Chai Bisket’s Story Series – రుద్ర (Part – 7)

Updated on
Chai Bisket’s Story Series – రుద్ర (Part – 7)
జరిగిన కథ: Part - 1 Part - 2 Part - 3 Part - 4 Part - 5 Part - 6 రుద్ర వాణి నడుం మీదుగా చేయివేస్తే, రుద్ర భుజం మీద తలాన్చి నడుస్తుంది వాణి. ఇంతకీ నీ పేరేంటి ? అని అడిగాడు రుద్ర. నడవటం ఆపేసి, ఆశ్చర్యంతో కూడిన సంశయంతో, కనీసం నా పేరు కూడా తెలీదా?, అన్నట్టు రుద్ర వైపు చూసింది వాణి. తెలీదు, నీ పేరేంటి ? అని అడిగాడు రుద్ర. “పేరు తెలీకుండానే అంతలా ప్రేమించావా ?” అని అడిగింది వాణి. సమాధానం తెలిసి కూడా అడుగుతున్నావ్ అంటే, నువ్వు అడిగిన ప్రశ్నకు అర్ధమే లేదు. “పేరు కూడా తెలీకుండా ప్రేమిస్తారా ఎవరైనా ?”. మనసు నిన్ను చూడగానే నన్ను మరచిపోయింది, కనులు నీ రూపం తప్ప మరో దృశ్యం చూడమని భీష్మించుకు కూర్చున్నాయి, కాళ్ళు నీవెళ్ళే దారి తప్ప మరో మార్గంలో కదలమూ అన్నాయి, వీటి మధ్యలో నీ పేరు అడగాలనే ఆలోచన వచ్చిందేమో కాని, మనసు చేసిన మాయలో, మొదటిసారి కలిగిన హాయిలో పట్టించుకోలేదు. యే! ప్రేమించటానికి పేరుతో పనేముంది. “నిజంగానే నా పేరు తెలీదా నీకు ? అంటే, నీది ప్రేమ కాదేమో. నా దేహం మీద మోహాన్ని, ప్రేమని భ్రమిస్తున్నావేమో. నా శరీరం కోసమే నీ తపన ఐతే, దానికోసం ఇంత నాటకం అవసరం లేదు.” అదే నాకు కావలసినది ఐతే, ఇంతకాలం వృధా చేస్తానా? పేరు తెలీదని సరదాగా అన్నాను, పేరు తెలీకుండా నీ గురించి పూర్తి వివరాలు ఎలా తెలుసుకోగలను. “హమ్మయ్య! బతికించావ్. చాలా ఏళ్ల తర్వాత, మొదటిసారి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తావేమో అని భయమేసింది.” నువ్వు సాధారణంగా ఎవ్వరిని నమ్మవనుకుంటా. “ఎలా నమ్మగలను. తోడులేని ఆడదాని వైపు అవకాశం కోసం ఆశగా చూస్తున్న కనుల మధ్యలో ఎక్కడో ఓ మూల ప్రేమ కురిపించే కళ్ళు ఉన్నా కానరావు.” చూడాలన్న కోరిక ఉండాలే కాని, కనుక్కోవటం పెద్ద కష్టమేమి కాదు. “చేస్తే కాని తెలీదు కష్టం, మోస్తే కాని తెలీదు బరువు. ఒడ్డున నిల్చొని, లోతు పెద్దగా లేదు అనటం అమాయకత్వం”. ఏది మోసినా, ఎంత చేసినా... ఉన్నది కాదు కావలనుకున్నదే చూస్తాం, అన్నది కాదు వినాలనుకున్నదే వింటాం. అందుకే ఎప్పుడో చెప్పారు మన పెద్దవాళ్ళు, ఏదైనా చూసే దృష్టిని బట్టే ఉంటుంది బుజ్జమ్మా. బుజ్జమ్మా