Chai Bisket’s Story Series – రుద్ర (Part - 2)

Updated on
Rudra 2
జరిగిన కథ: Part - 1 పోలీస్ స్టేషన్ దగ్గర... ఇన్స్పెక్టర్ ఎదురుగా బార్ షాప్ ఓనర్(లక్ష్మయ్య) కూర్చొని ఉన్నాడు, అతనికి ఓ మూడడుగుల దూరంలో తాళం వేసి లేని సెల్ కు ఆనుకొని దొంగల ఫొటోస్ అంటించి ఉన్న నోటీసు బోర్డు కింద ఉన్న చెక్క బల్లా మీద ఇరుక్కొని కూర్చున్నారు కమిలిపోయిన మొహాలతో, అలసిపోయిన దేహాలతో ఉన్న వస్తాదులు. “వాడ్ని వదలొద్దు సర్, ఎంత కావాలో చెప్పండి. కనీసం రెండు నెలలు ఇల్లు కదలకూడదు వాడు...” అంటూ ఇన్స్పెక్టర్ కి లక్ష్మయ్య ఇంకేదో చెప్పబోతుంటే రుద్రని తీసుకొని వస్తారు కానిస్టేబుల్స్. ఇన్స్పెక్టర్, రుద్రని చూసి “హా హా హా...ఏంటి, వీడు కొట్టాడా వాళ్ళని ? నమ్మలేకపోతున్నాను. లక్ష్మయ్య గారు నిజంగా వీడే కొట్టాడా ? మొహం చూస్తే పాలుకారుతున్న కుర్రాడిలా ఉన్నాడు. నమ్మలేను”. “దెబ్బలు తిన్న వాళ్ళు ఎదురుగా ఉన్నారు, కొట్టినవాడు కళ్ళముందే ఉన్నాడు, మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే వాడినే అడగండి సార్”. “సరే, మీరంతగా చెప్తున్నారు కాబట్టి, నేను చూసుకుంటాను వీడి సంగతి. ఓ 10 పంపండి, పనైపోతుంది”. ఆ వస్తాడుల వైపు చూస్తూ పదండి రా అని చేతితో సైగ చేసి, రుద్ర వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు లక్ష్మయ్య. వస్తాదులు రుద్రవైపు చూడకుండానే లేచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తారు. ఇన్స్పెక్టర్, రుద్ర ఎదురగా వచ్చి నిలబడి “రేయ్! ఇప్పటికి ఇది మూడోసారి అనుకుంటా. తాగొద్దని ఎన్నిసార్లు చెప్పాను. నీకేమైనా ఐతే ?”. నిజంగా నాకేం గుర్తులేదు బాబాయ్ నిన్నేం జరిగిందో అని ఇన్స్పెక్టర్ తో అంటాడు రుద్ర. ఇన్స్పెక్టర్ రుద్రని చైర్ లో కూర్చోపెట్టి, టేబుల్ మీద తను కూర్చొని “నిన్ను తాగొద్దని చెప్పట్లేదు కన్నా, ఎవ్వడితో గొడవపడోద్దని చెప్తున్నా. మొహం చూడు ఎలా కందిపోయిందో, చేతికి ఆ దెబ్బేంటి ? రేయ్! ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురండి త్వరగా...” అంటూ కిట్ రాగానే రక్తం గడ్డకట్టిన మోచేతి మీది దెబ్బని క్లీన్ చేసి కట్టు కడతాడు ఇన్స్పెక్టర్, రుద్ర ఏం అవ్వదులే బాబాయ్ అని వారిస్తున్నా వినకుండా. ఇంతకీ నిన్నేం జరిగింది బాబాయ్ ? “ఏముంది, మామూలే కదా. వాళ్ళ బార్కెళ్ళి ఫుల్ల్గాతాగి వాళ్ళనే కొట్టావ్. సరే కాని ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో పో.” బైక్ కీస్ ఇవ్వు