Chai Bisket’s Story Series – రుద్ర (Part – 5)

Updated on
Chai Bisket’s Story Series – రుద్ర (Part – 5)
జరిగిన కథ: Part - 1 Part - 2 Part - 3 Part - 4 బలరామయ్య గారి ప్రాణం పోయింది అతని వలెనే కాని, ప్రాణం తీయ్యాలని అతను అనుకోలేదు. “రెంటికి ఏంటి తేడా? ఎలా అయినా మీ నాన్న గారు చనిపోయారు కదా.” నిజమే. నేరం చేసింది నానానే కానీ, ఆయన దోషి కాదు. చంపింది నానానే కానీ, ఆయన చెడ్డవాడు కాదు. "అది నువ్వెలా చెప్పగలవ్ ?". ఎందుకంటే చనిపోయింది నా కన్న తండ్రి, చంపేసింది నన్ను పెంచిన తండ్రి. "మీ నాన్నని చంపినా వాడ్ని, తండ్రి అని ఎలా అనగలుగుతున్నావ్ ?".మా నాన్నని చంపటమే నానా ఉద్దేశ్యం అయ్యుంటే, అమ్మ మాటకు విలువిచ్చి, అసలు పెళ్ళే చేసుకోకుండా నన్నూ, నా చెల్లిని సొంత బిడ్డల్లా పెంచేవాడు కాదు. "మీ ఆస్తి కోసం మిమ్మల్ని పెంచి ఉండొచ్చు కదా". హా...హా...ఆస్తి కోసమా. సముద్రంలో వాన చుక్కంత, నానా ఆస్తి ముందు మాకున్నది. "ఆ తర్వాత ఎటువంటి సమస్యలు రాకుండా మిమ్మల్ని అడ్డం పెట్టుకున్నాడేమో ? ". అతను అనుకోని ఉంటె, నేనంటూ ఒకడ్ని పుట్టానని ప్రపంచానికి తెలీకుండా ఆ క్షణమే మాయం చేసేవాడు. నీకు తెలీదేమో శంకరన్న తరవాతే ఏ ప్రభుత్వమైనా, చట్టమైన, పోలీసులైన. "సరే... కన్న బిడ్డలా పెంచాడన్న కృతజ్ఞత చాలా ఉంది.కానీ, కన్న తండ్రిని చంపాడన్న కోపం కొంచెం కూడా లేదా ?". రుద్ర కొద్దిగా ఆవేశంగా... ఏదైనా సంఘటన ఎందుకు జరిగిందన్న కారణం తెలీనప్పుడే కోపం వస్తుంది. కన్నులు మూసుకుపోయేలా చేసే, కారణం లేకుండా, కష్టపడకుండా వచ్చే కోపానికి విలువ ఇవ్వను నేను. మా నాన్నని మా నుండి దూరం చేసినందుకు పశ్చాతాపంగా పాతికేళ్ళుగా మాకోసమే జీవితాన్ని పణంగా పెట్టాడు నానా. ఐనా ఆ సమయంలో ఎందుకు చేసాడు, ఏం చేసాడు అనేదాని కన్నా, చేసింది తప్పని తెలిసి పశ్చాతాపంగా ఏం చేసాడనేదే ముఖ్యం. "హ్మ్... ఐతే శంకరన్న మీ నాన్నని ఎందుకు చంపాడో ఎవ్వరికి తెలీదన్న మాట. ఔనూ...మీ అమ్మగారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?". తెలీదు అని టక్కున చెప్పాడు రుద్ర. "తెలీదా !? ". తెలీదు. కవిత ఇంకేదో చెప్పబోతుంటే, ఎవరో తెలిసిన వాళ్ళు ఆ వైపుగా వెళ్తూ కవితను పలకరిస్తారు. ఇప్పుడే వస్తా అని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కవిత. తను వెళ్ళగానే, కవితకి తెలీదని చెప్తాడు కాని...రుద్ర మనసులో... వాళ్ళమ్మ డైరీ లో పేజీలు కదులుతూ ఉన్న సన్నివేశం మెదులుతూ ఉంది. అలా డైరీలో పేజీలు కదులుతుంటే, తనకు తానె చెప్పుకోవటం మొదలెడతాడు... “నానా(శంకరన్న)కి అమ్మంటే ఆరాధన, అమ్మకి తాతంటే అమిత గౌరవం, తాతకి నాన్నంటే అభిమానం, నాన్నకి నానమ్మ మాటంటే శాసనం, నానమ్మకు అమ్మ వాళ్ళ ఆస్తి మీద ఆశ. ఇంతమంది అభిలాషలు, కోరికలు, ఆరాధనలు, భయాలు, అభిమానాల మధ్య అమ్మ మనసులో ఏముందో, అమ్మకి ఎవరి మీద ప్రేముందో ఎవ్వరూ పట్టించుకోలేదు. మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళు, ఇంకొకరిని ప్రాణంగా ప్రేమిస్తున్నారని తెలిస్తే తట్టుకోవటం చాలా కష్టం. ఆ సమయంలో కొంతమంది ప్రేమను తెంచుకుంటారు, ఇంకొంతమంది ఏదైనా చేసి ప్రేమను సొంతం చేసుకుందాం అనుకుంటారు, మరికొందరు ప్రేమని ద్వేషంగా మార్చేసి, మనసుని ముక్కలుగా కోసేసి, ప్రేమ దక్కకపోయినా మూర్ఖంగా మనిషిని దక్కించుకుందాం అనుకుంటారు. ఏదేమైనా ఒక్కసారి పెళ్ళైతే, ఇద్దరు మనుషులు, రెండు మనసులు కాస్తా ఒక్కటిగా మారిపోతాయి. కాని ఆ ఒక్కటైనా రెండు మనస్సుల్లో, భార్య మనసులో ఏ మూలో వేరొక మనసు మీద ప్రేమ కనిపిస్తే ఆ మగాడు తట్టుకోలేడు. భర్త మీద ఎంత ప్రేమున్నా, భార్య ప్రేమంతా ఇప్పుడు వీడి మీదే ఉన్నా, ఏనాడో జరిగిన విషయం తెలిసిన నాడు అతను విచక్షణ కోల్పోతాడు. తట్టుకోలేకో, అప్పటివరకు చెప్పక పోవటం వల్లనో, తనను నమ్మలేదనే అభిప్రాయం వల్లనో, ఇప్పటికి ఆ ప్రేమ కొనసాగుతుందేమో అనే అనుమానం వల్లనో కారణం ఏదైనా కనిపించే ఫలితం మాత్రం ఒక్కటే, అంతులేని ద్వేషంతో కూడిన ఉక్రోషం. ఆ స్థితిలో అతనేం చేస్తాడో అతనికే తెలీదు. ఎలా తెలిసిందో, ఎవరు చెప్పారో, ఎందుకో చేసారో తెలీదు కాని నాన్నకి అమ్మ వేరొకర్ని ప్రేమించింది అనే విషయం తెలిసింది. ఆ రోజు తర్వాత నుండి మా ఇంట్లో అంతా తారుమారయింది. ఆ తర్వాత నుండి మా నాన్న కళ్ళలో ప్రేమ, పెదాలపై చిరునవ్వు, మోహంలో ఆనందం, మమ్మల్ని దగ్గరగా తీసుకోవటం, కన్నీళ్లు లేని అమ్మ కళ్ళు, కందిపోని అమ్మ మొహం, అలసిపోని అమ్మని చూడలేదు మేము. నిజానికి అమ్మ ప్రేమించలేదు, ఇష్టపడింది. అతనితో ఉండాలనుకోలేదు, ఉంటె బావుండేమో అనుకునేది. పెళ్ళికి ముందు నానా మీద ప్రేమ, పెళ్లి తర్వాత నాన్న మీద అనురాగానికి ఎప్పుడు అడ్డు కాలేదు. పెళ్లి తర్వాత అసలు నానా అనే వ్యక్తి ఉన్నాడనే వాస్తవం అమ్మ మస్తిష్కంలో ఏనాడో మరుగైపోయింది. నేరం చేయలేదు, సాక్ష్యాధారాల ఊసు లేదు, వాదన జరగలేదు, క్షమాభిక్ష ప్రస్తావనే లేదు, కానీ మా నాన్న విధించిన