అని వినపడగానే ఆ పేరు తనకెలా తెలుసా అన్నట్టు రుద్ర వైపు చూసింది వాణి. ఏంటలా చూస్తున్నావ్, బుజ్జమ్మా అనే పేరు నాకెలా తెలుసనా. నీ గురించి మొత్తం తెలుసు బుజ్జమ్మా. నిజానికి నీకు తోడుగా ఉండాలని నిశ్చయించుకోవడానికి అదే ముఖ్య కారణం. “హ్మ్! ఆకతాయివి ఆలోచన లేకుండా వెంటపడుతున్నావ్ అనుకున్నాను. అన్నీ ఆలోచించే వచ్చావ్ అన్నమాట. నన్ను చూస్తేనే నీకు సమయం తెలీకుండా గడిచిపోతుందా?” హ్మ్. “మరి అలాంటప్పుడు చూస్తూనే బతికేయొచ్చు కదా, ఇదంతా ఎందుకు ?” నీళ్ళ వైపు ఎంతసేపు చూసినా దాహం తీరదు కదా. “నీళ్ళ సౌందర్యానికి ముగ్ధుడైన మనిషికి దాహమెక్కడిది ?” అంతసేపు కన్నార్పకుండా చూస్తుంటే దాహం వేయదా. “హా హా హా...”. మరి ఇప్పుడు మన కలయిక సంగామమా లేక సంకరమా ? “జీవితాంతం జరగాల్సిన సంబరం”. ఈలోపు వాణి వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. గేటు తీసి, ఇంటి తాళం తీసి లోపలకి వెళ్తారు ఇద్దరు. అదేంటి ఇంటికి తాళం వేశావ్, మీ బామ్మ ఉండటం లేదా నీతో ? “లేదు.” ఎక్కడికి వెళ్ళింది, నిన్ను ఒంటరిగా వదిలేసి. రుద్ర అలా అడగ్గానే వాణి కళ్ళలో నీళ్ళు చేరుకున్నాయి. రుద్రకు విషయం అర్ధమైయ్యింది. ఎప్పుడు జరిగింది ? “ఏడాది దాటిపోయింది. అదంతా ఎందుకులే కాని, వెళ్ళు స్నానం చేసిరా. ఈలోపు వంట చేస్తా”. ఒక్క నిమిషంలో వస్తా, నేనూ ఓ చెయ్యేస్తా. “సరేలే... ఇదిగో తువ్వాల, అదిగో ఆ వైపుగా ఉంది స్నానాల గది”. ఆ తర్వాత వాణి వంట, స్నానం పూర్తి చేసి వచ్చేలోపు రుద్ర ముందు గదిలో ఉన్న అల్మారలోని పుస్తకాలను తిరగేస్తున్నాడు. “రుద్రా... రుద్రా, ఓ సారి ఇటు రా” అని వెనుక గది నుండి పిలిచింది వాణి. పుస్తకం పక్కన పెట్టి, ఏమైందా అని వెళ్లి చూసాడు రుద్ర. తల ఎండటానికి తలకు ముడిలా కట్టిన తువ్వాలు, గోధుమరంగు నార చీర, ముఖం తూడ్చుకోకుండానే బొట్టు పెట్టడం వలన నెమ్మదిగా విచ్చుకుపోతున్న కుంకుమతో అద్దం ఎదురుగా నిల్చొని, చేతులతో వెనుక వైపుగా ఉన్న చివరి రెండు హుక్స్ పెట్టలేక అవస్థ పడుతుంది వాణి. రుద్ర గుమ్మ దగ్గరే నిల్చొని చూస్తున్నాడు. “ఏంటి అలా నిలబడిపోయావ్, పిల్చింది దేనికి అనుకున్నావ్. రా” అంటూ అధికారంగా పిలిచింది వాణి. రుద్ర వాటిని పెడుతూ, ఇన్ని రోజులెవరు సాయం చేసారు మరి. “ముందువైపుకి ఉండే వాటిని వేసుకునే