మరి. “ఈ ఒక్క రోజు జీప్ లో వెళ్ళు.” ఇంటికి వెళ్ళే దారిలో... నిన్న చూసిన అమ్మాయి కనిపిస్తుంది. రుద్ర, కదులుతున్న జీప్ లోనుండి దూకేసి తన వెనకాల నడుస్తుంటాడు. తన వెనకాలే హాస్పిటల్ వరకు వెళ్తాడు. స్టాఫ్ రూమ్ లోకి ఎంట్రీ లేదని ఆపినప్పుడు కాని తను అక్కడ ఉనట్టు తెలీదు రుద్రకి. బిల్ కౌంటర్ ఎదురుగా చైర్ లో కూర్చొని తనెప్పుడోస్తుందా అని స్టాఫ్ రూమ్ వైపే చూస్తుంటాడు. తను బయటకి వస్తూనే దెబ్బ తగిలి రక్తం కారుతున్నవాడిని చూసి, వాడి దగ్గరికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటుంది. రుద్ర, తన చేతికున్న కట్టుని పీకి పారేసి, చైర్ కేసి దెబ్బని గట్టగా కొడతాడు. రక్తం కారుతుంటుంది, ఆమె దగ్గరికి పరిగెడుతాడు. ఆవిడ రుద్రని చూడకుండా ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఆమెనే చూస్తుంటాడు రుద్ర. చీరకున్న నేమ్ బోర్డుని బట్టి ఆమె పేరు వాణి అని తెలుసుకుంటాడు. పెన్సిలిన్ ఇంజక్షన్ వేసి, ఈ టాబ్లెట్ వేసుకోమని చెప్పేప్పుడు చూస్తుంది రుద్రని. ఏం మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతుంది. రుద్రా అక్కడే కూర్చొని సాయంత్రం తను వెళ్ళేప్పుడు మళ్ళీ వెనకే నడుస్తూ వెళ్తాడు. కొంత దూరం వెళ్ళాక.... “ఏం చిన్నా ? ఎందుకు నా వెనుక వస్తున్నావ్ ” అని అడుగుతుంది వాణి. రుద్ర ఏం మాట్లాడకుండా నిలబడి చూస్తుంటాడు. “చూడూ... నాకు పెళ్లైంది, ఐదేళ్ళ కొడుకు ఉన్నాడు. నా భర్త ఈ మధ్యే చనిపోయాడు. నువ్విలా నా వెనుక తిరిగితే నేను తలెత్తుకు తిరగలేను.” రుద్ర వాణి వైపు కన్నార్పకుండా చూస్తూనే ఉంటాడు. “నీకు నేను చెప్పేది అర్ధం అవుతున్నట్టు లేదు. నా వెనుకరాకు.” అని వాణి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. రుద్రా వాళ్ళింటి గేటు వరకు వెనకాలే వస్తాడు. “ఏం కావాలి నీకు ? నా వెనుక ఎందుకు వస్తున్నావ్ ?” మీరు నాతో పడుకుంటారా అని అడుగుతాడు రుద్ర. చెంప పగలకొట్టటం, తాళం వెయ్యటం, ఇంట్లోకి వెళ్ళిపోవటం, పక్కింటి వాళ్ళు నెమ్మిదిగా నోటికొచ్చింది గునుక్కోవటం, రుద్ర తలదించుకొని వెళ్ళిపోవటం అన్నీ ముందు రోజులానే జరుగుతాయి. “ఏం కావాలి ?” మీరు నాతో పడుకుంటారా. “ఏం కావాలి ?” మీరు నాతో పడుకుంటారా. ... “ఏం కావాలి ?” మీరు నాతో పడుకుంటారా. ఇదే తంతు దాదాపు తర్వాత రెండు నెలలు జరుగుతుంది. ఇలా జరుగుతుంటే ఒక రోజు... “నీకేం కావాలి ?” మీరు నాతో పడుకుంటారా ? “ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా