా ఉందని పిల్లలు చెప్పడంతో ఫణిత గారు విపరీతంగా బాధపడ్డారు". ఎంత చేసినా కాని కేవలం నా రెండు చేతుల ద్వారా మాత్రం పిల్లల సమస్య తీరదని ఇందులో తోటి మిత్రులను, సమజాన్ని భాగస్వామ్యం చేయాలనుకున్నారు, చేశారు, చేస్తున్నారు.
ఒక పూట భోజనం పెడితే అది ఒకరోజు ఆకలి తీరుస్తుందేమో అదే భోజనంతో పాటు చదువును కూడా అందిస్తే అది ఆ పిల్లల భవిషత్తును పూర్తిగా మార్చేస్తుంది. మొదట తన పిల్లలు చదువుకునే స్కూల్ లోనే ఈ "స్కూల్ బకెట్ ఛాలెంజ్" ప్రారంభించబడినది. పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఇలా పిల్లలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు ఒక బకెట్ లో పెట్టి పిల్లలకు ఇచ్చి తన ప్రొఫైల్ లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇది సోషల్ మీడియా ద్వారా వైరల్ ఐయ్యింది.. అలా ఒకరి నుండి ఒకరికి చేరుకుంటూ మన ఎంపి కవిత, వినోద్ కుమార్, కొంతమంది మంత్రుల దగ్గరి నుండి విదేశాలలో ఉంటున్న తెలుగువారందరి దగ్గరికి చేరింది.. వారు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు.
Tag That Friend అంటూ ప్రతిరోజూ వచ్చే సవాలక్ష పోస్టులలో భాగం అయ్యే కన్నా రేపటి భారతానికి ధృడమైన పౌరులను తయారుచేసే ఈ ప్రోగ్రాంలో మనతో పాటు మన మిత్రులను భాగం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది