కబాలి ఇప్పుడు భారతదేశం మాత్రమే కాదు ప్రపంచమంతా ఎదురుచూస్తున్న సినిమా.. అలాంటి ప్రపంచ స్థాయి సినిమాలో 'రజినికాంత్ ఒక తెలుగు రచయిత రాసిన మా నాయన బాలయ్య పుస్తకాన్ని చదువుతున్న సీన్ తో సినిమా ప్రారంభం అవుతుంది.' మామూలు వ్యక్తి చేతిలో ఆ బుక్ ఉంటే దానికి ఇంత క్రేజ్ ఉండేది కాదు కాని రజిని లాంటి హీరో, ప్రపంచ స్తాయి సినిమాలో ఆ పుస్తకం ఉండటంతో ఇప్పుడు ఆ చర్చంత.. కబాలిని ఆ పుస్తకం ఎందుకు అంతలా ప్రభావితం చేసింది, ఇంతకి ఏమిటి ఆ పుస్తకం గొప్పతనం..
బతుకు కోసం, బతుకు తెరువు కోసం ఓ తెలంగాణ మాదిగ కుటుంబం సాగించిన పోరాటమే ఈ పుస్తకం. రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరచిన రిజర్వేషన్ వల్ల వెనుకబడిన కులాలు ధైర్యంగా ఇప్పుడు చదువుకుంటున్నారు కాని, మన దేశం బ్రిటీష్ బానిస సంకెళ్ళు తెంచుకోక ముందు మాదిగల బ్రతుకులు ఎలా ఉన్నాయి? దొరలు వారి జీవితంతో ఎలా అడుకునేవారు? సంఘం, సమాజం వీరిని ఎలా వెలివేశారు అన్నది మాత్రమే కాకుండా వీటన్నీటి నుండి మాదిగ కుటుంబం పోరాటం చేసి అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు ఎదిగిన దారి గురుంచి ఈ పుస్తకంలో వివరించారు. మూడు తరాల జీవితాలలో నాటి సమజానికి, నేటి సమజానికి వచ్చిన మార్పులు వర్ణించిన పుస్తకం ఇది. ఇది కథ కాదు జరిగిన కథ.
రచయిత వై.బి సత్యనారాయణ 1971లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ తీసుకున్నారు. ముప్ఫైమూడవ ఏటనే హైదరాబాద్‌లోని ధర్మవంత్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజీకి ప్రిన్సిపల్ స్థానాన్ని పొందారు. 25 సంవత్సరాలు అదే పదవిలో అక్కడే కొనసాగారు. రిటైరయ్యాక ప్రస్తుతం హైదరాబాద్‌లో “సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్” కు అధ్యక్షులుగా ఉన్నారు. రచయిత వై.వి సత్యనారాయణ ముత్తాత కాలం నుండి ప్రస్థుత కాలం వరకు అతని కుటుంబంలో జరిగిన సంఘటనలన్నీ ఈ పుస్తకంలో కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. వారిది కరీంనగర్ జిల్లాలోని వంగపల్లి అనే మారుమూల పల్లె స్వగ్రామం. ఓ సంధర్భంలో నిజాం నవాబు ఆ ఊరు నుండి వెళ్తుంటే నర్సయ్య(రచయిత ముత్తాత) ఒక దూడ చర్మంతో చెప్పులు కుట్టి నవాబుకు బహుమానంగా ఇస్తాడు ఆ చెప్పులు బాగా నచ్చడంతో ఆ రాజు 50ఎకరాల భూమిని కానుకగా ఇస్తాడు కాని తర్వాతి కాలంలో ఆ ప్రాంతంలోని దొరలు, అగ్రకులాల వారు ఆ భూమినంతా దోచుకుంటారు ఎందుకంటే అంత పొలం ఉంటే ఆ వచ్చే ధనంతో ఈ మాదిగవాడు నా స్థాయిలో ఉంటాడు అని అలా లాక్కుంటారు.. ఆ కాలంలో అగ్రవర్ణాల వారు దలితుల శరీరాన్ని తాకిన గాలిని తాకడానికి కూడా ఇష్టపడరు, అగ్ర కులస్థులు ఊరిలో ఉంటే నిమ్న వర్గాల వారు ఎక్కడో దూరంగ ఊరి బయట ఉండేవారు. చెరువులో నీళ్ళు పట్టుకోవడం, గుడిలోకి అడుగు పెట్టడం, చదువు కోవడం లాంటి వెన్నో దళితులకు పుట్టుకతోనే ఆ కాలంలో నిషిద్దం.
ఒకానొక సంధర్భంలో నేను చదువు కుంటాను అని అంటే ఆ తండ్రి కొడుకుతో పలికిన మాటలు కులం మూలంగా వారు అనుభవించిన సంఘటనలు ఎంతటి వారికైనా నీళ్ళు తెప్పిస్తాయి..
"మనం ముట్టుకోని వాళ్ళం బిడ్డా, మనకు చదువు చెప్పరు" "ఎందుకు" "మనలను వాళ్ళు ముట్టుకోరు బిడ్డా అందుకే" "అయితేంది? వాళ్ళకు దూరంగా కూసుంట, అక్కడ కూడా ఎవర్నీ ముట్టుకోను" "కాని నీకు పంతులు పాఠం చెప్పడు" "నేను పంతుల్ని గూడ ముట్టుకోను"
అలా బ్రతిమలాడి ఎదోలా బడిలో అడుగు పెట్టినా తానొక్కడే కాదు తన కులస్తులందరికి తోటి పిల్లల నుండి కూడా అవమనాలు ఎదుర్కున్నారు. "తన స్నేహితులకి అక్కడున్న గోడ చూపించి ‘ఇది ఎవరిది?’ అని అడిగే వాళ్ళు. వాళ్ళు ‘మాది’ అనేవాళ్ళు. అప్పుడు మళ్ళీ ‘ఇదేమిటి?’ అని అడిగేవాళ్లు. వాళ్ళు ‘గోడ’ అనే వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఆ రెండు సమాధానాలనీ కలిపి చెప్పమనేవాడు. వాళ్ళు వెంటనే ‘మాదిగోడా' అని అరిచేవాళ్ళు.” ఎంత అవమానపడి బాధపడ్డా, ఆ బృందానికి వ్యతిరేకంగా తన తరఫున ఎవరూ మాట్లాడే వాళ్ళు లేక ఎదురు సమాధానం చెప్పలేక పోవటం ఆనాటి దుర్భర, అసహాయ స్థితికి నిదర్శనం. ఇలాంటి హృదయ విధారకమైన సంఘటనలు ఈ పుస్తకంలో అనేకం. అచ్చం పచ్చి తెలంగాణ మాండలీకంలో రచయిత తన జీవిత సంఘటనలు వివరిస్తాడు. నిజానికి ఈ పుస్తకం ఇంగ్లీష్ లో ప్రింట్ చేసినా తర్వాత పి.సత్యవతి దీనిని తెలుగులో అనువదించారు. ఇందులో విచిత్రం ఏమిటంటే వై.వి సత్యనారాయణ ఒక దళిత మాదిగ, తెలుగులో అనువదించిన పి.సత్యవతి ఒక అగ్రవర్ణ బ్రహ్మణి ఐనా కూడా రచయిత భావాలు సరిగ్గా అనువదించారు. అంతర్జాతీయంగా ఈ పుస్తకానికి మంచి ప్రశంసలు వచ్చాయి.