Chai Bisket’s Story Series – రుద్ర (Part – 6)

Updated on
Chai Bisket’s Story Series – రుద్ర (Part – 6)
జరిగిన కథ: Part - 1 Part - 2 Part - 3 Part - 4 Part - 5 ఎందుకు అని అడుగుతుంటే, గణ ఏం మాట్లాడకుండా చూస్తున్నాడు. కొద్దిసేపు ఒకరివైపు ఒకరు చూసుకుంటూ, పెదాలతో మౌనం పలికిస్తూ, కన్నులతో మాట్లాడుకుంటున్నారు. మరి కాసేపటికి సర్కస్ వాళ్ళు కూడా ఎక్కడి నుండి తీసుకోచ్చరో తెలుసుకోలేక నోరెళ్ళపెట్టి చూసేలా, రెండు బోరుకోచ్చిన జీపుల్లో నుండి ఇరవై మంది దిగారు. జాతి పరంగా మనుషుల్లానే ఉన్నా, ఆకారం పరంగా రాతియుగానికి చెందిన వాళ్ళలా, అలంకరణ పరంగా మృగప్రవృత్తి కలిగిన వారిలా, ప్రవర్తన పరంగా సంస్కారం అనే మాటే వినని అనాగారికుల్లా కనిపిస్తున్నారు. వేప చెట్టు అరుగు మీద కూర్చున్న రుద్రకి కొన్ని అడుగుల దూరంలో గణా నిల్చొని ఉంటె, గణాకి రెండు అడుగుల దూరంలో జీపు బానేట్ మీద కొందరు కూర్చొని, జీపు ముందు కొందరు నిల్చొని ఉన్నారు. భయంకరంగా ఉన్న వాళ్ళకంటే, భయంకరంగా ఉంది నిశబ్ధం. ఎందుకు గణ ? అని అడిగాడు రుద్ర. అదే సమయంలో ఆ అడవి మనుషులు రుద్రని లేపేద్దామా అని సైగలతో గణాని అడుగుతుంటే, అప్పుడే కాదు అనట్టు చేతిని చూపించాడు గణ. “ఎందుకు... ఎందుకూ? అనే కదా రుద్ర” అని సమాధానం ఇచ్చాడు గణ. అదే అనట్టు ఓ నిట్టూర్పు ఇస్తూ తల ఊపుతున్నాడు రుద్ర. “ఎందుకు అనే ప్రశ్న నీకు కనిపిస్తుంది, కానీ ఎందుకు కాదు అనే ప్రశ్న నన్ను తొలిచేస్తుంది.” గణ ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కాలేదు రుద్రకి. దేని గురించి మాట్లాడుతున్నావ్ అనేది అడిగేలా పెదాలు కదపకుండా ముఖంతో మాట్లాడాడు రుద్ర. “నువ్వు కూర్చున్నావ్, నేను నిల్చున్నాను. నాకు కూర్చోవాలని ఉంది కానీ, కూర్చోలేకపోతున్నా. కూర్చోవడానికి స్థలం లేకో – ఓపిక లేకో కాదు నీ ముందు కూర్చోవటం గౌరవం కాదనే మర్యాదని నాలోపలే చంపలేక.” నేనెప్పుడూ మిమ్మల్ని తక్కువుగా చూడలేదు కదా గణ. మీరంతా నా వాళ్ళు, నా ఐనవాళ్ళు, నా కోసం ప్రాణం ఇచ్చే స్నేహితుల్లానే చూసాను కానీ, పనోళ్ళలా, పరాయివాళ్ళలా ఎప్పుడూ చూడలేదే. నాకు నేనెంతో, మీరూ అంతే. చిన్నప్పటి నుండి మీతోనే తిరిగాను కద గణ. “మాతో తిరగలేదు, నీ వెనక మేము కాపలాగా వచ్చాం. ఎప్పటకీ నీ స్నేహితులం కాదు నీకు సేవకులమే. నువ్వు శంకరన్న ఆస్తులకు హక్కుదారివి, అధికారానికి వారసుడివి, వారసత్వానికి నాయకుడివి. మరి, మేము అప్పటికి, ఇప్పటికి, ఎప్పటకీ మీ దగ్గర పని చేసే కిరాయి తీసుకునే పరాయి మనుషులమే కానీ...ఆస్తుల్లో భాగం, అధికారంలో వాటా, వారసత్వంలో చోటు మాకుటుందా ?”