Chai Bisket’s Story Series – రుద్ర (Part – 8)

Updated on
Chai Bisket’s Story Series – రుద్ర (Part – 8)
జరిగిన కథ: Part - 1 Part - 2 Part - 3 Part - 4 Part - 5 Part - 6 Part - 7 పక్కన ఉన్న కుర్రాడు కుడా రుద్రని పొడుస్తాడు. ఎవ్వర్రా మీరు ? అని వాళ్ళ కాలర్ పట్టుకొని అడుగుతుంటాడు రుద్రా, ఈ లోపు దూరం నుండి గణ, మణి, శివ తో పాటు ఇంకొంతమంది మనుషులు జీప్ లో అరుచుకుంటూ వస్తుంటారు. వాళ్ళ దగ్గరి నుండి కత్తులు కిందకి పడేసి, వాళ్ళిద్దరి మెడను రెండు చేతులతో పట్టుకొని నిలబడతాడు రుద్ర. వాళ్ళిద్దరూ, రుద్రచేతి నుండి విడిపించుకొని, రుద్రను వెనక్కి తోసేసి, బురదలో పడిపోయిన కత్తుల కోసం వెతుకుతుంటారు. బురదలో పడిన రుద్ర లేచేలోపు, వాళ్ళకి కత్తులు దొరుకుతాయి. రుద్ర బాధగా పైకి లేస్తుంటే, వాళ్ళిద్దరి తలనుండి బులెట్ వెళ్ళిన గుర్తునుండి రక్తం కారుతూ, రుద్రకి కుడివైపుగా ఒకడు, ఎడమవైపుగా ఒకడు పడిపోతారు. రుద్రకి మూడడుగుల దూరంలో ఎదురుగా, పొగొస్తున్న గన్ పాయింట్ చేస్తూ గణ నిల్చొని ఉంటాడు. వీడెవడు అంటూ ఎడమవైపుగా పడిపోయిన కుర్రాడని చూపించి అడుగుతూ మోకాళ్ళ మీద పడిపోతాడు రుద్ర. రుద్రని తీసుకొని హాస్పిటల్ కు వెళ్తారు. ప్రధమ చికిత్స తర్వాత, కుట్లు వెయ్యటం అయ్పోయాక, వాణి, పిల్లలు అందరితో మాట్లాడటం అయ్యాక, పోలీసులు వచ్చి వివరాలు తెలుసుకొని వెళ్ళిపోయాక, గణ ని పిలిస్తాడు రుద్ర. ఎవరు గణ? “వీరబాహుడి కొడుకు వీరభద్రుడు, రాంజీ సేట్ కొడుకు ఆర్యన్”. నేనా ముసుగు వదిలేసొచ్చి పదేళ్ళు దాటిపోయింది గణ, ఇప్పుడు ఎందుకు జరిగింది ? “కాలం కన్నా. నువ్వు వదిలిన ముసుగు వదిలిన గురుతులు వెతికే వాళ్ళు ఉంటారు కదా. ఐనా, వదిలేసి వెళ్ళడానికి అది ఉద్యోగం కాదు, అధికారం. లక్షల మంది జనం నువ్వు కావాలని కొరుకుంటూ, నీకు చెప్పకుండా కట్టబెట్టిన అధికారం. నువ్వు కేవలం మామూలు వ్యక్తివి కాదు, రుద్ర అంటే ఆపదలో తోడుంటాడనే నమ్మకం, బాధల్లో సేదతీర్చే ఓదార్పు, కష్టాల్లో తోడుండే స్నేహం, ఆనందాలు దగ్గర చేసే ఆప్యాయత, రక్తం పంచుకోని బంధం, అందరి హృదయాల్లో మెదిలే ప్రాణం.” ఏం మాట్లాడుతున్నావ్ గణ ? “నన్ను క్షమించు రుద్ర.” దేనికి ? “నీ గురించి తెలీక, రుద్ర స్థానం కావాలని కోరుకున్నాను, చెడు తలపెట్టాను ఒకప్పుడు”. గతంలో జరిగిన పొరపాట్లకు ఇప్పుడు మన్నింపులు ఎందుకు ?. “ఇప్పటివరకు సమయం దొరకలేదు, ఇప్పటికి చెప్పకపోతే ఎప్పటికి చెప్పలేనేమో”. హ్మ్, రాంజీ సేట్ కొడుక్కి నన్ను చంపాల్సిన