నీకైనా ?” తప్పుగా ఏం మాట్లాడలేదే. “ఒకమ్మాయితో, అదికూడా భర్తలేని అమ్మాయితో అలాగా మాట్లడేది ?” నాకు తప్పుగా అనిపించటం లేదే. “చూడూ! ఇన్ని రోజులుగా చూస్తున్నాను, నాకంటే చాలా చిన్నాడిలా ఉన్నావ్. మంచోడిలా కూడా ఉన్నావ్. కానీ, నీ కోరిక తప్పు, నువ్వు మాట్లాడే విధానం తప్పు. నా వెనుక తిరగటం మానేసి ఏదైనా పని చేసుకో, జీవితం ఎందుకు నాశనం చెసుకుంటావ్. ఇంకెవ్వరితో ఇలా అసభ్యంగా మాట్లాడకు.” నాకు విశ్వనాధ సత్యనారాయణలా మాట్లాడటం, ఆరుద్రలా వర్ణించటం రాదండీ! ఏం చెయ్యమంటారు. “వాళ్ళిద్దరూ నాకిష్టం అని నీకెలా తెలుసు.” ఏం తెలీకుండానే మీ వెనుక తిరిగాను అనుకున్నారా. “ఏం తెలుసు ?” అంతా. “అంటే ?” మీ పుట్టుక నుండి మీ ఆయన చావు వరకు. మీరు పొద్దున్నే లేచి చిన్నాని ముద్దుపెట్టుకునే దగ్గరి నుండి రాత్రి పుస్తకం చదువుతూ నిద్రలోకి వెళ్ళేంతవరకు. చిన్నప్పుడు చేయి పట్టుకున్నాడని మీ బావని కొట్టటం దగ్గరినుండి మొన్న అదే పని చేసిన డాక్టర్ ని కొట్టటం వరకు. పెళ్ళికి ముందు మీ పిన్ని పెట్టిన కష్టాల నుండి మీ ఆయన చూపించిన నరకం వరకు. చిన్నాకి ఏడాదిన్నరప్పుడు విషం తాగి చనిపోవాలి అనుకున్న దగ్గరి నుండి ఐదేళ్ళ చిన్నా అనాధ కాకూడదని, వాడికోసమైనా బతికుండాలని ఒట్టేసేంతవరకు. పదహారేళ్ళప్పుడు మీకు వచ్చిన ప్రేమలేఖల దగ్గరి నుండి పాతికేళ్ళప్పుడు మీరు రాసిన ఆత్మహత్య లేఖ వరకు. మీ మొదటి రాత్రి పీడకల నుండి కోరికలు చంపుకున్న ప్రతీ రాత్రి గురించి. రుద్రా ఇలా చెప్తూ ఉంటె వాణి కళ్ళు నీళ్ళతో నిండిపోయాయ్. ఇవన్ని రుద్రకి ఎలా తెలుసని భయం కూడా కలిగింది వాణికి. “ఇవ్వన్నీ నీకెలా తెలుసు ?” తెలుసుకున్నాను. “నా జీవితం మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది ?” ప్రతీ రోజు చెప్తూనే ఉన్నాను. చలం సాహిత్య సాన్నిహిత్యం ఆస్వాదించే వాళ్లకి ఇంతకంటే నిజాయితీగా మాట్లాడటం రాదండి. “నన్ను ప్రేమిస్తున్నావా ?” మీరు ఆ కోరికకి ఏ పేరు పెట్టినా నాకేం అభ్యంతరం లేదు. “నేనేం చెప్పాలని ఆశిస్తున్నావ్ ?” నాకేం కావాలో చెప్పాను, మీరేం చెప్పినా నేనేం అనుకోను. వాణీ రుద్ర కళ్ళలోకి చూస్తూ “నీ వయసెంతా ?” ఆడదాని వైపు ఆకర్షింపబడేంత. “నీ వయసెంతా ?” మనసులో కోరికను నచ్చిన వాళ్ల ఎదురుగా నిలబడి, కళ్ళలో చూస్తూ చెప్పగలిగేంత. “నీ వయసెంతా ?” కోరుకున్న వాటిని పొందటం కోసం ఎంత దూరమైనా వెళ్ళేంత, ఎంత కష్టమైనా లెక్కచేయనంత. “సంఖ్యలలో చెప్పు, నీ వయసెంతా ?” నేను వయసును