దానిని.” మరి ఈ రోజెందుకు ఇవి. “నాతో చెప్పించాలని అడుగుతున్నావా ? నీకు తెలీక అడుగుతున్నావా ?” నువ్ చెప్తే తెలుసుకుందాం అని అడుగుతున్నా. “ఔనా! అయ్యో పాపం, ఏమి తెలీని చంటిపిల్లోడు కదా.” ఔననట్టు తలూపుతున్నాడు రుద్ర, వాణి వెనుకగా నిల్చొని. “బుజ్జి బంగారం, ఇప్పటికే చీకటైపోయింది పదమ్మా బువ్వ తిని బజ్జుందాం”. నిజమే, పద బుజ్జమ్మా బాగా ఆకలేస్తుంది అంటూ మధ్య గదిలోకి వెళ్ళాడు రుద్ర. భోజనం చేస్తూ... “అందరూ నిన్ను కన్నా, కన్నా అంటారు ఎందుకు ?” అని అడిగింది వాణి. రుద్ర తన కథంతా చెప్పి... నన్ను, చెల్లిని నానా మొదటిసారి వాళ్ళింటికి తీసుకెళ్ళినప్పుడు భయంతో సరిగ్గా మాటలు రాక, చెల్లి నా చేయి పట్టుకొని కన్నా, కన్నా అని తిరిగేది. ఆ తర్వాత తనకి అన్నా కాస్త, కన్నా గా మారింది. ఆ విషయం తెలిసిన వాళ్ళందరూ అలానే పిలుస్తారు. “ఓహ్, శంకరన్నని నానా ఏంటి మరి ?” రుద్ర సమాధానం చెప్పబోతుంటే పొర పోతుంది, దగ్గుతుంటే... “చిన్నగ, చిన్నగ” అంటూ తల మీద నెమ్మదిగా కొడుతూ నీళ్ళు అందిస్తుంది వాణి. నానా కదా, ఏమో తెలీదు చిన్నప్పటినుండి అలా అలవాటయ్యింది. ఓ సారి శంకరన్నే చెప్పినట్టు గుర్తు, ఏమని పిలవాలి అంటే నాన్న అని పిలవండి అనుంటాడు. మేము దాన్ని నానా చేసేసాం. “నీ వయసెంత ?” ఇప్పుడు ఎందుకు ? “చెప్పటం వలన పోయేదేం లేదు లే, చెప్పు పర్లేదు”. ఓ 26 ఉంటాయేమో. “నా వయసెంతో తెలుసా ?”. 28 ఉండొచ్చు. ఒకవేళ ఉండకపోయినా, ఖచ్చితంగా ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. “ఐనా నా విషయాలు నీకు తెలుసో లేదో అని అడగటం నాదే పొరపాటు. ఉగ్రవాదుల గురించి సైనికులు తెలుసుకున్నంత సూక్ష్మంగా ప్రతీ విషయం తెలుసు కదా నీకు.” నవ్వుతూ పళ్ళెంలో చేయి కడుగుతున్నాడు రుద్ర. పళ్ళెం తీసుకొని లేవబోతుంటే, తను తీస్తానని ఆపింది వాణి. పర్లేదు, అని తీసుకు వెళ్లి వంట గదిలో ఓ పక్కగా పెట్టాడు రుద్ర. సరే కాని, నీ కొడుకు ఎక్కడ ? “వాడు ” అని వాణి ఎదో చెప్పబోయేలోపు అదే, మీ అక్క కొడుకు. “హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నాను”. మీ అక్కని చంపిన మీ బావనే ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? “ఈ విషయం గురించి ఎవ్వరూ చెప్పలేదా నీకు?” చెప్పారు.