. నువ్వు అడిగుంటే నేను ఇవ్వనన్నానా ? “అడుక్కుంటే చేసేది దానం, అడక్కుండానే అన్నదమ్ములు పంచుకోవటం ధర్మం. అంటే అడుక్కుంటే దానం చేసి ధర్మం మూటకట్టుకునే మహానుభావుడిలా నువ్వు, అడిగినందుకు తిన్నింటివాసాలు లెక్కపెట్టిన మూర్కుడిలా నేను. దానం అంగీకరిస్తే మీరు చూపిన దయకి, నా రక్తం పంచుకు పుట్టే కొన్ని తరాల్లో మీ పేరు గొప్పగా వినిపిస్తుంది. దానం కాదు వాటా కావాలి అని అడిగితే, సొంత మనిషిలా చూసిన వాళ్ళనే మోసం చేసిన కిరాతకుడిలా ప్రతీ తరం నా పేరు చెప్పుకుంటుంది. అంటే బతికుంటే మీ వాడిలా, మీ కాలి కింద కుక్కలా, మీకోసం కష్టపడుతూ, నా సుఖాలు, ఆశలు, కలలు, ఆశయాలు అన్నీ వదులుకొని, నాకంటూ ఓ బతుకంటూ ఉందని మర్చిపోయి మీ నీడలోనే పగలు, రాత్రి తేడా తెలీకుండా గడిపేస్తూ బతికేయాలి.” నా ఆలోచన తప్పని తెలిసింది, నీ ఆవేదన అర్ధమైంది. కానీ ఆవేదనని ఆవేశంగా మార్చి అనాలోచితంగా తీసుకున్న ఈ నిర్ణయం సమంజసం కాదేమో అనిపిస్తుంది. “నా మనసుకు తగిలిన గాయం కనపడుతుందేమో కానీ, దానికి నేను అనుభవిస్తున్న నరకం నీకెలా అర్ధమవుతుంది కన్నా. నాకు ఇదే ఖచ్చితం అనిపిస్తుంది. నాకు రుద్ర చూపించే సానుభూతి కాదు, రుద్ర స్థానం కావాలి.” తీసుకో. ఆ సమాధానం వినగానే, ఆవేశంతో మాట్లాడుతున్న గణ ఒక్కసారిగా ఆగిపోతాడు. తీసుకో గణ, ఇప్పటినుండి నువ్వే శంకరన్న సర్వస్వానికి వారసుడివి. “ఇందాకే చెప్పాను రుద్ర, నాకు దానంగా కాదు, ధర్మంగా కావాలి. కొన్నిసార్లు మాటలకంటే, ఘర్షణలే ఎక్కువ పరిష్కారాలు చూపిస్తాయి.” గమ్యం తెలీని ప్రయాణం, లక్ష్యం లేని పోరాటం రెండూ వృధా గణ. “అర్ధం కాకుండా చేసే ఆలోచన, అర్ధంలేని అవగాహన రెండు కూడా వృధానే కన్నా. నేనేదో ఆవేశంతోనో, నీ మీద ఉక్రోషం వల్లనో ఈ పని చెయ్యట్లేదు. బాగా అలోచించే తీసుకున్న నిర్ణయం ఇది. నువ్వంటూ లేకుంటే, నానాకి ఈ వయసులో ఎవరో ఒకరు తోడు కావాలి. కాన్సర్ వచ్చిందని తెలిస్తే మన కాలైనా నరికేయక తప్పదు కదా. నా లక్ష్యానికి అడ్డు నువ్వు, ముందు నిన్ను తొలగించని. ఆ తర్వాత సవాళ్లు ఎన్నైనా ఎదురుకోగలను.” సరే, నీ ఇష్టం. నీ కోరిక నేనెప్పుడు కాదన్నానని. ఇప్పుడు మొదలెట్టండి అన్నట్టు ఆ క్రూర మానావులకు సైగ చేసాడు గణ. రక్తం గడ్డకట్టి పదును లేని నాటు కొడవళ్ళు చేత పట్టి, పాన్ పరాగ్ రెండు వేళ్ళ మధ్యగా బలంగా నోటి నుండి బయటకు నెట్టి, రుద్రని చావకొట్టడానికి బయలుదేరారు వాళ్ళంతా. రుద్రా అంతమందినీ ఎదురుకున్తున్నాడు, వాళ్ళు కొడుతున్నారు, రుద్ర కొడుతున్నాడు. వాళ్ళలో కొందరు లేవలేనంతగా తన్నులు తిని కింద పడిపోయారు, రుద్రకి బాగానే దెబ్బలు తగులుతున్నాయ్ కాని రుద్రని పడేసేంతగా కాదు. రుద్రని ఎదిరించలేక వాళ్ళు డీలా పడిపోతున్నారు, రుద్రని చంపలేరేమో అని గణ మనసులో సందేహ పడుతున్న సమయంలో పెద్ద