యావజ్జీవ నరకయాతనని శిక్షగా సంతోషంగా స్వీకరించింది అమ్మ. ఏనాడో జరిగిన దాన్ని పట్టుకొని, నిజా నిజాలు తెలుసుకోకుండా, సర్వస్వం నువ్వే అని నమ్మివచ్చిన భార్యనే దారుణంగా హింసించే భర్తని చంపటం తప్పా ? కాదు కదా. కట్టుకున్న భార్య మీద ప్రేమ లేదు సరి కదా, కనీసం ఆడది అనే కనికరం కూడా లేని వ్యక్తిని చంపటం తప్పా ? కాదు కదా. ప్రేమించిన వ్యక్తి కంట్లో కన్నీటి బొట్టే తట్టుకోలేడు ప్రియుడు, అలాంటిది రక్తం చిందిస్తూ నరకయాతన అనుభావిస్తుందని తెలిస్తే ఊరుకోగలడా ? పెళ్ళికి ముందు ఏమైనా, పెళ్లి తర్వత ఆమెకి భర్తే సర్వస్వం. ప్రియుడి తపన తనకోసమే ఐనా, వెళ్తే సుఖపడొచ్చని తెలిసినా, భర్తని వదిలి రాలేదు కదా. ప్రియుడి లక్ష్యం ప్రేయసి సుఖం, అది సంఘ విరుద్దం అయినా, సమాజం అంగీకరించకపోయినా అతను పట్టించుకోడు. అమ్మని ఆ కష్టం నుండి తప్పించాలి అనేదే నానా ఉద్దేశ్యం. అమ్మ చెరసాలలో ఉంటె బద్దలు కొట్టి తీసుకెళ్ళేవాడు, బందీగా ఉంటె విడిపించుకు వెళ్ళేవాడు కాని, అమ్మ కట్టుబాట్లకి, ఆచారాలకు బానిసగా ఉంది. మరి విడిపించటం ఎలా ? నాన్న బతికున్నంత కాలం అమ్మ మీద ద్వేషం చూపించటం ఆపడు, నాన్న బ్రతికున్నంత వరకు అమ్మ ఆ నరకం నుండి బయటకి రాదు. అందుకే తప్ప లేదనుకుంటా నానాకి. మా నాన్నా మంచోడా, చెడ్దోడా అంటే ఏమో తెలీదు. ప్రపంచంలో మంచి, చెడు లెక్కించే కొలమానం ఏది ? లెక్కించగల మహానుభావుడు ఎవడు ? ఏదేమైనా...చేయని తప్పుకి నా తల్లిని హింసించిన వాడు, అనవసరంగా నా తల్లి కంట నీరు తెప్పించినవాడు మా నాన్న. అందుకేనేమో నానా చేసింది ఏనాడు నాకు తప్పుగా అనిపించలేదు. ఇదంతా ఎవ్వరికీ చెప్పలేను, ఎందుకంటే ఎంతైనా ఆయన నను కన్న తండ్రి కదా. నానాని దోషిగా నమ్మే సమాజానికి నిజం చెప్పకుండా ఉండటమే నా తండ్రికి నేను ఇవ్వగల గౌరవం. క్షమించు నానా.” రుద్ర అలా జరిగింది గుర్తుచేసుకుంటుంటే "రుద్రా...రుద్రా...రుద్రా" అంటూ రుద్రా భుజాన్ని రెండు చేతులతో పట్టుకొని బలంగా ఊపుతుంది కవిత. కొద్దిసేపటికి తేరుకున్న రుద్ర, నిండిపోయిన కళ్ళు తూడుచుకుంటూ ఏంటి చెప్పు అన్నాడు."మీ అమ్మ నాన్న గుర్తొచ్చారా ?". లేదు అని ఆ సంఘటన నుండి బయటకు వచ్చి, ఇంతకీ పోలీసువాళ్ళతో నీకేంటి పని అని కవితని అడుగుతాడు. "పోలీసులా ?" కొద్దిగా తత్తరబాటుగా అడుగుతుంది కవిత. ఇందాక నిన్ను పిలిచింది రహస్య పోలీసులే కదా. "ఏమో! నాకేం తెలుసు.