కానీ, కొలిమిలో వేడి గురించి దూరంగా నిల్చోని చూసినవాడికి, నిప్పుల శబ్దం విన్నవాడికి వాస్తవం ఎలా తెలుస్తుంది. కొలిమి ముందు కష్టపడిన వాడినే అడగాలి, అప్పుడే కదా నిజమెంటో తెలిసేది. “మా బావ కోరికల మైకంలో కళ్ళు మూసుకుపోయి విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పడినవాడు. మా అక్కకి కొడుకు పుట్టినప్పుడు, బాగా రక్తం పోయి చనిపోయింది. చనిపోయేముందు వాడ్ని నా చేతుల్లో పెట్టి, మా నాన్న దగ్గర మాట తీసుకుంది. ఈ విషయం మా బావకు తెలిసింది. కొడుకుని ఎంతకీ ఇవ్వనన్నాడు. నాన్న ఎంతో బతిమాలితే, ఒక్క షరతు మీద ఒప్పుకున్నాడు. బావ దృష్టిలో భార్యంటే కోరికలు తీర్చుకోటానికి ఉపయోగపడే శరీరం. అలాంటివాడికి నన్ను ఇచ్చి చేయటం నాన్నకు ఇష్టం లేదు. కానీ, మనిషి కంటే మాటకు విలువిచ్చే మనిషి, అది కూడా పెద్ద కూతురు ఆఖరి కోరిక తీర్చకుండా ఉంటాడా. పెళ్లి జరిగింది, కొన్ని రోజులు మా బావకు దొరక్కుండా ఏదోక కారణం వెతుక్కొని తప్పించుకునేదాన్ని. నాన్న ఉన్నంత కాలం, నన్ను హింసించగలిగాడు కాని నేను ఎప్పుడూ లొంగలేదు బావకి. కొన్నెలలకి నాన్న కాలం చేసారు, బావకు అడ్డు ఎవ్వరూ లేకుండా పోయారని సంతోషపడ్డాడు. నా అదృష్టమో, మా అక్కా, నాన్నల ఆత్మఘోష వలనో ఏమో, నాన్న చనిపోయిన మూడో రోజే నిద్రలోనే చనిపోయాడు బావ. ఆ తర్వాత ఆ ఊర్లో ఉండలేక ఇక్కడికి వచ్చి ఇలా బతుకుతున్నాను.” ఎన్నో ఇబ్బందులు పడిఉంటావ్ కదా. “పెళ్ళికాని ఆడపిల్లని ఆశగా చూస్తారు, మొగుడు లేని ఆడపిల్లని అవకాశంగా తీసుకుంటారు. మొదట్లో చాలా ఇబ్బంది ఉండేది, ఆ తర్వాత నా ధైర్యం వలన చాలా తగ్గిపోయాయి.” ఎవ్వరూ నిన్ను ఇబ్బందిపెట్టలేదా ? “నువ్వు తప్ప ఎవ్వరూ నాతో మాట్లాడే సాహసం కూడా చేయలేదు”. రుద్ర గుండెల మీద తల పెట్టి పడుకొనుంది వాణి. ఆ రాత్రివేళలో శబ్దం నిద్రోతున్నంత ప్రశాంతంగా ఉంది. చాలాసేపు రుద్ర, వాణి ఇద్దరు ఏం మాట్లాడలేదు. వాణి కంట్లో నీళ్ళు రుద్రని తాకగానే, బుజ్జమ్మా ఏంటిది ? “ఈ జీవతంలో ప్రేమించే మనిషి దొరుకుతాడని కలలో కూడా అనుకోలేదు. నీకెందుకు ఆ గొడవలన్నీ, వాటిలో నుండి బయటకు రాలేవా ?”. రావాలని నాకుండదా! కానీ, అది వెళ్ళటమే తప్ప రావటం ఉండని పద్మవ్యూహం. నేను అభిమన్యుడిని కాదు, కేవలం ఒక సామాన్య సైనికుడిని. ఐనా, బయటకి వచ్చి నేనేం చేయగలను. ప్రజలను ఇబ్బంది పెట్టడం వాళ్ళ విధి, ఇబ్బందులకు తలొగ్గటం ప్రజల విధి, నిస్సహాయులని ఆదుకోవటం మా విధి. “మీ వాళ్ళని చంపిన శంకరన్న మీద నీకు కోపం లేదా.” లేదు. “ఏ ?”