హార్న్ చేసుకుంటూ ఖరీదైన కారొకటి వచ్చి వీళ్ళ ముందు ఆగుతుంది. ఆ కార్లో నుండి పూర్తిగా తెల్ల గుడ్డతో కప్పేసి ఉన్న ఒక శవం ఎగిరొచ్చి, రుద్ర ముందు పడుతుంది, ఆ వెనుకగానే ఆపండ్రా అని వినిపిస్తుంది. రుద్రతో సహా అందరూ ఆగిపోతారు. కారులో నుండి, శవం గుండెల మీద కాలు పెట్టి దిగుతాడు రాంజీ సేట్. నడుచుకుంటూ వచ్చి, విజయగర్వం కళ్ళలో చూపిస్తూ, రుద్ర కూర్చున్న చోటే వచ్చి కూర్చుంటాడు. ఆ శవం మీదున్న గుడ్డ గాలికి లేచిపోతుంది, ఆ శవాన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ కుప్పకూలిపోతాడు రుద్ర. ఆ శవం ఖాదర్ ది, ఖాదర్ ని అలా చూడగానే రుద్ర కళ్ళలో నుండి నీరు ధారలా కారిపోతుంది. కన్నీళ్లకు కనురెప్పల మధ్యలో సంకెల్లేసి, కళ్ళలోనే ఖైదు చేసి, ఖాదర్ శవాన్ని పట్టుకొని పెద్దగా అరుస్తాడు రుద్ర. అదే అదును అనుకోని, వెనుక నుండి ఒకడు కొడవలితో వీపులో పోటేస్తాడు, మరొకడు తల మీద బలంగా కొడతాడు. రుద్ర కిందపడిపోతాడు. గొంతు మీద కొడవలి పెట్టి, చంపమంటారా అని రాంజీ సేట్ వైపు చూస్తుంటారు వాళ్ళు. రుద్ర దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, శవం మీదుగా ఓ కూర్చి వేసుకొని, మోకాళ్ళ మీద కూర్చున్న రుద్ర మొహం దగ్గరగా కాలు ఉండేలా కూర్చుంటాడు రాంజీ సేట్. “చెప్పానా? వద్దని చెప్తే నువ్వు వినలేదు. వీడికోసం,(శవాన్ని కోపంగా తంతు) ఈ చచ్చిన శవం కోసం నాతో పగ పెట్టుకున్నావ్. నా కాళ్ళు పట్టుకొని బతిమాలుకో వదిలేస్తా.” అంటూ రుద్ర మొహం మీద చెప్పుని రుద్దుతున్నాడు. రుద్ర ఎదో చెప్తాడు, ఎవ్వరికి వినపడలేదు. దగ్గరికి రమ్మన్నాడు, రాంజీ సేట్ ని. రాంజీ సేట్ చెవి రుద్ర పెదాలకు దగ్గరగా పెట్టి వింటున్నాడు. ఖాదర్ భాయ్ ని చంపినందుకు, ఆయన భార్య కాళ్ళు పట్టుకొని క్షమించమని బతిమాలినా నిన్ను వదిలిపెట్టను. అంటూ చిన్నగా నవ్వుతున్నాడు రుద్ర. “ఉడుకు రక్తం కదా... రేయ్ వీడి ఒంట్లో రక్తం అంతా బయటకు పోయేలా కొట్టి ఇక్కడే వదిలేయండి.” అని చెప్పి వెళ్ళిపోతాడు రాంజీ. వాళ్ళు రుద్రని తాడుతో కట్టేసి, చావకొట్టి, నెత్తుటి సంద్రంలో వదిలేసి వెళ్ళిపోతారు. అందరూ వెళ్లిపోయాకా, రుద్ర స్పృహలో లేకపోయేప్పటికి చంపేద్దాం అని కత్తి కోసం వెతుకుతాడు గణ. తీరా దొరికి చంపేద్దాం అనుకునేప్పుడు, యస్ ఐ నరసింహం వస్తాడు ఆ వైపుగా. యస్ ఐ ని గమనించిన గణ, అతనికి అనుమానం రాకుండా, తనని తానె చనిపోకుండా ఉండేలా పొడుచుకొని ఆ దగ్గరలోనే పడిపోతాడు. యస్ ఐ రావటం, రుద్రని, గణని చూడటం, తన జీప్ లో హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లటం, స్ట్రెచర్ లో ఎక్కించి లోపలకి తీసుకెళ్లటం, ఫస్ట్ ఎయిడ్ చెయ్యటం అన్నీ జరుగిపోతాయ్. దారుణంగా