Rare Yet Brilliant Sanskrit Films You Should Start Watching

Updated on
Rare Yet Brilliant Sanskrit Films You Should Start Watching

Contributed By Tanmayee Kondeti

అవును... సంస్కృతమే... సంస్కృత భాషలో ఇప్పటి వరకు ఆరు సినిమాలు విడుదల అయ్యాయి. అయితే ఈ సినిమాలు వినోదం కోసం కంటే కూడా విజ్ఞానం కోసం రూపొందించబడ్డాయి. కొన్ని ప్రభుత్వం చేత కూడా నిర్మించబడ్డాయి. ఈ సినిమాలన్నీ భారతీయ సంస్కృతి మరియు ఇండియన్ ఫిలాసఫీ (వేదాంతం) నేపథ్యంతో లేదా సమాజం లోని లోపాలను ఎత్తి చూపే నేపథ్యంతో చిత్రీకరించబడ్డాయి. ఈ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

1.ఆది శంకరాచార్యః (1983) దర్శకుడు : జీ. వీ.అయ్యర్ నిర్మాణ సంస్థ : ఎన్. ఎఫ్. డి. సి (నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఇది సంస్కృతంలో రూపొందించబడిన మొదటి సినిమా. ఇందులో శంకరాచార్యుల జీవితంతో పాటు అద్వైత వేదాంతం గురించి కూడా వివరించబడింది. ఈ సినిమాకి ఆ సంవత్సరంలో బెస్ట్ ఫీచర్ ఫిలిం విభాగంతో సహా ఇంకో మూడు విభాగాలలో నేషనల్ అవార్డులు లభించాయి.

2.భగవద్గీతః (1993) దర్శకుడు : జీ. వీ.అయ్యర్ నిర్మాత : టి. సుబ్బరామిరెడ్డీ ఇది మనందరికీ తెలిసిన కథే. శ్రీ కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పడం. దేవతల భాష అయిన సంస్కృతంలోనే దేవతల మధ్య సంభాషణలు చూడడం నిజంగా ఒక కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. ఈ సినిమాకి కూడా ఆ సంవత్సరంలో బెస్ట్ ఫీచర్ ఫిలిం విభాగంలో నేషనల్ అవార్డు లభించింది.

3. ప్రియమానసం (2015) దర్శకుడు : వినోద్ మంకర నిర్మాణ సంస్థ : సోమా క్రియేషన్స్ వినోద్ మంకర ఒక మళయాళీ దర్శకుడు. ఆయనకు ఎన్నో నేషనల్ మరియు స్టేట్ అవార్డులు లభించాయి. ఈ సినిమా 'ఉన్నాయి వారియర్' అనే 17వ శతాబ్దానికి చెందిన ఒక మళయాళ కవి రాసిన నలచిత్రం అనే కావ్యసంపుటి గురించి తీయబడింది. సినిమా కథ అంతా 17వ శతాబ్ద నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకి 2015 లో బెస్ట్ సంస్కృత్ ఫీచర్ ఫిలిం విభాగంలో నేషనల్ అవార్డు లభించింది. ఈ చిత్రం 46వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ప్రదర్శింపబడింది.

4. ఇష్టిః (2016) దర్శకుడు : జి. ప్రభ నిర్మాత : జి. ప్రభ ఇది సామాజిక నేపథ్యంతో వచ్చిన తొలి సంస్కృత సినిమా.1930 లో కేరళ లో నంబూడిరి అనే తేగకు చెందిన కొందరు బ్రాహ్మణలు స్త్రీ పురుష సమానత్వం కోసం పాటు పడిన కథే ఈ సినిమా కథ. ఈ చిత్రం 47వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ప్రదర్శింపబడింది.

5. సూర్యకాంతః (2017) దర్శకుడు : ఎమ్. సురేంద్రన్ నిర్మాణ సంస్థ : స్పైర్ ప్రొడక్షన్స్ సూర్యకాంతః సంస్కృతంలో రూపొందించబడిన తొలి సమకాలీన సినిమా. ఈ సినిమా ఇద్దరు వృద్ధ దంపతుల కథ. యవ్వనంలో భార్య గొప్ప కథకళి నర్తకురాలు. భర్త గొప్ప కథకళి గాయకుడు. అప్పట్లో అన్ని పేరు ప్రతిష్టలు లభించినప్పటికీ కాలం మారుతున్న కొద్ది వారికి ప్రజాదరణ తగ్గిపోయింది. వారు వారి గత వైభవాన్ని గుర్తు చేసుకోవడమే ఈ సినిమా కథ.

6. అనురక్తిః (2017) దర్శకుడు : పి. కే. అశోకన్ నిర్మాణ సంస్థ : హ్యాపీ ట్యూన్ పిక్చర్స్ ఈ సినిమా సంస్కృతంలో రూపొందించబడిన తొలి 3డి సినిమా. సినిమాలో పాట కలిగిన తోలి సంస్కృత సినిమా కూడా. పై సినిమాలలో పాటలు లేవు. ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. ఈ సినిమా కూడియాట్టుం అనే ఒక కళకు సంబంధించినది. ఈ చిత్రం 48వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ప్రదర్శింపబడింది.

7. పుణ్యకోటి (2018) దర్శకుడు : రవి శంకర్ వి. నిర్మాణ సంస్థ : పప్పెటికా మీడియా ఇది సంస్కృతంలో రాబోతున్న తొలి యానిమేషన్ చిత్రం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమా కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా పాడుకునే ఒక జానపద గేయం ఆధారంగా రూపొందించబడుతుంది. This is the official website of Punyakoti.

ఇవి కాకుండా యూట్యూబ్ లో మరెన్నో సంస్కృత షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఈ చిత్రాలలో ఎక్కువ శాతం కేరళ సంస్కృతి గురించే ఉండడం గమనార్హం. ఇలాంటి సినిమాలతో సంస్కృత భాషను కాపాడుతూనే మన భారతీయ సంస్కృతిని కూడా కాపాడడం చాలా గొప్ప విషయం కదా!!

Source : internet