సంఖ్యల్లో లెక్కగట్టను. “కానీ, నాకో పాతిక వరకు ఉంటాయ్. నిన్ను చూస్తుంటే ఇరవై కూడా ఉనట్టు లేవు. మిగిలినవన్నీ పక్కన పెడితే, చిన్నపిల్లాడి మాటలల నవ్వొస్తుంది తప్ప మరేం భావన కలగదు.” ఆ మాటకి రుద్ర కొద్దిగా ఆలోచించి... వయసుకి, మనసుకి ఏంటి సంబంధం ? “మనుషులకు మనసు అనే ఒకటి ఉందని సమాజానికి తెలీదు.” మీకు తెలుసు కదా. “నా అభిప్రాయలు సమాజానికి పట్టవు.” నాకు మీ అభిప్రాయాలే ముఖ్యం. “కాని, నేను ఆ సమాజంలో భాగాన్నే.” అస్తిత్వంలేని సమాజాన్ని పట్టించుకోవటం మూర్కత్వం. “మబ్బుల వెనుక కనపడే అస్తిత్వం లేని రోదసిని ఆకాశం అని నమ్మటం లేదా.” మబ్బుల మురికి ఆకాశానికి అంటుకోదు, ఉరుములు-మెరుపులకు ఆకాశం బద్దలవ్వదు, కుండపోత వర్షానికి కూడా ఆకాశానికేం తడి అంటదు కదా. “కానీ, వీటన్నిటి వెనుకే దాక్కొని ఉంటుంది ఆ ఆకాశం కూడా.” పౌర్ణమి రాత్రి వెన్నెలని వదిలి చుక్కల మధ్యలో ఉన్న చీకటిని చూసేవాళ్ళకి ఏం చెప్పగలం. “వెలుగులో బ్రతకటం అందరికి సాధ్యం కాదు.” భావోద్వేగాలు, భావావేశాలు, ఆఖరికి ఆలోచనలు కూడా పరాయి వాళ్ళు గీసిన పరిదులకు లోబడే జరగాలంటే ఇక జీవించటం ఎందుకు. “చావుని ఆహ్వానించటం అంత సులువుకాదు. పరిస్తితులకన్నా ఎవ్వరూ పెద్ద కాదు, పరిస్తితుల ముందు ఎవ్వరి కోరికలు ఎక్కువ కాదు.” మీరేం చెప్పాలనుకుంటున్నారు ? “నాకు తెలీదు”. మరి ఈ వాదన అంతా ఎందుకు ? “నాకు తెలీదు” అంటూ అసహనంగా, కోపంగా, కళ్ళనిండా నీళ్ళతో వెనక్కి తిరిగి వడి వడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. రుద్ర అక్కడే ఆగిపోతాడు. ఆ తర్వాతి రోజు... రుద్ర వాణీ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు, హాస్పిటల్ కు వెళ్తాడు, ఎక్కడా కనపడదు తను. హాస్పిటల్ లో అడిగితె రాజీనామా చేసిందని చెప్తారు. ఇంటి దగ్గర కనుక్కుంటే రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయింది, ఎక్కడికి వెళ్లిందో తెలీదని చెప్తారు. రుద్రకు ఏం చెయ్యాలో అర్ధంకాదు, కడుపులో అంతా ఖాళీగా ఉనట్టు, గుండెలో ముళ్ళు కదులుతున్నట్టు, తలలో మెదడు గిర్రున తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కళ్ళలో కోపం ఉరుములు ఉరుముతుంటే, కన్నీళ్ళ వర్షం కురుస్తుంది. రుద్ర మొదటిసారిగా ఏడవటం చూడటం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా, కుంభవృష్టి కురిపిస్తున్నాడు. వాణీ ఇంటి వాళ్ళ గేటుకు ఆనుకొని అక్కడే వర్షంలో ఏడుస్తూ కూర్చున్నాడు రుద్ర. మిగిలిన కథ తర్వాతి భాగంలో