Contributed By Praveen Kumar Rejeti
"సృష్టి కర్త ఒక బ్రహ్మ...అతడిని సృష్టించినదొక అమ్మ" అంటాడు ఒక రచయిత.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం..ఇది ఆమెను ఏడాది కోసారి పేరుకి గుర్తుచేసుకోటానికి కాదు... ప్రతి క్షణం నీ చుట్టూ ఉండే మహిళ ను గుర్తించి గౌరవించడం కోసం.ఆమె కొత్త లోకం కావాలని అడగడం లేదు...ఈ లోకం లొకి తానూ నీలాగే వచ్చానని...గుర్తుచేస్తోంది. సమానం గా బ్రతికే హక్కు తనకీ ఉందని గద్దిస్తోంది.ఆమె మన జీవితం లో....
అమ్మగా....!
ఆమె మన జీవితం లోనికి ప్రవేసించేది అమ్మగానే...ప్చ్...నిజానికి ఆమె పెట్టిన భిక్ష మన ఈ జీవితం కాదా?
"బిడ్డ అడ్డం తిరిగింది....బిడ్డకు శ్వాస సరిగ్గా అందట్లేదు....ఆపరేషన్ చెయ్యాలి " అని అంటే ...ఆసుపత్రి లో తన వారి అందరి ముందు ఓ చక్రాల మంచం మీద పడేసి బరా బరా ఆపరేషన్ థియేటర్ లోనికి లాక్కుపోతుంటే ....మళ్ళీ తన వారిని,...ఈ లోకాన్ని చూస్తానో లేదోతెలియని ఆ క్షణం లో....తానేమైనా పర్వాలేదు.... బిడ్డను బ్రతికించమని డాక్టర్లను ...భగవంతుడిని మనసారా బ్రతిమలాడేది ఆమె ఒక్కతే.ఆమె ధైర్యానికి జోహార్లు.
చిన్నతనం నుండి పుట్టింట అల్లారుముద్దుగా పెరిగిన సుకుమారి...తన బిడ్డకు ప్రమాదమని తెలిసి తనకి ఇష్టమైన వాటిని త్యాగం చేస్తుంది. అంతెందుకు...ఆకలికి చంటి బిడ్డ ఏడిస్తే...చాటుకి వెళ్లే వీలు లేకుంటే.... పదిమంది ముందు కూడా...కొంగు అడ్డుపెట్టి పాలిచ్చేస్తుంది..అదే ఆమె గొప్పతనం.
ఎక్కడ నుండి వచ్చేస్తుందో అసలు ఆ ధైర్యం... బిడ్డకు దెబ్బ తగిలి గుక్క పెట్టి ఎడుస్తుంటే ...ఇంట్లో ఎవ్వరూ లేకున్నా.. కాసింత కాఫీ గుండ రక్తం ఆగటానికి ఆ దెబ్బపై అదిమి...బిడ్డను ఓదార్చి కాసిన్ని నీళ్లు తాగించి..బాధను దిగమింగుకుని ...పరుగు పరుగున ఆసుపత్రికి వెళుతుంది..పిచ్చి దానిలా కనపడ్డ ప్రతి రాయిని .....మొక్కుతుంది బిడ్డకు నయం కావాలని.
కూతురిగా...!
ఎవడండి చెప్పింది...ఆడ పిల్లలు వద్దని చెప్పే తండ్రి ఉన్నాడని??అసలు అమ్మాయి పుడితే ఎక్కువ సంతోషం తండ్రికే...యెంత మురిసి పోతాడో...??ఎన్నెన్ని కబుర్లో ఆ తండ్రీ కూతురికి...."అమ్మా అమ్మా" అని నోరారా పిలుచుకుని సంబరపడిపోతుంటాడు.వచ్చి రాని మాటలతో ఆ చిట్టి తల్లి చెప్పే మాటలు వింటూ ...గొప్పలు పోతుంటాడు. అమ్మ స్థానాన్ని ఆమె తీసుకుని ...అలసి వచ్చిన తండ్రికి మంచినీళ్లు అందిస్తుంది...అమ్మ పనిలో ఉంటె చిన్ని చేతుల్తో అన్నం వడ్డించేస్తుంది.
ఆ భర్త అంటాడు..."చూడవోయ్...నువ్వూ ఉన్నావు....ఎన్నాడన్న ఇంత ప్రేమగా వడ్డించావా??"అని అంటాడు.
ఎదిగిన కూతురు మొదటిసారి సరదాగా చీర కట్టుకు వచ్చి...నిలుచుంటే.."బంగారు తల్లి ...గుండెల్లో పెట్టుకు చూసుకున్నాను...ఏ ఇంటికెళ్ళి పోతుందో..."అని కన్నీళ్లు తుడుచుని ఆమె తలవంచి నెత్తిపై మూర్ధన్య స్థానమందు ముద్దు పెట్టి...ఆశీర్వదించడా ఆ తండ్రి??
అక్కచెల్లెలి గా....!