మా ఇంటి దగ్గరే ఉంటారు, నేను ఇక్కడ కనిపించే సరికి ఏమైనా ఇబ్బందా అని కంగారుపడి అడిగారు. అంతే... అంతకంటే ఏం లేదు." అంటూ వడి వడిగా, తడబడుతూ మాట్లాడింది కవిత. హ్మ్...సర్లే. ఏది ఆ ఫైల్ ఇవ్వు. "ఏంటో అంత ఆత్రుత. నేను అడిగేవి ఇంకా చాలా ఉన్నాయ్. అవన్నీ అయ్యాక ఇస్తానులే." రుద్ర ఏంటో చెప్పు అన్నట్లు చూస్తున్నాడు. ఈలోపు రుద్రా, రుద్రా అంటూ వెనుక చాలా దూరం నుండి ఆయాసంగా పరిగెత్తుకుంటూ వస్తూ పిలుస్తున్నాడు గణ. "రుద్రా...రుద్రా...ఆ రాంజీ సేట్ మనుషులు మన శివ గాడ్ని మార్కెట్ దగ్గర చావకొడుతున్నారు". గణ మొహం అంతా కమిలిపోయి ఉంది, కుడి కనుబొమ్మ చిట్లి రక్తం కారుతుంది. బట్టలు అంతా మురికిగా ఉన్నాయ్, ఆయాసంగా, నీరసంతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారిగా గణాని అలా చూసిన రుద్ర గుండె వేగం, కను చూపు మేర, రక్తం ఉష్ణోగ్రత పెరిగింది. ఆ సమయంలో... వీళ్ళు మార్కెట్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు ? శివ గాడ్ని కొడుతుంటే, గణ ఎలా తప్పించుకున్నాడు ? మణి ఏమయ్యాడు ? మిగత వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు ? మార్కెట్ నుండి ఇక్కడి వరకు ఇటువంటి పరిస్తితిలో రక్తం ఒడ్డుతూ గణ ఎలా పరిగెత్తుకు వచ్చాడు ?...ఇలాంటి విషయాలేవీ పట్టించుకోకుండా... గణ మొహం మీద రక్తం చూడగానే, శివ కోసం మార్కెట్ వైపు వాయు వేగంతో పరిగెత్తాడు రుద్ర. రుద్ర మార్కెట్ దగ్గరకు చేరాక... అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎంత నిర్మానుష్యంగా ఉంటుందంటే, రుద్రాకి చాలా దూరంలో ఉన్న మంచి నీటి పంపు నుండి పడుతున్న ఒక్కో చుక్క శబ్దం కూడా స్పష్టంగా వినిపించేంత. కొద్దిసేపటికి గణ పరిగెత్తుకుంటూ వచ్చి, రుద్రకి కాసింత దగ్గరగా మోకాళ్ళ మీద చేతులు ఆసరాగా పెట్టి వంగి, వేగంగా గాలి పీల్చుతూ వదులుతున్నాడు. కొద్దిసేపు ఏమి మాట్లాడకుండా, చుట్టూ చూసాడు రుద్ర. ఇంకా పోగొస్తూనే ఉన్న తాగిపడేసిన బీడీలు, పూర్తిగా ఎండిపోని పాన్ పరాగ్ మరకలు, అక్కడొకటి - అక్కడొకటి ఎగుర్తున్న బాగా నలిగిపోయిన, అక్కడక్కడ చినిగిపోయిన, ఒడియా, హిందీ లిపిలో ఉన్న వార్తా పత్రిక ముక్కలు, జీపు టైరులు-చెక్క చెప్పుల గురుతులు, నీళ్ళు తాగి సరిగ్గా కట్టేయ్యని నల్లాల నుండి పడుతున్న నీటి చుక్కలు, ఆ నల్లాల దగ్గరగా పడేసి ఉన్న బిర్యాని పొట్లాలు...వీటన్నిటిని గమనించి దగ్గరలో ఉన్న పెద్ద వేప చెట్టు అరుగు మీద కూర్చొని, గణ వైపు చూస్తూ...ఎందుకు గణ ? ఎందుకు ? మిగలిన కథ తర్వాతి భాగం లో