అవసరం ఏముంది ? “పగ. పగ కన్నా. పగ” అంటూ టక్కరిగా చెప్తాడు గణ. మొదట అర్ధం కానట్టు, గణ వైపు చూసి, కొన్ని క్షణాల్లో ఎదో తట్టినట్టుగా ఎందుకు చంపారు గణ ? రాంజీని ఎందుకు చంపారు? అని గంభీరంగా అరుస్తాడు రుద్ర. “చేయక తప్పలేదు”. యే? అని ఆలోచిస్తూ... అనుమానంగా గణ వైపు చూస్తూ... కొన్ని నిజాలు గొంతు దాచకుండా ఆపడానికి, ఊపిరి ఆపటం కరెక్ట్ కాదేమో గణ. “జరిగిన వాస్తవం తెలీకుండా, అభిప్రాయం చెప్పటం కూడా కరెక్ట్ కాదేమో కన్నా”. ఏం జరిగింది ? అని అడగ్గానే, గణ చెప్పటం మొదలెడతాడు. గణ... నువ్వనుకుంటునట్టు, నేను రాంజీని కారణం లేకుండా, నేను చేసింది చెప్తాడనో ఏం చంపలేదు కన్నా. నీకు గుర్తుందా, ఆ రోజు మార్కెట్ యార్డ్లో కొట్టారు. అక్కడికి నిన్ను తీసుకెళ్ళింది నేను, అప్పుడు రుద్ర స్తానం కావాలనే దురశాలో. ఆ తర్వాత నువ్వు వాణితో కలిసి ఇటు వచ్చేసావ్. ఆ తర్వాత చాలా విషయాలు జరిగాయి కన్నా. మూర్ఖుడి మొండితనం, బలవంతుడి ధైర్యం కన్నా చాలా ఎక్కువ కన్నా. మార్కెట్లో జరిగన విషయం రాంజీ అస్సలు మర్చిపోలేదు. నీకు ద్రోహం చేసినా - నన్ను నువ్వు చేరదియ్యటం, అంత కొట్టినా నువ్వు బ్రతకటం రాంజీకి నచ్చలేదు. నువ్వు ఇక్కడికి వచ్చెయ్యటం వాడికి ఆనందాన్ని ఇచ్చినా, నీమీద జనంలో ఉన్న అభిమానం వాడ్ని నిద్రపోనివ్వలేదు. ఇంతకాలం ఎంతమంది నిన్ను చంపాలని వచ్చారో, నీకోసం ఎంతమందిని చంపెసామో నీకు తెలీదు. నువ్వు ఎప్పటికైనా వస్తావ్ అనే నమ్మకంతో ధైర్యంగా ఉన్నారు జనాలు. ఆ నమ్మకం రాంజీలో మృగాన్ని రెచ్చగొట్టింది. నిన్నేం చేయలేక, మేమెవ్వరం లేని సమయంలో నానాని చంపాలని ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు మేము అనుకోకుండా, వెళ్ళటం వలన నానాని కాపాడుకోగలిగాం.” నానా పేరు వినగానే... నానాకి ఏం అవ్వలేదు కదా అని అడిగాడు రుద్ర. “ఇది జరిగి చాలాకాలం అయ్యింది కన్నా. నానాకి ఏం అవ్వలేదు. వాడి అహం నీ ఊపిరి వేడిని తట్టుకోలేకపోయింది, ఎప్పుడెప్పుడు చల్లార్చాలా అని రగిలిపోతుండేది. నీకోసం, నానా కోసం రోజుకో ఆలోచనతో వచ్చేవాడు. వాడేలా వస్తాడా, ఎలా ఆపాలా అని కొన్నిసార్లు విపరీతంగా ఆలోచించేవాడిని. చివరికి నిన్ను, నానాని ఇద్దరిలో ఒక్కరికే రక్షణ ఇవ్వగలం అనిపించింది నాకు. రాంజీకి మనం భయపడకపోయినా, వాడున్నంత కాలం మీకు ఏం జరుగుతుందో అనే ఆలోచన నన్ను నిస్సహాయుడ్ని చేసింది. ఎక్కువ ఆలోచించలేదు, వాడివల్ల వాడి కుటుంబానికి తప్ప ఎవ్వడికీ ఉపయోగం లేదు కదా, పైగా నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకే తప్పలేదు.” వాడి వల్ల ఎవ్వడికీ ఉపయోగం లేకపోవచ్చు, వాడెంత వెధవైన అయ్యుండొచ్చు కాని, వాడేం చేస్తాడో అనే భయం వలన చంపటం...