ఒక్కదానివే ఎలా వెళ్తావే ....అని అమ్మ అంటే... "తమ్ముణ్ణి తీసుకెళ్తా అమ్మా "అని చెప్పే ఆమె మాటల్లో ధైర్యం ....ఆ తమ్ముడికి 5 ఏళ్ళ వయసే కావచ్చు ...కానీ వాడిలో హీరోయిజం కు అదే నాంది.
ఇహ కాలేజీకి వెళ్లే రోజుల్లో...అన్నదమ్ముడు ఉండే ప్రతి ఆడబిడ్డ కి ...ఆల్మోస్ట్ z సెక్యూరిటీ ఉన్నట్టే...ఆమె భావిస్తుంది.
ఒప్పుకోవాల్సింది ఏమిటంటే...చాల సమయాల్లో కొట్టుకు చచ్చినా...అక్కచెల్లెళ్లే మనకి గొప్ప సలహా దారులు..మనకి perfect ఫ్యాషన్ డిజైనర్లు.
భార్యగా ....!
ముక్కూ మొహం తెలియకున్నా....కేవలం నీ కుడి చేయి చిటికెన వేలు చివరంచు పెట్టుకుని ...తన అన్న వాటిని అన్నింటిని వదిలేసి...జీవితాన్ని....సర్వస్వాన్ని ధారపోయడం లో ఆమె కు సాటి ఎవరు?
కార్యేషు దాసీగా...కరణేషు మంత్రిగా... భోజ్యేషు మాతగా.... శయనేషు రంభగా.. క్షమయా ధరిత్రి గా ...నీ యింట లక్ష్మి గా... ఆమె ఒకరిగా ఉంటూ అనేక బాధ్యతలను అంది పుచ్చుకుంటుంది.
ఇంటిని ఒంటి చేతితో చక్కబెడుతూనే భర్తతో సమానంగా తానూ తన చదువుకు తగ్గ ఉద్యోగాన్ని పొంది ...సంపాదనలు తోడైతే కుటుంబ ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుందని...శ్రమించే ఆమెకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలి.అసలు నిజం చెప్పండి ...ఆమెకి weekend అంటూ ఉంటుందా?
భర్త జీతం కన్నా తన జీతం ఎక్కువైనా....ఆయన భార్యగానే ఆమెను గుర్తించడం లో ఎక్కువ సంతోషాన్ని పొందుతుంది.ఎవరెన్ని చెప్పినా....తన భర్త "బావుంది" ..అనే మాట ఆమె కు గొప్ప బహుమతిగా భావిస్తుంది.అవసరం లేకున్నా అతని నిర్ణయానికి గౌరవాన్ని ఇచ్చి చాలా విషయాల్లో ఒక అడుగు ఆగిపోతుంది.
ఒక గొప్ప రచయిత అన్నట్టు ఈ భూమికి నిజమైన భారం ఏమిటో తెలుసా? "One who says thanks to his mother and wife ". ఏమిచ్చి అమ్మ ఋణం తీర్చుకోగలవు?? ఏమిచ్చి భార్య ఋణం తీర్చుకోగలవు??
చివరి మాట గా...!
ఈరోజున ఆమె ప్రపంచ విజయాల్లో...అగ్ర స్థానాల్లో...నిలుచుంది...అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంది.చీకటి పొయ్యిల జీవితాలను అణచివేసి వెలుగుల లోకాన్ని అధిగమించింది. మనం గుర్తు పెట్టుకోవాల్సింది..... లక్ష్మి లేకుండా విష్ణువు లేడు... శక్తి లేనిదే శివుడు లేదు.... జ్ఞానం లేనిదే సృష్టి లేదు. అంటే త్రిసక్తి స్వరూపం లేనిదే సృష్టి ...స్థితి ...లయ లేవు. విద్యుత్ శక్తి లేని వట్టి తీగ కు విలువలేదు. ఆమె లేని మన జీవితానికి అర్ధం లేదు. ఆమె లేనిదే అసలు జీవితమే లేము. ఆమె ప్రేమ మనకు దీవెన... ఆమె మాట మనకు బలం. ఆమె కన్నీరు మనకే ప్రళయం. ఆమె ఆదరణ మనకు ధైర్యం. ఆమె ధైర్యమే దేశానికి ..భూమికి శ్రీరామ రక్ష. ఆడకూతురా....నీకు అడుగడుగునా వందనం. మనం ఆమెకు గుడి కట్టక్కర్లేద్దు
కానీ.. అన్నీ తెలిసిన మగాడు... కొన్ని సమయాల్లో "నేను మగవాడి" అనే మృగాన్ని తనలో నిద్దుర లేపకుండా ఉంటే అదే మహిళకు మనం చేసే పట్టాభిషేకం. ఆమెను ...ఆమెగా గౌరవించుకుంటే....మనతో సమానంగా మనసా ....వాచా ...కర్మణా భావన చేసుకుంటే అదే ఆమెకు గజారోహణం...