గొప్ప పుణ్యక్షేత్రాల దర్శనానికి ముఖ్యంగా రెండు బలమైన కారణాలుంటాయి.. ఒకటి.. భక్తితో ప్రతిమ రూపంలో ఉన్న దైవాన్ని మనసారా దర్శించడం కోసం, రెండు.. మనకున్న రోజువారి ఒత్తిడుల నుండి కాస్త ఉపశమనం పొందడానికి, అక్కడి ప్రకృతి రమనీయతను చూసి పరవశించడానికి.. చాలా వరకు ఇవే కారణాలతో వెళ్తుంటాం కాని ఆ భక్తికి, ప్రశాంతతకి, సాహసం కుడా తోడయితే..? చాలా బాగుంటుంది కదా.. ఈ మూడు అనుభూతులు కలగలిసిన దివ్య దేవాలయమే సలేశ్వర దేవాలయం. మన మూడు తెలుగు ప్రాంతాలను(తెలంగాణ, ఆంద్ర, రాయలసీమ) కలుపుతూ వేల కిలోమీటర్లు విస్తరించిన దట్టమైన నల్లమల్ల అడవిలో ఉంది ఈ దేవాలయం.
ఈ గుడి చేరుకోవడం ఓ చిన్నపాటి సాహస యాత్రలా ఉంటుంది. ఈ గుడిని చేరుకోడానికి మన మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం ఫరహాబాద్ చౌరస్తా నుండి సుమారు 30కిలోమీటర్ల వరకు దట్టమైన అడవి మధ్య నుండి ప్రయానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడు నడక మార్గాల ద్వారా గర్భగుడిని చేరుకోవచ్చు. ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి, నింగి నుండి వస్తున్నటువంటి జలపాతాలు, చల్లని వాతావరణంలో ఈ సాహస ప్రయానం సాగుతుంది. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పూర్వం పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం ఉన్నారని, వారే మహాశివుడిని పూజించుకోవడం కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారని స్థానికుల కథనం. ఇక్కడ స్థానిక గిరిజన తెగ చెంచులు వారి సాంప్రదాయానుసారం పూజలు నిర్వహిస్తారు.
నార్త్ లోని అమర్ నాథ్ యాత్రను తలపిస్తున్న ఈ గుడిని చేరుకోవలంటే సంవత్సరంలో కేవలం 5రోజులు మాత్రమే అనుమతిస్తారు. ఈ ప్రాంతానికి చైత్ర శుద్ధ పౌర్ణమి పర్వదినాలలో మాత్రమే అనుమతిస్తారు. ఏటా జరిగే ఈ ఐదురోజుల జాతరకు భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. మావోయిస్టులు, క్రూరమృగాలు సంచరించే ప్రాంతం కావడంతో అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటారు. చలివేంద్రాలు, అన్నదానం, వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, ప్రత్యేకంగా అంబులెన్స్‌ను కుడా ఏర్పాటు చేస్తారు. మండు వేసవిలో ఈ జాతర జరిగినా కూడా మిగిలిన ప్రాంతాలలో నీటి కష్టాలు అధికంగా ఉన్న కూడా సలేశ్వరంలోని జలధార మాత్రం ఎప్పటికి ఆగకుండా నేలను తాకుతుంటుంది..
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.