ఛా! తప్పు గణ, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. యే ? మనవేనా ప్రేమలు వాళ్లవి కావా ? మనకేనా బంధాలు వాడికి లేవా ? మనవేనా ప్రాణాలు వాళ్ళవి కావా ? ఇలా జరుగుతుందని నాకు చెప్పుండాల్సింది గణ. తప్పు చేసావ్, నువ్వు చంపింది రాంజీని కాదు గణ, ఓ కుటుంబాన్ని, ఓ తరాన్ని. “మండువేసవి సెగ, నీడలో కూర్చొని మాట్లాడేవాడికి కాదు కన్నా, మిట్ట మధ్యానం చెప్పుల్లేకుండా నడిచినవాడికి తెలుస్తుంది.” ఎండ సెగ ఎక్కువుంటే చెప్పులేసుకుంటాం – గొడుగు తీసుకెళతాం కాని, సూర్యుడ్ని చంపాలని చూడం కద గణ. “ఏమో, సాధ్యం అయితే అదే చేస్తామేమో. నువ్వు నన్నో దోషిలా చూసినా, ఎటువంటి శిక్ష వేసినా నాకు ఆ సమయంలో అదే కరెక్ట్ అనిపించింది, చేసాను. అది కూడా నీకోసం. నువ్వు నా మీద చూపిన దయకి కృతజ్ఞత.” హ్మ్. నిబద్దత – కృతజ్ఞత. హ, హా...నా ప్రమేయం లేకుండా హంతకుడ్ని చేసావ్ కద గణ. “నాకు నానా, కన్నా తప్ప మరే బంధం లేదు. వాళ్ళకి ఆపద తలపెట్టేవాళ్ళని లేకుండా చేయడమే కర్తవ్యంగా తోచింది.” తెలుసు గణ, కాని వాళ్లకీ బంధాలు ఉంటాయ్ కద. “రాముడికి ఆపద కలుగుతుందంటే, హనుమంతుడు కూడా ఆలోచించడేమో కన్నా”. కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు. నర్సు వచ్చింది, భోజనం పెట్టి, మందులు వేసి, ఇంజక్షన్ చేసింది రుద్రకి. నర్సు వెళ్ళాక... రుద్ర - వీరభద్రుడి కథేంటి ? “వాడా... ఆ రోజు నిన్ను ప్రశ్నించాడు గుర్తుందా(ఆ అన్నట్టు తలూపుతాడు రుద్ర). వాడే వీడు.” తండ్రి ఆత్మకు శాంతి చేయటానికి వచ్చాడా.ఇంకెంతమంది ఉంటారు...నా గతం గురుతులని వెతుకుతుంటు వస్తున్న అన్వేషకులు. “హా, హా... ఉంటారు. వేళ్ళమీద లేక్కేట్టెంత మంది తెలిసినవాళ్ళు, ఊహకందనంత మంది తెలీనివాళ్ళు”. హ, హ, హ... అంటూ రుద్ర మనస్పూర్తిగా నవ్వుతుంటే... “ఎంతకాలం కన్నా ?”. రుద్ర కొద్దిసేపు ఆలోచించి... మనలాంటి వాళ్ళు లేకుంటే జనాలకు ఇబ్బందులేం ఉండవ్ కద గణ, మన అవసరం ఉందంటావా? “ఇబ్బందులు పెట్టేవాడు ఉన్నంతకాలం, తీర్చేవాడు కూడా ఉండాలిగా.” ఇప్పుడు పెద్ద ఇబ్బందులేమి లేవు కదా. “కళ్ళు మూసుకొని లోకం మాయమైయ్యిందనుకోవటం అమాయకత్వం కన్నా.” కంటికి కనిపించని లోకం ఉన్నా, లేకున్నా వ్యత్యాసం ఏముంది గణ. “అదే లోకంలో నానా, మేము ఉన్నాం కదా. నువ్వు వదిలేస్తున్నా