దెబ్బలు తిన్న వ్యక్తి అంత త్వరగా స్పృహలోకి వస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ, ఆపరేషన్ చేసిన నాలుగు రోజుల్లోనే పూర్తి స్పృహలోకి వచ్చేసాడు రుద్ర. ఆపరేషన్ ధియేటర్ లో మత్తు మందులేకుండా కుట్లేసినా కదలని రుద్ర, ఐ సి యూ లో టాబ్లెట్ వేయటానికి ఓ నర్సు చేయిపట్టుకోగానే కదులుతాడు. అతను హాస్పిటల్ లోకి వచ్చ్చిన క్షణం నుండి దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకున్నది ఎవరో కాదు, వాణి. వాణి రుద్రని తాకిన క్షణాన రుద్ర ప్రాణం లేచొస్తుంది. కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తాడు, ఎదురుగా వాణి నిల్చొని ఉంటుంది. కదలడానికి ప్రయత్నిస్తాడు రుద్రా, కాని కదలలేడు. అతని అవస్థ గమనించి దగ్గరికి వచ్చి, అతన్ని పట్టుకొని ఓ వాలుగా కూర్చోపెడుతుంది వాణి. వాణి కళ్ళలోకే తదేకంగా చూస్తుండిపోతాడు రుద్ర. రుద్రని ఆ పరిస్తితుల్లో చూసేప్పటికి వాణి కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి. ప్రాణం పోయే స్థితిలో ఉంటె తప్ప కనిపించవ్ అని తెలిస్తే ఆ రోజే చావు దెబ్బలు తినేవాడ్ని కదా, ఇంతకాలం ఆగాలా దీనికోసం అని వాణిని చూస్తూ అంటాడు రుద్ర. “అలా మాట్లాడకు తప్పు. నీకు ఎంతో గొప్ప జీవితం ఉంది.” అంటూ కళ్ళు తుడుచుకుంటుంది వాణి. గుండెల్లో ప్రేమ, పెదాలు పలకేలా లేవని కళ్ళలో నుండి తప్పించుకొని బయటకి రావాలని చూస్తుంటే, వాటిని కూడా నాకు కనిపించకూడదని చెరిపేస్తున్నావా ? “తెలిసిన మనిషిని ఇలాంటి పరిస్తితుల్లో చూస్తే, దుఃఖం కలగటం మామూలే. ప్రేముంటేనే కన్నీల్లంటే, కన్నీళ్ళకు ఈ ప్రపంచంలో చోటుందా ?” ఔనా! మరి నీ పెదాలోకటి చెప్తుంటే, నీ కళ్ళు మరొకటి చెప్పాలని చూస్తున్నయేమిటో ? “పిచ్చి ఆశలు మాని, నీకున్న జీవితాన్ని ఆనందంగా గడపమని చెప్తున్నట్టున్నాయ్.” నా జీవితంలో ఆనందానికి ఏం కావాలో నీకు తెలీదా ? “ఏం కావాలి నీకు ?”. నువ్వు నాతో పడుకుంటావా ? ఆ మాటకి ఆశ్చర్యపోయిన వాణి “నువ్వు చావు వరకూ వెళ్ళినా నీ కోరిక ఇంకా చావలేదా ?”. నే చస్తే కాని... అని ఇంకా చెప్పబోతుంటే రుద్ర నోటికి చేతిని అడ్డుపెడుతుంది వాణి. “పదే, పదే ఆ విషయం తలుచుకోకు.” మరి నాకు నా ఆనందాన్ని ఇస్తావా ? “ఏముంది అందులో ?”. ఆ ఆనందంలో ఏముందో తెలీకుండానే ఓ ప్రాణాన్ని మోసావా ? “నా శరీరాన్ని హింసించి, నా మనుసుని చంపేసి, నా కోరికలని దూరంపెట్టి సృష్టించిన ప్రాణం అది. నీకు కావాల్సింది నా శరీరమే ఐతే ఏనాడో ఇచ్చేదానిని”.నాకేం కావాలో నీకు తెలుసు, శరీరమే కావాలనుకుంటే ఏనాడో నేనే ఆక్రమించేవాడిని. “శరీరం కాక మరేం కావాలి నీకు ?”. నువ్వు నాతో పడుకోవాలి. “మళ్ళీ అదే మాట, నువ్వేం అడుగుతున్నావో నీకైనా తెలుస్తుందా ?”