భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక పారిశ్రామిక వేత్తగా భారతరత్న అందుకున్న ఏకైక వ్యక్తి జెఆర్డీ టాటా గారు. ఒక సందర్భంలో ఆయన తన కంపెనీలో పనిచేయుట కొరకు ఇంజినీర్లు కావాలని ప్రకటన ఇచ్చారు, పురుషులకు మాత్రమే అని ప్రత్యేకంగా అందులో పొందుపరిచారు కూడా.. ఇంజినీర్ ఐన సుధామూర్తి గారు ఈ ప్రకటన చూశారు, చూడటమే కాకుండా జెఆర్డీ టాటా గారికి ఈ వివక్షపై ఒక ఘాటైన లెటర్ కూడా రాశారు. ఆ తర్వాత జెఆర్డీ టాటా గారు సుధామూర్తి గారికి ఉద్యోగం ఇవ్వడంతో పాటుగా మహిళా ఇంజినీర్లకు కూడా తన కంపెనీలో అవకాశం కల్పించారు.. ఆకాశంలో సగం అని మాటలకే పరిమితం ఐతే ఎలా.? ఈసారి మాత్రం రైల్వే శాఖ ఏకంగా ఒక రైల్వేస్టేషన్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా మహిళలకే అప్పగించింది.
మన విజయవాడలో: దాదాపు 18 నెలల కిందట 'వరల్డ్ విమెన్స్ డే' సందర్భంగా ప్రయోగాత్మకంగా ఈ స్టేషన్ ను ఎంపిక చేశారు. మహిళలు తలుచుకుంటే ఏ పనినైనా చెయ్యగలరు అని నిరూపించడం కోసమే దీని అమలుకు ముఖ్య కారణం. రామవరప్పాడు రైల్వేస్టేషన్ లో జెండా ఊపడం దగ్గరి నుండి సూపరింటెండెంట్, స్టేషన్ మాస్టర్లు, కానిస్టేబుళ్లు, ట్రాకులపై క్లాంపులు ఫిట్ చెయ్యడం వరకు ఈ రైల్వేస్టేషన్ లో పూర్తిగా మహిళా ఉద్యోగులు మాత్రమే పనిచేస్తుంటారు. ఇది విజయవాడ డివిజన్ పరిధిలోనే ఉంటుంది.
ఎలా మార్పులు జరుగుతున్నాయి: బ్యాచ్లర్స్ ఉండే ఇంటికి ఫ్యామిలీ ఉండే ఇంటికి చాలా తేడా ఉంటుంది కారణం ఆ ఇంట్లో అమ్మ కానీ, భార్య కానీ చెల్లి కానీ ఉంటారు. ఇంట్లో ఒక్క మహిళ ఉంటేనే అంత తేడా ఉంటే స్టేషన్ మొత్తం మహిళ ఉద్యోగులు ఉంటే ఆ మార్పును మనం ఊహించవచ్చు. రామవరప్పాడు రైల్వేస్టేషన్ ఇంతకుముందు కాస్త అపరిశుభ్రంగా, అల్లరిమూకలకు అడ్డాగా ఉండేది. వీటన్నిటిని ఏడాదిన్నర కాలంలో పూర్తిగా నిర్ములించడంతో పాటుగా ప్రతిచిన్న విషయంలో ఎలాంటి ఆలస్యం లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఈ స్టేషన్ కు వచ్చే మహిళ ప్యాసింజర్ల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ ఇక్కడ తీసుకుంటున్నారు.
మచిలీపట్నం మరియు విజయవాడ మధ్యలో రామవరప్పాడు రైల్వేస్టేషన్ ముఖ్యమైనది. ఈ మార్గం మధ్య ప్రతిరోజు 25 రైళ్లు వెళ్తూ ఉంటాయి. 15 రైళ్లకు ఈ స్టేషన్ లో స్టాప్ ఉంటుంది, ఈ 15 రైళ్లలో ప్రయాణం చేసేందుకు దాదాపు వెయ్యిమంది ప్రయాణికులు ఈ స్టేషన్ కు వస్తుంటారు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో విజయలక్ష్మి, ప్రీతి, కార్తీక, అఖిల, సోనిక సాయి, సౌమ్య మొదలైన వారు నేషనల్ ఇంటర్నేషనల్ లెవల్ లో పతకాలు గెలుచుకున్న అథ్లెట్లు కూడా ఉన్నారు.