సాధారణంగా ఒక ముగ్గురు మిత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఏ విషయాలు చర్చకు వస్తాయి.? సినిమాలు, లవ్ మ్యాటర్స్, పర్సనల్ విషయాలు.. అంతేనా.? కాని ప్రత్యూష్, ప్రశాంత్, హరీష్ ముగ్గరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రం దేశం గురించి, ప్రత్యేకంగా రైతులు పడుతున్న కష్టాల గురించే ప్రస్తావన వస్తుంది. కేవలం మాటల వరకు మాత్రమే కాదు చేతలలోనూ రైతులకోసం వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలను రూపొందించి ఏకంగా భారతదేశంలో మొదటి బహుమతిని అందుకుని రైతుల పట్ల వారి కున్న ప్రేమ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తున్నారు.
హైదరాబాద్ లో ఎంటెక్ చదువుతన్నప్పుడు కాలేజి ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో అందరిలా కాకుండా భారతదేశానికి వెన్నుముకగా ఉన్న రైతుకు అవసరమయ్యేవి తయారుచేయాలనే సంకల్పంతో పెస్టిసైడ్ స్పేయింగ్ డ్రోన్ తయారు చేయాలని చెప్పి మరో మిత్రుడు ప్రత్యూష్(ఫిజియోథెరపిస్ట్) ను కలిసి దీనిని తయారుచేశారు. ఇది కేవలం పురుగుల మందులను చల్లడం వరకు మాత్రమే కాదు దీనికి 4కె కెమరా సహాయంతో పంటను ఫొటో తీసి ఏ రకమైన తెగుళ్ళు సోకిందని తెలుసుకోవచ్చు.
మామూలుగా ఐతే ఒక ఎకరా పొలానికి మందు చల్లాలంటే గంటల సమయం పడుతుంది అంతేకాదు పెస్టిసైడ్స్ ని మన శరీరానికి అతి దగ్గరగా వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరం, ఇంకా కూలీలకు ఇచ్చే డబ్బు ఇలాంటి రకరకాల సమస్యలకు ఈ డ్రోన్ సరైన పరిష్కారం ఇస్తుంది. దీనికి కూలీలు అవసరం లేదు, రైతు ఒక చోట కూర్చుని పోలమంతే మందును చల్లవచ్చు, మందు చల్లేముందు వాటికి పూర్తిగా Instructions ఇచ్చేస్తే వాటంతట అవ్వే పనిని పూర్తి చేసుకుపోతుంది. గంటల సమయం కాకుండా కేవలం 10 నిమిషాలలోనే ఒక ఎకరమంతా మందును చల్లవచ్చు.
ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టే నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ వారి ఆద్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఈ డ్రోన్ ను రూపొందించిన విద్యార్ధులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా మొదటి బహుమతిని అందుకున్నారు.