. నేను ఆలోచించకుండా ఏది చెప్పను, నీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే నీ మీద నా ప్రేమను నిరూపణ చెయ్యటానికి ఒక్క అవకాశం ఇస్తావా? “నా శరీరం ప్రమేయం లేకుండా, నీ ప్రేమని నిరూపించలేవా ?”. మాటలతో నిరూపించే పాండిత్యం లేదు, హావాభావాలతో చూపించే అభినయం రాదు, గీసి చూపిద్దాం అంటే చిత్రకారుడని కాదు, రాసి వినిపిద్దాం అంటే కవిత్వం తెలీదు. అన్నిటికంటే శ్రేష్టమైనది, అందరు పాటించేది నాకు తెలిసిన అత్యుత్తమ విధానం ఒక్కటే. రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. “ఒకటే చేతితో చిటికెలు వెయ్యటం లేదు.” అందులోను రెండు వేళ్ళు కలుస్తున్నాయ్ కదా. రెండూ ఉంటేనే కలయిక. “అన్ని కలయికలు సంగమాలు కావు, సంకరాలు కూడా ఉంటాయి.” కాని, నది సముద్రంతో కలవటం సంకరం కాదు సంగమమే. నువ్వు నాతో కలవటం కూడా అంతే. “ఎందుకు నాపై నీకంత వ్యామోహం”. వ్యామోహం కాదు అనురాగం. “ఎలా నమ్మేది ?”. వ్యామోహం అయ్యుంటే ఇప్పుడు మనం ఈ సంభాషణ జరిపేవాళ్ళం కాదు, ఆ రోజు నిన్ను వెతికి పట్టుకొని నాకు కావలసినది తీసుకునేవాడిని కదా. “నాపైనే ఎందుకు నీకంత అనురాగం. మరెవ్వరూ దొరకలేదా ?”. ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు, బహుశా దైవనిర్ణయం అయ్యుండొచ్చు. లేకపోతె నీకోసం ఇంతలా పరితపించటం ఏమిటి. “నేను కాదంటే ఏం చేస్తావ్ ?” మళ్ళీ అడుగుతాను. “ఎప్పటికీ కాదంటే ?”. ఎప్పటికైనా నా ప్రేమని తెలుసుకుంటావ్ అనే నమ్మకం నాకుంది. “ఎప్పటికైనా దక్కుతుందో లేదో తెలీని ప్రేమ మీద ఆశ చాలా ఉంది కానీ ప్రాణం మీద కొద్దిగా కూడా లేదా ?”. నీ మీద ప్రేమే నా ప్రాణం, అది తెలిస్తే ఇప్పుడు నా పరిస్తితి ఎలాంటిదో నీకు అర్ధమవుతుంది. “చచ్చిపోతావ్ అని భయం లేదా ?” ఆ రోజు నా ప్రాణాన్ని పట్టుకు వెళ్లిపోయావ్ కదా, మళ్ళీ ఈ రోజు కనిపించి చనిపోతే అని అడగం ఎంతవరకు న్యాయం ? ఇదంతా ఎందుకు, నా ప్రేమని అంగీకరిస్తున్నావా లేదా ఒక్క విషయం చెప్పు చాలు. “అప్పుడే తొందరేముందిలే, ఇంకా చాలా కాలం ఇక్కడే ఉంటావ్ కదా.” రుద్ర హాస్పిటల్ లో ఉన్నత కాలం, వాణి రుద్రకు సేవలు చేస్తూ ప్రతీక్షణం అతనితోనే ఉంది. కొన్ని నెలల తర్వాత, రుద్ర పూర్తిగా కోలుకొన్న రోజు... శంకరన్న వాళ్ళు అందరూ రుద్రని తీసుకెళ్ళటానికి హాస్పిటల్ కు వచ్చి ఎదురు చూస్తున్నారు. రుద్ర – ఇప్పటికైనా నీ సమాధానం చెప్తావా ? “మా ఇంటివైపు అంత పెద్ద కారు వెళ్ళదు” అని సమాధానం చెప్తుంది వాణి. అది విన్న రుద్ర, పట్టలేని ఆనందంతో అందరిని వెళ్లిపొమ్మని చెప్తాడు. వాణి రుద్ర ఇద్దరూ, వాణి వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటారు... మిగిలిన కథ తర్వాతి భాగంలో...