This Intense Conversation Between A Helpless Farmer & An Arrogant Businessman Is A Sad Reality!

Updated on
This Intense Conversation Between A Helpless Farmer & An Arrogant Businessman Is A Sad Reality!

"ఎవరయ్యా నువ్వు ?"

"నన్ను రైతు అంటారయ్యా.. మీరు తినే ప్రతి మెతుకు వెనక మా కష్టం ఉందయ్యా.."

"కష్టమా ? నాలుగు విత్తనాలు వేస్తె మొక్కలు వాటికవే పెరుగుతాయి, అందులో మీ కష్టం ఏముంది.. కష్టం అంటే మాది.. డబ్బు సంపాదించటానికి ప్రతి రోజు ఒక కొత్త పధకం వెయ్యాలి. పరిగెత్తాలి.. అలసిపోయి ఆగిపోతే తొక్కేస్తారు."

"అయ్యా.. గొప్పోరు మీరు .. డబ్బు కాపాడుకోవటం కోసం మీరు పరిగెడతారు, కడుపు నింపుకోవటం కోసం రెక్కలు ముక్కలు అయ్యేలా మేము పరిగెడతాం. మీది కోట్లల్లో వ్యాపారం మాకు అణా పైసా దొరికిన ఆనందం."

"మాటలు మంచిగానే చెప్తున్నావ్. అయినా పని వదిలేసి ఇలా రోడ్ల మీద ఎందుకు పడి తిరుగుతున్నారు?"

"సార్.. మీ కడుపు నిండాలి అంటే మా రెక్కలు అరగాలి.. మా కడుపు కోత ఆగాలి అంటే మీ దయ మాపై చూపాలి."

"ఏం అంటున్నావు?"

"సారూ, రోజు కునుకు తీస్తే కాంక్రీటు మేడలు మట్టిని ఎక్కడ మింగేస్తాయో అన్న భయం.. పంటను చీడ పురుగులు మింగేసినట్టు, మట్టిని నమ్ముకున్న మాలాంటి రైతుల జీవితాన్ని మీ డబ్బునోరు మింగేస్తున్నారు. అప్పు కోసం కోసం బ్యాంకులు చుట్టూ మేము తిరుగుతుంటే, కోట్లు కోట్లు అప్పులు ఆ బ్యాంకులు మీకు తగలేస్తున్నాయి. సారూ.. మనిషి పూరె గుడిసెలో అన్న బ్రతుకగలడు, కానీ పుట్టెడన్నం లేకుండా బ్రతకలేడు సారూ. అన్నాన్ని కాంక్రీటులో పండించలేము కదా సార్!"

"రేపు బ్రతుకుతామో లేదో తెలియని బ్రతుకులు మీవి.. నలుగురు బ్రతుకులు బాగు చేసే ఆలోచనలు మావి. ఏ నమ్మకం తో మీకు అప్పులు ఇస్తారు వాళ్ళు .. అసలా మీకు ఏముంది అని ఇస్తారు!!"

"సారూ, ఏమి లేని వారికీ ఇచ్చేదే అప్పు సార్.. నమ్మకం అంటున్నారు .. వేలకోట్లు మింగేసి ఇపుడు వేరే దేశం పారిపోదాం అనుకున్నారు, మిమ్మల్న సార్ వారు నమ్మింది ??"

"నీకేం కావాలి అసలా? అప్పు కావాలి అంటే వెళ్లి బ్యాంకు వాళ్ళని అడుగు.. నీ పేరు కూడా నాకు తెలీదు.. దేశం వదిలి పోయే నన్ను ఎందుకు ఈ చీకటి గదిలో పెట్టి ఇవన్నీ చెప్తున్నావు??"

"తెలియాలి సారూ .. తెలుసుకోవాలి సారూ.. మేము పడే ప్రతి కష్టం మీకు తెలువాలి.. AC రూములో కూర్చునే మీకు, మా చెమటలు వెనక కష్టం తెలియాలి.. విమానాల్లో తిరిగే మీకు మట్టి వాసన తెలియాలి. దేశాన్ని దోచుకుపోతున్న మీలాంటి డబ్బునోరికి రైతు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఆ భయం తెలియాలి. నాకేంటిలే అన్న మీ నిర్లక్ష్యం వాళ్ళ ఇపుడు 50 వేల మంది రైతులు రోడ్డుకెక్కారు.. కదం తొక్కితే పీఠం అదిరేలా ముందుకు కదులుతున్నారు.."

"ఒకటి రెండు రోజుల్లో అంత తేలిపోద్ది .. నెల రోజుల్లో మళ్ళీ మాములే.. ఈ మాత్రం దానికి తిండి మానేసి రోడ్ లు ఎక్కటం ఎన్ని సార్లు చూడలేదు??"

"అవును సారు, మా కంట కన్నీరు .. మీ నెత్తిన బలుపు ఎప్పుడు పోవు సారూ.. ఆకలేస్తే అన్నం తింటాం కానీ డబ్బు తినం కదా సార్.. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి చాలు.. ఇక సెలవు.."

"ఏయ్ .. ఏయ్ .. ఈ కట్లు విప్పి వెళ్ళు.."

"ఆ పుణ్యం ఈ పేదోనికి లేదు సారు ... మీకు అప్పు ఇచ్చి ఆదుకున్న వారే వచ్చి విప్పుతారు!"