This Guy & Girl's Conversation About Love, Life & Career Is Super Relatable

Updated on
This Guy & Girl's Conversation About Love, Life & Career Is Super Relatable

ఐదేళ్ల తర్వాత మొదటి సారి హైదరాబాద్ కి వచ్చాను. అమెరికా లో ఎమ్.ఎస్ తర్వాత అక్కడే మంచి జాబ్ వచ్చింది.ఈ ఐదేళ్లు ఎలా గడిచాయో తెలీకుండా గడిచాయి. అమ్మ ని, నాన్న ని చాలా రోజుల తరువాత ప్రత్యక్షంగా చూడబోతున్నాను. వీడియో కాల్ పుణ్యమా అని వాలపైన బెంగ లేకపోయినా వాళ్ళ దగ్గర లేను అనే బాధ ఉంది. దేవుడి దయ నాకు హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది. అమ్మ కి వస్తున్న అనే విషయం చెప్పకుండా సడన్ సర్ప్రైస్ ఇద్దామని ఇంటికి వచ్చాను.

కానీ ...తాళం వేసుండటం చూసి అమ్మ కి కాల్ చేస్తే పక్కింటి వాళ్ళతో చిలుకూరు కి వెళ్ళాము సాయంత్రం లోపు వచ్చేస్తామని నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అప్పటి వరకు ఏంచేయను అని అడిగితే పక్కింటి వాళ్ళ అమ్మాయి ఇంట్లోనే ఉంది అక్కడ ఉండమంది. ఇక చేసేది లేక పక్కింటి తలుపు తట్టాను. టీ షర్ట్ జీన్స్ పాంట్ తో మనం తరుచు గా చూసే అమ్మాయిల కన్నా కొంచెం అందంగా ఉన్న అమ్మాయి తలుపు తీసి "హాయ్ నా పేరు స్వప్న ఆంటీ ఇప్పుడే చెప్పారు మీరు వస్తున్నారని" అని పలకరించింది.నేను కూడా "హాయండి నా పేరు సత్య" అని పరిచయం చేసుకుని ఇంట్లో కి అడుగుపెట్టాను.

వాష్ రూమ్ కి వెళ్లి ఫ్రెషయ్యి బయటకి వచ్చేసరికి సాంబ్రాణి సువాసన. తను విష్ణు సహస్రనామం చదువుతోంది. డ్రెస్ చూసి మోడ్రన్ అనుకున్న కాని సంప్రదాయాలకు విలువిస్తుందన్న మాట అనుకుని హాల్ లో సోఫా లో కూర్చుని టివి తో కాలక్షేపం చేద్దామా అని అనుకునే లోపు కరంట్ పోయింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యే స్టేజ్ లో ఉంది. ఆలా బాల్కనీ లో కి వెళ్ళి అమ్మ వచ్చేంత వరుకు ఎలా అని ఆలోచిస్తున్న... ఈ లోపల ఆ అమ్మాయి కాఫి తీసుకువచ్చింది.ఎప్పుడో అమ్మ చేసిన కాఫీ తాగిన తరువాత ఇంత రుచికరమైన కాఫీ ఇప్పటివరకు తాగలేదు.

నేను: కాఫీ చాలా బాగుందండి.

స్వప్న:థాంక్స్ అండి. మీ ఆఫీస్ ఎక్కడ

నేను: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఎల్లుండి నుండి వెళ్ళాలి.

(అలా కొన్ని ఫార్మల్ ప్రశ్నలు జవాబు ల అనంతరం.)

స్వప్న: ఎవరినైనా లవ్ చేశారా? (ముందు మోడ్రెన్ అనుకున్న తర్వాత ట్రెడిషనల్ అనుకున్న ఇప్పుడు ఇలా అడిగేసరికి ఈ అమ్మాయి మీద ఒక అంచనా కి రాలేక పోతున్నా).

స్వప్న :I am a blogger లవ్ స్టోరీస్ రాస్తుంటా. సో మీ స్టోరీ నాకేమన్నా ఉపయోగపడుతుందేమో అని అడిగా. sorry please don't mind.

నేను:నాకసలు లవ్ స్టోరీ లేదండి. బట్ లవ్ స్టోరీ అవ్వబోయి ఆగిన స్టోరీ ఉంది.

స్వప్న :పోనీ అదే చెప్పండి.