అన్నప్పుడు, ఎందుకు? అని అడగలేదు. ఇన్నాళ్ళు నిన్ను రమ్మని పిలవలేదు. ఇప్పుడు రావాలని కోరుకుంటున్నాం అంటే, కారణం చెప్తే కాని అర్ధం చేసుకోలేవని అనుకోవట్లేదు”. నాకొంచెం సమయం ఇవ్వు. ఆ తర్వాత రుద్ర డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తాడు. వాణికి చెప్తాడు. నానాని అడుగుతాడు. పట్నం వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కుటుంబం(చెల్లెలి కుటుంబంతో సహా) మొత్తం తీసుకొని, పట్నం వెళ్తాడు. అప్పటికే తప్పులు చేస్తున్న అందరిని పిలిపిస్తాడు.వినేవాడికి మర్యాదగా చెప్తాడు, విననివాడిని వినేలా చేస్తాడు, వినిపించుకోలేని వాడిని ఇంకెవరికి వినపడకుండా చేస్తాడు. పోలీసులు, ప్రభుత్వం అంతా రుద్ర చెప్పినట్టు చేస్తుంటారు. ప్రజల్లో రుద్రాకుండే అభిమానం రోజు రోజుకు పెరిగిపోతుంటుంది. ఏ తప్పు జరిగినా, ఏ సాయం కావాలన్నా, ఎవరికీ న్యాయం జరగాలన్నా ఎక్కే గడప రుద్ర ఇళ్ళు – తీర్చే వ్యక్తి రుద్ర. తన వలన ఇబ్బందిపడిన ప్రతీ ఒక్క కుటుంబాన్ని తనవాళ్ళు గా చేసుకుంటాడు రుద్ర. రాంజీ సేట్ కూతురు పెళ్లి చేస్తాడు. ఖాదర్ భాయ్ కొడుకుని సొంత కొడుకులా చూసుకుంటాడు. రుద్రకు ఎదురు దాదాపు ఎవ్వరు లేకుండా చేస్తారు గణ వాళ్ళు. కొంతకాలానికి నానా కాలం చేస్తాడు. రుద్ర పిల్లలు పెద్దోళ్ళు అవుతారు. కొన్ని సంవత్సరాల తర్వాత... రుద్ర వాళ్ళ ఇంట్లో వాణి కొడుకు పెళ్లి జరిగిన తర్వాతి రోజు. చుట్టాలు, బందువులు, అతిధులు, ఆహుతులతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఆ సమయంలో, గేటు దగ్గర రుద్ర వయసు ఉన్న విలేఖరిని ఆపుతారు రుద్ర మనుషులు. తను ఏం చెప్పినా, ఎంత చెప్పినా వినకుండా లోపలకి వెళ్ళకుండా అడ్డుకుంటారు. కొద్దిసేపటికి ఇంట్లోండి ఒకతను బయటకు వచ్చి, ఆమెని లోపలకి పంపండి అని చెప్తాడు. ఆ విలేఖరి లోపలకి వెళ్తుంది. అతను ఆమెని నేరుగా రుద్ర దగ్గరికి తీసుకెళతాడు. రుద్ర, విలేఖరి తప్ప ఎవ్వరు ఉండరు ఆ గదిలో. తను కూర్చొని, ఆమెను కూర్చోమంటాడు రుద్ర. హ్మ్, ఏంటి, చాలా ఏళ్ళ తర్వాత కనిపిస్తున్నావ్ ? “నీకో... మీకో నిజం చెప్పుదామని వచ్చాను.” నువ్వు విలేఖరి కవిత కాదు, స్పెషల్ పోలీస్ స్నిగ్ద అనేది కాకుండా ఇంకేదైనా ఉంటె చెప్పు. ఆశ్చర్యపోయిన తను “నీకా విషయం తెలిసే, నాకు అన్ని విషయాలు చెప్పావా ?”. హ్మ్. “ఇన్ని ఏళ్ల నా కష్టానికి ఇన్నాళ్టికి ఓ గుర్తింపు దొరికింది.” ఏంటి ? “నీ మీద అరెస్ట్ వారెంట్ సంపాదించాను.” ఏ తప్పు చేసానని ? “ఏం చేయలేదని ?”