. ప్రతీ కథలో పాత్రల ప్రవర్తనకు ఓ కారణం ఉంటుంది. కారణాన్ని చూసినవాడు రాసిన రచయితని అభినందిస్తాడు, ప్రవర్తనని చూసినవాడు పాత్రని ద్వేషిస్తాడు. నేను కారణం చూసాను, ఆ భగవంతుడికి అభినందనలతో పాటు, కృతజ్ఞతలు చెప్పాను. “నా పాత్రకు కారణం ఏమైయుంటుంది ?” అది తెలుసుకోవటమేనేమో నా పాత్ర ముఖ్య విధి అని రుద్ర అనగానే ఇద్దరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత పట్టణానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉండే రుద్ర వాళ్ళ పల్లెటూరిలో రుద్ర, వాణిల పెళ్లి జరుగుతుంది. రుద్ర, వాణి చాలా కాలం అక్కడే ఉంటారు. వాణి వాళ్ళ అక్క కొడుకుని రుద్ర సొంత కొడుకుగా చూసుకుంటాడు. ఆ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతుంటాడు రుద్ర. రుద్ర వాళ్ళ చెల్లికి ఆ ఊరికి దగ్గరలో మంచి వ్యక్తితో పెళ్లి జరిపిస్తాడు. శంకరన్నని తనతో ఉండిపొమ్మని అడుగుతాడు రుద్ర. కానీ, అంతా వదిలేసి, తన దగ్గర పనిచేసే అంతమందిని అనాధలని చేసి రాలేనని, అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళమని రుద్రకి చెప్పి వెళ్తాడు శంకరన్న. శంకరన్నని జాగ్రత్తగా చూసుకోమణి గణాకి చెప్తాడు రుద్ర. మణి, శివ...రుద్రతో పాటు ఆ ఊర్లోనే ఉండాలని నిశ్చయించుకుంటారు, కానీ శంకరన్నకి, గణాకి తోడెవరూ లేకుండా ఎలా అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు రుద్ర. రుద్ర, వాణీకి కొంతకాలానికి మొదట అమ్మాయి-అబ్బాయి కావల పిల్లలు, ఆ తర్వాత ఏడాది ఓక అబ్బాయి పుడతారు. రుద్ర చెల్లికి, ఇద్దరు ఆడపిల్లలు పుడతారు. శంకరన్న అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. రుద్ర ఒక మామూలు వ్యక్తిలా జీవితం సాగిస్తుంటాడు. అలా ఓ కలలా హాయిగా సాగిపోతున్న రుద్ర జీవితంలో ఒక రోజు, ఇద్దరు మనుషులు పొలంలో పని చేసుకుంటున్న రుద్ర దగ్గరికి వచ్చ కాళ్ళ మీద పడతారు. వాళ్ళిద్దరు ఎవరో రుద్రకు జ్ఞప్తిరాక, తనెవరో తెలీక అలా చేసారేమోని...