నేను:జి.ఆర్.ఈ ప్రిపేర్ అయ్యే టైం లో ఒక అమ్మాయి అంటే ఇష్టముండేది. కానీ ఎగ్జామ్ పాస్ అయ్యాక ఆ విషయం చెపుదామని ఆగాను. అనుకున్నట్టే మంచి యూనివర్సిటీ లో సీట్ వచ్చింది. ఒక మంచి బొకే ఆర్డర్ ఇచ్చి కాఫీ షాప్ లో ఎదురు చూస్తూ ఉన్నాను. తను ఆలస్యం చేస్తోంది. బొకే కూడా ఆలస్యం అవుతోంది. నా కోపం ఆ అమ్మాయి మీద చూపించలేను. సో బొకే వాళ్లకి మెసేజ్ చేసి తిట్టాను కానీ అక్కడి నుండి ఒక రిప్లై వచ్చింది ఆ రిప్లై నా జీవితాన్నే మార్చేసింది

ఆ రోజు నేను: మీకసలు టైం సెన్స్ ఉందా నేను ప్రేమించిన అమ్మాయి కి నా ప్రేమ ని ప్రపోస్ చేయాలి. మీరు ఆలస్యం చేస్తున్నారు. సారి అండి your bouquet do not deserve me.

బొకే వాళ్ళు: sir sorry for late. కానీ నా బొకే సంగతి పక్కన పెట్టండి. మీరు ప్రపోస్ చేయాలి అనుకునే అమ్మాయి మిమ్మల్ని deserve చేసుకుందా please check it. (అని మెసేజ్ వచ్చింది . ఆ విషయాన్ని నేను ఇప్పటి వరకు ఆలోచించలేదు. ఆ అమ్మాయి అందంగా బాగుందా, ఆ అమ్మాయి బాగా నవ్వుతుందా. ఇలాంటి విషయాలనే నేను చూసా కానీ ఆ అమ్మాయి నన్ను అర్ధం చేసుకుంటుందా? నా ఇంట్లో వాళ్లతో సరిగ్గా ఉంటుందా? ఆ క్షణం ఈ ప్రశ్నల కి నా దగ్గర సమాధానం లేదు అనే విషయం అర్ధమైంది. జవాబు కోసం ఒక చిన్న అబద్దం ఆడదాం అనుకున్నాను. ఇంతలో తను వచ్చింది.)

తను: హాయ్ సత్య ఏంటి ఎదో చెప్పాలి అన్నావ్?

నేను: ఏమి లేదు! జి.ఆర్.ఈ రిసిల్ట్స్ వచ్చాయి. I am not qualified.

తను: నాకు ముందే తెలుసు ఇవ్వన్నీ అయ్యే పనులు కావు సత్య. లైట్ తీస్కో. ఇక్కడే ఏదైనా జాబ్ చేస్కో.

(ఇలాంటి పరిస్థితి మా అమ్మ కి ఏదురైనప్పుడు, నాన్న ఇచ్చిన ప్రోత్సహం మా అమ్మ ని ఒక మంచి రచయిత్రి ని చేసాయి. మొదటి సారి ఓడిపోయినప్పుడు మనకెందుకులే అని మా నాన్న అనుంటే మా అమ్మ లో ని రచయిత మేల్కొనేవారు కాదేమో. మనలో విజేత మేలుకొల్పేది. మన అనుకునేవారు ప్రోత్సహం నమ్మకం. ఆ రెండు ఆ అమ్మాయి ఇవ్వదు అని అర్ధం అయినా క్షణం అది . నా ప్రశ్న ల కి జవాబు దొరికిన క్షణం అది. చిన్నగా నవ్వుతూ కడదాకా అనుకున్న తనతో ప్రయాణాన్ని కాఫీ తో ముగించి బయటకి వచ్చేసాను. అప్పటి నుండి ఆ అమ్మాయి ఆలోచనలు రాకుండా ఎన్నో పనులు పెట్టుకున్నాను. to be frank చాలా రోజుల తరువాత ఈ రోజే ఫ్రీ గా ఉన్నాను. ).

స్వప్న :సో ఆ రోజు తాలూకు జ్ఞాపకాలు ఇంకేమి లేవన్నమాట మీ దగ్గర .

నేను: ఉంది. ఆ రోజు బయటకి వస్తుంటే వెయిటర్ నేను ఆర్డర్ ఇచ్చిన బొకే ఇచ్చాడు. బహుశా బొకే వాళ్ళు తనకి ఇచ్చారు అనుకుంటా . ఆ బొకే తో పాటు ఒక కవిత రాసుంది . నాకు ఆ కవిత నచ్చి నాతో పాటే దాచి పెట్టుకున్నాను

స్వప్న:నాకు నువ్వు, నీకు నేను అర్థాలవ్వగా . నీ సమేతంగా సాగే నా జీవితాన... సంతోషం శాశ్వతంగా నిలిచిపోదా. ఏ గెలుపైనా నన్ను వరించి రాదా...