. కాలులో గుచ్చుకున్న ముళ్ళుని మరో ముళ్ళుతో తీసినంత మాత్రాన, రెండూ చెడ్డవి కావు కదా. “చట్టానికి సాక్ష్యాలు, ఆధారాలతోనే నడుస్తాయి. వాస్తవాలు, భావాలతో అవసరం లేదు.” అంత స్పష్టమైన అభిప్రాయం ఉన్న మీకు నేనేం చెప్పలేను. సరే... వారెంట్ తో వచ్చావు...వచ్చారు కదా. పదండి. “ఇంత సులువుగా మిమ్మల్ని తీసుకెళ్లనిస్తారా మీవాళ్ళు”. నేను ఉన్నాను కదా, ఓ గంట ఆగి బయలుదేరుదాం అని చెప్పి బయటకు వస్తారు ఇద్దరు. కవితని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు పరిచయం చేస్తాడు. భోజనం అయ్యాక, కార్ తియ్యండి అంటాడు రుద్రా. కవిత, రుద్ర కార్ లో కూర్చొని న్యాయస్థానానికి వెళ్తారు. పోలీస్ స్టేషన్ కి కదా తీసుకెళ్ళాలి, న్యాయస్థానానికి ఎందుకు వచ్చాం అనే సందేహం లో చూస్తాడు రుద్ర. “మిమ్మల్ని ఏ స్టేషన్ లోను ఉంచటం కుదరదని, ఇక్కడికి తీసుకొచ్చాం.” ఈ లోపు రుద్ర కొడుకులు, గణ, న్యాయవాదులు వస్తారు. వాదోపవాదాలు జరుగుతాయి, రుద్ర మీద చేసినవన్నీ ఆరోపణలే తప్ప సాక్ష్యాధారాలు లేనందున కొట్టివేయటం జరిగిందని తీర్పు వస్తుంది. రుద్ర న్యాయస్తానానికి వచ్చిన విషయం తెల్సి భారీగా జనం వస్తారు అక్కడికి. రుద్ర బయటకు వచ్చే సమయానికి పెద్ద వర్షం మొదలవుతుంది. న్యాయస్థానాన్ని మూడంచెల వలయం లా చుట్టేసి కాపలాకాస్తున్న రక్షకభటులు, ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నా మూడో వలయం ఆవల ఇసుకేస్తే రాలనంత మంది జనం, ఉరుములు, మెరుపుల తో పోటీ పడుతూ ఆకాశాన్ని హడలెత్తించేలా జనం చేస్తున్న నినాదం, వర్షం దాటికి గొడుగులు తడిచిపోతున్నా పట్టకుండా మొదటి వలయం ఆవల నుండి కెమెరా కళ్ళతో తీక్షణంగా చూస్తూ, మైక్ నోటితో విరుచుకుపడే క్షణాల కోసం ఎదురుచూస్తున్న విలేకరులు, న్యాయస్థానం సింహద్వారానికి ఎదురుగా నిశబ్దంగా-ఘభీరంగా రాజసంతో వెలిగిపోతున్న రోల్స్ రాయిస్ ఫాంటమ్, సింహ ద్వారం నుండి నడుచుకుంటూ వస్తున్న కొంతమంది మనుషులు, న్యాయవాదులు, పోలీసులు. ఇంత మంది మధ్యలో సాదా సీదా నార చొక్కా - పంచెతో, నెరిసిన గడ్డం - జుట్టుతో, పసి పిల్లాడిలా నవ్వుతూ వస్తున్న వ్యక్తి ని చూడగానే కెమేరా కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఆ క్షణాన్ని బందిస్తుంటే, రుద్ర, రుద్ర ... రుద్ర అనే నినాదం దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనిస్తుంటే, రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెడుతూ ఫాంటమ్ ఎక్కి కూర్చుంటాడు రుద్ర. కథ సమాప్తం :)