మీరు ఎవరో అనుకోని నాదగ్గరికి వచ్చినట్టున్నారు. మీకు ఎవరు కావాలి ? “లేదన్నా, మేము నీకోసమే వచ్చాం”. నాకోసమా, నేను మీకు తెలుసా ? “నీకు మేము గుర్తుండక పోవచ్చు, కాని మేము నిన్ను మర్చిపోలేం అన్నా.” ఇంతకీ ఎవరమ్మా మీరు ? అని రుద్రా అడగ్గానే వాళ్ళు గుర్తుచేస్తుంటారు... కొన్నేళ్ళ క్రితం... “” పట్టణంలో బాగా రద్దీ ప్రాంతంలో, పాడుబడిన పెద్ద బిల్డింగ్ లోని ఆరవ అంతస్తు. బయట నుండి చూస్తే, ఒక్క పురుగు కూడా నివసించని పాడుబడిన భూతబంగ్లాలా కనిపిస్తుంది, కాని ఆరవ అంతస్తులో చాలా మంది మనుషులు ఉన్నారు. రకరకాల మందులు రాసిలా పోసి ఉన్నాయి. కొంతమంది మందులు తయారు చేస్తుంటే, కొంతమంది పాకెట్స్ లో పెడుతుంటే, కొంతమంది తూకం వేస్తున్నారు, కొంతమంది సీల్ వేస్తుంటే, కొంతమంది కంపెని పేరు, ధర అతికిస్తున్నారు, కొంతమంది ఎవరేం చేస్తున్నాడో పర్యవేక్షిస్తున్నారు. వీళ్ళందరికీ కాపలాగా కొంతమంది మనుషులు కత్తులు, ఒకడు తుపాకీ పట్టుకొని నిల్చున్నారు. గదులు లేకుండా పిల్లర్లతో నిలిబడిన ఆ అంతస్తు మొత్తం ఈ పనే జరుగుతుంది. ఆ ఫ్లోర్ కి అన్నివైపుల నుండి సమానంగా ఉండేలా మధ్యలో ఒక పెద్ద సోఫాసేట్ మీద కూర్చొని ఉన్నాడు ఓ భారీకాయం ఉన్న వీరబాహుడు. వాడి ఎదురుగా టీపాయ్ మీద మూడు ల్యాండ్ ఫోన్లు, రెండు మాన్షన్ హౌస్ బాటిల్స్, సగం తాగిన మందు గ్లాసు, చిందర వందరగా పడి ఉన్న సగం తిని వదిలేసిన మటన్ ముక్కలు. ప్రస్తుతం రుద్రకి కథ చెప్తున్నా ఇద్దరూ... ఆ ఆరవ అంతస్తులో ఓ మూల ఏడుస్తూ మందులు తయారు చేస్తున్నారు. ఆ సమయంలోనే అదే బిల్డింగ్ లోకి ఒకడు ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ వస్తాడు. వాడి వెనుకాలే రుద్ర కత్తి పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇద్దరూ, ఆరవ అంతస్తు చేరుకుంటారు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి వీరబాహుడి వెనక దాక్కుంటాడు. కత్తితో వస్తున్న రుద్రని చూసి ఓ బులెట్ కాలుస్తాడు ఒకడు, అది తప్పించుకొని వచ్చి వీరబాహుడికి ఓ రెండు అడుగుల దూరంలో నిల్చుంటాడు రుద్ర. రుద్ర వెనుకాల వీరబాహుడి మనుషులు వచ్చి నిల్చుంటారు. మాట్లాడుకుందాం అన్నా అని అంటాడు రుద్రా. “నీతో నాకు మాటలేంటి. మా వాడి వెంట సింహంలాపడి, జింక పిల్లలా సింహం బోనులోకి వచ్చిపడ్డావ్. ఇప్పుడు నిన్నిక ఆ దేవుడే కాపాడాలి.” రుద్ర వీరబాహుడితో మాట్లాడదాం అని అడుగు ముందుకు వేయగానే, అందరూ చుట్టుముడతారు. అన్నా, ఎలాగో ఎసేస్తారు, ఒక్క