(నాతో పాటు ఇన్నేళ్లు ఉన్న కవిత. నా డైరీ లో ని ఎన్నో జ్ఞాపకాలతో సావాసం చేసిన కవిత. ఆ రోజు బొకే తో పాటు వచ్చిన కవిత ఈ రోజు స్వప్న గొంతు నుండి విని ఆశ్చర్య పోయాను . ఇంతలో )

స్వప్న: 5 years బ్యాక్ నేను కొత్తగా బొకే షాపు స్టార్ట్ చేసాను. విషెస్ ని కవితాత్మకంగా రాసి జత చేస్తుండడం తో షాప్ కి మంచి పేరే వచ్చింది. మొదటి నెల అయ్యాక నేను కాలేజ్ నుండి ప్రేమిస్తున్న అబ్బాయికి ప్రపోజ్ చేద్దామని ఒక మంచి బొకే రెడీ చేసి తన ఇంటికి వెళ్లాను. అక్కడికి వెళ్లే సరికి తను ఇంకో అమ్మాయి తో చాలా క్లోజ్ గా ఉండటం చూసి తట్టులోకేపోయాను. కన్నీళ్లు కళ్ళ నుండి దాటబోతున్నాయి. కానీ తన కోసం నేనెందుకు ఏడవాలి తనే నన్ను మిస్ చేసుకున్నాడు. తనే నా ప్రోత్సాహాన్ని నా నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. He does not deserve me అని నాకు నేను అనుకుంటున్నా టైం లో మీ మెసేజ్ వచ్చింది అదే మీకు కూడా చెప్పాను. కానీ కటువు గా చెప్పా అనిపించి మిమ్మల్ని కలిసి బొకే ఇద్దామని కాఫీ షాప్ కి వచ్చాను. కానీ మీరు బాధగా బయటకి రావడం చూసి ఆ టైం లో బొకే అక్కడున్న వెయిటర్ చేత ఇప్పించి వెళ్ళిపోయాను. ఆ తరువాత మీ పక్కింటి లోకి వచ్చిన కొత్తలో ఓ సారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఫోటో చూసి ఇది మీ ఇళ్లే అని అర్ధమైంది. ఆ తరువాత ఆంటీ ద్వారా మీ గురించి ఇంకొంచెం తెలిసింది. ఎందుకో మీరు నా లానే self respected and independent అనిపించింది. ఆంటీ అంటే నాకు ఇంకా ఇష్టం, అభిమానం. తన లాంటి అత్తయ్య, అమ్మాయిల భావనలని ప్రోత్సహించే అంకుల్ లాంటి మావయ్య కన్నా ఒక అమ్మాయి కోరుకునేది ఇంకేం ఉంటుంది . సో మా అమ్మ నాన్నలతో, మీ అమ్మ నాన్నలతో మిమ్మల్ని ఇష్టపడుతున్న విషయాన్ని చెప్పాను వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. మీరు వచ్చేంత వరకు ఎదురుచూద్దామనుకున్నాం . మీరు సడన్ గా వచ్చారు సో నేను సడన్ గా చెప్పేసాను.

(మొదట్లో ఆశ్చర్యం తరువాత ఆనందం. నేను ప్రేమ అనే పదాన్ని వదిలేసి గమ్యం వైపు కి పరిగెత్తితే ఆ ప్రేమ ఒక అమ్మాయి చెంతకు చేరి నాకోసం ఎదురుచూసేలా చేసింది . ఎందరో ఎదురుచూసే క్షణం నాకు కళ్ళ ముందే ఉంది. )

నేను: స్వప్నాన్ని సత్యంగా మలచడమే జీవితం. కడదాకా చేద్దామనుకున్న ప్రయాణాన్ని కాఫీ తో ఆపేసాను. కానీ కాఫీ తో మొదలైన ఈ ప్రయాణాన్ని కడదాకా తీసుకునివెళ్తాను. నేను నిన్ను అర్ధం చేసుకుంటాను. నేను నీతో ఉంటాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

చిలుకూరు నుండి వచ్చిన అమ్మ నాన్నలకు ఈ విషయం చెప్పి, వాళ్ల ఆనందాల నడుమ స్వప్న సమేతంగా నా జీవితాన్ని ప్రారంభించాను.