నిమిషం మాట్లడనివ్వన్నా. ఒకే ఒక్క నిమిషం. అని రుద్ర అడగ్గానే, సరే వదలండ్రా అనట్టు సైగ చేస్తాడు వీరబాహుడు. అప్పటికి వాళ్ళు అడ్డుతప్పుకోకపోతే, చెప్పాడుగా, అడ్డు జరగరా... అని ఘంభీరంగా చెప్తాడు రుద్ర. వాళ్ళు పక్కకి తప్పుకుంటారు, రుద్ర వచ్చి వీరబాహుడి ముందు కూర్చుంటాడు. అన్నా, నకిలీ మందులు అమ్మటం తప్పు. పెద్ద తప్పు చేస్తున్నావ్ అన్నా. రుద్ర అలా చెప్తుంటే, పట్టించుకోకుండా ఒక పెగ్గు కలపమని పక్కనున్నోడ్ని అడుగుతాడు వీరబాహుడు. నేనున్నా కాదన్నా, నేను కలుపుతాగా అంటూ పెగ్గు కలిపి వీరబాహుడికి ఇస్తాడు రుద్ర. అన్నా, మరేంటంటావ్. ఆపేద్దామా, ఇవన్నీ తీసేద్దామా ఈ రోజుతో. “తీసేస్తా... ముందు నీ ప్రాణం తీసి, ఆ తర్వాత అడ్డుపడాలని చూసే ప్రతీవాడి ఊపిరి ఆపేస్తా.” అన్నా... అన్నా... అన్నా... నీ అభిప్రాయం మార్చుకునే అవకాశమే లేదా. లేనేలేదన్నట్టు శబ్దం చేస్తాడు వీరబాహుడు. ఇక చాలు చంపెయ్యండిరా అని సైగ చేస్తాడు వీరబాహుడు. అన్నా... ఎలాగో చంపేస్తావ్, అదేదో కొంచెం కొత్తగా చేయోచ్చు కదన్నా. అలా చేస్తే కొత్తగా చచ్చానన్న త్రుప్తైన ఉంటుంది నాకు. “హా... హ... నాకు నచ్చింది ఈ అవిడియా. సరే... ఏంటో చెప్పు”. ఒక్క నిమిషం అన్నా ఆలోచిస్తా... అని కళ్ళు మూసుకొని తనలో తాను, ఇక్కడ మొత్తం 8 మంది ఉన్నారు, ఒక్కడి దగ్గర తుపాకీ ఉంది, మిగిలిన అందరి దగ్గరా కత్తులు. మనోళ్ళు పది మంది కిందున్నారు. సిగ్నల్ ఇవ్వగానే పైకి రావటానికి ఆ శరీరాలకు దాదాపు ఓ పది నిమిషాలు పడుతుంది. గన్ లో ఆరు బుల్లెట్లు, ఈ పది నిమిషాలు ఆరు బుల్లెట్లతో సరిపుచ్చాలి. రెడీ అన్నా... ఆటేంటంటే, రేయ్ గుడ్లగుబ, ఆ తుపాకి ఇటివ్వు. వాడు ఇవ్వకుండా కోపంగా చూస్తుంటే... అన్నా ఇవ్వమని చెప్పన్నా అంటాడు రుద్ర. తుపాకి తీసుకొని, ఐదు సార్లు పైకి కాలుస్తాడు(ఇది సిగ్నల్). అందరూ రుద్ర మెడ మీద కత్తి పెడతారు. ఓ... ఓ... నేనేం చేయనన్నా. ఆట గురించి చెప్తున్నా అంతే. అన్నా, గన్ లో ఒకే ఒక్క బులెట్ ఉంది. ఇదిగో తుపాకి, ముందు నువ్వు నన్ను కాల్చు, తర్వాత నేను నిన్ను కాలుస్తా, బులెట్ ఎవరికీ తగిలితే వాళ్ళు ఓడిపోయినట్టు. రెడీ యా... అనగానే తుపాకి తీసుకొని, రుద్రని కాలుస్తాడు వీరబాహు. బులెట్ ఉండదు. ఇప్పుడు నా ఛాన్స్ అన్నా అని గన్ తీసుకోబోతుంటే... “చిన్న మార్పు రా ఆటలో, నేనోసారి నువ్వోసారి కాదు. నేనొకసారి, వాడొకసారి, వాడొకసారి ఇలా అందరూ నిన్నే కాలుస్తారు. ఎవరి చేతులలో చావాలో నీకే ఛాన్స్ ఇస్తున్నా, ఎవడి చేతుల్లో చస్తావో కోరుకో”.అన్నా... ట్విస్ట్ అదిరిందిపొ. నెక్స్ట్ వీడన్నా... వాడు కాలుస్తాడు, బులెట్ రాదు. నెక్స్ట్ వీడన్నా... వాడు కాలుస్తాడు, బులెట్ రాదు. ఇలా వీరబాహుతో కలిపి ఐదుగురు కాలుస్తారు, బులెట్ రాదు. లాస్ట్ బులెట్, రుద్రకి వాళ్ళ మనుషులు దగ్గరికి వస్తున్నట్టు చెప్పుల శబ్దం వినిపిస్తుంది. అన్నా ఇది లాస్ట్, ఎలాగో బులెట్ వస్తుంది కాబట్టి నీ చేతుల్లో పోవటమే కరెక్టు, నువ్వే కాల్చన్న అంటూ వీరబాహుడికి ఇస్తాడు గన్. “నీ ధైర్యం నచ్చిందిరా తమ్ముడు.” అంటూ రుద్ర వైపు పెట్టి ట్రిగ్గర్ నొక్కగానే వీరబాహుడి కనుబొమ్మల మధ్యలో బులెట్ దిగుతుంది. ఏం జరిగిందో అర్ధం అయ్యేలోపు, రుద్ర, అతని మనుషులు కలిసి వీరబాహుడి మనుషులను అడ్డుకుంటారు. అన్నా, (వీరబాహు శవాన్ని చూపిస్తూ) వీడి కోసం చనిపోయే ఖర్మ మీకు లేదు. మంచిగా బతుకుతాం అంటే వదిలేస్తా, లేదంటే ప్రాణం తీసేస్తా అనగానే అందరూ మంచిగా బతుకుతాం అని వెళ్ళిపోతారు. రుద్ర, వీరబాహుడి బాడీని పక్కకి నెట్టి సోఫాలో కూర్చుంటాడు. వీరబాహుడి వెనుక వచ్చి దాక్కున్నది ఎవరో కాదు, గణ. గణ వచ్చి రుద్ర పక్కన కూర్చుంటాడు, “ఏంటి కన్నా, నేను కాల్చటం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే, నీకు ఏమయ్యుండేది” అని అడుగుతాడు గణ. నాకేం అవుద్ది గణ, అందులో అసలు బులెట్ ఉంటేనే కదా అని, గన్ తీసి చూపిస్తాడు, బులెట్ ఉండదు. “బులెట్ ఏమైంది ?” నేను పైకి రాగానే ఒకటి కాల్చాడు గుర్తు లేదా. గణ, రుద్ర ఇద్దరు నవ్వుకుంటారు. అక్కడున్న మందులన్నీ కాల్చేసి, పనిచేస్తున్న వాళ్ళందరిని తిట్టి వేరే పని చేసుకోమని చెప్తాడు రుద్ర. “మేము చదివన చదువులకు బయట ఉద్యోగాలు లేవు, ఇక్కడ కూడా పని చేయోద్దంటే ఎక్కడికి వెళ్ళాలన్నా” అని ప్రశ్నిస్తాడు ఒకడు. రుద్ర వాడి దగ్గరికి వెళ్లి, రేయ్! ఎంత ఆకలేసినా మనుషులు తినేదే తినాలి. లేదన్నా, ఎక్కడా అన్నం దొరకలేదని ఆశుద్ధాన్ని తినవ్ కదా. “” అలా జరిగింది చెప్తూ... ఆపి, ఉన్నట్టుండి రుద్రని పొడుస్తాడు ఒకడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో